ఈమాట » వేణునాదం ఆగింది!

Expand to right
Expand to left

వేణునాదం ఆగింది!

ఒక తెలుగు మాసపత్రిక జనవరి సంచిక చూసేదాకా ఏల్చూరి విజయరాఘవరావుగారు అమెరికాలో కాలంచేశారన్న వార్త తెలియకపోవడంతో నేను దిగ్భ్రాంతికీ, కలవరపాటుకూ గురి అయాను. ముందుగా కొన్ని వ్యక్తిగతవిషయాలు చెప్పాలి. బొంబాయిలో 1970నుంచీ ఉంటున్న నాకు ఆయనతో బాగా పరిచయం ఉండేది. 1958నుంచీ ఫిల్మ్స్ డివిజన్‌లో ఆయన సంగీతదర్శకుడుగా పనిచెయ్యడం వల్ల అక్కడ ఎడిటర్‌గా పనిచేసి, ఆ తరవాత పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌కు ప్రొఫెసర్‌గా వెళ్ళిన మా అన్నయ్య రామచంద్రరావుకు ఆయన మంచి మిత్రుడు. మా బాబాయి కృష్ణమూర్తి కూడా అదే ఆఫీస్‌లో తెలుగు కామెంటేటర్‌గా పనిచేసేవారు. ఆ తరవాత నాకున్న హిందూస్తానీ శాస్త్రీయ సంగీతంలోని అభిరుచి దృష్ట్యా ఆయనను చాలా సందర్భాల్లో కలుసుకున్నాను.

ముఖ్యంగా 1978లో బొంబాయి కళాకారుల చేత - ప్రస్తుతం హ్యూస్టన్‌లో ఉంటున్న మా కవి మిత్రుడు, సైంటిస్ట్ డా. అహోబిలవఝ్ఝల మురళి రాసి - నిర్వహించిన కుమారసంభవం అనే నృత్య నాటకానికి నేను సంగీతదర్శకత్వం వహించడం, దాని మలిప్రదర్శనకు ఏల్చూరివారు ముఖ్యఅతిథిగా వచ్చి మా అందరినీ ప్రశంసించడం మరిచిపోలేని సంఘటనలు.

అంతేకాక మేము నడుపుతున్న తెలుగు సాహిత్యసమితి సభ్యుల ఉత్సాహాన్ని గమనించిన రావుగారు కొన్నిరోజులకే 1979లో తాను పుట్టపర్తికి వెళ్ళినప్పుడు మమ్మల్ని సంప్రదించకుండానే మాతరఫున అక్కడ ఎస్.రాజేశ్వరరావునూ, పి.సుశీలనూ ఆర్కెస్ట్రాతోసహా బొంబాయికి ఆహ్వానించారు. అదొక చరిత్రాత్మక ఘట్టమయింది. ఒకవంక మాలో ‘పెద్దలు’గా చలామణీ అవుతున్న కొందరు అలిగి, మొత్తం కార్యక్రమాన్ని చివరి నిమిషాన ముంచే ప్రయత్నం చేశారు. మాలో 35మందిమి వాలంటీర్లం మటుకు పట్టువదలక ఆ పాటల ప్రోగ్రామును అతివిజయవంతంగా నిర్వహించాము. షణ్ముఖానంద హాలులోని 3000 సీట్లూ అమ్ముడు పోవడమేకాక 5రూ. టికెట్టు ప్రేక్షకుల్లోని కొందరు ఆశాపరులకు బ్లాకులో 40రూ. పలికింది! ఇదంతా ఇన్నేళ్ళ తరవాత చెప్పుకోదగినది కాదుగాని, అప్పట్లో మా ఉత్సాహాన్నీ, అందోళననూకూడా పెంచిందనేది చెప్పడానికే.

ఆ ప్రోగ్రాములో గాయకుడు రామకృష్ణ కోరగా నేను తెరలేచే ముందరే రిహార్సల్ లేకుండా తక్కిన ఆర్కెస్ట్రాతో బాటుగా సితార్ వాయించవలసివచ్చింది. ఆ సభకు విజయరాఘవరావుగారు ముఖ్యఅతిథిగా, నౌషాద్ విశేష అతిథిగా రావడం మాకు మరింత సంతోషాన్నిచ్చింది. మేము ఆర్గనైజర్లుగానూ, స్టేజి కళాకారులుగానూకూడా శ్రమిస్తామనే సంగతి విజయరాఘవరావుగారు కళ్ళారా చూసి, భుజం తట్టగలిగారు.

తిరునాళ్ళకు తరలొచ్చే - సంగీతం: వి.రా. రావు

బొంబాయిలో విజయరాఘవరావుగారి వేణుకచేరీలూ, సంగీతంలోని రాగతాళాల మీద చేసిన సోదాహరణ ప్రసంగాలూ, వాటిని సక్రమంగా వినిపించేందుకు గాయక, వాద్యబృందాలతో నిర్వహించిన పెద్ద కార్యక్రమాలూ ఎన్నోసార్లు నేను విని ఆనందించగలిగాను. వాటిలో కొన్ని మా భాభా అణుకేంద్రం ఆడిటోరియంలోనూ, కొన్ని కాలనీలోనూ కూడా ఏర్పాటు చేశాము. ఆయనను ఇంట్లో కలుసుకుని క్రమం తప్పకుండా ప్రతి సాయంత్రమూ ఆఫీసునుంచి తిరిగి రాగానే ఆయన చేసే సంగీతాభ్యాసమూ, చెప్పే విషయాలూ అన్నీ వినే అదృష్టం నాకు కలిగింది. ఆయనకు పద్మశ్రీ రావడం అంత ఆశ్చర్యకరమేమీ కాదు.

ఆయన శిష్యుల్లో రోనూ మజుందార్ బాగా పేరుపొందాడు. ఆయన రెయిన్‌బో అనే ఒక లాంగ్‌ప్లే రికార్డ్‌లో ఒక వేపున వివిధరాగాలూ, తాళాల మాలికను వాద్యబృందం ద్వారా వినిపించారు. రెండోవేపున పదాలు లేకుండా ఒక థీం మ్యూజిక్ వినిపిస్తుంది. సుఖంగా ఉంటున్న ఒక గ్రామానికి క్షామం ఎదురవుతుంది. అక్కడి ప్రజలంతా కొన్నాళ్ళు బాధలు పడ్డాక, కలిసి, శ్రమించి, మళ్ళీ ప్రగతిని సాధిస్తారు. ఈ కథంతా కేవలం వాద్యసంగీతం ద్వారానే మనకు అర్థమవుతుంది. ఈ రికార్డ్ మేము పదేపదే వింటూ ఉండేవాళ్ళం. ఆయన వాయించిన మాల్కౌఁస్ రాగం ఇక్కడ వినవచ్చు. ఒక సభలో ప్రదర్శించిన గీతగోవిందం ఓడిస్సీ శైలి నృత్యనాటకానికి పాటల స్వరరచన జస్‌రాజ్ చెయ్యగా, వాద్యసంగీతమంతా రావుగారే చేశారు.

