జోలపాటలను వ్రాయడములో కూడ ఇతనికితడే సాటి. ఉదాహరణకు క్రింది చరణాన్ని చూడండి –
భూమియ చిన్నద తొట్టిల మాడి
సోమసూర్యరెంబ కలశవ హూడి
నేమది వేదగళ సరపణి మాడి
ఆ మహాకాశక్కె కొండిగళ హాకి
భూమిని బంగరు ఊయెల జేసి
సోమసూర్యు లనెడు కలశము బెట్టి
నేమము వేదముల గొలుసుల జేసి
ఆ మహాకాశమున కొండెలు వేసి
మనము ప్రతిదినము యిళ్ళల్లో పాపలకు దృష్టిదోషము తగులుతుంది అని చెబుతుంటాము గదా! ఆ సంఘటనను ఎంత సొగసుగా వర్ణించాడో చూడండి –
దృష్టి తాకితో బీది మెట్టబ్యాడవో
సృష్టియ నారియరెల్లరు కణ్ణిట్టు హీరువరో నిన్న
దిష్టి తగిలెరా వీధి త్రొక్కబోకురా
సృష్టిని గల స్త్రీలందరు కనులతో జుర్రెదరుర నిన్ను
విష్ణువు సర్వోత్తముడైనా, శివుని కూడ మధ్వమతావలంబులు అంతే భక్తితో పూజిస్తారు –
వృషభ నేరిద విషధరన్యారె పేళమ్మయ్య
హసుళె పార్వతియ తపసిగె మెచ్చిద
జటామండలధారి కాణమ్మ
వృషభ మెక్కిన విషధరుడెవరె చెప్పవేమె
పసిది పార్వతీ తపమును మెచ్చిన
జటామండలధారి జూడమ్మ
గుమ్మడిని గురించి కూడా ఒక పాట వ్రాశాడు శ్రీపాదరాయలు –
గుమ్మ బందనెలొ దుర్జన బేడ
సుమ్మనిరెలో రంగయ్య”
గుమ్మ డరుదెంచె ఆటలు చాలు
కిమ్మనకురా రంగయ్య
తరువాతి కాలములో పురందరదాసులు ‘గుమ్మన కరెయదిరే’ అని వ్రాసిన ఒక మంచి పాటకు ఇది బహుశా ప్రోత్సాహమేమో?
సత్యనారాయణవ్రతము మున్నగు నోములు నోచేటప్పుడు దేవునికి అంగపూజ చేస్తారు, దేవుడి ప్రతి అంగాన్ని పేర్కొంటూ అర్చిస్తారు. ఆ పద్ధతిలో ‘శ్రీరంగవిఠలన శ్రీమకుటకె శరణు’ (శ్రీరంగవిఠలుని మకుటమునకు శరణు) అని ఒక కీర్తన చాల చక్కగా వ్రాసినాడు శ్రీపాదరాయలు. ఇది కూడా పంచమాత్రబద్ధమై వినడానికి సొగసుగా ఉంటుంది. అందులో ఒక చరణము –
సొంపునోటద చెలువ సోగెగణ్ణిగె శరణు
సంపిగెయ కుసుమసమ నాసికకె శరణు
గుంపురత్నద కర్ణకుండలగళిగె శరణు
ఇంపుదర్పణనిభ కపోలగళిగె శరణు
సొంపుచూపుల సొబగు సోగ కనులకు శరణు
సంపంగి కుసుమంపు నాసికకు శరణు
గుంపు రత్నపు కర్ణకుండలములకు శరణు
ఇంపుటద్దమొ యను కపోలములకు శరణు
శ్రీపాదరాయల కీర్తనాసాహిత్యములో వాసి, వైవిధ్యము ఉన్నా కూడ సంఖ్యలో అది తక్కువే. అన్నమాచార్యుల, పురందరదాసుల వేలాది కీర్తనల పక్క ఒక వంద పాటల సంఖ్య పెద్దదేమీ కాదు. దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. శ్రీపాదరాయలు ముఖ్యముగా మఠాధికారి. మతప్రచారము, నిత్యపూజ, పర్యటనలు, శిష్యులకు పాఠములు నేర్పడము ఇవి అతని దైనందిన చర్య. ఉదయమునుండి రాత్రివరకు ఈ పనులలో అతడు నిమగ్నమై ఉండాలి. తరువాతనే గీతరచన. బహుశా అందువల్లనే కాబోలు ఎక్కువగా సంకీర్తనలను వ్రాయలేదు.
