ఈమాట » ఈ కానుకనివ్వలేను

Expand to right
Expand to left

ఈ కానుకనివ్వలేను

నారాయణగారి రూపం గుర్తొచ్చి మనసునెవరో మిక్సీలో వేసి తిప్పినట్టయింది. మా ఇంటికొచ్చిన రోజు కదిపితే కన్నీటి చుక్కన్నట్టు ఉన్నాడాయన.

“ఆయన్ని చూడు పూర్ణా. మొదలు నరికిన చెట్టులా ఎంత డీలా పడిపోయారో చూడు. ఎలా ఉండేవారో తెలుసా… మాకు స్కూల్లో లెక్కలెంత బాగా చెప్పేవారో, తెలంగాణ ఉద్యమ పోరాట కథలంత బాగా చెప్పేవారు. కొన్నాళ్లు యూజీలో ఉన్నారు. సభలు, సమావేశాలప్పుడు గొంతెత్తి పాడాడంటే అలా వింటూ ఉండిపోవాల్సిందే ఎవరైనా. ఎంత శ్రావ్యతో అంత తీవ్రత. కథలెంత బాగా రాస్తారని. అసలవి కథలు కావు. అక్కడి జీవితాన్ని అలా ఎత్తి కళ్లకు కట్టినట్టుగా చూపిస్తారు. వాళ్లింట్లో అందరూ అంతే…”

చిన్నగా చెప్పినా శాండీ మాటలు వినపడ్డాయేమో నారాయణగారు నిర్లిప్తంగా కళ్లెత్తి చూశారు. కళ్లనిండా నీళ్లు. ఎవరివంకా చూడకుండా తల దించుకున్నారు. తనలో తనే మాట్లాడుకుంటున్నట్టుగా అన్నారు.

“అలాంటి కుటుంబంలోని కుర్రాడు అమెరికా ఎందుకొచ్చాడో తెలుసామ్మా? డాలర్‌ కలలు మాకెన్నడూ లేవు తల్లీ. తను సంపాదించాలనో, ఇక్కణ్నుంచి పంపే డబ్బుతో వాళ్ల నాన్న సొంతిల్లు కూర్చుకుంటాడనో, అమ్మ బంగారం కొనుక్కోవాలనో కాదమ్మా. తనకి నచ్చిన రంగంలో పరిశోధన చేసే అవకాశం ఇక్కడే ఉందని. కాఫీ కూడా ముట్టనివాడు, ఏ గొడవా లేకుండా ఎవడో తాగి వచ్చి పేల్చిన తూటాలకు చచ్చిపోయాడు. మేం తుపాకీ గొట్టాలకు భయపడేవాళ్లం కాదు. కానీ ఇలాంటి గుళ్లకు బలయిపోతామనుకోలేదు. వాడొక్కడే కాదు, అందరం బలయిపోయాం తల్లీ. మా కలలన్నీ కల్లలయిపోయాయి. ఇక్కణ్నుంచి వెళ్లి వాళ్లమ్మకు మొహం ఎలా చూపించను? అమెరికా నుంచి ఏం తెచ్చానని చెప్పను? కొడుకు శవాన్నా? ఇక్కడ ఏ గొప్ప ప్రదేశాలు చూశానని చెప్పనమ్మా… వాడు హత్యకు గురయిపోయిన అపార్టుమెంటును వర్ణించనా? ఏం చెయ్యను తల్లీ..”

అంతసేపూ ఎలా ఉగ్గబెట్టుకున్నాడోగానీ, ఆ క్షణాన భోరున ఏడ్చేశాడాయన. శాండిల్య కంట నీరు తిరగలేదు, దవడ కండరాలు బిగుసుకోవడం మాత్రం మసకబారిన కళ్లతో చూశాను.

బాడీ పాడవకుండా పంపేందుకు ఏర్పాట్లు చెయ్యడం, మెడికల్‌, లీగల్‌ ఫార్మాలిటీస్‌, ఎంబసీలో అవసరమైన పేపర్లు డాక్యుమెంట్‌ చెయ్యడం… అన్నిటితో అలిసిపోయాడు శాండిల్య. అన్నిచోట్లా అతనికున్న పరిచయాలు పని త్వరగా జరిగేలా చేశాయి. రాజూ, ఇంకొందరు స్నేహితులూ ఎంత సాయం చేశారో.