సితార్ విద్వాంసుడైన రవిశంకర్‌వద్ద సంగీతం నేర్చుకున్న విజయరాఘవరావు ఆయనకు నికరమైన శిష్యుడు ఎందుకంటే కేవలం రాగతాళాలేకాక మొత్తం భారతీయసంస్కృతినీ, అందులోని వివిధ అంశాలనూ పరిశీలించి, అర్థంచేసుకునే సామర్థ్యం ఆయనకు అలవడింది. రవిశంకర్ స్వయంగా సంగీతరచన చేసిన అనూరాధా, గోదాన్, మీరా మొదలైన హిందీ చిత్రాల రికార్డింగ్‌లన్నిటిలోనూ రావుగారు ప్రధానపాత్ర నిర్వహించారు. ఫిల్మ్స్ డివిజన్‌వారి అసంఖ్యాకమైన డాక్యుమెంటరీల సంగీతంలో ఆయన రేడియోశబ్గాల దగ్గర్నుంచీ, రకరకాల ప్రపంచవాద్యాలదాకా అనేకం వాడి విజయవంతమైన ప్రయోగాలు చేశారు. 2008లో మా ఆవిడ, నేనూ అమెరికాలో అట్లాంటాలో ఉంటున్నప్పుడు వాషింగ్టన్ ప్రాంతం నుంచి తన రెండో కుమార్తె వద్దకు వచ్చిన ఆ సంగీతజ్ఞుణ్ణీ, కుటుంబాన్నీ మేము కలుసుకోగలిగాము. నా సితార్, గాత్రం విని ఆయన మెచ్చుకున్నారు కూడా. ఆయనిచ్చిన సలహాలు సంగీతపరంగా చాలా ఉపకరించాయి.

ఆయనకు తెలుగు, ఇంగ్లీష్, హిందీలతో బాటుగా బెంగాలీవంటి ఇతరభాషలు కూడా క్షుణ్ణంగా వచ్చు. విజయరాఘవరావు తన కళాజీవితాన్ని భరతనాట్యంతో మొదలు పెట్టినప్పటికీ, ఆయన వేణువునేకాక, వాద్యబృంద నిర్వహణనూ, మెళుకువలనూ, స్వరరచననూ, సంగీతప్రసంగాలనూ అద్భుతంగా నిర్వహించారు. ఇవన్నీకాక సుబ్రహ్మణ్యంగారి సోదరుడిగా తెలుగు కవిత్వమూ, కథలూ, ఇంగ్లీషులో రచనలూ చేశారు. ఎంతోకాలం ఆంధ్రప్రదేశ్ బైటే నివసించడంతో తెలుగువారికి ఆయన గురించి తెలియకపోవడం వారి దురదృష్టమే అనుకోవాలి. హిందూస్తానీ సంగీతరంగానికి ఆయన బాగా పరిచితుడే.

సినీసంగీతదర్శకుడుగా భువన్‌షోమ్‌ వంటి ఉత్తమ చిత్రాలకు ఆయన సమకూర్చిన నేపథ్యసంగీతం బహుమతులు గెలుచుకుంది. కళాత్మక విలువలపట్ల ఏమాత్రమూ రాజీపడకుండా, ఎవరినీ తిట్టుకోకుండా, ఆనందంగా చివరిదాకా జీవించిన ఆ మహానుభావుడు సదా స్మరణీయుడే.

 

(29 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Rohiniprasad అభిప్రాయం:

    January 10, 2012 10:03 am

    ఉత్తమ కళాకారులను మరణించాక తలుచుకోవడంకూడా తప్పేనని లైలాగారివల్ల తెలిసింది!

  2. lyla yerneni అభిప్రాయం:

    January 10, 2012 11:38 am

    ఉత్తమ కళాకారులను మరణించాక తలుచుకోవడంకూడా తప్పేనని లైలాగారివల్ల తెలిసింది!- రోహిణీప్రసాద్

    మరణించినప్పుడే ఉత్తమ కళాకారులు యాదిలొకి వస్తారా? లేక మరణించినందువలన అప్పుడు ఉత్తమ శ్రేణిలోకి జేరతారా. ఒక కళాకారుని చనిపోయినప్పుడే, ఎందుకు పరిచయం చెయ్యటం? కళ అంతకు ముందునుండీ ఉందిగా. తర్వాత కూడా ఉంటుంది. ఇతర పత్రికలు, సాహిత్య సంగీత కళల విషయాలు ఎప్పటికప్పుడు పరిచయం చేస్తుంటారు. విషయాలు మారుతూ ఉంటాయి. ఆసక్తి దాయకంగా ఉంటాయి. ట్రిబ్యూట్లు మీకొక రిపొర్టింగ్ సెన్సేషనలిసమ్. అది మీ ఆచారం. ప్రజలందర్నీ ఈ వ్యక్తి చనిపోయాడు, చనిపోయాడు, ఇప్పుడు స్పందించండో అని synchronise చెయ్యటం. ఒక వ్యక్తి మరణిస్తేనే వేణు నాదం ఆగిపోతుందా? ఏమిటా హెడ్డింగ్ ? ఏమిటీ వెర్రి? రోహిణీ ప్రసాద్?

    మరణించినప్పుడే కళాకారులను గుర్తు చేసుకోటానికి, పరిచయం చెయ్యటానికి, మీరిచ్చే కారణం?

    లైలా.

  3. Rohiniprasad అభిప్రాయం:

    January 10, 2012 12:00 pm

    లైలాగారూ, నా వెర్రి మీకు తెలియదు లెండి.

    2007లో అట్లాంటాలో ఉన్నప్పుడు అప్నా అనే ఒక సంస్థ మొదలయింది. దాన్ని ప్రారంభించిన వ్యక్తులు నాకు తెలుసు గనక ప్రారంభోత్సవానికి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంతో బాటుగా విజయరాఘవరావుగారిని కూడా ఆహ్వానిస్తే బావుంటుందని నేను సూచించాను. కాస్త తటపటాయించి ఆ ప్రయత్నం విరమించారు.

    నాకు వీలున్నంతవరకూ ఇంకా చాలా సందర్భాల్లో చాలామందితో ఈ సంగతి చెప్పి, ఒక పద్మశ్రీ అవార్డుతో అయినా ఆయనను మనం గుర్తించాలని చెప్పాను.

    బతికుంటేనేం, లేకపోతేనేం అనే మీవంటివారి వైఖరి ఉంటే ఏమీ జరగదు కదా. పైగా మీకు ఆయనొక పబ్లిక్ ఫిగర్ కావచ్చు. నాకు పరిచయం ఉంది కనక కాస్త సీరియస్‌గా అనిపిస్తుంది. అర్థం చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు.

  4. మోహన అభిప్రాయం:

    January 10, 2012 12:18 pm

    ఆల్ ఇండియా రేడియో కాలంలో విజయరాఘవరావుగారి పేరు ఎక్కువగా వినబడేది. అతడు గొప్ప కళాకారుడన్న విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. మన శ్రద్ధాంజలిని తగిన రీతిగా చూపడము సబబే. ఇక పోతే లైలాగారి ఆక్షేపణ అంతా బ్రదికి ఉన్నవారిపైన ఎందుకు వ్రాయడము లేదు అనేదే. మదరాసులో చిన్నప్పుడు నేను బడిలో చదివేటప్పుడు జూను బతికిన కాలేజి అని, మ్యూసియమును చచ్చిన కాలేజి అని వ్యవహరించే వాళ్లము. అలా ఈమాట చచ్చిన కాలేజి మాత్రమే కాకుండా బతికిన కాలేజిగా కూడ ఎందుకు ఉండరాదు అనేదే ప్రశ్న. బహుశా సంపాదకులు ప్రముఖాంధ్రుల 60 లేక 70 ఏళ్ల వయస్సును చేరేవారి పట్టికను తయారు చేసి వారు తెలుగు సాహిత్యానికి, లలిత కళలకు ఎలాటి సేవ చేసారో అనే విషయాన్నిగురించి సంచికలను తయారు చేయవచ్చును. అందులో ఆ కళాకారుని కూడ వ్రాయమనవచ్చును. అలా భద్రిరాజు కృష్ణమూర్తిని గురించి ఇంతకు ముందు ఒక సంచిక వెలువడింది. అలాగే అట్టి ప్రయత్నాలను కొనసాగించమనే లైలాగారు భావిస్తున్నారని నేను అనుకొంటాను. విధేయుడు - మోహన