శ్రీపాదరాయలు – అన్నమాచార్యులు
శ్రీపాదరాయలు అన్నమాచార్యులను కలిసినారా అనే ప్రశ్న అప్పుడప్పుడు నాకు కలుగుతుంది. అన్నమయ్య, పురందరదాసుల సమాగమమును గురించి అన్నమయ్య మనుమడు వర్ణించాడు గాని అన్నమయ్య శ్రీపాదరాయల, అన్నమయ్య వ్యాసరాయల ముఖాముఖిని గురించి అతడు వ్రాయలేదు. శ్రీపాదరాయలు, వ్యాసరాయలు, అన్నమాచార్యులు సమకాలీనులు. వీరిలో శ్రీపాదరాయలు అందరికన్న పెద్దవాడు. వీరు ముగ్గురు ఒకే రాజు ఆస్థానములో (చంద్రగిరిలోని సాళువ నరసింహరాజు) ఉన్నారు. ముఖ్యముగా తిరుమల శిఖరాన వెలసిన శ్రీనివాసునిపై భక్తి పారవశ్యముతో పాడారు. పండ్రెండు సంవత్సరాలు దేవునికి పూజ చేసిన వ్యాసరాయలు అదే దేవుడిముందు ప్రతిరోజు పాడిన అన్నమాచార్యులతో మాట్లాడి ఉండడంటే నమ్మ శక్యము కాదు. అన్నమయ్య వ్రాసి శిలాఫలకాలపై చెక్కించిన సూళాదులు తప్పక శ్రీపాదరాయల ప్రేరణ, ప్రోత్సాహములుగా ఉండాలన్న విషయములో అతిశయోక్తి లేదు. కొందరు భిన్న మతాలను అనుసరించడము (అన్నమయ్య విశిష్టాద్వైతుడు, శ్రీపాద, వ్యాసరాయలు ద్వైతులు) దీనికి కారణామేమో అని ఊహిస్తారు. నా ఉద్దేశములో అది కారణము కాదు. శ్రీరంగములో చాలా కాలము గడిపి అక్కడి తమిళ పాశురములను విని అదే విధముగా కన్నడములో ఉద్యమాన్ని ప్రారంభించిన శ్రీపాదరాయలకు ఇట్టి సంకుచిత స్వభావము ఉండి ఉండదని నేను భావిస్తాను. అదియును కాక శ్రీపాదరాయల అనుమతితో శ్రీనివాసుని పూజించిన వ్యాసరాయలు ఆ పూజను విశిష్టాద్వైతరీతులలో చేసినాడు కాని ద్వైతవిధానములో కాదు. కాబట్టి ఇది సబబు అని నాకు తోచదు. బహుశా శ్రీపాదరాయలు, వ్యాసరాయలు రాజగురువులుగా ఉన్నారు. అన్నమయ్యకు నరసింహరాయలకు తరువాతి కాలములో అంతగా పొంతన కుదరలేదు. ఇది ఒక వేళ కారణమేమో? లేకపోతే శ్రీపాదరాయల, వ్యాసరాయల మఠాలలో అన్నమయ్యను గురించిన దాఖలాలు ఉన్నాయేమో? ఔత్సాహికులు ఈ విషయాన్ని బాగుగా పరిశోధించాలి.
ముగింపు
త్యాగరాజ-ముత్తుస్వామి-శ్యామశాస్త్రులను కర్ణాటక సంగీత వాగ్గేయకార త్రయము అని సామాన్యముగా పిలుస్తారు. కాని నిజముగా నేటి కర్ణాటక సంగీతానికి పటిష్ఠముగా పునాదులను వేసినవారు శ్రీపాదరాయలు, అన్నమాచార్యులు, వ్యాసరాయలు. నేటి కర్ణాటక సంగీతానికి ఆద్యుడు, పూజ్యుడు శ్రీపాదరాయలు. శ్రీపాదయతివర్యులను మాధ్వపరంపరలో ధ్రువుని అవతారమని భావిస్తారు. నమ్మితే అది నిజము, లేకపోతే కాదు. కాని హరిదాసపద సాహిత్యాకాశములో శ్రీపాదరాయలు ఒక ధ్రువతార అనడములో సందేహము లేదు. వారిని స్మరిస్తూ వారి రంగవిఠల అంకితముద్రతో, నా ఒక వృత్తమాలికాపుష్పముతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను.