అది మొదలు. తర్వాత ఏం జరిగినా ముందు శాండీకే కాల్‌.

ఓ నెలయిందో లేదో, హైవే మీద యాక్సిడెంట్ జరిగితే వెళ్లాడు. ఐదుగురూ విజయవాడ పిల్లలు. నలుగురు అక్కడే చచ్చిపోయారు. ఒకమ్మాయి మాత్రం అతి కష్టమ్మీద బతికింది. రెండు నెలల క్రితం రిసెషన్‌ వల్ల ఉద్యోగం పోగొట్టుకున్న ఓ ఇండియన్‌ భార్యాపిల్లల్ని కాల్చి చంపేసి, తనని తాను కాల్చుకున్నాడు. అన్ని సందర్భాల్లోనూ తెలుగు సంఘాల్లో ఇతనే ముందుండి అన్నీ దగ్గరుండి చేశాడు. అప్పుడప్పుడూ ఎవరోఒకరు ఇండియా నుంచి ఫోన్‌ చేసి ధాంక్స్‌ చెప్పడమూ, ‘మీవారు దేవుడిలా ఆదుకున్నారండీ’ అనడమూ తెలుసు నాకు. యస్‌… అప్పట్నుంచే ఏదో ఆలోచనలో పడ్డాడు శాండిల్య. అదే నిజమైతే అతనేం చెప్పబోతున్నాడో ఊహించగలను. నా ఊహకు మించిన కారణం కాకపోడంతో అతనికి విడమర్చి నా ఆలోచనలూ చెప్పగలను, తోడ్పాటు నివ్వగలనేమో.

తెప్పరిల్లి చూస్తే సాయంత్రమవుతోంది. మొక్కలకు నీళ్లు పోసి, డిన్నరు ప్రయత్నాలు చేస్తున్నాను. పిల్లలు వచ్చి ఫ్రెష్‌ అయి బేస్‌బాల్‌ ఆడుకోవడానికి బయటకు వెళ్లారు.

మరో అరగంటకల్లా శాండిల్య వచ్చేశాడు. కాఫీ అందిస్తుంటే చెయ్యి పట్టుకుని ఆపి, దగ్గరగా కూచోపెట్టుకున్నాడు. నా అరచేతుల్లో తన చేతులనుంచి “పని తర్వాత చేసుకుందాం. ఇప్పుడు కాస్త వింటావా?” అన్నాడు. తల ఊపాను.

“కష్టం - సుఖం అంటారు పూర్ణా. మన పెళ్లికో, గృహప్రవేశానికో ఎవరెవరు వచ్చారో ఆల్బమ్‌లో ఫోటోలుంటాయి. వాళ్లిచ్చిన గిఫ్టులు ఇంట్లో ఉంటాయి గనుక ఆ రకంగానూ వాళ్లు గుర్తుంటారు. వాళ్లు జ్ఞాపకం వస్తుంటే సంతోషంగా ఉంటుంది. అయితే కష్టంలో సాయం చేసినవాళ్ల దారి వేరు. వాళ్లను మరిచిపోలేం. కానీ వాళ్లు గుర్తొచ్చినప్పుడు ఆ దుఃఖదినాలు కూడా గుర్తొస్తుంటాయి. ఎందుకు వాళ్లు మనకు సాయం చేయవలసి వచ్చిందన్న పాయింటు దగ్గర ఆగుతాయి ఆలోచనలు. వింటున్నావా? నే చెబుతున్నది అర్థమవుతోందా? డిడ్‌ యూ గెట్మీ?”

