ఈమాట » గుల్మొహర్

Expand to right
Expand to left

గుల్మొహర్

నిన్నటి దాకా ఇక్కడ
చెట్టు ఉన్నట్లే గమనించలేదు.
నిన్న ఈ చెట్టు ఆకుల్ని రాల్చేసి
నిరలంకారంగా నిర్లిప్తంగా
నిలబడి ఉండేది.
ఏవో రహస్యాలని నిగూఢంగా దాచుకుని
పెదవి విప్పకుండా ఒదిగి కూర్చున్న
చిన్ని చిన్ని మొగ్గల్ని రెమ్మల చివర్ల మోస్తూ,
ఈ చెట్టు మౌనం గా నిలబడి ఉండేది.

ఈ రోజు ఉదయానికల్లా
ఏదో ఎర్రని రాగం బద్దలైనట్లు,
ఎవరో రాత్రంతా కూర్చుని మొగ్గలలోకి
ఎర్ర రంగు దట్టించినట్లు,
ఈ చెట్టు రెమ్మల చివర్లలో పేలిన రంగుతూటాల్లా మొగ్గలు!

ఏ ఎక్సెంట్రిక్ చిత్రకారుడో హడావుడిగా
దారంట వెడుతూ ఓ క్షణం ఆగి,
తన కనురెప్పలక్రింద దాచుకున్న స్వప్నాల్ని,
కను చివర్లలో దాగిన ఎర్ర జీరల్ని ,
తన బ్రష్ కొనలతో చెట్టు మీద చిత్రించి వెళ్ళిపోయాడేమో !

ఎవరో రాజనర్తకి తన చేలాంచలాన్ని సుతారంగా సవరించినట్లు,
చిరుగాలికి రెమ్మల్ని అలవోకగా కదల్చుతూ ,
మన శుష్క హృదయాలలోని స్తబ్ద శిశిరాల్ని,కఠిన గ్రీష్మాల్ని ,
విరబూసిన వసంతాలుగా మార్చుతూ
అందానికీ ,ఆనందానికీ నిర్వచనంలా
ఎర్రెర్రని పుష్పాల్ని గర్వంగా
తన కిరీటంలో అలంకరించుకుంది గుల్మొహర్!

రచయిత వైదేహి శశిధర్ గురించి: జన్మస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. నివాసం న్యూ జెర్సీలో. వైద్యరంగంలో పనిచేస్తున్నారు. చాలా కవితలు ప్రచురించారు. ...

 

(3 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Prasad అభిప్రాయం:

    July 31, 2006 8:45 am

    చాలా అద్భుతంగా వుంది. మోడుల్లా మారి మళ్ళీ వసంతం రాకతో కొంగొత్త పచ్చదనంతో, మరికొన్ని వడలెల్ల కొత్తకొత్త రంగుల చెంగావి చీరలు కట్టిన వాటిల్లా సింగారించుకుంటే చూసి మురిసిపోవటమే కానీ ఈ సరికొత్త భావనలు పొడచూపలేదు. ఇక ప్రతి వసంతానికీ నే చూసే ప్రతిచెట్టూ ఈ కవితే పలికిస్తుందనడంలో సందేహం లేదు.
    – ప్రసాద్
    http://charasala.wordpress.com

  2. baabjeelu అభిప్రాయం:

    July 29, 2008 8:04 am

    వైదేహి గారూ,

    సమకాలీనులు మెచ్చరు ఎలారాసినా అని ఓ పాత కవిగారి బాధ నాకర్థం కాలేదు. మీ పునశ్చరణ కి “రవికిరణు”, “ఈ మాట” లో మీ సహవాసి, పులకించడం ముచ్చటేసింది.

    చక్కని అనుభూతి; అనుభూతిని అంతకన్నా చక్కగా అభివ్యక్తీకరించడం; అంతేకదా కవిత్వం అంటే.

    “నిరలంకారం” అంటే సరిగ్గా అర్ధం కాలేదు. మీరేం రాయకండి. ఏ భైరవభట్లగారో, కొడవళ్ళవారో ఇంకెవరో తీరికా ఓపికా వుంటే రాస్తారు.

    అభిప్రాయాల్ని పట్టించుకోకండి. పట్టించుకున్నా సమాధానాలివ్వకండి. కవిత్వం రాయండి.

  3. jayaprabha అభిప్రాయం:

    August 1, 2008 10:52 am

    డియర్ వైదేహి,

    చెట్టు అందాన్ని అక్షరం లో పట్టుకోగలగటం అంత తేలిక కాదు. అలాంటిది ఆ అందాన్ని సునాయాసంగా అంతే అందంగా కవిత్వం చేసేరు. చదువుతూంటే మనసుకి కూడా ఆ రంగు అంటింది సుమా. హాయిగా అనిపించింది. బాగా రాస్తున్నారు. కంగ్రాట్స్. మరిన్ని రంగుల్ని మీ ఊహ ప్రతిఫలించాలని …

    జయప్రభ

    note for babjeelu; బాబ్జీలుగారు రామలింగని అవతరమా మీది?? మీ ధోరణి నాకు బాగా నచ్చింది, అభిప్రాయాలు చెప్పటంలో. ఎన్‌జాయ్ చేస్తున్నాను వాటిని చదువుతూ. — జయప్రభ.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a