ఈమాట » సడిచేయకే గాలి

Expand to right
Expand to left

సడిచేయకే గాలి

(న్యూజెర్సీలోని తెలుగు కళా సమితి వెలువరించే “తెలుగు జ్యోతి” పత్రిక రజతోత్సవ వార్షిక సంచిక కవితల పోటీలో ద్వితీయబహుమతి పొందిన కవిత)

సడిసేయకే గాలి సడిసేయకే
సవ్వడిచేసి మాపాప కునుకు చెడదీయకే

ఆటలాడీ పాప అలసి నిదురోతున్నాది
నిదురలో కమ్మనీ కలలు కంటున్నాది
కలలలో మా బంగారు, రంగురంగుల
సీతాకోకచిలుకల వెంట పరుగెడుతున్నాది
నిదుర చెదిరితే బంగారుకల చెదిరిపొయ్యేను
సీతాకోకచిలుకలు పారిపొయ్యేను

సడిసేయకే గాలి సడిసేయకే
సవ్వడిచేసి మాపాప కునుకు చెడదీయకే

అమ్మ, అక్కలతోడ దోబూచులాడింది
తాత, నానమ్మలతో కతలెన్నో చెప్పింది
నిదురలో మాతల్లి, ఏం కలలు కంటున్నాదొ
ముసిముసిగా మాత్రమూ నవ్వుతున్నాది

సడిసేయకే గాలి సడిసేయకే
సవ్వడిచేసి మాపాప కునుకు చెడదీయకే

బుడి బుడి అడుగులతో బుల్లి మాతల్లి
నట్టింట తిరిగింది
తలుపుమాటున దాగి, తానెక్కడో చెప్పుకోమన్నాది
ఇల్లంత తిరిగి, ఇంట కళ నింపి
అలసి సొలసీ పాప నిద్దురోతున్నాది

సడిసేయకే గాలి సడిసేయకే
సవ్వడిచేసి మాపాప కునుకు చెడదీయకే

 

(11 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    May 2, 2008 2:10 pm

    ఈ క్రింది పాటనీ, ఈ కవితనీ తరచి చూడండి.
    దేనికేది మూలం అన్నది ఎవరి విజ్ఞతకి వారిని వదిలేస్తున్నాను.

    సడి సేయకో గాలి
    సడి సేయ బోకే
    బడిలి వడిలో రాజు పవళించెనే

    ఏటి గలగలలకే ఎగసి లేచేనే
    ఆకు కదలికలకే అదిరి చూసేనే
    నిదుర చెదిరిందంటే నేనూరు కోనే

    పండు వెన్నెలనడిగి - పానుపు తేరాదే
    నీడ మబ్బుల దాగు - నిదుర తేరాదే
    విరుల వీవెన బూని - విసిరి పోరాదే

    ఇది రాజమకుటం సినిమాలో పాట.
    ఈ కవిత మొదటి రెండు లైన్లూ ఒకేలా అనిపించడం లేదూ -

    సడిసేయకే గాలి సడిసేయకే
    సవ్వడిచేసి మాపాప కునుకు చెడదీయకే

    సడికీ, సవ్వడికీ మధ్య ఒకే ఒక్క అక్షరం దూరం. అంతే!

    గ్రంధచౌర్యం గురించి రాసిన వేలూరి గారి సంపాదకీయానికి ఉదాహరణ గా అనిపించింది ఈ కవిత నాకు.

    - సాయి బ్రహ్మానందం గొర్తి

  2. జె.యు.బి.వి. ప్రసాద్ అభిప్రాయం:

    May 2, 2008 5:44 pm

    నేను సాధారణంగా కవిత్వం జోలికి పోను. నాకు బాగా అర్థం కాదు. ఈ పాట నాకు చాలా ఇష్టం. అందుకని ఈ కవిత కూడా చదివాను. ఎవరినీ నొప్పించకుండా నా అభిప్రాయం చెబుదామని నా తాపత్రయం.

    కవితలో మొదటి రెండు లైన్లు:
    “సడిసేయకే గాలి సడిసేయకే
    సవ్వడిచేసి మాపాప కునుకు చెడదీయకే”

    పాటలో మొదటి రెండు లైన్లు:
    “సడి సేయకో గాలి సడి సేయ బోకే
    బడిలి వడిలో రాజు పవళించెనే”

    నాకు మొదటి లైనులో తప్ప, రెండో లైనులో సారూప్యత కనబడలేదు.
    కవితలోని మిగిలిన లైన్లు అన్నీ వేరుగానే వున్నాయి.