“యస్‌. అర్థమవుతోంది… చెప్పు…”

“నేనింత ఆలోచించకేపోదును నిజానికి. ఒకట్రెండుసార్లు ఫోన్లు చేస్తే నారాయణగారు ఏమన్నారో తెలుసా? నేను మాట్లాడినప్పుడల్లా ఆయనకి తన అమెరికా ప్రయాణం, ఎందుకొచ్చాడు అన్నది గుర్తొస్తుందట. వాళ్లబ్బాయిని నేను జాగ్రత్తగా పంపానన్నదీ గుర్తొస్తుందట. అంతే తర్వాత ఏడుపు తప్ప మరేం ఉండదు. ఇవి చెప్పి, ‘బాబూ, పోయినవాడితో మేం పోలేదు, పోలేం కూడా. లోపల కుళ్లిపోతున్నా బైటికి బాగానే బతుకీడుస్తాం. మీరు ఎలా ఉన్నారని అడిగినప్పుడల్లా నాకిది బుర్రలో సినిమా రీల్లా తిరుగుతుంది. మరీ అవసరమైనప్పుడు నేనే మీకు ఫోను చేస్తాను. మీరు చెయ్యకండి.’ అని చెప్పేశారాయన. అప్పటివరకూ ఆ పాయింటు నాకు తట్టలేదు. నేను వాళ్లకు అలా గుర్తుండాలనుకోవటం లేదు పూర్ణా. తల్లుల కడుపుచేటవుతుంటే ఆ వార్తల్ని ఫోన్లు చేసి వాళ్లకు చేరవెయ్యలేను. మీరు అల్లారుముద్దుగా పెంచుకుని, పదిమందికి నీడనిస్తుందనుకున్న ఆశల వృక్షం ఎవరో దుండగుల వికృతత్వానికి బలయిపోయిందని ఎలా చెప్పను వాళ్లకి? అంతా అయ్యాక మీరు దేవుడిలా కనిపించారని వాళ్లంటుంటే మనసును రంపంతో కోసినట్టుంటుంది తెలుసా పూర్ణా. నేను దేవుడిలా కనిపించడం ఏవిటి? ఎలా కనిపిస్తాను… జీవితాంతం గర్భశోకంతో రగిలిపోమని శాపమిచ్చే దేవుడిలాగానా? మిమ్మల్నీ జన్మలో మర్చిపోలేం అంటారు. ఎలా మర్చిపోతారు? కన్నబిడ్డల మరణవార్తలను చేరవేసిన దుర్మార్గపు మనిషిని కదా నేను… ఎలా మర్చిపోతారు ఎవరైనా? ఇంతాచేసి నా ప్రయోజకత్వం ఏమిటి? శవ వాహకత్వమే కదా. వద్దు పూర్ణా, నాకలాంటి గుర్తింపు వద్దు. ఆ ప్రయోజకత్వమూ వద్దు. ఎప్పుడైనా అక్కడికి వెళ్లినప్పుడు మీవాడిచ్చాడండీ అని కాసిని డబ్బులో చాక్లెట్లో మరేదో వస్తువో ఇచ్చి రావడం వరకూ ఓకే. ఆమాత్రానికే లగేజ్‌ ఎక్కువయిపోతుందని మానేస్తారు చాలామంది. మరి నేను మాత్రం ఇంత లగేజ్‌ను ఎందుకు మొయ్యాలి పూర్ణా… ఆశల్ని మోసుకుంటూ వచ్చినవాళ్లు అర్థంతరంగా చచ్చిపోతే… నేను వాళ్లని పెట్టెల్లో పెట్టించి, ప్యాక్‌ చేయించి జాగ్రత్తగా తల్లిదండ్రులకూ పుట్టినూరికీ పంపించాలా? ఇవా మనం ఇక్కణ్నుంచి పంపేవి? ఇలాంటి కానుకలివ్వలేను పూర్ణా. అంతకుమించి… మనమూ అలాగయిపోతే…'’

దుఃఖంతో గొంతు పూడుకుపోయి మరి మాట్లాడలేకపోయాడు శాండిల్య.

అతనిచుట్టూ చేతులేసి దగ్గరకు తీసుకున్నాను. పసిపిల్లాడిలా ఒళ్లో తలపెట్టి సోఫాలో ముడుచుకుని పడుకున్నాడు. మెల్లగా అతని తల నిమురుతూ కాసేపలానే నిశ్శబ్దంగా వున్నాను.

“శాండీ, నారాయణగారలా అన్నాడని అప్పుడే ఎందుకు చెప్పలేదు నువ్వూ?”

