ప్రతిరోజూ నా కొమ్మనించి ఆకులని సౌపర్ణికలో రాల్చి సూర్యునికి అర్ఘ్యమిడటం నా నిత్యకృత్యం ఇన్ని వందల ఏళ్ళుగా! సౌపర్ణికకి ఆవలి దిక్కున పొలం దున్నుకునే రైతు దంపతులు కూడా ఆ పొడిచే తొలి పొద్దుకీ పంట నిచ్చే మట్టికీ రోజూ మొక్కడం నేను గమనించాను. పిట్టలన్నీ తెలవారక ముందే లేచి తూరుపు దిక్కుకి దూసుకు వెళ్ళేది సూర్యునికి అంజలి ఘటించడానికేనని నాతో చెప్పినప్పుడు నేనెంతో విస్తుపోయేను. తన ఒక్క తేజంతో ఒక్క కిరణ స్పర్శతో ఈ భువనాన్ని ప్రభావితం చేసే ఆ ఎండదొర ఎన్ని లక్షల జీవరాశులని పోషిస్తున్నాడు, జీవన ప్రయాణంలో వెన్ను తట్టి కొనసాగమని జఠరాగ్నిని మండించి ఎలా ప్రోత్సహిస్తున్నాడు అనుకుని సృష్టి విన్యాసానికి ప్రణామం చేశాను.
సాయం సంధ్యలో మహేంద్రగిరి మాటున కనుమరుగవుతూ, అడవిచెట్ల కొనకొమ్మలపై తన నీరెండ కాంతితో సూర్యుడు తన సందేశాన్ని రాసినప్పుడు, వాటిని అందుకుని వెలుగుతూ వనాలూ, మేఘాలూ, నదీ జలాలూ, నమ్మకంతో మరో ఉదయం కోసం ఎదురు చూసేవి. ఆకులన్నీ హేమంతంలో రంగులు మారుతున్నప్పుడు ఆకాశం లోని హరివిల్లు తన లోని రంగులని నలుదిక్కులా విరజిమ్మి ఆకులపై వాలి విశ్రమించేనా? అన్నట్లుండేది. దూరంగా పల్లెల లోంచి విరబూసిన పూలవాసనలు గాలి ద్వారా తేలి వచ్చి మమ్మల్ని ఆక్రమించేవి. సృష్టిలో ఎంత హాయి ఉందో అనిపించి సంతోషంతో మా చెట్టూ పుట్టా సంభాషించుకున్న రోజులు ఎన్నో!
దూరాన ఉన్న మహేంద్రగిరి మీది కోవెలకి నరులు బారులు తీరి పోయేవారు. వారంతా సౌపర్ణికలో స్నానమాడేవారు. రథసప్తమి రోజున స్నానం చేస్తూ సూర్యునికి నమస్కారం చేస్తూ ఎందరెందరో స్త్రీలు నదిలో మునిగినప్పుడు, నది కెరటాలపై హొయలుగా కదిలే వారి నీలకుంతలాలు నన్ను ఆకర్శించేవి. నేను తదేకదీక్షతో వారినే గమనించేదానిని! అప్పుడప్పుడు వారంతా ప్రేమగా నన్ను తాకి, నాకింత పసుపు రాసి పూలుంచి నా ముందర, నా చుట్టూ తిరిగి నాకు మొక్కేవారు. వారి వారి కోరికలేమిటో నాకు తెలియకపోయినా వారి బ్రతుకు సంతోషంగా ఉండాలని నేను నా కొమ్మల మునివేళ్ళతో వారి శిరస్సులని తాకి ఆశీర్వదించేదానిని. వారంతా “స్వామీ! శ్రీమన్నారాయణా! రక్షించు తండ్రీ!” అంటూ ఎలుగెత్తి దేవుని కొలిచేవారు.
‘రక్షించమనే’ మాట నాకెంతో ప్రియంగా అన్పించేది. ఎన్ని సంఘర్షణల మధ్య సైతం భయవిహ్వలులు కాకుండా ఒక స్థిరచిత్తంతో గెలుపునీ ఓటమినీ స్వీకరించడానికి మన వెన్నంటి ఒక సృష్టికర్త ఉన్నాడన్న భావం నాకు ఎంతో బాగుండేది! ఎవరికో ఒకరికి నివేదించుకోవాలి కద అంతరంగాన్ని! బతుకులోని కష్టసుఖాల్ని! ఆకలిని! ఆగామి కాలంలోని ఆశలని, ఆలోచనల వలయాన్ని, విహ్వలాన్నీ!
