ఈమాట » నేనొక సాధారణ పాఠకుణ్ణి

Expand to right
Expand to left

నేనొక సాధారణ పాఠకుణ్ణి

మరొక పద్యం, చిన్నదే!

ఎప్పటిదో తెలీదు[12]
ఎక్కడిదో తెలీదు
తడపటం ఒక్కటే తెలుసు వానకి.
లోపలంతా రాత్రంతా
అలా
కురుస్తూనే వున్నా ఏక ధారగా.

ఆ మధ్యాన్నపు వాన ఇలాగే
కురిసీకురవని నీ లాగే

గాయకుడు మిగిల్చి వెళ్ళిన
నిశ్శబ్దంలా వాన
సుదీర్ఘమౌనానికి నిరసనలా వాన
ఇవాళింక తెరిపి లేదు.

వాన ఏ రకమైన వెనకటి జ్ఞాపకాలని గుర్తుకి తెచ్చినా, కవితలో ఆఖరి చరణం మరొక కొత్త జ్ఞాపకాన్నీ నెమరుకి తెస్తుంది. అది మంచి కవితకి ఉండవలసిన లక్షణాల్లో ఒకటి. ఈ పైకవితలు రెండూ, రాజశేఖరుడు చెప్పిన నారికేళ (కొబ్బరి) పాకపు కవితలు.

ఐతే, అసలు ఏ పాకంలోకీ ఇరకని పాకం, అస్పష్ట పాకం అనుకుంటా!

“… నిద్రలేని సగం అర్థ ఒకటిన్నర రాత్రిలో[13]
చీకటి కాటుక కానుగ చెట్టు ఆకుల జుట్టులోని
ఈనెల నరాల్లో కన్నీళ్ళు, చలిగాలీ, నేను
రైలు దిగి రహస్సూ యాశ్వమెక్కి వచ్చాం;
ఎర్ర ద్రాక్షపళ్ళూ తెల్లన్నం పుచ్చుకొని…”

శబ్దపాకం తిరకాసుగా ఉన్నట్టున్నది! ఈ వచనపద్యాన్ని మామూలు వచనంలోకి మార్చుకొని చదివితే, మొదటి రెండు లైనులూ ఇలా ఉంటాయి. అర్థ రాత్రి ఒంటిగంటన్నరకి, సగం నిద్రలో లేచాడు కాబోలు. కాటుక చీకటి. మాటలు తల్లకిందులు. కానుగు చెట్ల ఆకుల జుట్టు అంటే ఏమిటి? ఆకుల ఈనెల నరాల్లో కన్నీళ్ళు, చలిగాలితో కలిసి, సగం నిద్రలో రైలు దిగి రహస్యం అనే గుర్రం ఎక్కి వచ్చారట! ఏమిటి పట్టుకోవచ్చారు? ఎర్రద్రాక్ష పళ్ళు, తెల్ల అన్నం! ఈ కవిత ఎన్నిసార్లు చదివినా దీనిలోని తాత్త్విక నిగూఢార్థం నాకు ఇప్పటికీ బోధపడలేదు! ఇదేదో నాలాంటి సాధారణ పాఠకుడికోసం రాసింది కాదని వదిలేశాను! ఎప్పుడో, ఎవరింట్లోనో, లైఫ్ బాయ్ సబ్బుతో కడిగిన గ్లాసులో చవకరకం జిన్‌ అండ్ టానిక్ తాగిన రుచి. ఇది నా కొచ్చిన జ్ఞాపకం!


వాదనకి ఒక ప్రశ్న రావచ్చు. నేనొక కవిత చదివిన తరువాత నాకు తిరిగి ఏ విధమైన జ్ఞాపకాలూ రావటల్లేదు. అంత మాత్రం చేత ఆ కవితని నేను అనుభవించి ఆనందించలేనా? అని అడగవచ్చు. నిజం చెప్పాలంటే, ఆ కవితని మీరు సహృదయతతో అనుభవించలేరు. అయితే, ఇక్కడ పెర్ఫ్యూముల విషయం గుర్తుకి తీసుకొని రావాలి. కొత్తగా, మొట్టమొదటిసారిగా పెర్ఫ్యూముల దుకాణంలోకి వెళ్ళినప్పుడు, ఏ విధమైన “అనుభవం” కలిగింది? అని ప్రశ్నించుకోవాలి. ఆ పరిమళానుభవం అభ్యాసంతో వచ్చినది అవుతుంది. ఆ అనుభవం జ్ఞాపకపరిథిలోకి పోతుంది. అదే విధంగా ఈ కవిత ఏ విధమైన కొత్త అనుభూతులని కలిగిస్తూన్నది? లేదా ఏ విధమైన పాత జ్ఞాపకాలని వెలికి తెస్తూన్నది? ఇంతకీ ఇది మరి మంచి కవితా కాదా? అని మనం ప్రశ్నించుకోవాలి.

మరొక ఉదాహరణ : ఆకు రాలు కాలంలో ఎండుటాకుల కుప్పలు మెల్లగా మండేటప్పుడు వచ్చే వాసన మొట్టమొదటిసారిగా అనుభవించిన గుర్తు. ఇక్కడా అభ్యాసమే! కొన్ని పరిమళాలు మనసుకి హత్తుకొని పోతాయి. కొన్ని మరుగున పడిపోతాయి. సహజం. మనసుకి హత్తుకొపోయిన పరిమళాలు (రుచులు) మనం తేలికగా జ్ఞప్తి లోకి తెచ్చుకుంటాం. We relive them. We experience them again! సరిగ్గా, కవిత్వం ఆస్వాదించడం కూడా అంతే! పోతే, కొన్ని కవితలు చదివిన తరువాత ఏవిధమైన కొత్త అనుభూతి కలగకపోవచ్చు. కొత్తదనం ఉండవచ్చు. వినడానికి బాగుండవచ్చు. కానీ కవితగా ఏ విధమైన రుచినీ గుర్తుకి తీసుకొరాక పోవచ్చు. ఉదాహరణకి: “కాకికేమి తెలుసు సైకోఎనాలి సిస్‌” అని చదవగానే అందంగా వినిపించినా ఇందులో ఏమీ పసలేదని సాధారణ పాఠకుడు గమనించగలడు. సూపర్‌ మార్కెట్లో కొన్న టొమేటో తంతు. గుండ్రంగా, పెద్దగా అందంగా ఉంటుంది. అంతే!


The conceits of the poets of other lands
I’d bring them not,
Nor the compliments that have served
Their turn so long,
Nor rhyme, nor the classics, nor perfume
of foreign court or indoor library;
But an odor I’d bring
As from forests of pine from Maine,
or breath of Illinois prairie,
With open airs of Virginia
or Georgia or Tennessee,
or from Texas uplands, or Florida glades….

- Walt Whitman వ్రాసిన Leaves of Grass నుంచి…


కావ్యాలంకార సంగ్రహం ( సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి గారి వ్యాఖ్యానం ), కావ్యమీమాంసా ( రాజశేఖరుడు), ధ్వన్యాలోకం ( ఆనందవర్థనుడు), శ్రీ కృష్ణ కర్ణామృతం
( బిళ్వమంగళ లీలాశుకుడు) - ఈ పుస్తకాలు సంప్రదించాను. దగ్గిర దగ్గిర ఒక నలభై యాభై ఆథునిక కవితా సంకలనాలు జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నించాను.

పరిమళాలు, జ్ఞాపకాల పరంగా, ముఖ్యంగా Recovered Memories పై నా అవగాహనకి ఈ క్రింది మూడుపుస్తకాలూ చాలా బలాన్ని చేకూర్చాయి.

  1. Wines: Their Sensory Evaluation, By Maynard Amerine & Edward Roessler, 1976.
  2. What the Nose Knows, By Avery Gilbert, 2008.
  3. Perfumes : The Guide, By Luca Turin & Tania Sanchez, 2008

వ్యాసంలో ఉదహరించిన కవితల జాబితా, వరసగా:

  1. ^విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం నుంచి
  2. ^శ్రీశ్రీ భిక్షువర్షీయసి కవిత. ఆఖరి మూడు చరణాలు
  3. ^సింగిరెడ్డి నారాయణరెడ్డి కాలం అంచుమీద అన్న సంకలనం నుంచి - చినుకు అన్న కవిత
  4. ^సింగిరెడ్డి నారాయణరెడ్డిగారి విశ్వంభర, బృహత్కావ్యం నుంచి
  5. ^ఎండ్లూరి సుధాకర్ నల్ల ద్రాక్ష పందిరి నుంచి - గ్రీష్మ గోదావరి అన్న కవిత
  6. ^శివపురం శైలజ మచ్చు తునకలు సంకలనం నుంచి
  7. ^రెంటాల కల్పన నేను కనిపించే పదం అన్న సంకలనం నుంచి - రాలిపడ్డ జ్ఞాపకాలు అన్న కవిత
  8. ^వి. ఆర్‌. విద్యార్థి ఖండాంతర కవిత్వం అనే సంకలనం నుంచి - సమాంతరం అన్న కవిత
  9. ^నారాయణ స్వామి సందుక సంకలనం నుంచి - చిన్నారిమొక్క అనే కవిత
  10. ^విన్నకోట రవిశంకర్ వేసవి వాన అన్న సంకలనం నుంచి, పోలికలు అన్న కవిత
  11. ^కన్నెగంటి చంద్ర వాన వెలిసిన సాయంత్రం అన్న సంకలనం నుంచి - మబ్బుల్లో బొమ్మలు అనే కవిత
  12. ^అఫ్సర్ వలస అన్న సంకలనం నుంచి - కురిసీకురవని అనే కవిత
  13. ^వేగుంట మోహన ప్రసాద్ చితి-చింత అనే సంకలనం నుంచి - నిరాకారుడు అనే కవిత
ముందరి పేజీ(లు) 1 2 3 4 5
 

(31 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. baabjeelu అభిప్రాయం:

    November 16, 2008 4:36 am

    వేలూరి వారికి. దండాలు.

    ఇదేట్రా, special issue లో మీదని “సెక్రం” తిప్పడం తప్ప కిందని ఏటీ special లేదు, బెంగెట్టీసుకున్నాను. సంపాదకులు రాసినవి చదవకూడదని ఎంకట్రవణమూర్తికి మొక్కుకోడం వల్ల, ఇది చదవలేదు ఇప్పటిదాకా. తప్పైపోయింది.

    మొక్కుకున్నాక కూడా కొన్ని చదివి లెంపలేసుకున్నాను. అయినా “దాలిగుంట బతుకు” కదా మళ్ళీ చదివేను. అద్రుష్టం.నిజంగా మీరు సాధారణ పాఠకుడే. లేపోతే ఇంత చక్కగా రాయరు. మధ్యలో హుషారు ఇచ్చే వైనాలు.

    సాధారణపాఠకుడికి “group లు” వుండవు. వాదాలుండవు. ఏ రసం నచ్చిన వాడు ఆ రసాప్లావితం లో కొట్టుకుపోతాడు. తమ్మినేని వారి “థాయి ల్యాండు” టూరు కవిత మీద మనలాటి సాధారణ పాఠకుల అభిప్రాయలకి, గురుతుల్యులు భైరవభట్ల వారూ, జెజ్జాల వారూ “గెడ్డ’ లో ఈత కొట్టేరు. గజీతగాళ్ళని “గెడ్డ” లో దింపనక్కరలేకుండా ఈ “వైన్వ్యాసం” మన్లాటోళ్ళందరిచేతా టోకున చదివించేస్తే కవిత్వపు మత్తొదిలిపోతుంది. లేదా కవిత్వపు సత్తువా తేలిపోతుంది.

