పునశ్చరణం
రాయటం పూర్తి చేసిన
కవితను మళ్ళీ మళ్ళీ
చదువుతూ ఉంటాను
అప్పుడే పుట్టిన పసికందును
ఒక్క క్షణం కూడా వదలలేక
తడిమి తడిమి ముద్దాడే
తొలిచూలాలిలా
పరాయి దేశం లో
హఠాత్తుగా ఎదురైన
చిన్ననాటి నేస్తాన్ని
తరచి తరచి
పరామర్శించే స్నేహితునిలా
పరిష్వంగాన్ని సడలించిన
మరుక్షణం లోనే వేయేళ్ళ
విరహాన్ని అనుభవిస్తూ
పదే పదే కౌగలించే ప్రేమికునిలా
రచయిత వైదేహి శశిధర్ గురించి: జన్మస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. నివాసం న్యూ జెర్సీలో. వైద్యరంగంలో పనిచేస్తున్నారు. చాలా కవితలు ప్రచురించారు. ... పూర్తిగా »
Tulasimohan అభిప్రాయం:
March 3, 2007 2:15 am
నిజమే కదూ…!
good one
Raghothama Rao C అభిప్రాయం:
March 7, 2007 6:54 am
నిదర్శనలు ఒకటి కంటే ఎక్కువైతే కవిత పలచనబడగలదు.
ravikiran timmireddy అభిప్రాయం:
March 8, 2007 8:44 am
నిద్రపోతున్న నా కూతుర్ని చూస్తుంటే మళ్ళా, మళ్ళా చూడాలనిపిస్తుంది. నా చేతుల్లో వొదిగిపోయిన ఆ పిల్లేనా, ఈ రోజు నేనెత్తలేనంత ఎత్తుకి ఎదిగిపోయింది అనిపిస్తుంది. చెప్పలేని అధ్భుతవైన భావవొకటి మనసంతా విస్తరిస్తుంది. కాగితం మీద పరచుకున్న ఈ నల్లని నాలుగు మరకలు, మన మన్సులో పుట్టిన, మనలో భాగవే కదూ! మెదడులో వుక్కిరిబిక్కిరగా వున్న ఆ రసాయనిక సమీకరం విచ్చుకున్న రూపవేకదా మన కవితకానీ, కథ కానీ.
చాలా అద్భుతంగా వుందండీ మీ కవిత వైదేహీ శశిధర్ గారు.
రవికిరణ్ తిమ్మిరెడ్డి
మిరపకాయ్ అభిప్రాయం:
March 16, 2007 6:11 pm
నేను కవిని కాదు కానీ మీకవిత చదివిన తర్వాత… నాకు నేను ఎప్పుడో గీసిన బొమ్మలు మళ్ళీ చూడాలనిపించింది …. మనస్సుమూలల్లో ఎక్కడో ముళ్ళ చెట్లకు చిక్కుకుపోయిన గాలిపటాల్లాటి జ్ఞాపకాలు వెనక్కొస్తున్నాయి… కవిత చాలా బాగుంది ..
ఒక చిన్నవిషయం .. మీరు కవితను ఇంకా పెద్దది వ్రాసి సగమే ఇక్కడ పెట్టినట్టు అనిపిస్తొంది . మీరు అర్ధోక్తిలో ఆగిపోయిన విషయం మీభాష చెబుతోంది … లేకపోతే పైన ఎవరో చెప్పినట్టు metaphors ఎక్కువవ్వడం వలన అలా అనిపిస్తోందేమో ..
స్వాతి అభిప్రాయం:
March 19, 2007 5:03 am
అద్భుతం!!
బిడ్డను కన్న ప్రతి తల్లికీ
కవిత రాసిన ప్రతి వారికి అనుభవమే ఇది.
P. Siva అభిప్రాయం:
March 19, 2007 2:25 pm
సరిగ్గా అతకని రెండో సిమిలీని వదిలేసి ఉండవలసింది.
rajasankar kasinadhuni అభిప్రాయం:
March 31, 2007 8:14 am
కవిత బావుంది. metaphors ని కూడా ముచ్చటగా మూడేసి పంక్తులలో క్లుప్తంగా వివరిస్తే కవిత మరింత బాగుండేదని నా అభిప్రాయం.