ఆకలిని గురించి నాలో ఎన్నో ప్రశ్నలు, సందేహాలు, దాని ఉనికి లోని మంచి చెడులని గురించిన ఊగిసలాటలు సదా మనసుని ముసురుకుని బాధించేవి. అలా జరగడానికి అనేకమైన కారణాలు! పాము నా కొమ్మల సందుల్లోంచి జరజరా పాకుతూ పైకి వెళుతుంది. నాకు తెలుసు అది అటుగా ఎందుకని వెళుతుందో! చిన్ని పక్షికూనలు ఇంకా కళ్ళూ తెరవనివి, రెక్క మొలవనివి గూటిలో ఉంటాయి. తల్లి పక్షి చేపల కోసం నది వైపు వెళ్ళే సమయాలు చూసుకుని ఆ చిన్ని కూనలని మింగడానికి దొంగచాటుగా వస్తుంది పాము. ఇలా ఒక గూటిలోంచి మరో గూటి వైపుగా అది సాగి అక్కడి పసి కూనలని కూడా తినిపోతుంది. వెనక్కివచ్చి ఖాళీగా మిగిలిన తమ గూళ్ళని చూసి వ్యధతో అరిచే తల్లిపక్షుల రోదన నన్ను భయపెట్టేది. ఎక్కడినుంచో వచ్చి నా కొమ్మల నాశ్రయించి నన్ను నమ్మి గూడు కట్టుకున్న ఆ పక్షి సంసారాన్ని రక్షించవలసిన బాధ్యత నాదేనని నేను అనుకునేదాన్ని! పాము మరో గూటివైపు వెళ్ళకముందే ఒక్క ఉదుటున కోపంలో కొమ్మల్ని విదిలిస్తాను. ఒక్కోసారి పాము కిందికి పడిపోతుంది. ఒక్కోసారి పడదు. ఇదొక నిత్యఘర్షణ మా మధ్య. నా కొమ్మలీ ఘర్షణలో విరిగి పోతుంటాయి. నా కొమ్మలెన్ని విరిగిపడినా సరే. నేను నారాయణ పక్షుల నమ్మకాన్ని మాత్రం విరగనివ్వను అని అనుకుంటాను.
రాత్రిలో క్రూరమృగాలు వేటాడి నేలని రక్తపు చిత్తడి చేసేవి. సౌపర్ణికకి వచ్చిన వరదలు, అందులో కొట్టుకుపోయిన ఎన్నో కళేబరాలూ, ఇలా ఆనేకరకాలుగా విధ్వంసాన్ని నేను చూశాను. విధ్వంసం గురించిన ఆలోచన వచ్చినప్పుడు మాత్రం వీటన్నింటికన్నా నాకు ముందుగా నారాయణ పక్షుల కూనలని తినడానికి నామీదికి ఎగబాకే పామే నాకు స్ఫురణకు వస్తుంది. పాము పక్షిపిల్లల్నే ఎందుకు తినాలని నాకు అన్పించేది. ఆ దృశ్యం నన్ను సదా కలచివేసినది కావడం వల్లనే! కానీ ఆకలి చాలా ముఖ్యమైనది మరి! ఆకలి ముందు ఇతర స్పందనలన్నీ చిన్నవే అయిపోక తప్పదని నాకు అర్ధమయ్యింది. ఆకలే జీవ చైతన్యానికి ప్రతీక! ఆకలన్నదే లేకపోతే ఈ జగత్తు ఎలా ఉండేదో! అన్న ఊహకి స్పష్టమైన దృశ్యం నాకు కన్పించేది కాదు. కానీ ఆలోచనలన్నింటి తరవాత ఆకలి అన్నది సృష్టిలో తప్పక ఉండవలసిందేనని సారాంశంగా నేను స్వీకరించాను. ఆకలే లేకపోతే ఆ ఎగిరే చిన్నిపిట్ట నా చెంతకి రాదు. ఆ నారాయణ పక్షులూ నన్ను వెతుక్కుంటూ రావు. నన్ను ఆశ్రయించి నా కొమ్మల్లో గూళ్ళు కట్టి పిల్లల్ని పొదగవు. సౌపర్ణికలో చేపలని వేటాడి తమ సంతానానికి తిండిని అందించవు. ఇదే సృష్టి నియతి.