  5. Sreenivas Paruchuri అభిప్రాయం:

    January 10, 2012 1:28 pm

    గొప్ప నివాళి! 1982-83 ప్రాంతాల్లో ఆయన విజయవాడ వస్తే రేడియో కేంద్రం వాళ్ళు ఆయన చేత ఒక పాటను (తిరునాళ్ళకు తరలొచ్చే కన్నెపిల్లలా …) చేయించుకున్నారు. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి రచనకు విజయరాఘవరావుగారు బాణీ కడితే, శ్రీరంగం గోపాలరత్నం గొప్పగా పాడారు. విజయవాడ రేడియో స్టేషన్‌ శ్రోతలందరికీ అప్పటికీ, ఇప్పటికీ గుర్తుండి పోయిన పాటల్లో ఇదొకటి. ఈ పాటొకెత్తయితే, రామం గారు (S.B శ్రీరామమూర్తి) ఆ పాట పుట్టుక మీద చేసిన డాక్యుమెంటరీ: “ఒక పాట పుట్టింది” మరొకెత్తు. అది కూడా అప్పట్లో చాలా ప్రాచుర్యం పొందింది. ఈ రెండు కార్యక్రమాలతోనే విజయరాఘవరావుగారితో (సంగీతం) నాకు పరిచయం. ఆ తరువాతే ఆయన మృణాల్ సేన్‌ సినిమాలకి, తెలుగులో ఒక ఊరి కథ సినిమాకి చేసిన సంగీతం తెలిసొచ్చాయి. తరువాత్తరువాత ఆయన వేణువాదన L.Pలు, CD లు చాలా విన్నాను. ఒక పదేళ్ళ క్రితం (కర్నాటక) సంగీతం గురించి బాగా తెలిసిన వారొకరు ఆయనతో సంగీతపరమైన అంశాలపై వ్యక్తిగగతంగా జరిపిన సంభాషణ టేపొకటి వినే అదృష్టం కలిగిది. అప్పటినుడీ ఆయనంటె గౌరవం మరింత పెరిగింది. ఉత్తర-, దక్షిణ భారతీయ సంగీత పద్ధతులగురించి, రేడియోలో వాద్యబృందాల గురించిన వివరాలే కాకుండా ఆయన సంగీతాన్ని విశ్లేషించిన పద్ధతి నన్ను బాగా ఆకట్టుకొంది.

    తెలుగులో కూడా బహుళంగా రచనలు చేసిన విషయం చాలామందికి తెలియదు. గత కొద్ది సంవత్సరాలలో “కౌముది”(వెబ్‌) పత్రికలో ఆయన తెలుగు రచనలు వచ్చాయి.

    తెలుగు పత్రికల్లో, ఆ మాటకొస్తే భారతీయ పత్రికల్లో యెక్కడా ఆయన కాలం చేసినట్లు వార్త వచ్చినట్లు లేదు. చివరకు “నరసరావుపేట” అన్న బ్లాగు (అది ఆయన స్వస్థలం) నడిపేవారికి కూడా ఈ వార్త తెలిసినట్లు లేదు. గత రెండు నెలలుగా నిరంతరం ప్రయాణాల్లో వుండి RMIC చర్చావేదిక కూడా చూడకపోవడంతో రెండు రోజుల క్రితం రోహిణీప్రసాద్ గారు చెప్పేవరకు ఈ వార్త తెలిసి రాలేదు. ఆయనలానే నేను కూడా దిగ్భ్రాంతికీ, కలవరపాటుకూ గురి అయాను. మొన్న డిసెంబరు చివరిలో మిత్రుడు మాధవ్ ఇంట్లో విజయరాఘవరావుగారి సిడి ఒకటి చూసి ఆయనతో interview ఒకటి ఈమాటకి పంపుతానని చెప్పాను. ఇప్పుడైనా AIR, Films Division సంస్థలు ఆయన చేసిన గొప్ప సంగీతాన్ని మరింత వెలుగులోకి తెస్తాయని ఆశిద్దాం.

    రోహిణీప్రసాద్ గారికి మంచి వ్యాసం అందించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఒక గొప్ప సంగీతజ్ఞుణ్ణి, నిరాడంబరమైన మనిషిని స్మరించుకుంటూ …

    మరొక వెర్రివాడు,
    – శ్రీనివాస్

  6. rama bharadwaj అభిప్రాయం:

    January 10, 2012 2:55 pm

    విజయరాఘవ రావు ఏల్చూరి మంచి సంగీత విద్వాంసుడు. రోహిణీ ప్రసాద్ అన్నట్టుగా ఆయన తెలుగు నేలకి దూరంగా ఉండటమ్ హిందుస్తానీ సంగీతానికి దగ్గర వారు కావటం వంటి వాటి వలన తెలుగు వారికి అంతగా తెలిసే వీలు కలగలేదు. అది తెలుగు వారి దురదృష్టమ్ కూడా! ఆయనకి నివాళి చెప్పడంలో తప్పేంలేదు.

    అయితే లైలా గారి అభిప్రాయంలో అందరూ ఆలోచించవలసిన ముఖ్యమైన అంశాలున్నాయి. ఆవిడ గొంతులో ధ్వనించే అసహనంలో/ ప్రశ్నలో నిజం లేకపోలేదు. ఒక వ్యక్తి తాలూకు గొప్పదనాన్ని గుర్తించడమో/ వారి గురించి మాట్లాడటమో జరగడానికివాళ్ళు వయసు మళ్ళి పోవాల్సి రావడమో ..లేక జీవితంనించి కూడా మళ్ళిపోవాల్సి రావడమో జరిగితే గానీ ఒక మంచి జ్నాపకమ్ బయటికి రాదన్నమాట! ఈ మాటలేవో ఆయన జీవితకాలంలోనే ఒక వ్యాసంగా వచ్చి ఉంటే తెలుగు వాళ్ళు ఆయన మీద ఒక గొప్ప భావనని కలిగి ఉన్నారని ఆయనకి తెలిసేది కదా? రోహిణీప్రసాద్ ఈ వ్యాసాన్ని విజయరాఘవ రావుగారు ఉన్నప్పుడే రాసి ఉండవలసింది కాదా? అప్పుడు ఆ కళాకారుడికీ ఈ కళాకారుడికీ ఒక తృప్తి మిగిలేది కదా?? ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు అన్నాడు ఆరుద్ర. కానీ రావల్సిన వ్యాసాలు సైతం ఒక జీవితకాలమ్ ఆలశ్యం కావడమ్ అసలు సిసలైన ” తెలుగుతనం”.

    లైలాగారి వ్యాఖ్యలు… చనిపోయిన వారి జ్నాపకాలతో పత్రికని నింపడం మీద. అది చాలాసార్లు చేస్తూంటే ఎవరికైనా ఈ సంప్రదాయం మీద విసుగుపుట్టడంలో ఆశ్చర్యమ్ లేదు. ఒక రంగంలో వ్యక్తులు చేసిన ఏ రకమైన సేవలకైనా ఆ వ్యక్తుల జీవితకాలంలో గుర్తింపురావడం నాగరికత. ఆ నాగరికతనే నిజాయితీగా పెంపొందించుకోవడం గురించి ఆలోచించుకోవాలి తెలుగువాళ్ళు. లేకపోతే ఎంత గాఢమైన భావనలున్నా అవన్నీ చివరికి ఇలా చనిపోయిన సందర్భంలో రాసే సంతాపంగానే మిగిలిపోతాయి. ఇవీ రాయొచ్చు తప్పులేదు. ఇంతకన్నా మెరుగైన సందర్భలో రాయడమ్ మరింత ఆహ్లాదమ్ గా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆ పోయిన వారి ఆత్మీయులకి ఎవరికైనా !!