  2. పాఠకుడు అభిప్రాయం:

    November 20, 2008 12:32 pm

    ఇన్ని విషయాలు చెప్పి, ఆ తర్వాత, “నేనొక సాధారణ పాఠకుణ్ణి” అని అంత వినయంగా అనేశారేవిటీ? ఎవరూ నమ్మరు ఆ మాట. “నేనొక అసాధారణ పాఠకుణ్ణి” అని పెట్టాలి పేరు ఈ వ్యాసానికి, ఇందులో వున్న “అసాధారణ విషయాల” వల్ల. అందుకే నా లాంటి పాఠకుడికి ఇదొక పెద్ద సోదిలా అనిపించి, చాలా బోరు కొట్టింది. కాసిన్ని తెలివితేటలుంటేనే గానీ చదివి, హరాయించుకోలేమనిపించింది కూడా. ఈ తప్పు విశ్వనాథ కవిత ప్రకారం అయితే నాదే. వేలూరి గారి మాటల వల్ల అయితే ఆయనదీ. మొత్తానికి చందమామలో రామాయణం సంక్షిప్తంగా ముద్రించినట్టూ, రేడియోలో సంక్షిప్త శబ్ద చిత్రం విన్నట్టూ, లేడిలా గెంతుకుంటూ, వాక్యాలు వదిలేస్తూ చదవాల్సి వచ్చింది.
    - పాఠకుడు

  3. baabjeelu అభిప్రాయం:

    November 21, 2008 7:30 am

    పాఠకుడుగోరూ,
    అదేటండీ అలాగనీసేరు. సంపాదకులు రాసీవి సాధారణంగా “సప్పగ” వుంటాయి. ఎందుకంటే అవి “ఖాళీలు పూరింపుము” తరహావి కాబట్టి. ఇదలాటిది కాదే? సృజనాత్మక ప్రక్రియని, ఒకరు పావుకేజీ అని నిర్ణయిస్తే, మరొకరు “అబ్బే, ఇది వంద గ్రాములు” అనడం. ఇంకొహరు “అయ్యా! ఇలాటి సృజనని కేజీల్లో తేలుస్తారా? అన్నేయం. ఇది ఎలాటిదంటే, అత్తరు సాయిబు దుగ్ధతో కోట గోడకేసి అత్తరు బుడ్డీని కొడితే, ఆ దెబ్బకి ప్రభువుల వారి దివ్యాశ్వము పరమానంద భరితయై, మోరా, ముందు కాళ్ళు ఎత్తీసి, ప్రభువుల safety గురించి మర్సిపోయి ఆశ్వాదిస్తూ వుంటే, ప్రభువులు కూడా (రసజ్నుడు కాబట్టి, సచ్చేన్రో అని బయపడకుండా) ” సెబాస్” అనడం లాటిది. అలా అనుభూతించాలి తప్ప, తూకం యెయ్యకూడదు” అని నిర్ణయిస్తే? సాధారణ పాఠకులు ” ఏందార్రా నాయనా?” అనుకోరా?
    మొన్నా, నిన్నాతోబాటూ ఇయేల కూడా సాధారణ పాఠకులే కదా “ఫలానా సృజనాత్మక ప్రక్రియ” బావుందో లేదో తేల్చుకోలేక నానా హింసా పడీది. వేలూరి వారు చెప్పిన పధ్ధతో, ఇంకోటో ( ఏ రాయైతేనేటి అనుభూతించడానికి) ఒవులైనా తయారు చేస్తే (సాధారణ పాఠకులు చెయ్యలేరు) సాధారణ పాఠకులు నిబ్బరంగా “సాహిత్య సేవనం” సేస్తారు కదా? అదే కదా రాసీవోళ్ళు కూడా కోరుకునీది.

  4. కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    November 23, 2008 9:40 pm

    “కవిత్వం ఒక ఆల్కెమీ”

    Walter Benjamin, రాజశేఖరుడు, ఆనందవర్థనుడు, వగైరాల సాహితీ సిద్ధాంతాలని పేర్కొనేవారు తాము సాధారణ పాఠకులమంటే, ఇక “సాధారణ” అన్న మాటకి అర్థమేముంది? “Oh, Lord Venkateswara! If you are only a stone, what are we?” అని ఎక్కడో ఎవరినో అన్నది గుర్తొస్తోంది. :-) అల్ప విషయంగా వదిలేద్దాం.

    వేలూరి గారన్న దాంట్లో ఓ చిన్న సందేహం: “వాన ఏ రకమైన వెనకటి జ్ఞాపకాలని గుర్తుకి తెచ్చినా, కవితలో ఆఖరి చరణం మరొక కొత్త జ్ఞాపకాన్నీ నెమరుకి తెస్తుంది. అది మంచి కవితకి ఉండవలసిన లక్షణాల్లో ఒకటి.”

    కొత్త జ్ఞాపకం అంటే ఇటీవలిదనా (recent memory)? మంచి కవితకి అదెందుకు ఉండాలో వివరిస్తే బావుండేది.

    హార్డీ Apology లో Housman పేరు చూశాను. పోయినేడే ఆయన 1933లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఇచ్చిన ఉపన్యాసం, “The Name and Nature of Poetry,” [1] చదివాను. కవిత్వ స్వభావం గురించి Housman చెప్పింది నాకు నచ్చింది. దీనినే రచ్చబండలో కాస్త ఘాటుగా ప్రస్తావించి, ఘర్షణ పడ్డాను. (పడిన గాయాలు అందరిలోనూ మానిపోయాయని ఆశిస్తాను.)

    వేలూరి గారు పాఠకుని జ్ఞాపకాలు కవిత్వాన్ని ఆస్వాదించడానికి కావలసిన పరికరం అంటే, Housman, భావోద్వేగాన్ని కలిగించడమే కవిత్వ విశేష లక్షణం అన్నాడు:

    “And I think that to transfuse emotion - not to transmit thought but to set up in the reader’s sense a vibration corresponding to what was felt by the writer - is the peculiar function of poetry.”

    ఉద్వేగం వేలూరి/Benjamin అన్నట్లు జ్ఞాపకాల వలనే వస్తుందనుకుందాం. అయితే ఒక సందేహం వస్తుంది. మన జ్ఞాపకాలని మనమే గుర్తు తెచ్చుకోడానికి వేరేవాళ్ళ కవిత్వం ఎందుకు? దీనికి సమాధానంగా నాకు రెండు విషయాలు గోచరిస్తాయి.

    ఒకటి, కొన్ని జ్ఞాపకాలు గుప్తంగా ఉండొచ్చు; మనకంతుపట్టని అంతర్గత మానవ స్వభావానికి చెంది ఉండొచ్చు. Housman మాటల్లో;

    “But in these six simple words of Milton -
    Nymphs and shepherds, dance no more -
    what is it that can draw tears, as I know it can, to the eyes of more readers than one? What in the world is there to cry about? Why have the mere words the physical effect of pathos when the sense of the passage is blithe and gay? I can only say, because they are poetry, and find their way to something in man which is obscure and latent, something older than the present organisation of his nature, like the patches of fen which still linger here and there in the drained lands of Cambridgeshire.”

    రెండోది మనలో ఉద్వేగం కలిగించాలంటే ఆ భావాలని వ్యక్తీకరించే భాష ప్రత్యేకమైనదిగా ఉండాలి. Housman అన్నట్లు, “Poetry is not the thing said but a way of saying it.”

    రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ తన వేమన ఉపన్యాసాలలో అన్నారు: “తీవ్రమైన భావములు మనుష్యులు కందరికిని కలవు, కాని ఆ భావములను బైట పెట్టవలసినప్పుడు మన కందరికిని వచ్చునది కవిత్వం గాదు; నత్తి. కొందరికది నాలుకకే అంటియుండును. మరికొందరికి వ్రాతలోను కలదు. కవులనబడే వారిలో ననేకులిట్టి నత్తివ్రాతవారే. బుద్దిమంతులైన వారి కీరెంటికిని మందొకటే; చేతనైనంతవరకు మౌనము వహించుట.”

    (1929లో కన్నా ఇప్పుడు కవుల్లో నత్తి ఎక్కువయిందా?:-))

    పైదీ, వేలూరి గారన్నదీ నాకు చాలావరకు సమ్మతమే. కాని నేనిది రాయడానికి కారణం, ఆధునికులు ఇదంతా పాత చింతకాయపచ్చడి, అని కొట్టిపారేస్తారేమోనని. మన ప్రముఖ కవి ఇస్మాయిల్ మాటల్లో [2]:

    “మనః ప్రపంచంలోనూ, బహిః ప్రపంచం లోనూ ఏక కాలం లో కవి చేసే ఎక్స్ ప్లొరేషనే కవిత్వం. అందరికీ తెలిసిందాన్నే అందంగా చెప్పడం కాదన్నమాట కవిత్వం. ఇది సంప్రదాయవాదులిచ్చిన నిర్వచనం. దీన్ని ఆధునికులు ఒప్పుకోరు. కవిత్వం ఎక్స్ ప్లొరేషన్ కనక, కొత్త సత్యాలని ఆవిష్కరిస్తుందని వీళ్ళంటారు. అందుకే, అస్పష్టం అనే ఫిర్యాదు ఆధునిక కవిత్వం గురించి అప్పుడప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. అస్పష్టమంటే కొత్త అని అర్థం చేసుకోవాలి, చదువరికి ఇంతవరకూ అనుభవంలోకి రాని విషయమన్న మాట.”

    మో ఆధునిక కవి. ఆయన కవిత్వం అస్పష్ట పాకమా? లేక మనకింతవరకూ అనుభవంలోకి రాని సరికొత్త పాకమా?

    ఎప్పటికైనా మో “కవిత్వం అంతరాంతర జ్యోతిస్సీమల్ని బహిర్గతం” చేస్తుందని నా ఆశ. అప్పటిదాకా “శాంతి ఒక్కొక్క బొట్టూ పడ్తుంది వేకువ కళ్ళల్లోంచి. కట్టేసిన కన్నీటి మేలిముసుగు కుళాయిల్లోంచి.” అన్న నిరాకారుణ్ణి “లైఫ్ బాయ్ సబ్బుతో కడిగిన గ్లాసులో తాగిన చవకరకం జిన్‌ అండ్ టానిక్” తో పోల్చడం మాత్రం అన్యాయమే!

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “The Name and Nature of Poetry and Other Selected Prose,” by AE Housman. Cambridge University Press, 1961.

    [2] “కవితా విహంగానికి స్వేచ్ఛ ఊపిరి,” అన్న ఇస్మాయిల్ 1981 వ్యాసం. “కవిత్వంలో నిశ్శబ్దం,” నుండి.