    “సడికీ, సవ్వడికీ మధ్య ఒకే ఒక్క అక్షరం దూరం. అంతే!” అని అంటే, అర్థం కాలేదు. ఎందుకంటే, కవితలో రెండవలైనులోని మొదటి పదం “సవ్వడి” అయితే, పాటలో రెండవ లైను లోని మొదటి పదం “బడిలి”. పాటని కోట్ చేసేటప్పుడు, ఒక లైనుని రెండు లైన్లుగా విడగొట్టారు. అలా చేస్తే, సారూప్యత పోతోంది. కవితలో మొదటి లైను “సడిసేయకే గాలి సడిసేయకే” అని వుంటే, పోలిక కోసం, పాటలో మొదటి లైను, “సడి సేయకో గాలి సడి సేయ బోకే” గానే వుండాలి. కాబట్టి “సడికీ, సవ్వడికీ మధ్య ఒకే ఒక్క అక్షరం దూరం. అంతే!” అని అనడం కరెక్టు కాదని అనుకుంటున్నాను.

    ఇక మొదటి లైనుకి వస్తే, కవితలో, “సడి సేయకే” అని వుంటే, పాటలో, “సడి సేయబోకే” అని వుంది. ఒక్క పిసర తేడా వుంది.

    మొత్తానికి మొదటి లైను తప్పితే, ఇంకేదీ పోలికతో కనబడలేదు. అలాంటప్పుడూ, దీన్ని “గ్రంధ చౌర్యం” లాంటి పెద్ద పదాలతో చెప్పొచ్చా అన్నది నా ప్రశ్న.
    అసలు కవి గారు ఈ పాట ఎప్పుడన్నా విన్నారో లేదో. ఎప్పటిదో పాత పాట. కవి వివరణ కూడా వుంటే బాగుండేది. మిగిలిన కవిత అంతా ఇంత తేడాగా రాసి నప్పుడు, మొదటి లైను మాత్రం చౌర్యం అయి వుంటుందా? కాస్త ఆశ్చర్యమే. కవికి కూడా ఇదే లైను తోచి వుండ కూడదా?

    ఏమో! నాకు అనిపించింది చెప్పాను. ఎవరినీ చిన్నబుచ్చాలని కాదు.
    కవి గారు తన అభిప్రాయం చెబితే బాగుంటుంది. నాకయితే ఇది చౌర్యం అని అనిపించడం లేదు. బహుశా నా విజ్ఞత తక్కువయి వుంటుంది. :-)
    - ప్రసాద్

  3. రవికిరణ్ తిమ్మిరెడ్డి అభిప్రాయం:

    May 2, 2008 6:39 pm

    “గ్రంధచౌర్యం గురించి రాసిన వేలూరి గారి సంపాదకీయానికి ఉదాహరణ గా అనిపించింది ఈ కవిత నాకు.
    - సాయి బ్రహ్మానందం గొర్తి ”
    ఎక్కడో వకటి, అరా లైన్లు కలిస్తే దానికి గ్రంధచౌర్యం అనే మాట వాడాల్సిన అవసరం లేదు. దానికోసం అక్షరం అక్షరం పోలికలవసరం లేదు. సాయి గారు ఎంత సున్నితంగా తమ అభిప్రాయం చెప్పారనుకున్నా, వేసిన అభాంఢం పెద్దది. సరి ఐన పరిశీలన లేకుండానే అపవాదు వేశారని నా అభిప్రాయం.

    రెండు కవితలు జోల పాట బాణీలో వ్రాసినవే. కవితలో భావం, కవిలో భావావేశం లో పోలికలున్నప్పుడు, భాషలో కొంత పోలికలుండటం సహజవే. ఈ కవితలో ఆ పోలికలు హద్దులు మించలేదని నా అభిప్రాయం.

    సాయి గారు ఇంత పెద్ద ఆరోపణని పత్రికా ముఖంగా ఇంత తేలిగ్గా చెయ్యటం నాకైతే విజ్ఞత అనిపించడం లేదు.