    లైలాగారూ మీ మాటల “చురుకు” ఈమాటకి ఉన్న అతికొద్ది ఆకర్షణల్లో ఒకటి.

    రమ.

  7. lyla yerneni అభిప్రాయం:

    January 10, 2012 3:06 pm

    Pardon me, చందమామలో నేమో చదువుకున్నా, ఎప్పుడో ఒక నీతి కథని.

    ఒక ఇంటివాళ్ళకి మామిడికాయల బుట్ట వచ్చింది. కొన్ని కుళ్ళువి. కొన్ని నవనవ లాడుతున్నయి. నాలాటి ఒక హృదయం లేని స్త్రీ, - అయ్యలూ! కుళ్ళిన పళ్ళు అవతల పారెయ్యండి, మంచివి ఇవ్వాళే తినండి అంది. వారు -ఎందుకు పారెయ్యటం వెర్రిదానా! నీకు డబ్బు విలువ బొత్తిగా తెలీదూ, నువ్వు చెప్పేదేంటి, మేము వినేదేంటి అని, కుళ్ళిన పళ్ళే తిన్నారు. మర్నాటికి మరి కొన్ని కుళ్ళాయి. మళ్ళీ అవే తిన్నారు. ఇలా బుట్టలో కాయలు ఐపోయేసరికి వారు ఒక్క నాడూ మంచి మామిడిపండు ఆనందంగా తినలేదు. మంచి రుచి తెలుసుకోలేదు. ఈ లోగా వారికి కుళ్ళు రుచి అలవాటై పోయింది. ఇప్పడు కుళ్ళు పళ్ళే కావాలని తెచ్చుకుని కళ్ళ కద్దుకుని తింటారు.

    రోహిణీ ప్రసాద్ “మరణించినప్పుడే కళాకారులను గుర్తు చేసుకోటానికి, పరిచయం చెయ్యటానికి, మీరిచ్చే కారణం?” - అని నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.

    పర్లేదు. విషాదంలో ఉన్నారు, మీరు శ్రీనివాస్, occupy శ్రద్ధాంజలి ఈ మాట ప్రాంగణం లోనే peaceful గా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఆర్టికల్, ఎప్పుడు రాయాలో మీకే తెలుసుగా.

    లైలా

  8. జె. యు. బి. వి. ప్రసాద్‌ అభిప్రాయం:

    January 10, 2012 7:08 pm

    నా ఓటు కూడా లైలా గారికీ, రమా భరద్వాజ్‌ గారికీ, ఈ విషయంలో.
    ప్రసాద్‌

  9. వెర్రి Rahaman అభిప్రాయం:

    January 10, 2012 7:25 pm

    లైలా,

    మీరు గమనించారో లేదో ఇందులో విజయరాఘవరావు గారి నివాళి కంటే రాసిన వారి సోత్కర్షే పుష్కలంగా వుంది. కాబట్టి, ఇది నివాళి వ్యాసంగా మీరెలా అనుకున్నారో, ఈ అనవసర చర్చెందుకో అర్థం కావడం లేదు.
    ఇది చూడండి: విజయరాఘవ రావుగారెంత గొప్పవారో తెలుస్తుంది.
    అంతేకాక మేము నడుపుతున్న తెలుగు సాహిత్యసమితి సభ్యుల ఉత్సాహాన్ని గమనించిన రావుగారు కొన్నిరోజులకే 1979లో తాను పుట్టపర్తికి వెళ్ళినప్పుడు మమ్మల్ని సంప్రదించకుండానే మాతరఫున అక్కడ ఎస్.రాజేశ్వరరావునూ, పి.సుశీలనూ ఆర్కెస్ట్రాతోసహా బొంబాయికి ఆహ్వానించారు. అదొక చరిత్రాత్మక ఘట్టమయింది. ఒకవంక మాలో ‘పెద్దలు’గా చలామణీ అవుతున్న కొందరు అలిగి, మొత్తం కార్యక్రమాన్ని చివరి నిమిషాన ముంచే ప్రయత్నం చేశారు. మాలో 35మందిమి వాలంటీర్లం మటుకు పట్టువదలక ఆ పాటల ప్రోగ్రామును అతివిజయవంతంగా నిర్వహించాము. షణ్ముఖానంద హాలులోని 3000 సీట్లూ అమ్ముడు పోవడమేకాక 5రూ. టికెట్టు ప్రేక్షకుల్లోని కొందరు ఆశాపరులకు బ్లాకులో 40రూ. పలికింది! ఇదంతా ఇన్నేళ్ళ తరవాత చెప్పుకోదగినది కాదుగాని, అప్పట్లో మా ఉత్సాహాన్నీ, అందోళననూకూడా పెంచిందనేది చెప్పడానికే.

    ఆ ప్రోగ్రాములో గాయకుడు రామకృష్ణ కోరగా నేను తెరలేచే ముందరే రిహార్సల్ లేకుండా తక్కిన ఆర్కెస్ట్రాతో బాటుగా సితార్ వాయించవలసివచ్చింది. ఆ సభకు విజయరాఘవరావుగారు ముఖ్యఅతిథిగా, నౌషాద్ విశేష అతిథిగా రావడం మాకు మరింత సంతోషాన్నిచ్చింది. మేము ఆర్గనైజర్లుగానూ, స్టేజి కళాకారులుగానూకూడా శ్రమిస్తామనే సంగతి విజయరాఘవరావుగారు కళ్ళారా చూసి, భుజం తట్టగలిగారు.

    విజయరాఘవ రావుగారికి వేణువు వాయించడమే కాదు, తోటి కళాకారుల భుజం తట్టడం కూడా వచ్చునని చక్కగా తెలుస్తోంది కదా? విజయరాఘవ రావుగారి గురించి మనలాంటి వెర్రివాళ్ళకి ఏమీ తెలియలేదంటే అది మన తప్పు. కాదంటారా?

  10. Rohiniprasad అభిప్రాయం:

    January 10, 2012 9:28 pm

    ఇంగ్లీషులో Johnny come lately అనే ఒక expression ఉంది.

    విజయరాఘవరావుగారి గురించి బొంబాయిలో 1986 ప్రాంతాల సోమంచి యజ్ఞన్నశాస్త్రిగారు నడిపిన మహాంధ్ర పత్రికలో నేనొక పెద్ద వ్యాసం రాశాను. అప్పటికాయన పాపం బతికే ఉన్నారు. (శాస్త్రిగారి 75 ఏళ్ళకూ, ఆయన పోయిన తరవాతా కూడా వ్యాసాలు రాశాను).

    ఇలాంటివన్నీ అడుగడుగునా ‘నిరూపించుకోవడం’ చాలా అనవసరం. కొన్ని సందర్భాల్లో గౌరవంతో మౌనం వహించడం మంచిదని తెలుసుకుంటే చాలు.