వృత్తము (సంపఁగి) – మోహన రాగము
ననుగన నిప్పుడే ప్రియసఖా నయమౌ నగుమోముతోడ రా
స్వనముల నూదరా సరసమై సరసా విని పొంగిపోదురా
ధనములు వద్దురా నిజముగా ధరపై ధన మీవె నాకురా
మనసిక వీణగా పలుకురా మను వియ్యది నీదె మాధవా
పదము – మోహన రాగము, అట తాళము
పల్లవి:
తహతహల పడె మనసు త్వర రా
అనుపల్లవి:
మహిళ నిక ముంచ కీ వ్యధలో
చరణం:
నిక పిచ్చి పట్టు నిది నా స్థితి
అకలంక నీకొఱకు చూచితి
ఇక రమ్ము నీవెరా నా గతి
చరణం:
పాటకై వేచె నా వీనులు
ఆటకై చూచె నీ కన్నులు
పూట నే వెదకితిని తెన్నులు
చరణం:
రంగ రాకున్న మది శకలము
శృంగార మోహనా హరి రా
రంగవిట్ఠల యిపుడె దరి రా
ఉపయుక్త గ్రంథసూచి
- ఉదాహరణ వాఙ్మయ చరిత్ర – నిడుదవోలు వేంకటరావు, విజయభాస్కర పబ్లికేషన్స్, హైదరాబాదు, 1968.
- ఛందోవిచారమంజరి – M.P. మంజప్ప శెట్టి మసగలి, మసగలి ప్రకాశన, మైసూరు, 1992.
- ద్వాదశస్తోత్రము – మధ్వాచార్యులు
- నన్నెచోడుని క్రౌంచపదము – జెజ్జాల కృష్ణ మోహన రావు, ఈమాట, మార్చి 2009.
- పదకవితాసార్వభౌముడు క్షేత్రయ్య – జెజ్జాల కృష్ణ మోహనరావు, తెలుగు పలుకు – 2011 తానా సమావేశాల ప్రత్యేక సంచిక, ఈమాట, జులై 2011.
- శ్రీ అన్నమాచార్యుల జీవితచరిత్ర – తాళ్ళపాక తిరువేంగళనాథుడు (చిన్నన్న), పీఠిక వేటూరి ప్రభాకర శాస్త్రి, తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రచురణ, తిరుపతి, 2001.
- శ్రీకృష్ణదేవరాయల ఆంధ్రేతర సాహిత్యము – జెజ్జాల కృష్ణ మోహనరావు, ఈమాట, జులై 2010.
- ప్రముఖ కన్నడాంధ్ర వాగ్గేయకారుల సంకీర్తనలలో తిరుమల శ్రీనివాసుని ప్రశంస – ఒక పరిశీలన – మాళగి వ్యాసరాజ్, నరేంద్ర ఆఫ్సెట్ ప్రింటర్స్, 2000.
- ప్రథమోపలబ్ధ స్వరసహిత సంకీర్తనా శిలాలేఖము – సం. P. V. పరబ్రహ్మ శాస్త్రి, తిరుమల రామచంద్ర, వేటూరి ఆనందమూర్తి, ఆకెళ్ళ మల్లికార్జున శర్మ, N. S. శ్రీనివాసన్ – తి. తి. దేవస్థానం ప్రచురణ, తిరుపతి, 1999.
- శ్రీపాదరాజతీర్థరు
- శ్రీపాదరాజర కృతిగళు – సం. G. వరదరాజరావ్, కన్నడ అధ్యయన సంస్థె, మానసగంగోత్రి, మైసూరు, 1987.
- సా విరహే తవ దీనా – జెజ్జాల కృష్ణ మోహన రావు, సాయి బ్రహ్మానందం గొర్తి, మార్చి 2010.
- సాళువనరసింహరాయలు.
- హరిదాస ఆందోలన – ఒందు అధ్యయన – N. K. రామశేషన్, మిత్రా ప్రింటర్స్, మైసూరు, 1991.
- Glorious History of Orissa.
- Haridasas and Carnatic music.
- Haridasa Literature in Kannada – K. G. Narayana Prasad – from Poet Saints of India, ed. M. Sivaramakrishna and Sumita Roy, pp 166-172, Sterling Publishers, New Delhi, 1998.
- Madhvacharya
- Naraharitirtha