“‘ఏమో, ఆయన చెప్పింది అర్థం చేసుకోవడానికే నాక్కొంత సమయం పట్టింది. అప్పటివరకూ ఇలాంటి సంఘటనల్లో ముందుండి మనం చెయ్యగలిగిన సాయం చెయ్యడం ఒక బాధ్యతగా అనుకునేవాణ్ని పూర్ణా. నేనొక్కణ్నే ఏదో చేసేస్తున్నానని కాదు. అందరం కలిసి తలో చెయ్యీ వేసేదే. కానీ నారాయణగారు చెప్పింది విన్నాక నాకా సాయం చెయ్యబుద్ధి కావటం లేదు. అలాగని తెలిసి తెలిసీ చెయ్యగలిగింది చెయ్యకుండా వదిలెయ్యలేను. నలిగిపోతున్నాను. అంతకుమించి మనమూ ఇండియాకు అలా వెళతామేమో అన్న భయం కుదిపేస్తోంది పూర్ణా…”

నాకు చెప్పలేదు సరే, రాజుతోనో మిగిలిన ఫ్రెండ్స్‌తోనో అయినా ఇతనివన్నీ పంచుకున్నట్టు లేడసలు. అదే అడిగాను.

“ఎలా చెప్పను పూర్ణా. చెయ్యకుండా పారిపోడానికిదో సాకని వాళ్లనుకుంటే? లేదూ ఇదీ కరెక్టేనని నాలాగే అందరూ వెనకడుగు వేస్తే? అసలు అలాంటి సమయాల్లో సాయం చేసేవాళ్ల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ఎవరికీ ఏమీ చెప్పలేకపోతున్నా…”

అతని బాధ నాదై నా కళ్ళు తడి అయ్యాయి. శాండిల్యని ఒళ్ళోంచి లేపి అతని తలని గుండెల మీద పెట్టుకుని పసిపాపలా పొదివి పట్టుకున్నాను.

“శాండీ, నువ్వెందుకో నలిగిపోతున్నావని నాకు తెలుస్తూనే వుంది. కానీ నువ్వే టైం వచ్చినప్పుడు చెప్తావని ఆగాను. కొంత నా భయం కూడా తోడయింది. ఇంతకాలం మనం ఈ విషయం మాట్లడుకోకుండా తప్పు చేశాం. ఎనీ వే, నీ మనసులో అశాంతి నిన్ను స్తిమితంగా ఆలోచించనివ్వటం లేదు. దురదృష్టవశాత్తూ మూణ్నాలుగు యాక్సిడెంట్లు మన ఏరియాలోనే జరిగాయి. రోడ్డు మీద వెళుతుంటే ఎవరికో ప్రమాదం జరిగిందనుకో. ఒక్క క్షణం భయం వేస్తుంది. చాలాదగ్గరవాళ్లకే ఏదో అయిందనుకో, అసలు జీవితంలో మళ్లీ మామూలుగా నవ్వుతామనే అనుకోం. కానీ నెమ్మదిగా బయటపడతాం, మామూలవుతాం కదా. అలాగని అవి మళ్లీమళ్లీ జరుగుతాయని భయపడుతూ కూర్చోం. ఇలాంటివి తరచుగా జరుగుతాయని, నువ్వే బాధ్యత తీసుకోవాలనీ అనుకోకు. రాజుతో కూడా మాట్లాడు, అతని పరిస్థితి ఎలావుందో తెలుసుకో. ఈ వీకెండ్ వాళ్ళని డిన్నర్‌కి పిలుద్దాం, మనం కలిసి కూడా చాలా రోజులయింది కదా.”

శాండిల్య తల చిన్నగా వూపాడు నేను చెప్పేది వింటున్నాడనీ ఆలోచిస్తున్నాడనీ తెలిసేట్టుగా.