  11. మోహన అభిప్రాయం:

    January 10, 2012 11:52 pm

    విజయరాఘవరావుగారిని గురించి మరి కొన్ని విశేషాలు - భారతదేశానికి స్వాతంత్ర్యము సిద్దించినప్పుడు ఎఱ్ఱకోటలో మొట్టమొదట 1947 ఆగస్టు 15 రోజు ఆర్చెస్ట్రాను కండక్టు చేసినది వీరే. ఇతని ఒక పెన్సిలు రేఖాచిత్రాన్ని యిక్కడ చూడగలరు. ఇతని ఒక LP రికార్డు చిత్రాలను యిక్కడ చూడ వీలగును. వీరు వ్రాసిన పుస్తకాలలో విజయాంజలి (ఈ పుస్తకాన్ని మానవాళికి అంకితము చేసారు), అభ్యుత్థానము ఉన్నాయి. వీరి కథాసుధ అనే ఒక కథను ఇక్కడ చదువవచ్చును. అతడు వ్రాసిన ఒక కవిత -

    ఔనమ్మా సంగీత తరంగాలు
    గాలిలో తేలుతున్నాయి
    తాన్సేనులు, టాగూరులు
    గాంధీలు, నెహ్రూలు
    వాళ్లేనమ్మా నీ దిగ్దర్శకత్వంలో
    ఈ జీవిత సంగీతపు
    మల్‌హారులు, హిందోళాలు

    విధేయుడు - మోహన

  12. rama bharadwaj అభిప్రాయం:

    January 11, 2012 12:47 am

    ఎవరైనా గౌరవంతో మౌనమ్ వహించడం పోయిన వారి ఆత్మశాంతి కోసమ్ చేయాలి. అలాంటి సంతాప సమావేశం ఒకటి ఏర్పాటై అక్కడ నిలబడినప్పుడు తప్పకుండా ఆ పని చేయగలం !! దాని గురించి రోహిణీప్రసాద్ నించి నేర్చుకోనఖ్ఖరలేదు. ఆ నాగరికత విద్యాధికులమ్ గా మాకు ఉంది.

    ఇక్కడ విజయ రాఘవరావు గారు కాదు విషయం. విజయ రాఘవ రావు గారి మీద గొప్ప గౌరవం నాకుంది. ఆయన వేణువాద్య మాధుర్యమ్ నా చెవికి తెలుసు.

    ఇక్కడ వ్యక్తులని గురించి మాట్లాడటం లేదు. సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఒక గొప్ప వ్యక్తిని గురించి తలుచుకోవడంలోని సందర్భమ్ గురించి. ఆ విషయం మీద ఉన్న పరిమితులు… ఇబ్బందులూను. పదేపదే ఒకటే చట్రం లోంచి వ్యక్తులని తలుచుకుంటూంటే అందులోని సున్నితత్వం మందగించే అవకాశం ఉంది గనక. అది మంచిది కాదు గనక.

    విజయరాఘవ రావు గారి వంటి గొప్ప వేణువాద్య విద్వాంసుని గురించి సంగీత రంగలోని ఇతరులెవరైనా ఈ సరికే మరింతగా “తెలుగున” రాసి ఉండవలసింది. ఆయన సంగీత రంగంలో కర్నాటకమ్ లో ఉన్నవాడు కాడు గనక ఇక్కడి వాళ్ళు రాయలేదో , లేక మరి ఎప్పట్లానే తెలుగు వాళ్ళ అలసత్వమో అనుకోవాలి. తెలుగునేలకి దూరంగా ఉన్నవారు కావడం విజయరాఘవ రావు గారి గురించి ఎక్కువ తెలుగు వారికి తెలియకపోవడానికి గల కారణాలు అని కూడా పూర్తిగా అనను. తెలుగు వాళ్ళకి వాళ్ళలోని విశిష్టతని సకాలంలో గుర్తించే అలవాటు లేదు. దీని గురించి నేను అంటున్నాను. పదే పదే అంటున్నాను ఎందుకంటే మరొక ప్రతిభావంతుడైన తెలుగు వ్యక్తి విషయంలో అయినా వాళ్ళు పోయేకా కాక ముందే తెలుగులు మేల్కొంటే బాగుంటుందని.. తెలుగు పత్రికలూ .. ఇతర మీడియా కూడా! మనకి ఒక కవి మీద గానీ తెలుగు నేల మీద ప్రభవించిన ఒక మంచి కళాకారుని మీద గాని చక్కటి డాక్యుమెంటరీ లేదు. దీనికి ఏమనాలి? టెక్నాలజీ లోపమైతే పూడ్చుకుంటాం! కానీ అది మనుష్యులలోని లోపమే అయితే ఎట్లా?? ఇతర భాషలలో ఈ రకమైన అలసత్వం లేదు. దీని గురించి కూడా మాట్లాడాలి. అది సందర్భాన్ని బట్టైనా మాట్లాడాలి. ఒక వ్యక్తి వ్యాసం రాయడం లేదా రాయక పోవడమ్ కాదిక్కడి సంగతి.

    అయితే విజయరాఘవ రావు గారికి బయట మంచి గుర్తింపు ఉంది. అన్ని అవార్డులూ ఆయనని వరించాయి. తెలుగువారినించి తప్ప. అదీ నా చింత . అందుకే చింత. దాని గురించి “మౌనంగా” ఉండటం కన్నా మాట్లాడటమే మంచిది ఎవరైనా..ఎప్పుడైనా ఎక్కడైనా .. ఇందులో ఎవరికీ విబేధం ఉండనవసరం లేదు. ఇక్కడ “మౌనానికి” అదనపు విలువ ఏమీ లేదు.

    రమ.

  13. Bhavani అభిప్రాయం:

    January 11, 2012 1:27 pm

    ఎవరైనా గౌరవంతో మౌనమ్ వహించడం పోయిన వారి ఆత్మశాంతి కోసమ్ చేయాలి. అలాంటి సంతాప సమావేశం ఒకటి ఏర్పాటై అక్కడ నిలబడినప్పుడు తప్పకుండా ఆ పని చేయగలం !! దాని గురించి రోహిణీప్రసాద్ నించి నేర్చుకోనఖ్ఖరలేదు. ఆ నాగరికత విద్యాధికులమ్ గా మాకు ఉంది.

    సంతాప సమావేశం లాంటిదే పత్రికాముఖంగా ఇచ్చే నివాళి కూడా. “ఇక్కడ విజయ రాఘవరావు గారు కాదు విషయం.” అంటూ ఆయనకిచ్చే నివాళి సందర్భాన్ని తెలుగులను మేల్కొలిపే బృహత్తర కార్యక్రమం కోసం, అదీ ఈ సందర్భానికి పొసగని స్వరంలో వినియోగించడం బాధాకరం. అందుకు వేరే వ్యాసం రాసుకుని అక్కడ ఈ చర్చ సాగించవచ్చు. అసందర్భ వ్యాఖ్యల్ని కూడా ప్రచురించడం ప్రజాస్వామికమనుకుంటున్నట్లున్నారు సంపాదకులు. నివాళి స్ఫూర్తి చూపిన మోహన గారికి ధన్యవాదాలు.

