కవితా ప్రస్థానం
న చ కి
నా బుద్ధియు, నా మనస్సు
***
శ్రమించితే,
రమించితే,
వీరమూ, శృంగారమూ,
అద్భుతమూ, బీభత్సమూ
కలగలసిన నా స్వేదములో
నవరసముల ఆస్వాదముతో
ప్రభవించెను కవితానాదం,
ప్రణవించెను జగదాధారం!
నా మాటే ఆనయై,
నా బాటే ప్రాణమై
ఎదగసాగె నా కవిత!
అదియె కదా నా భవిత!
నా పద్యం ప్రాణపంచకం!
నైవేద్యం దానికే జగం!
మిథ్యాకూపంలో మునిగివున్న వేళ
శరం వెంట శరంలా
అక్షరం వెంట అక్షరం పేర్చి
మది బంతిని ప్రపంచంలోకి లాగే
కూర్పరితనం కవితకు స్వంతం!
మనోవల్మీకంలో మ్రగ్గుతున్న మనిషికి
చుట్టూ చీకట్లను పాఱద్రోలి
నిజమైన వెలుగు చూపి
జ్ఞానభగవద్దర్శనం కలిగించే
నేర్పరితనం కవితకు స్వంతం!!
నా కవనం ఢంకాధ్వానమై
***
నా కథనం ఝంఝానాదమై
హృద్మృదంగాల తాకి ప్రతిధ్వనించగా,
దిగ్దిగంతాల దాక పరిభ్రమించగా,
ఆ తేజమే అతిశయమై ప్రకాశించెనే
నా నైజమై అనవరతం విరాజిల్లెనే!
మనసు లోగిలి దాటి
జగతి వాకిలి లోకి
కవితాబాల అడుగిడుతూ
భయమూ, ఆశ్చర్యమూ,
గర్వమూ, ఆనందమూ
ఏకక్షేత్రంలో నాకు తాను కలిగిస్తుంది!
కవితోద్భవ కారకులౌ
నా బుద్ధీ, నా మనసూ,
నా స్వగతం, నా గతం
ఏతత్‌క్షణంలో చూపి తనివి కలిగిస్తుంది!
నాలో సగం సాహిత్యం,
తక్కినది జ్ఞానరాహిత్యం!
అజ్ఞానతిమిరం మనసును మూస్తే,
ఎదిగే కవితాశిశువును చూస్తే,
మదిలో భావనావీచిక వీస్తే,
కవితా సృష్టికార్యం మళ్ళీ
మనోనేత్రమే అవలోకిస్తే,
నాటి ఉద్వేగం గురుతుకు వస్తే...
నా స్వరం మళ్ళీ ఉద్విగ్నం!
స్వరపేటికలో అతి జాగ్రత్తగ
దాచిన నా కవితానిధి
- అది
గలగలమని, జలజలమని
***
వెలుపలికని వెలువడితే
కవితోచ్చారణమే నా
ప్రాణోద్ధారణమై,
గళంలోనూ, గాత్రంలోనూ
నిలబడితే, స్థిరపడితే,
నా ఆవేశం నా కవితకు
ఊపిరి పోస్తుంది!
నా ఆలోచన ఆ కవితకు
రూపమునిస్తుంది!
జ్వలిత భాస్వరం నా గేయం!
కాని, నశ్వరం! అది ఖాయం!
ఆ విషయం గ్రహించినా,
ఆ తాపం దహించగా
నా గేయం చిరకాలం
రసజ్ఞులను చేరాలని,
నా గీతం కలకాలం
లసత్కృతిగ నిలవాలని,
కంఠస్థం చేసిన నిధి
గ్రంథస్థం చేసెను విధి
ఆ కవితను మరలా
నా కనులు తడిమితే
అవి అమృతవర్షం కురిపిస్తాయ!
కానీ...
నింగిని విడచిన సురనది గమనము
పుక్కిట పట్టిన జహ్నువు యెఱుగడు!
కృంగక, అలయక నేలకు దింపిన
మునివరుడెఱుగును నది ఒడిదుడుకులు!
పద్యం పుట్టుక పఠితకు తెలియదు!
పాఠకుడెఱిగిన ప్రచురిత కవనము
సజీవకవితకు మృతప్రతిబింబము!
ఆ ప్రచురణలో
ప్రాణం పోసిన మానసమేదీ?
యాగం చేసిన యోచనమేదీ?
ఆకృతినిచ్చిన భావన యేదీ?
భావం నింపిన భావుకతేదీ!?
ప్రచురణ ఆ కవితకు
మరణానంతర బహుమానం,
జ్ఞాపకముండే అభిమానం!
కవితను చదివే వారికి యక పై
నా స్వరధునిలో ఉద్వేగాలవి
అందవు, చేరవు, తెలియవులే!
వారికి వినిపించిన భావనలవి
***
నా మనసున మ్రోగిన సడులేనా?
వారిని కదిలించిన ఉద్వేగాలవి
నా కన్నుల చిందిన తడులేనా?
గ్రంథసమాధిని చేరుకొని,
భావ వైతరణి దాటుకొని
తన ప్రస్థానం ముగించుకుంది,
మనస్తాపమును రగుల్చుతుంది
జీవన్మృత కద నాదు కవిత్వం!
వెలిగే స్మృతి నాకనునిత్యం!
మళ్ళీ సృష్టికి మార్గం చూపే,
విధాత దృష్టికి వివరం చెప్పే,
రసాతలానికి రాజుగ నిలచే,
మరొక్క కవితే పుడుతుంది,
ఇదే దారిలో వెడుతుంది!
"పునరపి జననమ్ పునరపి మరణమ్"
కవితాగమనం చక్రభ్రమణం!
***