  4. Sai Brahmanandam Gorthi అభిప్రాయం:

    May 2, 2008 8:11 pm

    ఉదాహరణ ఇచ్చినా మీకు అలా అనిపించక పోతే నేనేమీ చెయ్యలేను. మీ అందరికీ నచ్చితే మంచిదే ! జిహ్వ కో రుచి.
    నా అభిప్రాయం చెప్పాను. అభాండాలు వేరుగా ఉంటాయి. రాసిందేమో నాలుగు లైన్ల కవిత అందులో రెండు వేరే దానితో పోలిక ఉంటే దాన్ని ఏవో రెండు లైన్లు కలిసాయి దానికింత రాద్ధాంతమా అని అంటే నేనేమీ చేసేది లేదు.
    ఒకవేళ ఆ సినిమా పాట రాసిన వాళ్ళకి తెలియదు అనుకుందాం, కానీ బహుమతి ఇచ్చిన వారిలో ఒక్కరికీ తెలియదు అంటే కాస్త నమ్మబుద్ది కావడం లేదు నాకు. పోనీ అది అంత ప్రాచుర్యం పొందిన పాట కాదూ అనుకోడానికీ లేదు. ఏభై ఏళ్ళ తరవాత కూడా ఇంకా టీవీ లో వస్తోంది. కాస్త ఇక్కడ గూగ్లింగ్ చేస్తే ఎవరైనా వినచ్చు:

    మీ వ్యాఖ్యలు చూసాకా, కవిత్వంలో ఒకటి అరా లైన్లు వేరే కవితతో కలిసినా ఫర్వాలేదన్న కొత్త విషయం తెలిసింది. ఈ మధ్యనే ఆంధ్రభూమిలో ఉగాది కవితల పోటీకి రెండో బహుమతి ఇచ్చిన కవిత మక్కీకి మక్కీ లాగించేసి, ఇది నా సొంతమే అని ఒక వ్యక్తి హామీ పత్రం రాసి పంపారు. తీరా కవితని ప్రచురించాకా, ఇది నా కవితా అంటూ ఇంకో పెద్దమనిషి లబోదిబో మన్నాడు. ఆంధ్రభూమి వాళ్ళు ఇచ్చిన బహుమతి వెనక్కి తీసుకున్నారు. దీనికి కొసమెరుపేమిటంటే, ఆ పెద్దమనిషి కవిత ఆంధ్రభూమిలోనే అచ్చు వేసుకున్నారు, కొన్ని నెలల క్రితం.
    సరిపెట్టుకుంటే సర్వమూ సుందరంగానే కనిపిస్తుంది.
    మీరందరూ విజ్ఞులే! నా బుద్ధే కాస్త మందగించింది.

  5. Lyla yerneni అభిప్రాయం:

    May 3, 2008 8:56 am

    పాట చాలా చక్కగా ఉంది. ఆ పాట సాహిత్యంలోని మృదుత్వాన్ని ఆనందించాను. ఇదివరకటి సినిమా పాట లాగానే పాడుకుని కూడా సంతోషిస్తున్నాను. చేతైతే ఈ కొత్త పాటను పాడించి ‘యూ ట్యూబ్” లో కూడా పెట్టించి వింటాను.
    కవి ఎవ్వరికీ తెలియదు, కాపీ కొట్టేద్దాం అని కాదు ఈ పాట రాసేది. చాలామందికి ఈ పాట చాలా ఇష్టమనే.
    ఈ కవి ముందు పాటకి పొంగిపోయాడు. ఇంకో చక్కని విషయానికి దాన్ని అన్వయించి మరో చక్కని పాట రాశాడు. దీనితో మన ఆనందం ఎక్కువ అయ్యింది కాని తగ్గదే.
    అంతకు ముందు ఒక పాట ఉంటే, అది మిగతా మనుషులందరినీ బతికున్నంత కాలం ఆ పాటే పాడమని బంధించటానికి కాదు. ఈ పాట వచ్చినందువల్ల అంతకు ముందు పాటకు హాని ఏమిటి? ఏం లేదు.
    వేలూరి వ్యాసం లేక పోతే ఈ పాట మీది కామెంట్లు ఇంకో ధోరణిలో ఉండేవా కావా? అంటే ఆ వ్యాసం ప్రభావం చదివిన వారి మీద పడింది. ఆలోచిస్తున్నారు. మరి అంత చక్కని పాట ప్రభావం శ్రోతను నోరు మూయించలేదు. కవిని చేసింది. ఇంకో చక్కని పాట రాయించింది.
    నేనైతే:
    సడి చేయకే గాలి సడి చెయ్యకే
    సవ్వడి చేసి మా పాప కునుకు చెడనియ్యకే
    అని పాడుకుంటున్నాను.

    ఫాడనివ్వరా ఏమిటి?