“నెమ్మదిగా అన్నీ అవే సర్దుకుంటాయి. నీ భయాలన్నీ అర్థం లేనివని, వాటిని ఇప్పటికిప్పుడే బుర్రలోంచి తీసెయ్యమనీ అనను. కానీ అలాంటి సందర్భాల్లో నువ్వో, నేనో, మరొకరో తోచింది చెయ్యకపోతే ఎలా చెప్పు? నిజమే, మనం గుర్తొచ్చినప్పుడల్లా వారికి వచ్చేది చేదు జ్ఞాపకాలే. కానీ, దాంట్లో ఒక ఫైనాలిటీ ఉంది. ఒక నిశ్చింత వుంటుంది శాండీ. ఆ శవాన్ని చూస్కోడంతో, ఆ కర్మ పూర్తి కావడంతో వాళ్ళు కొన్నేళ్ళ తర్వాతైనా కోలుకుంటారు. ఒక్కసారి ఊహించు, తన బిడ్డ పోయాడనే వార్త ఒక్కటే వాళ్ళకి తెలిసి, ఆఖరిచూపుకీ నోచుకోక, కనీసం శవాన్నీ చూసుకోలేక పోతే ఆ వ్యాక్యూం వాళ్ళని పూర్తిగా కాల్చేస్తుంది. వాళ్ళ జీవితమంతా ఒక నిర్ధారించుకోలేని నిజంతో బతకడం కంటే, నువ్వు పంపించే బిలాంగింగ్స్‌తో చేదైనదే అయినా ఒక ముగింపు, ఒక వోదార్పు వస్తుంది. పోయినవారితో వీళ్ళూ పోకుండా కొంతైనా ఆపుతుంది కదా శాండీ నువు చేస్తున్న ఈ సహాయం. అది చాలుగదా. అంతకంటే ఇంకేం కోరుకుంటాం మనం. సో డోంట్వరీ. ప్లీజ్ రిలాక్స్‌ ఫర్ ఎ వైల్. ఇట్స్ గోయింగ్ టు బీ ఫైన్. కానీ, ఇంకెప్పుడూ ఇలా నీలో నువ్వే నలిగిపోకుండా నాతో వెంటనే చెప్తావు కదూ ప్లీజ్.”

శాండిల్య కళ్ళెత్తి నా కళ్ళలోకి చూశాడు. అతని కళ్ళు సరే అంటున్నాయి. వాన కురిసి వెలిసిన తర్వాత వీచే చల్లగాలిలాంటిదేదో అతని మొహంలో తేటగా ప్రతిఫలించింది.

ముందరి పేజీ(లు) 1 2

రచయిత అరుణ పప్పు గురించి: శ్రీకాకుళం జిల్లా పాలకొండలో 1979లో జన్మించారు. గణితంలో ఎం. ఎస్‌సీ. చేసినా తెలుగు చదవాలనీ రాయాలనీ వున్న అభిలాష వల్ల చేపట్టిన వృత్తి పాత్రికేయం. మొదట ఈనాడు లో ఐదేళ్ళు చేసి, గత రెండేళ్ళుగా ఆంధ్రజ్యోతిలో పని చేస్తున్నారు. రచనా వ్యాసంగం శైశవదశలోనే ఉన్నా ఇప్పటికే మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు. అరుణమ్ వీరి బ్లాగ్‌సైట్.  ...

 

(8 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Vamsi M Maganti అభిప్రాయం:

    July 1, 2009 8:15 am

    కథనం బాగున్నది. నామటుకు మొదటి సగభాగం నిటారుగా కూర్చోని ఆసక్తిగా చదివాను, తర్వాత సీట్లోకి నెమ్మదిగా జారగిలబడటం మొదలు అయ్యింది. అయితే ఇక్కడ నివసిస్తున్న, అంటే నాకు తెలిసున్న తెలుగువారి కుటుంబాల్లో (భవదీయుడిది కూడా కలుపుకుని) ఈ క్రింది తరహా మాటలు నేను వినకపోవటం, చూడకపోవటం మూలానో ఏమో మరి … “శాండిల్య ఆఫీసుకు రెడీ అయిపోయి సిరియల్ తింటూ చెప్పాడు, “పూర్ణా, సాయంత్రం నీతో మాట్లాడాలి. కొంచెం ముందు రావడానికి ప్రయత్నిస్తావా” “షూర్ ” అన్నాన్నేను. ” - ఇలా ఇంకా కొన్ని , కథలో నాకు కృతకంగా కనపడ్డాయి. నాకు అలవాటు లేకపోవటం మూలాన..