  5. Srinivas Nagulapalli అభిప్రాయం:

    November 24, 2008 8:52 am

    ఒక కవిత పాత జ్ఞాపకాల పుట్ట అని వేలూరి గారు అంటే, పాత జ్ఞాపకాలు, కాదు గాయాలు, మానిపోయాయని మన హనుమగారు ఆశిస్తున్నారు. రెండూ సహృదయంతో చెప్పినవే కాబట్టి, దేన్ని కాదనగలం?

    షడ్రుచులున్నాయి అని మన వాళ్ళంటే, “లోకో భిన్న రుచిః” అని అంతకంటే ముందే అన్నారు. ఎంత మధురమైనా మోతాదెక్కువైతే మొహమెత్తిపోతుందని చుట్టున్నవాళ్లు గుర్తుచేస్తూనే ఉంటారు. ఈ రుచి బాగుంది, ఆ రుచి గొప్పది అని వెలకట్టబోతుంటే, “అన్నేసి చూడు, నన్నేసి చూడు” అన్న ఉప్పును మాత్రం ఎవ్వరు తక్కువ చేయగలరు!

    రుచులు, వాసనలు అందరికీ సాధారణంగా అనుభవంలోకి వచ్చినట్లు, అన్ని కవితలు అర్థమయి, అనుభవంలోకి వస్తాయి అనలేం. పెళ్ళిచేసుకోవడం, ఇల్లుచూసుకోవడం సంగతేమోకాని, పింగళిగారెప్పుడో “భావ కవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్” అనేసారు. పాటలేకాదు, ఏవో కవితలు రాయాలోయ్ అని కూడా అన్వయించుకోవచ్చేమో.

    కొన్ని కవితలు మిగిల్చిన జ్ఞాపకాల గురించి రెండు లైన్లు రాయాలనిపించింది.

    ఎన్నో జ్ఞాపకాల నిధులున్న మనసే ఒక కోట
    ఎన్నో శబ్దాలు నింపుకున్న కవితే ఒక ఫిరంగి
    ఇది కూలదు
    అది పేలదు!

    ఏది ఏమైనా కవులూ, పాఠకులూ, పాఠకులు కానివారుతో సహా
    “ఎల్లరు హాయిగ ఉండాలోయ్” అన్న పింగళిగారి కాంక్షనే ఆకాంక్షిస్తూ
    ===========
    విధేయుడు
    - Srinivas

  6. baabjeelu అభిప్రాయం:

    November 25, 2008 8:42 am

    సాధారణ పాఠకుడు:
    చిన్న పిల్లల్లాటి వాడు. ఏది జరిగినా “శ్రీశ్రీ” కవితలో చెప్పినట్టు ఆకసమున హరివిల్లు విరిస్తే ఆశ్చర్యంతో, ఆనందంతో చప్పట్లు కొట్టేరకం. మాహాకవుల రచనకీ, మామూలువాళ్ళరచనకీ, ఆఖరుకి సినిమా పాటకీ తేడా పట్టించుకోకుండా “రసాత్మకవయిన వాక్యానికి” సాష్టాంగ పడిపోయే రకం. ఏ గ్రూపు వారు రాసేరో పట్టించుకోని రకం. అసాధారణ పాఠకులు ” ఇలాటి దిగుడు ధరల సమయంలో, మబ్బూ, వానా, మల్లెల వాసనా.. లాటి వాక్యాలని ఆనందిస్తావా?” అని గదమాయిస్తే, సిగ్గు పడిపోయే రకం. సిగ్గు పడుతూనే “బాపూ బాగా రాసేడు కదా?” అని మెలికలు తిరిగే రకం. ఎవరైనా ఆంగ్ల రచయతల్ని గానీ, పాత తెలుగు కవుల/రచయతల ని గానీ “కోట్” చేస్తే గజగజలాడీ రకం.
    అసాధారణ పాఠకుడు:
    గిడసబారిన సరుకిది. ఎందుకో తెలీదు కానీ “సృజనాత్మక ప్రక్రియ” ఫలానా విధంగానే వుండాలి, ఫలానా పధ్ధతిలోనే రాయాలి, ఫలానా వస్తువు గురించే అని, “రాజు-మహిషి” వర్ధనమ్మ గారి లాగ “రూల్సు” పెట్టుకున్న రకం. “రూల్సు” దాటితే, ఆ ” సృజనాత్మక ప్రక్రియ” ఎంత బాగున్నా “యాక్” అని నిర్భయంగా అని ఋజువు చెయ్యగల రకం. “సాధారణ పాఠకుల్ని” “డామినేట్” చేసే రకం. అలవోకగా వాళ్ళ వాదానికి తగ్గట్టూ ఆంగ్ల/పాత తెలుగు రచయతల్ని “కోట్” చేసి సాధారణ పాఠకుల్ని గజగజలాడించీ రకం.
    ఇలాటి పరిస్తుతుల్లో “సాధారణ పాఠకుడికి” ఏదో ఒక “యార్డ్ స్టిక్” వుంటే మంచిదే గదా? మామూలు బతుకుని మరీ మామూలుగా బతుకుతూ, కుదిరినపుడు “సాహిత్య సేవనం” చేస్తూ హాయ్ హాయ్ గా బతకడానికి.
    అలాకుదరదు, “త్రిక సంధి” కంఠతా రావాలి, “పదహారు పదహార్లూ” కంఠతా రావాలి, future perfect continuous tense లో కూడా “సొంత వాక్య” ప్రయోగం రావాలి అని “రూల్సు” పెడితే సాధారణ పాఠకుల గతి? సాహిత్యం గతి?
    వేలూరి వారు, బహుముఖ ప్రజ్నా(స్పెల్లింగ్?) శాలీయున్నూ, బహు భాషావేత్తయున్నూ, సంస్కృతాంధ్రాంగ్లముల యందు బండితుడున్నూ, సమీక్షా చక్రవర్తీ, విమర్శకాగ్రేసరుడున్నూ, వగైరాలన్నియునూ అయుండొచ్చు. కానీ పై వ్యాసంలో ఆయన వుదహరించిన wide spectrum of కవిత్వాలు/కవితలు ఆయనని “సాధారణ పాఠకుడనే” పట్టించెస్తాయి.

  7. rama అభిప్రాయం:

    November 25, 2008 10:42 am

    ఏమండీ వేలూరి గారూ!

    మీరు ఎంచుకున్న కవిత్వం లోనే పస లేనప్పుడు, దాన్ని మీరు ఎంత రసంలేదని నిరూపించినా అది వృధా ప్రయాస కాదా? మీకు తెలుగులో మంచి కవిత్వమే కనిపించలేదంటే అది మీరెంచుకున్న కవుల లోపం ఏమో? ఒకసారి ఆలోచించారా?
    మీరు మంచి కవిత్వాన్ని పట్టుకోలేని ఒక సాధారణ పాఠకుడు గానే మీ కవితల ఎంపికలో కనిపించారు. మీ కవిత్వపు ఆసక్తి అంతిమంగా అలాంటిదైతే అందుకు కవులేంచేస్తారండీ? మంచి కవిత్వం దేవుడిని చూడగల్గటంలాంటిది. కాస్త రసహృదయం చూపించండి. అక్షరం మీకు దర్శనమిస్తుంది.
    రమ.

  8. కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    November 25, 2008 8:22 pm

    బాభ్జీలు గారికి,

    వేలూరి సాధారణ పాఠకుడి గానే రాశారని వదిలేద్దాం. అదంత గొడవపడాల్సిన విషయం కాదని నా ఉద్దేశం. నే వెలిబుచ్చిన అభిప్రాయంలో కొటేషన్లెక్కువ. వాటినన్నిటినీ అవతల పెట్టండి - ఒక్క ఇస్మాయిల్ ది తప్ప.

    మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఇస్మాయిల్ మాటలు ఆలోచించదగ్గవి. అవి ఆధునిక కవిత్వ స్వరూప స్వభావాల గురించీ, అది సామాన్య పాఠకులకర్థం కాకపోవడం గురించీ కదా. అవి వేలూరి గారన్న దానికి కొంత భిన్నంగా ఉండటాన వాటిని చర్చలోకి దింపాలని నా కోరిక.

    కొడవళ్ళ హనుమంతరావు

  9. Srinivas Nagulapalli అభిప్రాయం:

    November 25, 2008 9:30 pm

    ఎప్పటిలాగానే హనుమగారు శ్రమతో, ఓపికతో మనకు అందించే quotes నుండి, చదివిన ఇస్మాయిల్ గారి quote -
    “మనః ప్రపంచంలోనూ, బహిః ప్రపంచం లోనూ ఏక కాలం లో కవి చేసే ఎక్స్ ప్లొరేషనే కవిత్వం”

    ఇటువంటివి చదివినప్పుడు ఆశ్చర్యం, ఆవేదన, కొంత అనుమానం కూడా కలుగుతుంది. అలా అన్నారా అని ఆశ్చర్యం. అయ్యో అలా అన్నారా అని ఆవేదన. నిజంగా అలా అన్నారా అని అనుమానం.

    మనః ప్రపంచంలోనూ, బహిః ప్రపంచం లోనూ ఏక కాలం లో exploration చేయని మనిషి ఎవరో, చేయని క్షణమేదో అంతుపట్టదు. ఇది చదవడం సైతం ఇందులో ఏముందో అనే exploration వల్లనే కదా సాధ్యం.. అసలు మాటలు రాని పసిపిల్లాడు సైతం అందుకోవాలనే ఆటవస్తువుకోసం వెతుకులాట, దానికి ప్రేరణ లేక పరిణామంగా మనస్సులో అనుభవించే ఉత్సాహం నిరుత్సాహం వగైరా భావాలెన్నో ఏకకాలంలో జరిగే exploration ఫలితమే కదా!

    వారన్న చివర నాలుగు పదాలతో “కవి చేసే exploration కవిత్వం” అంటే సరిపోదా అని కూడా అనుమానం. Scientist చేసే exploration science. Painter చేసే exploration painting. Investor చేసే exploration investing etc, అన్నట్లు.
    —————————-
    విధేయుడు
    Srinivas

  10. baabjeelu అభిప్రాయం:

    November 26, 2008 7:52 am

    హనుమంతరావు గారికి
    2008 లో ఇస్మాయిల్ గారి మాటలగురించి ఆలోచించడడం సబబు కాదని నా నమ్మకం. ఆధునిక కవిత్వం అని ఆయన అన్నది శ్రీశ్రీ కవిత్వం తరవాత రాసిన వాళ్ళ గురించనే అనుకుంటున్నాను నేను. లేదా కుందుర్తి వారి తరవాత రాసిన వాళ్ళ గురించా? “మో” గారు ఆధునికుడే కాబోలు ఇస్మాయిల్ గారి వ్యాఖ్యతో చూస్తే.

    ముందు “మో” గారి కవిత్వం గురించి: నాలాటి “సాధారణ పాఠకులు” చదివీసి ఏవనకుండా వూరుకుంటారు. ఎందుకంటే చదివిన వెంటనే ఏవీఁ అనిపించదు, అర్ధవూఁ అవదు. చేకూరి రామారావు గారు “చేరాతలు” లో “చితి-చింత” గురించి “…తొందరపడకుండా చదివితే కవితానుభవం ఇవ్వగల కవితలున్నాయి అందులో.” అని రాసేరు. Concluding paragraphs లో “అతని (మో) కి చెప్పాల్సిందేమిటంటే తిక్కగా రాస్తేనే కవిత్వం కాదు. కవిత్వం అంటూ వుంటే తిక్కను క్షమిస్తామని.”