  14. rama bharadwaj అభిప్రాయం:

    January 11, 2012 2:46 pm

    సంపాదకుల వారికీ, నా లాంటి వ్యక్తుల “అప్రజాస్వామ్యాన్ని” భరించే వారి ఔదార్యానికీ నమస్కరిస్తూ.. నాది మరొక చివరి మాట :) ఈ విషయం మీద వెర్రి రెహమాన్ గారి లాగే నేనూ వ్యాసమ్ చదవగానే తొలుత అభిప్రాయపడి ఆ వ్యాసమ్ మీద ప్రతి స్పందించినా ..భవానీ గారిలాంటివారి వల్ల నీలాపనిందల్ని మోయాల్సివచ్చినా నేనేమీ అనుకోవడమ్ లేదు గానీ “అసందర్భమే” అయినా ఇది నా స్వోత్కర్ష కాదు గనక దీనికి తెలుగుల ఆమోదమ్ సైతం ఉంటుందనే నమ్మకంతో కనీశంగా ఒక కోరికని మాత్రం కోరుతున్నాను. అదేమంటే నేను చాలా మంచి డాక్యుమెంటరీలు చూసేను ఇతర భాషల్లో.. కవుల కళాకారుల చిత్రకారుల మీద. తెలుగులో మాత్రం చెప్పుకోదగ్గ డాక్యుమెంటరీలేవీ నేను చూడలేదు. చూసినవన్నీ నాసిరకంగా ఉన్నవే!

    ఎవరు చేయగలరో నాకు తెలియదు. ఎలా చేయగలరో కూడా నాకు తెలియదు. కానీ చెయ్యాల్సిన అవసరమ్ మాత్రమ్ ఉంది. లేకపోతే రేపెప్పుడో మన మనవల మునిమనవల తరాలకి చూపించుకుందికి కనీసమ్ శుభ్రమైన లఘుచిత్రాలు కూడా లేకపోతే ..రాగల తరాలు ఎవరిని అడగాలీ?? లేదా ఈ తరాల గురిచి వాళ్ళు ఏమని అనుకోవాలీ ఆలోచించాల్సింది మనమే కదా?? వీటికి డబ్బులు కావాల్సి ఉంటుంది గనక ప్రభుత్వాలో సంస్థలో చెయ్యాలి. ఆ దిసగ శక్తి ఉన్నవారు ఎవరన్నా ఆలోచించగలిగితే బాగుణ్ణు.

    భవానీ గారూ! నేను అభిప్రాయాల చోటుని మాత్రమే వాడుకుంటున్నాను. ఇది ఈమాట సంపాదకులు అనుమతించిన జాగా! అన్నిటికన్నా ముఖ్యం నాకు ఏల్చూరి విజయరాఘవ రావు గారి వేణువు అంటే ఇస్టమ్ ఉంది. ఆయనకి నేను కూడా నివాళి చెబుతున్నాను. మౌనంగా!

    రమ.

  15. మాగంటి వంశీ మోహన్ అభిప్రాయం:

    January 11, 2012 6:42 pm

    అన్నిటికన్నా ముందుగా విజయరాఘవరావు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ… వివరాలు, ఆయనతో తనకున్న పరిచయాన్ని క్లుప్తంగా వివరించిన రోహిణీప్రసాద్ గారికి కృతజ్ఞతలతో…

    ఇహ ఇప్పుడు వ్యాసాన్ని వదిలేసి , వచ్చిన కా”మెంటలు” సంగతికొద్దామని అనుకుంటూ ఒక చిన్న ఉపోద్ఘాతం - ఈమాట నేను చదవటం మానెయ్యటానికి కారణమైన అనేక కారణాల్లో, మచ్చుకి ఒకటి…

    అ) అకారణంగానో, వారికి వారు సకారణం అనుకునో, ఆ మాటకొస్తే మానసిక సంతులన లేకపోటం మూలాన, వేరే దారిలేక స్వంత పేరు కూడా చెప్పుకోలేక మారుపేర్ల వ్యాఖ్యలను మీ పత్రికా సంపాదకులు “సగర్వంగా” ప్రచురించటం మొదలుపెట్టటం.

    ఆ) ఇంకో కారణం - వస్తువున్నా లేకున్నా, అదీ ఇదీ అని లేకుండా తన అరకొర పుస్తక, భాషా, సంగీత, సాహిత్య - ఒహటేమిటీ సర్వం సహా నిఘంటువులతో సహా - వీరపాండిత్యాన్నంతా ప్రదర్శిస్తూ కాలుగాలిన పిల్లిలా తన”మాట” ఈ”మాట” లో వినపడాలని కొంతమంది విశ్వప్రయత్నం చేస్తూండటం, ఆ ప్రయత్నానికి మీరు ఊతమివ్వడం.

    ఇలాటివన్నీ నా బోటి పాఠకులకి పత్రిక మీద, సంపాదకుల మీద “అదో” రకమైన భావాన్ని కలిగించడానికి దోహదం చేస్తున్నాయనడంలో ఇసుమంత సందేహం లేదు. ఎక్కడిదాకో ఎందుకు? ఇక్కడే ఉన్న ఒక కామెంటు చూడండి

    ఎవరైనా గౌరవంతో మౌనమ్ వహించడం పోయిన వారి ఆత్మశాంతి కోసమ్ చేయాలి. అలాంటి సంతాప సమావేశం ఒకటి ఏర్పాటై అక్కడ నిలబడినప్పుడు తప్పకుండా ఆ పని చేయగలం !! దాని గురించి రోహిణీప్రసాద్ నించి నేర్చుకోనఖ్ఖరలేదు. ఆ నాగరికత విద్యాధికులమ్ గా మాకు ఉంది.

    విద్యాధికులం”: అహా.. భలే మాట… ఇహ నాగరికతకొస్తే - ఇక్కడే తెలిసిపోయింది, నాగరికత ఏమిటో?

    సరే అసలా సంగతి పక్కనబెడితే, చాలా రోజుల తర్వాత బే-ఎరియాలో నివసించే మిత్రులొకాయన ద్వారా విజయరాఘవరావు గారు కాలధర్మం చేసారన్న వార్త విని, గూగుల్లో సెర్చ్ చేద్దును కదా రోహిణీప్రసాద్ గారి వ్యాసం లంకె కనపడింది. ఇక్కడికొస్తే ఏముందీ? అసలు సంగతి పక్కనబెట్టి, మొత్తానికే వదిలేసి - తోకలు పుచ్చుకు వేళ్ళాడుతూ కా”మెంటలు” కనపడ్డవి.

    లైలా గారు సంపాదకులను సంపాతిలా “ముందుమాట” గురించీ , “ఈమాట మనుగడ” గురించి “దీర్ఘదృష్టి” సారించమని వెయ్యాల్సిన, వేసిన ప్రశ్న గురితప్పిన బాణంలా రోహిణీప్రసాదు గారి మీదకొచ్చింది… దానికి ఆయనేం సమాధానం చెబుతారు? అసలు ఆయనెందుకు సమాధానం చెప్పాలో ఏమిటో? ఆయన విజయరాఘవరావు గారితో తనకున్న పరిచయంతో తనకు రాయాలనిపించింది రాసి వీళ్ళకు పంపిస్తే వీళ్ళు వేసారు. అది ఆయన తప్పెలా అవుతుంది? ఆవిడ ఇదేమి వెర్రి అని వెసిన ప్రశ్న అడగవలసిన వారిని అడిగితే, అడగబడినవారి మానసిక స్థితి బాగుండి చర్చలకు సిద్ధమైతే అక్కడ సావధానంగా చర్చించవచ్చు.

    అదలాగుంచితే పైన ఒహ వెర్రి రహమానుడికి ఇందులో - “స్వోత్కర్ష” కనిపించిందిట… చోద్యం కాకపోతే, కనీస జ్ఞానం ఉన్నవాడెవడికీ కనపడంది, వెర్రివాడైన ఈయనకు కనపడింది. సంతోషం! అయితే ఈ గొడవకంతా బాధ్యత పూర్తిగా లైలాగారిదే అనను కానీ మీ సంపాదకుల బాధ్యత ఉన్నదని ఖచ్చితంగా చెప్పొచ్చు. అసలావిడ ఎప్పటినుంచో వేస్తున్న కొచ్చెనుకు సమాధానం ఇవ్వకుండా , ఆవిడలో రగులుతున్న కొచ్చెనార్తిని సమాధానపరచకుండా, ఎండమావి చూపించటం మీ తప్పే.