    కాకపోతే ఇక్కడి వారి జీవన విధానంలో కొన్ని పా(ర్)ట్లు తెలుగువారికి అన్వయించి చెప్పడానికి రచయిత్రి చేసిన ప్రయత్నం బాగున్నది. ఈ వాక్యాలు మటుకు బాగా నచ్చాయి - “ఆశల్ని మోసుకుంటూ వచ్చినవాళ్లు అర్థంతరంగా చచ్చిపోతే… నేను వాళ్లని పెట్టెల్లో పెట్టించి, ప్యాక్ చేయించి జాగ్రత్తగా తల్లిదండ్రులకూ పుట్టినూరికీ పంపించాలా? ఇవా మనం ఇక్కణ్నుంచి పంపేవి? ఇలాంటి కానుకలివ్వలేను పూర్ణా. అంతకుమించి… మనమూ అలాగయిపోతే…’’

    అభినందనలు…

  2. రవిచంద్ర అభిప్రాయం:

    July 1, 2009 10:59 pm

    అమ్మల దగ్గర్నుంచి అమెరికాకు దిగుమతయ్యేది ఆవకాయే కాదు, అద్భుతమైన ప్రశాంతత, అంతకుమించిన ధైర్యమూనూ.

    చివరికి హార్దికం మీద ఆర్థికమే ఎక్కువగా నెగ్గుతుంది.

    అక్కడక్కడా ఇలాంటి వాక్యాలు హృదయాన్ని తాకాయి. సమకాలీనమైన సంఘటనలను కథారూపంలో మలిచిన రచయితకు అభినందనలు.

  3. vinay అభిప్రాయం:

    July 2, 2009 11:07 pm

    i agree with ravi chandra……………..excellent quotes

    especially

    అమ్మల దగ్గర్నుంచి అమెరికాకు దిగుమతయ్యేది ఆవకాయే కాదు, అద్భుతమైన ప్రశాంతత, అంతకుమించిన ధైర్యమూనూ.

    top

  4. Venkat అభిప్రాయం:

    July 3, 2009 2:12 am

    కథ చాలా బాగుంది. ముఖ్యంగా శాండిల్య పాత్ర. సహాయం చేసిన తరువాత అతనిలో కలిగే సంఘర్షణ బాగా చెప్పారు.

  5. Kumara Swamy అభిప్రాయం:

    July 3, 2009 8:56 pm

    ఈ కథలో feelings బావున్నాయి. కాని సంఘటన ఏది? మనసును గాయపెట్టే అనుభవం ఉంటే సరిపోతుందా. కథకి ఫార్ములా / ట్విస్ట్ / సర్కిల్ - పరిపూర్ణం కావించబడిన సంఘటన ముఖ్యం. ఈ సంవత్సరం అరుణ గారు రాసిన నాలుగు కథలూ చదివాను. చాలామంది అనుభవజ్ఞులైన మూసకొట్టుడు కథకులకంటే ఆమె బాగా రాస్తున్నారు. ఈ ఒక్క లోపాన్ని అధిగమిచగలిగితే ఆమె నుంచి మరిన్నిమంచికథలను ఆశించవచ్చునేమో.
    Anyway best of luck to Aruna.

    కుమారస్వామి

  6. రాఘవ అభిప్రాయం:

    July 15, 2009 5:20 am

    కథ ఈ మధ్య బాగా వినవస్తున్న సమస్య గురించినది కావడం, సహాయం చేసే ఉద్దేశ్యం ఉన్నవాళ్లకి కూడా నొచ్చుకోలు ఉంటుందని చెప్పడం… బావుందండీ. అభినందనలు.

  7. Sowmya అభిప్రాయం:

    July 16, 2009 2:45 am

    కథనం చాలా నచ్చింది నాకు.
    ఇంకా, అసలీ కాన్సెప్ట్ కూడా - ఆలోచింపజేసింది.
    ఈ కథను నా స్నేహితూలకి కూడా చదవమని చెప్తున్నాను…

  8. Mohan అభిప్రాయం:

    October 19, 2009 10:40 am

    అరుణ గారి కథనం బాగుంది.
    ఈ కథలొ శాండిల్య ఎవరో నాకు తెలియదు కానీ, తానా ప్రవేశపెట్టిన TEAM Square ద్వారా కొన్ని సంఘటనల్లో నా అనుభవాన్ని ఈ కథలో చూడగలిగాను.
    మరిన్ని వివరాలకు ఈ Links :

    TEAM Square Activities
    TEAM Square Mission
    ఆరుణ గారికి అభినందనలు.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a