    ఇక “ఆధునిక” కవిత్వం: ఇప్పుడొస్తున్న కవిత్వాన్ని “ఆధునిక” కవిత్వం అనడం భావ్యం కాదని నా అభిప్రాయం. “గురుజాడ” దగ్గరనుంచీ, హైకూలవరకూ; హైకూల తరవాత ప్రస్తుత కవుల వరకూ, వీళ్ళందరూ “ఆధునికు” ల్లోకొస్తారా? ఎవరు ఆధునికులు? ఇది మీ లాటివారు తేల్చాలి. అందుచేత కవిత్వం అనడం న్యాయం. నిర్వచనాలు out of context లో అనిర్వచనాలయిపోతాయి.

    కవిత్వాన్ని ఖచ్చితంగా నిర్ణయించడం “అనంతాన్ని” నిర్ణయించడం లాటిది. గుడ్డివాళ్ళు ఏనుగుని తెలుసుకోడం లాటిది, తెలుసుకుని “సాధారణ” పాఠకులికి విపులీకరించి విశ్లేషించడం లాటిది.

    ఇక “అస్పష్టత”: ప్రస్తుతం కవిత్వంలో “కతలు” చెప్పడం మానీసేరు కవులు. అనుభవాల్ని మాత్రమే చెబ్తున్నారు. ఒక కవిగారు అడవుల్లో ప్రయాణం చేస్తూ “ఆకులో ఆకునై….” అంటూ రాసేరు. “యదుకులభూషణ్” గారు థాయ్ లాండ్” వెళ్ళొచ్చి కవిత రాసేరు. ఆయా కవిత్వాల్ని అనుభవించిన పాఠకులు “వహ్వా” అన్నారు. అనుభూతించని పాఠకులు “….చెప్పుచ్చుకు కొట్టండి” అన్నారు. Transmitting station తప్పా? Receiving station తప్పా? “చేరా” గారు “తొందర పడకుండా చదివితే…” అని రాసింది ఇలాటి వాటికేనేమో? నా మట్టుకి నాకు, కవిత్వం చదవగానే, “ప్రతిపదార్థం” రాయడానికి ముందు, చదువరికి ఏదోవొక అనుభూతి కలగాలి. ఆ తరవాతే అందులోని “ఛమక్కులు”, “పన్నులూ”, “పదప్రయోగాలూ” వగైరాలు.

    ఈ మాట లో వ్యాసానికి అభిప్రాయం రాయాలి తప్ప సంబంధంలేని విషయాల గురించి రాయకూడదేమో? మళ్ళీ “మో”. ఏమో!

  11. పాఠకుడు అభిప్రాయం:

    November 26, 2008 10:35 am

    “2008 లో ఇస్మాయిల్ గారి మాటలగురించి ఆలోచించడడం సబబు కాదని నా నమ్మకం.”

    ఎందుకంటా? వందేళ్ళ కిందటి కన్యాశుల్కం గురించి ఆలోచించడంలో లేని “సబబు”, కాసిని పుంజీల యేళ్ళ కిందటి ఇస్మాయిల్ మాటల గురించి ఆలోచిస్తే వచ్చిందా? కాల మాన పరిస్థితులని ఆధారంగా చేసుకుని, విషయాలను ఒక సంబంధంలో చూస్తూ, ఆలోచించడం ఎప్పుడూ సబబే

  12. సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    November 26, 2008 1:02 pm

    తను సృష్టించిన Common Man గురించి చెబుతూ RK Laxman ఇలా అన్నాడు: “I would say he symbolises the mute millions of India, or perhaps the whole world, a silent spectator of marching time.”

    ఆర్. కె. లక్ష్మణ్ గారి కామన్ మాన్ లాంటివాడే వేలూరి గారి సాధారణ పాఠకుడు. పాకశాస్త్రంలో ప్రత్యేక తర్ఫీదు, ప్రావీణ్యత లేకపోయినా ఒక సామాన్య మానవుడు ఎలాగైతే నవవిధ పాకాలని ఆస్వాదించగలుగుతున్నాడో, అలాగే ఏ కవిత్వ తత్త్వ విచారము, సాహితీ సిద్ధాంతాల పరిచయం లేకపోయినా వేలూరి గారి సాధారణ పాఠకుడు — పాత జ్ఞాపకాలే సాధనంగా — కవితాస్వాదన చెయ్యగలడు.

    అంటే, ఈ వ్యాసంలో వేలూరి గారిది ద్విపాత్రాభినయనం :-): సిసిఫస్ రాయిలా ఏ సిద్ధాంతాన్ని మోయకుండా, మంచి భోజనాన్ని ఆస్వాదించినట్టే మంచి కవిత్వాన్ని ఆస్వాదించే సాధారణ పాఠకుడు ఒక పాత్ర అయితే, ఆ సాధారణ పాఠకుడు సాహిత్య సేవనం చేస్తునప్పుడు కలిగే అనుభవాన్ని సిద్ధాంతీకరించే సాహితీ సిద్ధాంతకర్తగా, Walter Benjamin, రాజశేఖరుడు, ఆనందవర్థనుడు, వగైరాలను చదివిన వేలూరిగారిది ఇంకో పాత్ర.

    కవితలో ఆఖరి చరణం మరొక కొత్త జ్ఞాపకాన్నీ నెమరుకి తెస్తుంది. అది మంచి కవితకి ఉండవలసిన లక్షణాల్లో ఒకటి.

    వేలూరి గారు బహుశా “కొత్త జ్ఞాపకాన్నీ సృష్టించడం ఒక మంచి కవితకి ఉండవలసిన లక్షణాల్లో ఒకటి” అని రాయాలనుకున్నారని నా అభిప్రాయం.

    పాఠకుడిగా,
    సురేశ్.

  13. Vaidehi Sasidhar అభిప్రాయం:

    November 26, 2008 2:42 pm

    నా ఉద్దేశ్యం లో మంచి కవిత కి ఉండవలసిన లక్షణాలలో ఒకటి పాఠకుడి అనుభవం లోకి రావటం .ఈ అనుభవం లోకి రావటం పాతజ్ఞాపకాలని/పాత అనుభూతులని గుర్తు తేవటం ద్వారా కావచ్చు ,లేదా ఓ కొత్త అనుభూతిని కలుగజేయటం ద్వారా కావచ్చు. పాతజ్ఞాపకాలు ఒకప్పటి కొత్త అనుభూతులే కదా!

    కవిత్వం లో అస్పష్టతని గూర్చి

    “అది ట్రాన్స్పరెంట్ చీకటై ఉండాలి
    దాని అనుభూతి ఆకారం పాఠకుడికి అందాలి,హత్తుకోవాలి”

    అని తిలక్ చెప్పింది ఇప్పటికీ నిజమేనేమో అనిపిస్తుంది.

    My humblest two cents.

  14. Srinivas Nagulapalli అభిప్రాయం:

    November 26, 2008 9:43 pm

    బాబ్జీలుగారు
    “నిర్వచనాలు out of context లో అనిర్వచనాలయిపోతాయి.”

    ఏ context లోనైనా వర్తించేదే నిర్వచనం. ఫలానా context లోనే వర్తించేది వొట్టి వచనం. ఉదాహరణకు కావ్యానికి, కవితకు కొందరిచ్చిన నిర్వచనాలు, ఏ context లోనైనా పనికివచ్చేవి మచ్చుకు కొన్ని.

    1. నానృషిః కురుతే కావ్యం - సంస్కృత సూక్తి
    2. శబ్దార్థౌ సహితౌ కావ్యం - భామహుడు
    3. ఇష్టార్థ పదావ్యచ్చిన్నా వళీ కావ్యం - దండి
    4. ధ్వనిః కావ్య జీవితం - ఆనంద వర్ధనుడు
    5. ఔచిత్యం కావ్యస్య జీవితం - క్షేమేంద్రుడు
    6. లోకోత్తర వర్ణనా నిపుణ కవి కర్మ కావ్యం - మమ్మటుడు
    7. వాక్యం రసాత్మకం కావ్యం, రసోవై సః - విశ్వనాథుడు
    8. రమణీయార్థ ప్రతిపాదక శబ్దః కావ్యం - పండితరాయలు
    9. విశ్వశ్రేయః్ కావ్యం - ఆంధ్ర శబ్ద చింతామణి
    10. కవయః్ క్రాంతః్ దర్శనః - సంస్కృత సూక్తి
    11. Poetry is emotion recollected in tranquillity - Wordsworth
    12. Poetry turns everything to loveliness. It exaults the beauty of that whcih is beautiful and it adds beauty to that which is deformed. - Shelley
    ——————————
    విధేయుడు
    -Srinivas

  15. కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    November 27, 2008 1:31 am

    “నా కవిత్వంలోని విషాదపు జీర సమాజానికి సంబంధించిందే.” - మో

    బాబ్జీలు గారికి, (కొంత వైదేహి గారికి),

    “ఎవరు ఆధునికులు? ఇది మీ లాటివారు తేల్చాలి,” అన్నారు మీరు. కవిత్వానికి సంబంధించినంతవరకు నాలాటి వాడు ఏమీ తేల్చలేడు. (నాలుగేళ్ళ క్రితం గట్టు వినీల్ నో పార్టీలో కలిసి, సాహిత్యం గురించి ముచ్చటించుకున్నాం. వినీల్ ది ఈ తరం. నేనో ఇరవై ఏళ్ళు సాహిత్యాంధకారంలో ఉండటాన ఈ తరం రచయితల పేర్లు కూడా తెలియలేదు. ఆ ఖాళీ పూరించుకోడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. నాలుగు పుస్తకాలు చదివి, నలుగుర్ని కోట్ చేసినంత మాత్రాన పండితులవుతామన్న అపోహ లేదు.)

    మో గురించి చేరా “ఆషామాషీగా చదివితే అర్థమయ్యే కవి కాడు … అప్పుడప్పుడు అక్కడక్కడ కొంచం తిక్క చూపిస్తాడు” అన్నాడు. సామాన్య పాఠకులయినంత మాత్రాన ఆషామాషీగా చదవాలని లేదు కదా. లోతు ఉంటే తెలుసుకోడానికి కష్టపడితే ఏం?

    కొన్ని కవితలు వెంటనే మనసుకు హత్తుకుపోవు. అందీ అందక ఉంటాయి. వాటిని కాస్త తెలిసిన వాళ్ళు ఎవరన్నా వివరిస్తే అప్పుడు మామూలు పాఠకులకి కూడా గాఢమైన అనుభూతి కలుగుతుంది.

    వేలూరి గారి వ్యాసంలో మో కవిత మీద వ్యాఖ్యానం చూసి, చితి-చింత తీశాను - ఎవరన్నా ప్రస్తావిస్తేనే కాని ఇలాటివాటి జోలి కెళ్ళను నేను. వేలూరి గారు కోట్ చేసిన పాదాలు నాకూ అర్థం కాలేదు. “ఎర్ర ద్రాక్ష పళ్ళూ, తెల్ల అన్నం,” ఏమిటీ గొడవ? అనుకున్నాను.