    చివరి మాటగా - ఈ వ్యాసాన్ని వదిలేసి ఈ వ్యాసానికొచ్చిన కామెంట్లు చూస్తే, మోహనరావు గారు ఒక్కరే ఎప్పటిలానే చాలా సమతులన గా మాట్లాడారు. వారికి నా ధన్యవాదాలు. వారిని చూసి నేర్చుకుంటే కొన్ని జీవితాలు, ఇలాటి పత్రికలు బాగుపడతాయని నా ఘాట్టి నమ్మకం.

    భవదీయుడు
    మాగంటి వంశీ మోహన్

    తా.క: 1) ఆకాశవాణి వారు విజయరాఘవరావు గారితో పరిచయ కార్యక్రమం ఒకటి ప్రసారం చేసారు. ఆ ఆడియో కావాలనుకున్నవారు http://www.maganti.org/ కు వెళ్ళి , అక్కడ ఆకాశవాణి కార్యక్రమాలు లంకె నొక్కి, పరిచయ కార్యక్రమాల భాగంలో వినవచ్చు.

  16. Rohiniprasad అభిప్రాయం:

    January 12, 2012 3:10 am

    విజయరాఘవరావుగారి గురించి అభిమానం ఒలకబోస్తున్నవారు ఆయన మీద James Beveridge తీసిన డాక్యుమెంటరీ చూశారో లేదో.

  17. సుజాత అభిప్రాయం:

    January 12, 2012 7:12 am

    చివరకు “నరసరావుపేట” అన్న బ్లాగు (అది ఆయన స్వస్థలం) నడిపేవారికి కూడా ఈ వార్త తెలిసినట్లు లేదు. వెటకారం బహు బాగానే ఉంది కానీ లాభం లేదు! నిజమే! నాకు కూడా తెలీలేదు. ఆయన నాకు (మా అత్తింటివారి వైపు నుంచి)దూరపు బంధువు కూడా అవుతారు. అయినా తెలీలేదు. బంధుత్వాలిలా ఉన్నాయని ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలన్నమాట! :-))

    ఆయనతో కలిసి పని చేసి, కచేరీలు నిర్వహించి, సంగీత దర్శకత్వాలు వహించి, ఎంతో కొంత స్నేహం, పరిచయం ఉన్న వారికే ఏదో ఒక పత్రిక చూస్తే తప్ప తెలీలేదంటే కేవలం నరసరావు పేట సంగతులతో బ్లాగు నడిపే వారికి ఈ విషయం తెలీక పోవడంలో ఆశ్చర్యం ఉందని అనుకోడం లేదు గానీ, బంధువులెవరూ ఈ విషయాన్ని పంచుకోకపోవడం.. కొంత విషాదం! పైగా ఆయన కుటుంబంతో నాకు పరిచయం తక్కువ.

    నాకు తెలిసిన ఆయన జ్ఞాపకం! నరరసరావు పేట ద్విశతాబ్ది ఉత్సవాలు జరిగినపుడు ఆయన్ని అహ్వానించగా ఆయన అమెరికా నుంచి వచ్చారు. మా వూరి నడి బొడ్డులో ఆయనకు సన్మానం జరిగింది.ఆ సభలో ఆయన,తన వేణువుని సవరించి అందరికీ వీనుల విందు చేశారు. చాలా ఉద్వేగ భరితులై మాతృభూమి గురించి ఆశువుగా కవిత్వం చెప్పారని చదివాను. వీలైతే ఆ నాటి వార్తా పత్రికలు సంపాదించడానికి ప్రయత్నిస్తే తెలుస్తుందేమో!

    నా వద్ద వారి కవితా సంకలనం “అంతర్వాణి” ఉంది. మరి కొన్ని విశేషాలు సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి శ్రీ ఏల్చూరి మురళీధర్ రావు గారిని సంప్రదిస్తే చెప్పగలరు.

  18. Rohiniprasad అభిప్రాయం:

    January 12, 2012 10:23 am

    ఎందుకో నేను రెహమాన్‌గారి కామెంట్ మిస్ అయాను.

    నా స్వోత్కర్ష కొట్టుకోవాలంటే మరెన్నో అవకాశాలుంటాయి సార్‌. విజయరాఘవరావుగారి కంటే పెద్దల పేర్లే drop చెయ్యగలను. ఆయనతో నాకుండిన interaction మాత్రమే రాశాను.

    ఆయన 15-8-1947న జనగణమన ఆర్కెస్ట్రా వాయింపించిన సంగతీ, సంగీతదర్శకుడు రోషన్‌ దిల్రుబాతో వేణువు జుగల్‌బందీ వాయించిన సంగతీ స్వయంగా ఆయనే చెప్పారు. ఈ వ్యాసం నా డబ్బా కొట్టుకోవడానికి రాయలేదు. అలాంటి పని ఇంతకన్నా చాలా subtleగా చెయ్యాలి. Pl give me more credit for my writing abilities!

    నా సంగతి వదిలేసి సంగీతం మీద ఏమన్నా ఆసక్తి ఉంటే రావుగారి గురించి తలుచుకోండి. మీవంటివారిని కూడా convince చెయ్యలేని నా స్వోత్కర్ష మాటకేం లెండి.

  19. Editors అభిప్రాయం:

    January 12, 2012 2:50 pm

    Dear Posters:

    The editors have decided to not approve further comments on this article (barring those that are only about the person being remembered, Sri E. V. R).

    We appreciate your cooperation.

    Editors of eemaata.

  20. ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    January 12, 2012 9:33 pm

    మాన్యులు శ్రీ రోహిణీప్రసాద్ గారి నివాళిని చదివి, ఆయన అనుసంధించిన ఆ స్వరలహరిలో తేలియాడుతుంటే మైమఱపు కలిగి, కళ్ళల్లో నీళ్ళుతిరిగాయి. మా చిన్నప్పుడు - ఆయన పేర్కొన్న ఆ కార్యక్రమం జరిగిన తర్వాత - మా బాబాయిగారు, పిన్ని మద్రాసులో మా ఇంటికి వచ్చినప్పుడు ఆ సంఘటనను గుఱించి మా అందరికీ వివరించి చెప్పటం, మా పిన్ని శ్రీ రోహిణీప్రసాద్ గారిని గుఱించి ఎంతో ఆప్యాయనంగా మాట్లాడటం నా కింకా గుర్తున్నది. తెలుగు సాహిత్యాన్ని వేలుపట్టుకొని నడిపించిన మహామహుని తనయునికి ఆయన సంగీతాభిమానమంతా సంక్రమించినదని మా పిన్ని అనటం వల్ల నాకప్పుడు శ్రీ రోహిణీప్రసాద్‌గారి పేరు తెలిసింది. వారిని నేనెన్నడూ కలుసుకోలేకపోయినా - మా బాబాయిగారు, నాన్నగారల ద్వారానూ; వారి అక్కగారు ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి శాంతసుందరిగారు, బావగారు సుప్రసిద్ధకథకులు శ్రీ రామవరపు గణేశ్వరరావు గారల ముఖతః వారిని గుఱించి తెలుసుకొనే అవకాశం కలిగింది. వారి స్మృత్యంజలి మా ఇంటిల్లిపాదినీ కదిలించిందని చెప్పటానికే ధన్యవాదపురస్సరంగా ఈ నాలుగు మాటలూ వ్రాశాను.