    లైలా

  6. జె.యు.బి.వి. ప్రసాద్ అభిప్రాయం:

    May 3, 2008 11:12 am

    ఇక్కడ ఇచ్చిన లింకుకి కృతజ్ఞతలు. చక్కగా రాజసులోచననీ, యంటీ రామారావునీ, రాజనాలనీ చూస్తూ, పాట మూడు సార్లు విన్నాను లీల గారి చక్కటి గొంతుతో. సంతోషం కలిగింది.
    ఈ పాటలో పల్లవి కాకుండా మూడు చరణాలున్నాయి. ఒక్కో చరణంలో ఆరు చిన్న లైన్లు (లేదా మూడు చిన్న లైన్లు) వున్నాయి. మొత్తం పద్దెనిమిది చిన్న లైన్లు, లేదా తొమ్మిది పెద్ద లైన్లు. చొక్కాకుల వెంకట ప్రసాద్ గారు రాసిన కవితలో (పాటలో?) మూడు చరణాలున్నాయి. మొదటి చరణంలో ఆరు లైన్లూ, రెండవ చరణంలో నాలుగు లైన్లూ, మూడో చరణంలో ఐదు లైన్లూ. మొత్తం పదిహేను లైన్లు. రెండింటి లోనూ పల్లవి రెండు లైన్లు. పల్లవి లోని మొదటి లైను మాత్రం ఒకేలా వుంది. అంటే కవి గారు ఈ పాటలోని మొదటి లైను మాత్రం స్ఫూర్తిగా తీసుకుని రాశారనుకుని, కాస్త ఈజీగా తీసుకుని వదిలెయ్యాలి. “గ్రంధ చౌర్యం” అనే పెద్ద మాటలూ, “రాసిందేమో నాలుగు లైన్ల కవిత” అనే అన్యాయం మాటలూ ‘విజ్ఞత’కి చెందినవి అవవు.
    ఈ సందర్భం గురించి నిన్న ఇంకో వెబ్ పత్రిక ఎడిటర్ గారితో మాట్టాడుతున్నప్పుడు, కొన్ని విషయాలు తెలిశాయి. సుద్దాల అశోక్ తేజ అనే సినీ పాటల రచయిత, శ్రీశ్రీ “మహాప్రస్థానం” లోని “నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ధార పోశాను” తీసుకుని, దాన్ని మూడు లైన్ల పల్లవిగా చేసి, సొంత చరణాలు రాసుకుని, ఠాగూర్ సినిమాకి ఇచ్చారు. ఈ పాటకి National Film Aware for Best Lyrics Award వచ్చింది. కొంత మంది విమర్శించారు. దానికి బదులుగా శ్రీశ్రీ మహాప్రస్థానం లోంచి ఒక్క లైను మాత్రమే స్ఫూర్తిగా తీసుకున్నాను అని సమర్థకులు అన్నారు. కేంద్ర బహుమతి విషయంలోనే ఇలా వుంటే, తెలుగు జ్యోతి వారి బహుమతుల విషయంలో ఇది ఆశ్చర్యకరమైన విషయం కాదనిపించింది.
    - ప్రసాద్

  7. Sai Brahmanandam Gorthi అభిప్రాయం:

    May 3, 2008 12:27 pm

    లైలా గారూ,

    వేలూరి గారి వ్యాసం రాయకపోయినా ఇలాంటివి కనిపిస్తే రాస్తాను. మీకందరికీ తప్పులేదనిపించింది. సంతోషం.

    ప్రేరణకి కొత్త అర్థాలూ, అన్వయాలూ చెప్పినందుకు ఆనందించాను. ఇప్పుడే పాత సినిమా పాటలన్నీ ముందేసుకూర్చున్నాను. ఎంత ప్రేరణ దొరుకుతుందో చూడాలి.
    మీరు రాసిన -
    “కవి ఎవ్వరికీ తెలియదు, కాపీ కొట్టేద్దాం అని కాదు ఈ పాట రాసేది. చాలామందికి ఈ పాట చాలా ఇష్టమనే. ఈ కవి ముందు పాటకి పొంగిపోయాడు. ఇంకో చక్కని విషయానికి దాన్ని అన్వయించి మరో చక్కని పాట రాశాడు. దీనితో మన ఆనందం ఎక్కువ అయ్యింది కాని తగ్గదే.”
    అన్న ఈ మాటలు కవి గారంటే ఇంకాస్త అనందించేవాణ్ణి.