    కాని ఇది దీర్ఘ కవిత. ఇంకా ముందుకు పోతే, నిరాకారుడు, తలుపుతో,
    “నీకు నిద్ర వృద్ధాప్యంలా ముంచుకొచ్చినపుడు
    చలి కొణుకుతూ రాంకీర్తనలు గొణుగుతూన్నపుడు
    నన్ను తలుచుకొని నీ పుస్తకం లోపల్లోపల చదువుకో,

    మూసేసిన వెన్నెలమాసికలేసిన తలుపూ
    నేనెళ్ళొస్తా గడేసుకో.”

    అనేటప్పటికి, అయ్యో! ఇది మన గురించే, అని తెలిసింది, విషాదమావరించింది. అందుకే నా మొదటి అభిప్రాయం రాసింది. ఇవాళ మీరు మో మీద రాసింది చదివి, మో తన మీద తనే అన్న మాటలు గుర్తొచ్చాయి [1]:

    “నా కవిత్వానికి ఎంతమంది అభిమానులున్నారో అంతేమంది విమర్శకులూ ఉన్నారు. అది అర్థం కాదనేది ప్రధాన విమర్శ. దాన్ని నేను ఖండించను. ఎందుకంటే నిజంగానే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఎవరిదాకో ఎందుకు… చలసాని ప్రసాదరావు గారే నాకు రాసిన ఆఖరి లేఖలో, ‘మీ కవితా సంకలనాలన్నీ మీరు అరబ్బీలోనో పార్శీలోనో లేదా ఆఫ్రికా ఖండపు బురుండీ దేశభాషలోనో రాశారని ఎందుకు డిక్లేర్ చెయ్యకూడదు,’ అంటూ హాస్యమాడారు. నేనెన్నుకున్న వస్తువు నేపథ్యాన్ని బలంగా ఆవిష్కరించే ప్రయత్నంలో ఏ ఇంగ్లీషు కవి ప్రభావమో నామీద పడవచ్చు. ఆ భావాలతో బొత్తిగా పరిచయం లేని వ్యక్తికి… నేను రాసిన కవితలోని మూలం అందకపోవచ్చు. అలాగని నేను రాసిందంతా సంక్లిష్టమైన కవిత్వమంటే మాత్రం ఒప్పుకోను. నా కవిత్వంలోని విషాదపు జీర సమాజానికి సంబంధించిందే.”

    నిరాకారుడి లాంటి కవితలకి చేరానో, మరో పండితుడో కాస్త వ్యాఖ్యానం ఇవ్వాలి. వెతికితే, వడాలి [2] లో కాస్త ఉంది: “Walter de la Mare’s poem The Listeners opens with a traveller “knocking on the moon-lit door”. MO’s Nirakarudu has a similar opening, but he cautions us against reading too much similarity between the two poems.”

    “The Listeners” బాగా పేరున్న కవిత అట. ఆ కవి మీద TS Eliot చక్కటి కవిత రాశాడట. ఇవేవీ నాకు తెలియవు. ఇప్పుడవి చదివి, మళ్ళీ “నిరాకారుడు” చదివాను. ఈ వ్యాసంలోని మిగతా కవితలూ చదివాను.

    “అన్నంపు రాసులు చిన్న తోమాలెల కై సన్నజాజులు పోసినట్లు,” అని చదివితే నాకూ చిన్నప్పటి మాఊళ్ళో బంతి భోజనాలు, గాడిపొయ్యులు, వాటితో పాటు వంటసాల చేసి పొగకి మండిన కళ్ళూ - అవన్నీ గుర్తొస్తాయి. మిగిలిన కవితలు గూడా మరికొన్ని జ్ఞాపకాలని తలపుకొస్తాయి. కాని అవేవీ మో కవిత అంతగా కదల్చడం లేదు. దానికి ఫలానా జ్ఞాపకం కారణం అని చెప్పలేను. నిరాకారుడు గొప్ప కవిత. కాస్త చెయ్యిస్తే సామాన్య పాఠకులని కూడా విషాదంలోనూ మోదంలోనూ ముంచెత్తేది.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “ఏకాంతం నుంచి ఏకాంతంలోకి,” ఈనాడు ఆదివారం, మార్చి 27, 2005.
    [2] “Modern Poetry in Telugu,” by V. Mandeswara Rao.

  16. baabjeelu అభిప్రాయం:

    November 27, 2008 6:16 am

    పాఠకుడి గారికి:
    ఇస్మాయిల్ గారి వ్యాఖ్యనీ, కన్యాశుల్కాన్నీ ఒకే గాటని కట్టకండి. ఇస్మాయిల్ గారే వొప్పుకోరు. కన్యాశుల్కం జీవితం. జీవితం గురించి మరో వెయ్యేళ్ళ తరవాత కూడా “హాట్ హాట్” చర్చలు జరుగుతాయి. మీరొక్కరే హనుమంతరావు గారడిగిన చర్చ చేశేరు. విపులంగా చేయాలి, దయచేసి.

    సురేష్ కొలిచాల గారికి:
    వేలూరి వారు “సాధారణ పాఠకుడు”. ఇది వేలూరి వారికి అవమానం కాదు. శ్రీశ్రీ చివరివరకూ “సాధారణ పాఠకుడే” సాధారణ పాఠకుడి మొదటి లక్షణం, నూతనత్వాన్ని, అదెలాటిదయినా, అందులో మంచి లేశమాత్రమైనా, “కానీయండి” అని. అసాధారణ పాఠకులు ఎక్కడో ఒకదగ్గర ఆగిపోతారు.కొత్త జ్నాపకాన్ని సృష్టించడవేవిఁటీ? వేలూరి వారు రాసింది రైటు. కొత్త జ్నాపకాన్ని నెమరు వేయడం. మీరు ఇస్మాయిల్ గారి గురించీ, “మో” గారి గురించీ ఏవీఁ అన్లేదు. అన్నట్టు “అసాధారణ పాఠకుడి” గురించి: “అమ్మమ్మా! కందిగుండలో ఇంగువ వెయ్యవా, ప్లీజ్. మా అత్తారింట్లో కందిగుండ ఘుమఘుమ లాడుతుందే, ఇంగువతోటి. ప్లీజ్ ప్లీజ్” అని బతిమాలినా “నో ఇంగువ. ఓన్లీ జీలకర్ర” అనే రకం.

    వైదేహీ శశిధర్ గారికి:
    నిజవేఁనండోయ్. “ట్రాన్స్పెరెంట్ చీకటి” .

    హనుమంతరావు గారూ, మహానుభావుల వ్యాఖ్యల గురించి నా అజ్నానపు విజ్నానపు అభిప్రాయాల్ని క్షమించీయండి.
    ట్రాన్స్పెరెంట్ చీకటి, స్పష్టవైఁన అస్పష్టం, అస్పష్టవైఁన స్పష్టం, తీరిపోయిన దాహం, అంతవైఁన అనంతం. హనుమంతరావుగారూ! ఇదేవిటండీ. బాబ్జీలూ, ఇదనంతం.

  17. baabjeelu అభిప్రాయం:

    November 27, 2008 8:12 am

    నాగులపల్లి శ్రీనివాస్ గారూ,
    నిర్వచనం, అందులోనూ కవిత్వాన్ని నిర్వచించడడం, మీరు చెప్పినట్టు కుదరదు. “సామాన్య, సాంగీక” శాస్త్రాల్లో కుదురుతాయి.

    మీరు 12 రకాల నిర్వచనాలు రాసేరు. ఇంకా బోల్డు వుండే వుంటాయి. ప్రస్తుతానికి ఇవే అనుకుందాం. అంటే 12 రకాల కవిత్వాలనా? లేదా పన్నెండింటినీ కలగలపాలా? విశ్వ శ్రేయస్సు కోరని రసాత్మకవైఁన వాక్యం ఏఁవఁవుతుంది? Tranquility లో ఎమోషన్ రికలక్ట్ అవకపోయినా మిగిలిన పదకొండు నిర్వచనాల్లో ఏదో ఒకదానికి సరిపోయీ రచన ఏఁవఁవుతుందీ?
    వేలూరి వారు, పై వ్యాసంలో, ఆశించింది ఇలాటి సందిగ్ధావస్థని నివారించడానికే ఏదో ఒక “టెక్నిక్” కోసవేఁ కదా?
    హనుమంత రావు గారూ, “మో” కవిత్వం, దాన్ని వేలూరి వారు వుదాహరణగా వాడుకున్న పధ్ధతికీ, లేదా చేరా చేసిన వ్యాఖ్యలకీ, మీరెందుకు ఇంత బాధపడుతున్నారూ? ఏం నిరూపిద్దావఁని?

  18. కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    November 27, 2008 1:32 pm

    బాబ్జీలు గారికి,

    బాధేం లేదు. మో నిరాకారుడి లాగే నేనూ అడివిలో చిక్కుకుపోయాను. :-)

    ఇస్మాయిల్ చెప్పేదేదో ఈ సందర్భంలో ఆలోచించదగ్గదనిపిస్తోంది కాని, అది అభిప్రాయాల పరిథి దాటిపొయ్యేటట్లుంది. ప్రస్తుతానికి అంతటితో ఆపేస్తాను.

    వేలూరి గారికి నిరాకారుణ్ణి ప్రస్తావించినందుకు కృతజ్ఞతలతో,

    కొడవళ్ళ హనుమంతరావు

  19. Srinivas Nagulapalli అభిప్రాయం:

    November 27, 2008 6:19 pm

    బాబ్జీలు గారు
    నిజమే మీరన్నట్లకు బోలెడు నిర్వచనాలున్నాయి. పంచుకున్నవి నాకు తెలిసిన కొంచెం మాత్రమే.

    కవిత్వాన్ని నిర్వచించడం కుదరదు అని అనుకున్నా, చేసిన వాళ్ళు చేసారు, చేయని వాళ్ళు ఆగకుండా చేస్తున్నారు, ఇంకా ముందుకు చేయకుండా ఆగుతారనీ లేదు.

    ఇక మీరడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానమే నాది కూడా అని అనుకుంటాను. విశ్వశ్శ్రేయం కావ్యం అంటే విశ్వశ్రేయం కానిదేదీ కావ్యం కాదని కాదు. తీపి మంచి రుచి అంటే తీపి కానిదేదీ మంచి రుచి కాదని అననట్లు.

    మీరన్న ఒక మాట మాత్రం చాలా సత్యం. కవిత చదవగానే చదువరికి ఏదోవొక అనుభూతి కలగాలి అన్నది పాఠకుని పట్ల సహాయమే కాదు, అవసరం కూడా అనిపిస్తుంది. తెలుగు భాష ఉనికే సవాలుగా మరుతున్న సమయంలో “నారికేళ పాకం” ముసుగులో అస్పష్టతను సమర్థించడం కష్టంగా అనిపిస్తుంది.
    ————————–
    విధేయుడు
    -Srinivas

  20. కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    November 29, 2008 12:13 am

    ఆధునిక కవిత్వంలో అస్పష్టత

    నాగులపల్లి శ్రీనివాస్ గారికి,

    మన భాష ఉనికికే ముప్పు కలిగితే, పాఠశాలల్లో, ప్రజల లావాదేవీలలో తెలుగు వాడకం ఎక్కువ చేస్తే ఫలితం ఉంటుంది కాని, కవులని స్పష్టంగా రాయండర్రో అని మొరెట్టుకున్నా, ఒకవేళ వాళ్ళు దానిని పాటించగలిగినా, ఒరిగేది మాత్రం సున్నా!