    వ్యక్తితో అనుబంధం, ఆత్మీయత అల్లుకొన్నవారి రచనలెప్పుడూ ఆ వ్యక్తితో తమకు గల పరిచయాన్ని నెమరువేసుకొంటూ ఈ విధంగానే ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయలు పరమపదించినప్పుడు అల్లసాని పెద్దనగారు నిఃస్పృహులై, “మనుచరిత్రం బందుకొనువేళ యెదురేఁగి పల్లకి తన కేలఁ బట్టి యెత్తె”, “ఆంధ్రకవితాపితామహ! అల్లసాని పెద్దనార్య! అని నన్నుఁ బిలచునట్టి కృష్ణరాయల తోడ దివి కేఁగలేక బ్రదికియున్నాఁడ” అన్న వాక్యాలు స్వోత్కర్షలు కావు.

    సాహిత్యాభిమానులు అందులో చరిత్రశకలాలను గుర్తించి, వ్యక్తిజీవితాన్ని పునర్నిర్మించుకొంటారు.

    చాలాకాలంగా భారతదేశవాసానికి, ఈనాటి ప్రచార భేరీభాంకారాలకు దూరంగా ఉండటం వల్ల మా బాబాయిగారిని గుఱించి ఈ తరానికి అంతగా తెలియకపోవటం జరిగింది. వారు స్వర్గస్థులైనప్పుడు నేను మా కుటుంబానికీ, బాబాయిగారికీ ఆప్తులైన శ్రీ మందలపర్తి కిషోర్ గారికి తెలియజేయటమూ, వారు సాక్షి దినపత్రికలోను, సాక్షి టివిలోనూ వెల్లడించటం జరిగింది. తర్వాత శ్రీ రవిబాబుగారు సహృదయంతో గౌరవపూర్వకంగా నెమరువేసుకొన్నారు.

    ఈ లేఖావళిని ఈరోజే చూడటం మూలాన ఆలస్యంగా స్పందించినందుకు మన్నింప ప్రార్థన.

    వారి జ్ఞాపకాలను మఱెప్పుడైనా వ్రాసే ప్రయత్నం చేస్తాను. శ్రీ రోహిణీప్రసాద్ గారికి ధన్యవాదాలు.

    సవినమ్రంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  21. Rohiniprasad అభిప్రాయం:

    January 13, 2012 1:47 am

    సంగీతరంగంలో అంతటి పేరుప్రఖ్యాతులూ, అనుభవమూ గడించాక కూడా విజయరాఘవరావుగారు ఎంతో నిరాడంబరంగా జీవించారు. ‘మీరు ఆట్లాంటా వస్తున్నట్టుగా కూడా మాకు తెలియలేదే?’ అనే నేనంటే ‘ఇక్కడ మా అమ్మాయీ, అల్లుడి family, మీరూ తప్ప నాకెవరూ తెలియద’ని ఎంతో సీదాగా ఆయన చెప్పడం నాకు బాధ కలిగించింది. ఆయనచేత కచేరీ ఏర్పాటు చేయించాలనీ, ఈసారి వచ్చినప్పుడు ముందుగా అడిగి తెలుసుకుంటాననీ అన్నాను. ఆ అవకాశం రానేలేదు.

    సంగీతంలోనే కాక మాట తీరులోనూ, ప్రవర్తనలోనూ సంస్కారం ఉట్టిపడేట్టు జీవించిన మహానుభావుడాయన. Sionలో వాళ్ళ Ram sharan ఇంటి ప్రాంతాన్ని ఎన్నటికీ మరిచిపోలేను.

  22. Rohiniprasad అభిప్రాయం:

    January 24, 2012 9:35 pm

    ఒక మిత్రుడు ఈ మంచి వ్యాసం లింక్‌ పంపాడు. ఇందులోని చాలా విషయాలు నాకు తెలియవు. విజయరాఘవరావుగారి గురించి అభిమానం ఉన్నవాళ్ళు దీన్ని చదువుకోవచ్చు!

  23. తః తః అభిప్రాయం:

    January 27, 2012 3:45 pm

    Sri Rohini Prasad :
    Innumerable thanks for the link
    తః తః

  24. Sujatha అభిప్రాయం:

    February 9, 2012 12:25 am

    విజయ రాఘవ రావు గారి గురించి మరి కొన్ని విశేషాలు, అరుదైన ఫొటోలు నా బ్లాగు లో చూడండి

    http://narasaraopet-bloggers.blogspot.in/2012/01/blog-post.html
    http://narasaraopet-bloggers.blogspot.in/2012/02/2.html

  25. TahaTaha అభిప్రాయం:

    February 9, 2012 5:19 am

    గొల్ల పిల్లనగ్రొవి మళ్ళీ తెలుగు వాళ్ళకు దొరికేనా!

  26. Rohiniprasad అభిప్రాయం:

    February 11, 2012 10:37 pm

    హిందుస్తానీ సంగీతంలో కృషి చేస్తున్న తెలుగువారు బాగా తక్కువేకాని కొందరి పేర్లు తెలుసుకోదగినవి.
    రవిశంకర్ శిష్యుడు మిట్టా జనార్దన్ అనేక దశాబ్దాలుగా మద్రాసులోని వివిధభాషల సినీసంగీతంలో సితార్ వినిపించారు. వాటిలో మనసున మనసై, ఎవరివో నీవెవరివో, నీవురావు నిదురరాదు వగైరా పేరుపొందిన పాటలున్నాయి.
    శాస్త్రీయగాత్రం వినిపిస్తున్న సుమిత్రా గుహా తెలుగుమహిళే. ఇంకా పేర్లు తెలియవలసినవి ఉంటాయి.
    హిందుస్తానీ గాయకులుగా పేరుపొందినవారిలో ఎ. కానన్, ఎం.ఆర్. గౌతమ్, తమిళులు. వయొలిన్ వాయించే ఎన్.రాజమ్‌, సవ్యసాచిలాగా రెండుపద్ధతుల్లోనూ వయొలిన్ నైపుణ్యం కలిగిన ఎం.ఏస్. గోపాలకృష్ణన్ కూడా తమిళులే. ఇక కన్నడం సంగీతవేత్తలకు కొదవేలేదు.

  27. TahaTaha అభిప్రాయం:

    February 12, 2012 1:37 pm

    ‘తిరనా ళ్ళకు తరలొచ్చే కన్నెపిల్ల లా’ కనీసం నాలుగు సార్లు విని ఇది రాస్తున్నాను. వరస తిరనాళ్ళు అయిపోయింతర్వాత వెనక్కు చూసుకుంటూ తిరిగొచ్చే కన్నె పిల్లని తలపింప జెసింది. ముఖ్యంగా చరణాల మధ్య వచ్చిన జంత్రం. చాలా సహజంగా విషాదం పలికే గోపాల రత్నం గొంతులో ఈ వరస ఆహ్లాదాన్ని వినిపించ లేకపోయింది.

  28. Gaddeswarup అభిప్రాయం:

    February 15, 2012 5:56 am

    The Wikipedia article has some nice links to his work.

  29. Gaddeswarup అభిప్రాయం:

    February 16, 2012 5:28 am

    I apologize for commenting again. This is not to point out any deficiencies in the above presentations but I started remembering that I saw the name several times in Indian documentaries long ago and started googling. Because of his peripatetic life, probably information about him is scattered around the world. From Internet it seems that at least two of his sons accompanied him on occasions and there is documentary by one of his sons. The trailer is here. It would be good to know more about him, his contributions and influence.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)
Autosuggest?

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a