ఆకలే లేకపోతే ఆ రైతు దంపతులు మట్టిని పెళ్ళగించి విత్తులని నాటరే! మందలు మందలుగా లేళ్ళూ, గుంపులు గుంపులుగా చేపలూ, అడివినిండా, నదినిండా నిండిపోతాయా?! నిలబడిపోతాయా?! ప్రయాణం అలా ఆగిపోతుందా?! సృష్టి స్తంభించిపోతుందా?! అన్న ఊహకి అంత దిట్టమైన నా వెన్నులోనే వణుకు పుడుతుంది. ఋతు ఆవృతమూ, అలాగే సౌపర్ణికా ప్రవాహమూ కూడా ఆగిపోతాయని నాలో సందేహం మొలిచింది. ఆ ఊహని భరించలేక భయంతో ఆవేళ నాకు అవసరమైన దానికన్నా మించి మరింత మరింతగా నేను సూర్యరశ్మిని భోజనం చేశాను. నెమ్మదిగా నా భయాన్ని నేనే తొలగించుకున్నాను. తలదించి సౌపర్ణికని చూశాను. నిర్నిమిత్తంగా నది సాగిపోతూనే ఉంది. ఈ ‘నిమిత్తమనే’ దానిని ఎవరైనా విశదీకరిస్తే ఎంత బాగుండునూ?! సమస్త రోగ నివారిణిగా ఈ సృష్టి నన్ను ఎందుకని కల్పించిందో? నాకెందుకీ సౌపర్ణికా జలస్పర్శ లభించిందో?! ఆ ప్రచండభానుడు తన కిరణాల ద్వారా నాకు ఆహారాన్ని ఎందుకని అనుగ్రహిస్తున్నాడో? ఎందుకని నేను ఇంత ఉన్నతంగా, ఇంత విశాలంగా, ఇంత హరితమయంగా విస్తరించి ఈ సృష్టి సంఘటనలకి సాక్షీభూతమయ్యానో? వీటన్నింటికీ ఏ నిమిత్తమో ఎవరు చెప్పగలిగినవారు?
ప్రతి జీవికీ ఒక నిత్యకర్మని ప్రసాదిస్తున్న సృష్టి తప్ప నిమిత్తమన్నది ఏదీ లేదు. దాని ఆజ్ఞని తలదాల్చటమే బ్రతకటం అంటే అనుకున్నాను అర్జునగా నేను. నా కారణాన్ని నేను ఇలా నిర్వచించుకున్నాను. ఆకులు రాలి ఎండినా, పచ్చగా నిండినా కూడా, నా గొంతులో మార్పు లేదు. నాలాగే నీళ్ళు లేక కృశించిన నాడూ, నీటితో నిండి పరవళ్ళు తొక్కిన నాడూ సౌపర్ణికా హృదయంలోనూ ఏ మార్పూ లేదు. ఆమెది అలజడి లేని వడి! ఆమె వేగంలో సాంద్రత ఉంటుంది! సంగీతం ఉంటుంది! మాపైనుండి ఎన్నో ఋతు ఆవృతాలు మళ్ళిపోతూనే ఉన్నాయి!
ఆకురాలు కాలం వచ్చి వెళ్ళింది! చైత్రం పలకరించింది! తాను మళ్ళిపోతూ గ్రీష్మాన్ని పిలిచింది! సౌపర్ణికలోని జలరాశి పలచనయ్యింది! దాహానికి ఓపలేక అడివంతా తల్లడిల్లింది. ఇంతలో నల్ల మబ్బులు పరుగుపరుగున వచ్చాయి! జడివానగా కురిశాయి! దాహార్తిలో తపించిన జీవాలన్నీ తెప్పరిల్లాయి! నా నిండా చినుకులు ఆకులతో కలిసి సందడి చేశాయి! ఇదుగో! మళ్ళీ ఇలా శరత్తు ఆవహించింది నన్నూ, సౌపర్ణికనీ! ఆమె తరంగాలలో ప్రతిఫలించే నీలిమబ్బులనీ, సూర్యుని పయనాన్నీ, వెన్నెల కిరణాలనీ, నక్షత్రాలనీ, నేను చూస్తూనే ఉన్నాను!
జీవనయానానికి గుర్తుగా సౌపర్ణిక సాగిపోతూనే ఉంది! నా కొమ్మల్లో నారాయణ పక్షులు ఆహారాన్ని పట్టి తెచ్చి తమ చిన్ని కూనల గొంతుల్లోకి జారవిడుస్తూనే ఉన్నాయి! కృష్ణజింకలు పులుల మూర్ఖత్వాన్ని గురించి ముచ్చటలాడుతూనే ఉన్నాయి! నేను అన్ని మార్పులని గురించి, అన్ని భయసందేహాలని గురించీ సౌపర్ణికతో సంభాషిస్తూనే ఉన్నాను. తాను చూస్తున్న దుస్సహమైన మార్పుల గురించి నాకు సౌపర్ణిక వివరిస్తూనే ఉన్నది! నేను నది ఒడ్డున నిలిచి అన్నింటీ కథలని గానం చేస్తాను! సౌపర్ణిక నాకు చలనాన్ని చూపిస్తుంది! నేను ఆమెకు స్థిరత్వాన్ని విశదీకరిస్తాను!