    సాహిత్యానికీ సమాజ స్థితిగతులకీ పరస్పర సంబంధం ఉంది. కాని కార్యకారణ సంబంధాలు చూపకుండా ప్రతిదానికీ గ్లోబలైజేషన్ పేరెత్తడం వలన సాహిత్య వివేచన పెరగదు.

    భావ కవిత్వానికి ముందర మన కవిత్వంలో అస్పష్టత లేదు. భాషా కాఠిన్యత మూలంగా పాత కవిత్వం అర్థం కాకపోవచ్చు కాని దాంట్లో అస్పష్టత లేదు. ఆధునిక కవిత్వంలో అస్పష్టతని వర్ణించడానికి నారికేళ పాకం అన్న పదమే అనుచితం కావచ్చు. వర్తమాన కాలపు కవిత్వంలో అస్పష్టత స్వభావం ఏమిటి? అది ఎన్ని రకాలు? ఏది అనివార్యం? ఏది అవాంఛనీయం? ఇది రావడానికి అసలు కారణాలు ఏమిటి? అని పాపినేని శివశంకర్ [1] తన సిద్ధాంత గ్రంథంలో కాస్త వివరించాడు. మనమాయనతో ఒప్పుకోనవసరం లేదు కాని చర్చలోకి తీసుకోవాలి.

    సామాన్య పాఠకులు తెలుగు PhD థీసిస్ లు చదువుతారా? కవిత్వం ఆస్వాదించడానికి సిద్ధాంత గ్రంథాలు చదవాలా? అంటే అక్కర్లేదు. కాని గ్లోబలైజేషన్ ప్రభావంలో తెలుగు ఉనికికే ఆపద ముంచుకొచ్చిన తరుణంలో నారికేళ పాకం ముసుగులో అస్పష్టతని సమర్థించకూడదన్నప్పుడు - దీంట్లో సాహిత్య ప్రభావం గురించి చాలా గంభీరమైన భావాలున్నాయి కనుక - కాస్తో కూస్తో సిద్ధాంతపరమైన విచారణ చెయ్యాలి. PhD థీసిస్ లు కాకపోతే మరేదో, మనదో మరెవరిదో, కాస్త లోతుగా ఆలోచన చేసిన రచన ఆధారంగా.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “సాహిత్యం - మౌలిక భావనలు,” పాపినేని శివశంకర్, 1996. పేజీలు 139-146.

  21. వినీల్ అభిప్రాయం:

    November 29, 2008 11:23 am

    1) hanuma gaaru, hats off to your patience and focused responses. I have seen people taking digs at you for quoting from others. I wonder why is it so objectionable? Why should an objective reader (whether ordinary or extra-ordinary) be concerned about source of the content rather than the content? Infact, one should appreciate the honesty of writer for giving credits to the right people instead of flaunting them as his own.

    2) శ్రీనివాస్ గారు, “కవిత చదవగానే ఎదో ఒక అనుభూతి కలగాలి….”.
    Since when did instant gratification become a yard stick for good poetry? what about readers role, EQ/IQ level in understanding a poem?
    నారికేళ పాకం మాటున అస్పష్టత సమర్థించటం గురించి… అస్పష్టతకు కారణాలేమిటి? పాఠకుడికి విషయపరిజ్ఞానలోపం వల్ల కలిగిన అస్పష్టతా? ఐదేళ్ళ క్రితం ఈమాటలో కనకప్రసాద్ గారి ‘టకరగాయికె‘ చదివినప్పుడు నాకు అర్థం అవలేదు. దాంట్లో కవి దోషం ఉందనుకోను. ఇంకో రకం ఉంది. కవి అమూర్త భావాలు వాడటం వల్ల కలిగిన అస్పష్టత. ట్రాన్స్పరెంట్ చీకట్లు, చంద్రుణ్ణి తాగడాలు లాంటి expressions ఐతే I can empathize with you.

    3)బాబ్జీలు గారు, “2008 లో ఇస్మాయిల్ గారి మాటల గురించి ఆలోచించడం సబబు కాదని…”
    అలవోకగా ఇలాంటి విప్లవాత్మక అభిప్రాయాలు వెలిబుచ్చేటపుడు కాస్తా ముందూ వెనకలు…ఆయన ఆలోచనలు ఏమిటి? ఇప్పుడవెందుకు పనికి రావు? 2009 నుండి ఎవరి మాటల గురించి ఆలోచించడం సబబు? సెలవిచ్చి ఉంటే బాగుంటుంది. అణువులో బ్రహ్మాండాన్ని గ్రహించలేని మా బోంట్లకొరకు అభిప్రాయవేదిక బదులు వచ్చే సంచికలో ఒక వ్యాసం రాస్తే మరీ మంచిది. మరో విన్నపం. ఆ వ్యాసంలో పాత తెలుగు రచయితలు, వారి రచనలు పాత్రల రిఫరెన్సులు లేకుండా ఉంటే, మాలాటి సాధారణ పాఠకులకు ఇంకా మంచిది.
    వినీల్

  22. mOhana అభిప్రాయం:

    November 29, 2008 1:14 pm

    కవిత్వం చదువగానే ఒక అనుభూతి కలగాలి అని చదివిన తరువాత నాకు నన్నెచోడుడుగారు వ్రాసిన క్రింది పద్యం గుర్తుకు వచ్చింది -

    ముదమునఁ గవికృత కావ్యము
    నదరున విలుకాని పట్టినమ్మును బర హృ-
    ద్భిదమై తల యూఁపును, బెఱ
    యది కావ్యమె చెప్పఁ, బట్ట నదియున్ శరమే
    - కుమారసంభవము (1.41)

    మంచి కవిత హృదయాన్ని తాకి సంతోషాన్ని కలిగిస్తుంది, విలుకాడు పట్టిన బాణము భయము కలిగించి శత్రువు గుండెను తాకుతుంది. కవిత అంటే అది, బాణమంటే అది.
    మిగిలిందంతా కవిత అవుతుందా, బాణమవుతుందా అని దీనికి అర్థము.

    విధేయుడు - మోహన

  23. Vaidehi Sasidhar అభిప్రాయం:

    November 29, 2008 2:02 pm

    కవిత్వంలో అస్పష్టతను గురించి ప్రస్తావిస్తూ నేను కోట్ చేసిన తిలక్ కవితా పంక్తులలో , కవిత్వంలో అస్పష్టతని తిలక్ సమర్థిస్తున్నారన్న అభిప్రాయం కలిగితే అది నా పొరపాటు మాత్రమే.
    ఆయన వ్రాసిన “నవత - కవిత” కవిత లో కవిత్వం పట్ల ,కవిత్వం లో అస్పష్టత పట్ల ఆయన అభిప్రాయాలు చూడవచ్చు.బహుశా ఏభై ఏళ్ళక్రితం వ్రాసిన కవిత అయినా మౌలికంగా కవిత్వాన్ని గురించిన కొన్ని ఆలోచనలు ఇప్పటికీ Out of context కాకపోవటం కూడా మనం చూడవచ్చు. ఈ కవిత నగ్నమునిగారికి ఆయన వ్రాసిన లెటర్ అని విన్నాను.

  24. Srinivas Nagulapalli అభిప్రాయం:

    November 29, 2008 3:52 pm

    హనుమ గారు
    Thanks for the reference.
    ఇది రాద్దామనుకోలేదు, కాని నేను రాసింది అస్పష్టంగా ఉందేమోనని అనుమానం వచ్చి రాయడం. “ఈ మాట” యొక్క అభిప్రాయవేదిక చర్చావేదిక గా మారకుండా ఉండాలని గింజుకుంటూ కూడా రాయడం.

    గ్లోబలైజేషన్్ ఉన్నా లేకపోయినా, “నారికేళపాకం” ముసుగులో అస్పష్టతను సమర్థించడం కష్టమే కాదు, నిజాయితీ అని కూడా అనిపించడంలేదు నాకు.

    వినీల్్ గారు “అస్పష్టతకు కారణాలేమిటి?” అని చాలా మంచి ప్రశ్న వేసారు. రెండు పాయింట్లు చెప్పి నా అభిప్రాయంతో ముగిస్తాను.
    1. అస్పష్టత చాలా సార్లు subjective అనిపిస్తుంది.
    2. అస్పష్టత వేరు complexity వేరు.
    ఒకరికి అస్పష్టంగా ఉన్నది ఇంకొకరికి ఉండకపోవచ్చు. లోకం మొత్తానికి అస్పష్టంగా ఉన్నది కవికి స్పష్టంగా ఉండొచ్చు, hopefully! Subjective అన్నప్పుడు, అస్పష్టతకు సవాలక్ష కారణాలుండొచ్చు. పాఠకుడు సరిగ్గా చదవకపోవడం నుంచి, భాషా పరిచయం లేకపోవడం నుంచి అచ్చుతప్పులు గ్రహించకపోవడం దాకా ఎన్నో కారణాలుండొచ్చు. వాటికి కవిత మాత్రం కారణం కాదు. కాబట్టి వాటి గురించి, అంటే “1″ గురించి కాదు ఈ చర్చ అని అనుకుంటున్నాను.

    ఇక “2″ వ అంశం. ఆలోచనా విస్తృతి పెరిగినప్పుడు complexity తగ్గిపోతుందని కాదు కాని, complexity పట్ల స్పష్టత పెరుగుతుంది. వీటి ఉదాహరణలు అందరి దగ్గరా ఉంటాయి.

    నేను సమర్థించని “అస్పష్టత” పై రెండు కోవలకు సైతం చెందనిది, ఇతరమైనది! కవిత అర్థం కాకముందు కాదు, దాని అర్థం తెలుసుకున్నాక కూడా అది అస్పష్టంగా కనిపించడం గురించి. అప్పుడు ఆ “కవిత” అనే రాతలో ఏముంది డొల్ల అని ఎందుకు నిలదీయకూడదో తెలియదు, నిజాయితీగా. నేనన్న “నారికేళ పాకం” ముసుగులో అస్పష్టతను సమర్థించడం కష్టం అని అన్నది దీని గురించి మాత్రమే.
    ==================
    విధేయుడు
    -Srinivas

  25. కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    November 30, 2008 11:16 pm

    To Give Credit Where It Is Due

    సంపాదకులకి: ఈ అభిప్రాయాన్ని “గ్రంథచౌర్యం గురించి,” అన్న మే 2008 సంపాదకీయం కింద వెయ్యవచ్చు కాని, ఇక్కడే ఉంచమని మనవి.

    గట్టు వినీల్ నా కొటేషన్స్ ని ప్రస్తావించి సమర్థించినందుకు థాంక్స్. ఆ సందర్భంలో రెండు విషయాలు చెప్పాలనుకున్నాను. మొదటిది అల్పమైనది, రెండోది ముఖ్యమైనది.