    -సాయి బ్రహ్మానందం గొర్తి

  8. Paruchuri Sreenivas అభిప్రాయం:

    May 4, 2008 1:29 am

    నాకూ లైలా, జె.యు.బి.ప్రసాద్ గార్లు వెలిబుచ్చిన అభిప్రాయాలతో చాలా యిబ్బందులున్నాయి. అంతకంటే యిక్కడ చెప్పలేను, చెప్పడం యిష్టంలేదు. ఎందుకంటే ఏది అనుసరణ/అనుకరణ, ప్రేరణ, చౌర్యం అనే అంశాలపై ఒక నాలుగేళ్ళుగానో, యింకా పైనో తర్జన భర్జనలు పడుతున్నాను, ముఖ్యంగా సినిమా పాటల విషయంలో ఈ మాటల్ని కొండొకచో బాధ్యతారహితంగా వాడుతున్నారు అని నా బాధ.
    సాహిత్యం విషయంలోకొచ్చేసరికి వేరుగా చూస్తారని మరో బాధ.

    దేవులపల్లి పాట ప్రస్తావనకు వచ్చింది కాబట్టి … బహుశ మీలో చాలామందికి తెలిసే వుంటుంది. “లేపకే నా యెంకి లేపకే నిదరా, ఈ పాటి సుకము నేనింతవరకెరగనే” అనే ఎంకిపాట ఈ సినీగేయానికి ప్రేరణ అని ఆ కాలంలో కొన్ని విమర్శలు వెలువడ్డాయి. :-)

    – శ్రీనివాస్

  9. డా.స్మైల్ అభిప్రాయం:

    May 4, 2008 5:31 am

    స్ఫూర్తికి, చౌర్యానికీ మధ్య ఉన్నది చాలా సన్నటి గీత. ఉదా: మాయాబజార్ల̍లోని ‘వివాహ భోజనంబు’ పాట. పాత సినిమా పాటలకు నడిచే నిఘంటువు లాంటి వి.ఎ.కె.రంగారావు గారి మాటల్లో- “1930 ప్రాంతాల బ్రిటన్, అమెరికా దేశాల్లో రంగస్థలంమీద చిన్న ప్రహసనాల్లాంటివి చేసేవారు. ఆయా నటులు వాళ్ల దుస్తుల్ని ఒక తోపుడు బండిలో వేసుకొని రంగస్థలం మీదికి తోసుకుంటూ వచ్చేవారు. వస్తున్నప్పుడు ఆ బండి చక్రాల ధ్వని వినిపించకుండా దానిమీద వాద్యగోష్ఠి వచ్చేది. అది ‘వివాహ భోజనంబు’ వరస, మీటరూ! అటు తర్వాత ఆ ట్యూనును ‘మెక్సికన్ మెర్రి గో రౌండ్’ అనే పాటగా మలిచారు. ఆ వినోద కాలక్షేపాలు మన దేశంలో కూడా ప్రదర్శింపబడినప్పుడు, ఆ ట్యూనును మన వాళ్లు గ్రహించి వుంటారు.” (సంగ్రహించి?:-)

  10. chokkakula venkataprasad అభిప్రాయం:

    May 27, 2008 7:29 am

    జె.యు.బి.వి. ప్రసాద్, లైలా యెర్నెని, రవికిరణ్ తిమ్మిరెడ్డి గార్లకు నా కృతజ్ఞతలు. కనీసం నెలరోజులు నిలిచిన తరువాత వ్రాద్దామని ఆగాను. నా మిత్రులు వారికి పాప పుట్టిందని చెప్పినపుడు నాకు కలిగిన ఆనందాన్ని మాటల్లో పెట్టాను. నా పదాలు మీకు నచ్చినందుకు నాకు అనందం. ప్రచురించినందులకు ఎడిటర్ గారికి ధన్యవాదాలు.

    చొక్కాకుల వెంకటప్రసాద్

  11. కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    May 27, 2008 7:17 pm

    “జయభేరి”

    JUBV ప్రసాద్ గారి వ్యాఖ్య నుండి:
    సుద్దాల అశోక్ తేజ అనే సినీ పాటల రచయిత, శ్రీశ్రీ “మహాప్రస్థానం” లోని “నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ధార పోశాను” తీసుకుని, దాన్ని మూడు లైన్ల పల్లవిగా చేసి, సొంత చరణాలు రాసుకుని, ఠాగూర్ సినిమాకి ఇచ్చారు.

    సినిమాలో ఏముందో నాకు తెలియదు కాని ఆ శ్రీశ్రీ గీతం ప్రారంభం ఇది:

    “నేను సైతం
    ప్రపంచాగ్నికి
    సమిధ నొక్కటి ఆహుతిచ్చాను!

    నేను సైతం
    విశ్వవృష్టికి
    అశ్రు వొక్కటి ధారపోశాను!

    నేను సైతం
    భువన ఘోషకు
    వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను!”

    కొడవళ్ళ హనుమంతరావు

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a