    మొదటిది: కొటేషన్స్ ఇవ్వడం నా బలహీనత. సృజనా లోపమని భావిస్తాను. సాహిత్యం నా వృత్తీ, ప్రవృత్తీ కానందుకు బతికిపోయాననుకుంటాను. :-) పదే పదే నేను కోట్ చెయ్యడం విమర్శించదగ్గ విషయమే.

    రెండోది: అయితే అది నేనేదో గొప్పవాణ్ణని చూపించడానికో ఇతరులని భయపెట్టడానికో కాదు. భావమో, వ్యక్తీకరణో మనది కానపుడు, ఎవరిదో సూచించడం నైతిక బాధ్యత. సైన్సు రంగంలో ఉండటానో, పాశ్చాత్య ప్రభావమో నాకిది దాదాపుగా అలవాటు. అలా చెయ్యని సందర్భాల్లో తప్పు చేశానని చానాళ్ళు మనసులో పీకుతుంటుంది.

    ముఖ్యమైన విషయాలు ప్రస్తావించినపుడు, మూలం మనది కాకపోతే విధిగా కారకులని గుర్తించాలి. మొన్ననే ఇస్మాయిల్ పుస్తకాన్ని ప్రస్తావించాను. దాంట్లోనే “ఇద్దరు భాష్యకారులు,” [1] అన్న 1980లో రాసిన వ్యాసం ఉంది. చలం “మ్యూజింగ్స్” ప్రస్తావనతో మొదలయిన వ్యాసంలో రెండో పేరా చూడండి:

    “అప్పుడప్పుడూ రంగులు లేతగానో, ముదరగానో మారుస్తుండటమూ, లేదా ఎడమొహం పెడమొహం వేసి రెంటిగా చీలిపోవటమూ మార్క్సిస్టు ఉద్యమాలన్నిటికీ సామాన్య లక్షణమనుకుంటాను. మార్క్సిస్టు సాహిత్య విమర్శలో ఈ భిన్న దృక్పథాల్ని వాటి మూలాలదాక ఆరా తీయటమే ఇప్పుడు నా ఉద్దేశ్యం.”

    వెంటనే పక్కా ఇస్మాయిల్ అనిపిస్తుంది కదూ. :-) మార్క్సిస్టు విమర్శకుల్లో రెండు రకాలు - ఛాందసులు, అఛాందసులు - అని వాళ్ళలో తేడాలని వివరించే వ్యాసం. నాకు చాలా నచ్చింది. కాని అఛాందసుల మీద మామూలుగా ఇస్మాయిల్ మార్క్సిస్టుల మీద వేసేటన్ని వాతలు పడనందుకు ఆశ్చర్య మేసింది. తెలుగు వాళ్ళు కానందువల్లనేమో నని సమాధానపడ్డాను. వాళ్ళ గురించి ఏమన్నా తెలుసుకుందాం అని వెతికితే ఓ George Steiner పుస్తకం [2] కనబడింది.

    నేనీ Steiner వేమీ చదవలేదు. ఆదివారం కదా అని లైబ్రరీకెళ్ళి తెచ్చుకొని తిరగేశాను. దాంట్లోని “Marxism and the Literary Critic,” అన్న వ్యాసం నన్ను దిగ్భ్రాంతుణ్ణి చేసింది. ఇస్మాయిల్ వ్యాసం దీనికి సంక్షిప్తానువాదం! మంచి అనువాదం, సందేహం లేదు. కాని మూలంలో లేనిది ఒక్క అక్షరం కూడా లేదు, దాంట్లో అనుమానం లేదు. మరి ఇస్మాయిల్, “ఈ భిన్న దృక్పథాల్ని వాటి మూలాలదాక ఆరా తీయటమే ఇప్పుడు నా ఉద్దేశ్యం,” అన్న దాంట్లో ఆవగింజంతయినా ఔచిత్యం ఉందా? తను సొంతంగా ఏం ఆరా తీశారు?

    ఇస్మాయిల్ ప్రతిభావంతుడైన కవి, విమర్శకుడు. సాహిత్యం, తత్వశాస్త్రాల్లో విద్యాధికుడు. సొంతంగా ఇలాంటి వ్యాసం రాసే సత్తువ ఆయనకుంది, నాకెలాంటి సందేహం లేదు. కాని ఈ వ్యాసం మూలం మాత్రం ఇస్మాయిల్ ది కాదు. Steiner పేరు ప్రస్తావించకపోవడం పెద్ద నేరం.

    ఆ రీతిలో కాకపోయినా, ఇక్కడే ప్రస్తావించిన మో “నిరాకారుడు” కవితని చూద్దాం. మొదలొకటే అయినంత మాత్రాన “The Listeners,” తో పోల్చకూడదన్నాడు మో. అది ఒక పేజీ, ఇది ఆరు పేజీలు, అనువాదం కాదు. కాని కవితలోని వాతావరణం అదే, అనుమానం లేదు. మో ఆంగ్ల సాహిత్యం విస్తృతంగా చదివిన వాడు. స్పూర్తి దానినుండే వచ్చి ఉండాలి. పేరు చెప్తే సొమ్మేం పోయింది? సాధారణ పాఠకులకి ఆ కవిత చేరేదేమో కూడాను.

    చివరగా, మరో విషయం. మూలాలు చెప్తే, పాఠకులు పోయి ఇంకాస్త చదువుకొని లాభించే అవకాశం ఉంది. చెప్పకపోతేనే నష్టం.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “కవిత్వంలో నిశ్శబ్దం,” ఇస్మాయిల్. పేజీలు 102-106.
    [2] “George Steiner: A Reader,” Oxford University Press, 1984. పేజీలు 37-53. “Marxism and the Literary Critic,” వ్యాసం మొదట ప్రచురించింది 1958లో.

  26. Kameswara Rao అభిప్రాయం:

    December 1, 2008 5:51 am

    “భావ కవిత్వానికి ముందర మన కవిత్వంలో అస్పష్టత లేదు. భాషా కాఠిన్యత మూలంగా పాత కవిత్వం అర్థం కాకపోవచ్చు కాని దాంట్లో అస్పష్టత లేదు.”
    అని హనుమగారన్నది సరి కాదు. భావకవిత్వం ముందర వాక్యగతమైన (వ్యాకరణ ధిక్కారంతో వచ్చే) అస్పష్టత చాలా వరకూ లేదు. కాని భావగతమైన అస్పష్టత ఉంది. వాక్యగతమైన అస్పష్టత కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. అంతకన్నా పై మెట్టు మరొకటి ఉంది! అది కవిత్వంలో పొరలు (layers). అంటే పైకి స్పష్టంగా ఒక అర్థాన్నిస్తూనే అంతర్గతంగా మరొక (మరికొన్ని) అర్థాన్ని స్ఫురింపజెయ్యడం. ఇక్కడనేనంటున్నది శ్లేష గురించి కాదు.

    “కవి అమూర్త భావాలు వాడటం వల్ల కలిగిన అస్పష్టత. ట్రాన్స్పరెంట్ చీకట్లు, చంద్రుణ్ణి తాగడాలు లాంటి expressions ఐతే I can empathize with you.” అని వినీల్ గారన్నారు.

    But I cannot! ఒక పాఠకుడికి, తనకి అర్థం కాని కవిత్వాన్ని అర్థం కాలేదని చెప్పడానికి అధికారం ఉంది కానీ, దాన్నసలు కవిత్వమే కాదనడానికీ, విమర్శించడానికీ హక్కు లేదని నా ఉద్దేశం. ఆ కవిత్వం వేరెవరికైనా అర్థం కావచ్చు, వాళ్ళా కవిత్వాన్ని అనుభవించవచ్చు. ఏదైనా కవిత్వం ఎవరికీ అర్థం కాకుండా పోతే, దానికి ఆదరణ లేక అది సహజమరణం పొందుతుంది. దాని గురించి విమర్శించడం అనవసరం.

    ఈ వ్యాసంలో వేలూరివారు ప్రస్తావించిన కవిత్వానికి కొలమానాలు కాని, టెక్నిక్కు కానీ మొత్తం కవిత్వానికంతకీ వర్తించేవి తయారుచెయ్యడం అసాధ్యం, అనర్థం కూడా. ఒకో “రకమైన” కవిత్వానికీ (కొన్ని ప్రత్యేక కొలమానాలతో) ఒకో టెక్నిక్కు సృష్టించుకునే ప్రయత్నం చెయ్యవచ్చు. ఒక రకమైన కవిత్వానికి సంబంధించిన టెక్నిక్కుని మరొక రకమైన కవిత్వమ్మీద ప్రయోగించడం పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం వెయ్యడమవుతుంది!

  27. పరుచూరి శ్రీనివాస్ అభిప్రాయం:

    December 1, 2008 10:41 am

    మొదటిది: …
    రెండోది: అయితే అది నేనేదో గొప్పవాణ్ణని చూపించడానికో […] అలా చెయ్యని సందర్భాల్లో తప్పు చేశానని చానాళ్ళు మనసులో పీకుతుంటుంది.

    హమ్మయ్య!ఇన్నాళ్ళకు, KHR గారు రాసిన ప్రతి వాక్యంతోను ఏకీభవిస్తున్నాను :-).చాలా కాలంగా నేనుమొర పెట్టుకుందామనుకుంటున్న విషయాన్ని చాలా క్లుప్తంగా, బలంగా చెప్పారు!

    – శ్రీనివాస్

  28. కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    December 1, 2008 11:05 pm

    స్వచ్ఛమైన గాఢమైన అస్పష్టత :-)

    కామేశ్వరరావు గారికి,

    నన్ను కరెక్ట్ చేసినందుకు థాంక్స్. నాకు పాత సాహిత్యంతో పరిచయం నామమాత్రంగా కూడా లేదు. నేను పాపినేని ని paraphrase చేశానంతే. ఆయన మాటల్లో:

    “భావ కవిత్వానికి ముందు తెలుగు కవిత్వంలో అస్పష్టత (ambuguity), దానిని గూర్చిన భావన కన్పించవు. వెనకటి ఏ ప్రసిద్ధకవి పద్యమైనా భాషాకాఠిన్యం వల్ల, అన్వయక్లేశం వల్ల అర్థంకాక పోవటమంటూ వుందిగానీ అస్పష్టం కావటమంటూ లేదు. ప్రాచీన కావ్యాల్లో కవి ఉద్దేశ్యాన్ని ప్రతి పద్యంలోనూ సుళువుగానే గ్రహించవచ్చు. కవి ఉద్దేశ్యం తెలియకపోవటం అనే ఇబ్బంది ఆధునిక కవిత్వంలోనే ఎదురవుతోంది. ఈ ఇబ్బందిని గూర్చి ముచ్చటించుకోవాలంటే ముందుగా అస్పష్టత అనే భావనను నిర్వచించుకోవాలి.”

    అస్పష్టతకి ఉదాహరణగా పాపినేని ఇచ్చిన ఒక కవిత - “పోలికలు”:

    “అద్దాలమేడ - అందాల భామ
    బృహదారణ్య కోపనిషత్తులో
    సీలియాని కుట్టి చంపేసిన కిం గం జా ఐలండ్ చీమలు
    వేదాల పనసలు - ఉల్లిపాయ పొరలు.
    నిలువుటద్దాల్ని నిట్టూర్పులతో కొలువ్
    షాపెనోవర్ పడుకున్నచోట
    పడిపోయిందొక క్షురకర్మ అద్దం.
    పగిలిన అద్దంలో అతనొక
    అనంత శయన ఐక్యతా శతమూర్తి.
    సంసారి కొలిమిలో సన్యాసి ఊపిరి ఊదు
    దీపాల కొలువులో పాపాల చీకటి చిమ్ము
    నిలువుటద్దాలపై పడకటద్దాలు పడితే
    కళ్ళు విరిగి కాళ్ళు పగుల్తాయ్.
    వాలుటద్దాలపై కార్నర్ అద్దాలు రగిలితే
    స్ప్లింటర్స్ లో సిన్నర్స్ మిగుల్తారు.
    అద్దాల మేడలో గాజుసూదుల కంపలో
    గాయపడ్డ వాళ్ళని చూచి డాక్టరే కట్టుకుంటాడు.”

    ఎలియట్, డెరీడా, షెల్లీ లకి అధోదీపికలున్నాయి! ఎవరు రాసిందో చెప్పనవసరం లేదు కదా. పాత కవిత్వంలో కూడా ఇంతటి అస్పష్టత కలవి ఉన్నాయంటారా? పాతా కొత్తా, రెండూ ఎరిగిన మీరే చెప్పాలి.

    నాకిది అర్థమయితే ఒట్టు. అందంగా ఉందని మాత్రం ఒప్పుకోవాలేమో!

    కొడవళ్ళ హనుమంతరావు

  29. తమ్మినేని యదుకులభూషణ్. అభిప్రాయం:

    December 2, 2008 10:25 pm

    ఇస్మాయిల్ గారిని బాగా ఎరిగున్న వ్యక్తిగా నాలుగు మాటలు చెబుతాను.ఆయన వ్యక్తిగా చాలా ఉదారుడు. చేయనిదానికి ఘనత పొందాలనే తాపత్రయం ఆయనలో ఏనాడు లేదు. అయితే కొడవళ్ల హనుమంతరావు గారు చూపిన వ్యాసం ఇస్మాయిల్ గారి “ఇద్దరు భాష్యకారుల”కు మూలం అన్న దాంట్లో రెండవ అభిప్రాయానికి తావు లేదు.

    ఇంకో పార్శ్వం:
    తెలుగులో పుస్తక ప్రచురణ పెద్ద తలనొప్పి వ్యవహారం (దేశిబుక్స్ తరపున ఇస్మాయిల్ గారి “కవిత్వంలో నిశ్శబ్దం”, “పల్లెలో పాత ఇల్లు” మేము ప్రచురించిన సంగతి కొంత మంది పాఠకులకైన తెలిసే ఉంటుంది). ఆ ప్రస్తావన ఎందుకు తెస్తున్నానంటే , ఇస్మాయిల్ గారి ఆముద్రిత కవితలు అనువాదాలు ప్రచురించే ముందు ఆయన స్వదస్తూరిలో ఒక అనువాదం దొరికింది. దాని మీద, ఆయన రష్యన్ కవయిత్రి అని రాశారు అంతే. ఊరు, పేరు ఏమీలేవు. ఆయనకు రష్యన్ లో ఇష్టులైన కవులు/కవయిత్రులు నాకు తెలుసు కాబట్టి, అందునా అది ఆ కవయిత్రి రాసిన కవితల్లో కొంత విలక్షణమైనది కాబట్టి నేను వెంటనే, గుర్తించి ఒక లఘు టిప్పణి లిఖించి ప్రచురణ పనులు చూస్తున్న కవిమిత్రులకు పంపాను. అదే రకంగా ఇంకో రెండు పోలిష్ కవితలను గుర్తించడం జరిగింది. శ్రీనివాస్ రాయప్రోల్ కవిత్వం/జీవితం గురించి అమెరికన్ పత్రికలో వచ్చిన సమాచారం ఆధారంగా నాలుగు వాక్యాలు రాసి పంపాను. కానీ, ఇవేవీ పుస్తకం ప్రచురణలోకి రాలేదు.

    నేను చెప్ప దలచుకొన్నది ఏమంటే, మనవారికి పాదపీఠికలమీద పెద్ద ఖాతరీ లేదు. కవి /రచయితల శుద్ధప్రతి మొదలుకుని ప్రెస్సుకు వెళ్ళే ఆఖరి ప్రతి (gateway అంటారు మన ప్రెస్సువాళ్ళు) దాకా ఎన్నో మార్పు చేర్పులు చోటు చేసుకొంటాయి. పుస్తక ప్రచురణలో కవి /రచయిత /సంపాదకుల ప్రమేయం ఉన్నా, ఒక్కొక్కసారి కొందరి అజాగ్రత్త వల్ల ఎన్నో స్ఖాలిత్యాలు. అటువంటి స్ఖాలిత్యాల ఫలితమా ఇది? ఇస్మాయిల్ గారు మొదట రాసిన ప్రతిలో దాని మూలాన్ని పేర్కొన్నారా?? అసలు మొదటి సారి ఏ పత్రికలో ప్రచురించ బడింది?? ఇవన్నీ సాహిత్య చరిత్రకారులు తేల్చవలసిన విషయాలు.

    తమ్మినేని యదుకులభూషణ్.

  30. Kameswara Rao అభిప్రాయం:

    December 3, 2008 6:51 am

    హనుమగారు,

    ప్రాచీన ఆధునిక కవిత్వాలలోని అస్పష్టతని పోల్చడం నా ఉద్దేశం కాదు. రెండూ వేరువేరు తరహాలకి చెందినవి కాబట్టి వాటిని పోల్చలేము కూడా. ప్రాచీనకవిత్వంలో కూడా అస్పష్టత ఉందని, అది మీరన్న ఆధునికకవిత్వంలోని అస్పష్టతకి భిన్నమైనదని చెప్పడమే నా ఉద్దేశం. ఆధునికకవిత్వంలో అస్పష్టతకి మీరిచ్చిన ఉదాహరణ నేనన్న వాక్యగత అస్పష్టతకి మంచి ఉదాహరణే. ఇక్కడ వాక్యాలు అర్థ రహితం (వ్యాకరణ రీత్యా) కావడం మూలాన అస్పష్టత ఏర్పడుతోంది. ప్రాచీనకవిత్వంలో ఇలాటిది దాదాపుగా కనిపించని మాట వాస్తవమే.

    ప్రాచీనకవిత్వంలో అస్పష్టతకి ఇంకా మంచి ఉదాహరణలు ఉన్నాయి కాని ప్రస్తుతానికి ఇది:

    “ఈ కలహంసయాన నను నెక్కడి కెక్కడ నుండి తెచ్చె! నా
    హా! కడుదూరమిప్పు”డని యక్కున జేర్పక జంపుమాటలన్
    వ్యాకుల పెట్టుటేల? విరహాంబుధి ముంపకపోదు నన్; జలం
    బేకద నీకు; మంచిదిక నీతకు మిక్కిలి లోతు గల్గునే!

    ఇందులో అస్సలు అర్థంకాని పదాలు కానీ, అర్థంలేని వాక్యాలు కానీ ఏవీలేవు. అయినా కవి ఇక్కడ ఏవిటి చెప్పదలచుకున్నాడో స్పష్టంగా తెలియటంలేదు. ఇది విజయవిలాసంలో ఉలూచి అర్జునునితో అనే మాటలు. అర్జునుడు తనని పెళ్ళిచేసుకోడానికి ఒప్పుకోకపోతే అంటున్న మాటలు. సందర్భాన్ని బట్టి ఈ పద్య తాత్పర్యం చూచాయగా తెలుస్తున్నా, దీనికి సంతృప్తికరమైన వివరణ ఎక్కడా నాకు కనిపించలేదు. హృదయోల్లాస వ్యాఖ్య రాసిన తాపీవారు కూడా ఈ పద్యంలో కవి చెపుతున్న “ఎక్కడినుండి ఎక్కడకి” తేవడం, విరహ అంబుధిలో “ముంచడం”, “ఈతకు మిక్కిలి లోతుగల్గునే” అనే జాతీయాన్ని ప్రయోగించడం మొదలైన విషయాల్లో కవి ఆంతర్యం స్పష్టం కాలేదని ఒప్పుకున్నారు. “ఈతకు మిక్కిలి లోతు చావుకి మిక్కిలి చింత ఉండవు” అనే జాతీయాన్ని ఇక్కడ ప్రస్తావించి, తనకి చావే శరణ్యం అని ఉలూచి అంటోంది అని అర్థం చేసుకోవాలి. కానీ వచ్చిన చిక్కల్లా, ఈతవస్తే సముద్రంలో మునిగిపోవడం ఉండదు కదా, మరి విరహాంబుధిలో ముంచడం గురించి ఎందుకు ప్రస్తావించినట్టు?

    ఇంతకీ నేను చెప్పదలచుకున్న సారాంశమేమిటంటే, ప్రాచీన కవిత్వంలో కూడా కొన్ని చోట్ల అస్పష్టత కనిపిస్తుంది. అయితే, అది మీరు ఆధునిక కవిత్వంలో చూపిన అస్పష్టత లాంటిది కాదు. ఏది స్వచ్ఛమైనది, గాఢమైనది అన్న ప్రశ్న అనవసరం.

  31. కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    December 3, 2008 9:04 pm

    కామేశ్వరరావు గారికి,

    సోదాహరణంగా విపులీకరించినందుకు థాంక్స్. నా శీర్షిక మో “పోలికలు” కవితని ఉద్దేశించి, సరదాగా పెట్టింది. పాత కవిత్వంతో పోల్చడానికి కాదు.

    వినీల్, శ్రీనివాస్ గార్లని ఉద్దేశించి మీరు రాసిన అభిప్రాయంలో, తనకర్థం కాని కవితని విమర్శించే హక్కు పాఠకుడికి లేదన్నారు. నా ఉద్దేశంలో పాఠకుడికి విమర్శించే హక్కు ఎప్పుడూ ఉండాలి, అర్థం కావడం లేదన్నదీ ఓ విమర్శే. కవిత్వం లో సత్తా ఉంటే ఆ విమర్శల ధాటికి నిలుస్తుంది.

    భూషణ్ గారికి,

    నేను ప్రస్తావించిన పొరబాట్లు ఎవరివల్ల జరిగినా చివరకి రచయితే బాధ్యుడు. నాకు ఇస్మాయిల్ వ్యక్తిగతంగా తెలియకపోయినా, ఈమధ్య ఆయన రచనలని చదివి, వాటితో పూర్తి అంగీకారం లేకపోయినా, ఉన్నత వ్యక్తిత్వం కలవాడన్న భావన కలిగింది. ఒక్క పొరబాటు మూలాన ఆయన మీద ఉన్న నా అభిప్రాయం మారదు.

    మో గురించి కూడా ఒక విషయం. “నిరాకారుడు” ఆయన మొదటి సంపుటి, “చితి-చింత” లోనిది. తరవాత వచ్చిన “రహస్తంత్రి” లో చాలా చోట్ల పాశ్చాత్య కవుల ప్రేరణ సూచిస్తాడు.

    కొడవళ్ళ హనుమంతరావు

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)
Autosuggest?

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a