P. Siva అభిప్రాయం:
April 19, 2007 6:40 am
రాజశంకర్ గారు,
ఇవి మెటఫర్లు కావు సిమిలీలు. అనగా ఉత్ప్రేక్షలు కావు, ఉపమానాలు. ఇక ‘క్లుప్తంగా వివరించడం’ అనేది oxymoron.
ఈమధ్య క్లుప్తత మీద obsession పెరుగుతున్నట్లుంది. నాలుగు మాటలు ఎక్కువయినంత మాత్రాన కొంపలేవీ మునిగిపోవు భావం అద్భుతంగా ఉన్నప్పుడు, కవి చెప్పదలుచుకున్నది పాఠకుడి మనసుకి అందినప్పుడు. సందర్భాన్ని బట్టి కవితలు ఒక్కోసారి దీర్ఘంగానూ ఉంటాయి, పదాలూ, భావాలూ పునరావృతమవుతూ ఉంటాయి. అందరి నవ్వులూ, ఏడుపులూ ఒకలా ఉండవుగదా! అన్నింటికీ క్లుప్తత మంత్రం పనికి రాదు. అప్పుడు మనకు హైకూలు తప్ప ఏవీ మిగలవు. ‘ఇక్కడ తాజా చేపలు సరసమైన ధరలకు అమ్మబడును’ అన్న బోర్డు కథ వినలేదా? అవధరించండి.
ఒకాయన కొత్తగా చేపలకొట్టు పెట్టుకున్నాడు పైన చెప్పిన బోర్డు రాయించుకుని. మీలాంటి పెద్దమనిషి వచ్చి “పిచ్చోడా, షాపు ఇక్కడ పెట్టుకుని చేపలు ఇంకెక్కడో అమ్ముతావా? ‘ఇక్కడ’ అక్కర్లేదు తీసేయ”మన్నాడు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. ఇంకొకాయన వచ్చి “ఈ సముద్రపొడ్డున తాజా చేపలు కాకపోతే కుళ్ళినవి ఎవరయినా అమ్ముతారా? ‘తాజా’ తీసేయించు” అన్నాడు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. మరొకాయన వచ్చి “కొట్టునిండా చేపలు పెట్టుకుని చేపలు కాక ఇంకేం అమ్ముతావు. ‘చేపలు’ తీసేయించు” అన్నాడు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. మీరొచ్చి “చుట్టూ పోటీగా ఇన్ని కొట్లుంటే అందరూ సరసమైన ధరలకే అమ్ముతారు గనక ‘సరసమైన’ అనవసరం’ తీసేయించు” అన్నారు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. వేరొకాయన వచ్చి “ధరకు కాకుండా ఊరికే ఎవరయినా ఇస్తారా? ఆ మాట తీసేయించు” అన్నాడు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. వాళ్ళావిడ వచ్చి “కొట్టునిండా చేపలు పెట్టుకుంది అమ్మడానికి కాక కొనడానికా? అర్థం లేని మాట, తీసేయించు” అన్నదిట. ఆ అమాయకుడు అలాగే చేశాడు.
ఇప్పుడు ఆ ఖాళీ బోర్డున్న షాపులో చేపలు ఎవరు కొంటున్నారో మీకే తెలియాలి.
అన్నట్టు మళ్ళీ పైకి వెళ్ళకుండా బోర్డు మీదినుంచి మీరే మాట తీయించారో చెప్పుకోండి.
rajasankar kasinadhuni అభిప్రాయం:
April 19, 2007 3:54 pm
“పి.శివ” గారు,
క్లుప్తంగా చెప్పినంత మాత్రాన ‘వివరం’ అందకుండా పోదు. మీరు శెలవిచ్చిన లెక్కన “Brief description” కూడా oxymoron. పాపం చాలా కస్టపడి కథ చెప్పారు. మీరు చెప్పిన కథకి counter గా బండి మీద పండ్లు అమ్ముకునేవాడి కథ ఉంది. “ద్రాక్ష పళ్ళు, బత్తాయి పళ్ళు…” అని అరుచుకుంటూ ఒక అమాయకుడు బండి తోసుకుంటూ వెడుతున్నాడు. మీరు అడ్డం పడి, ఊరికే పళ్ళ పేర్లు చెప్పి ఊరుకుంటే కొనేవాడికి నువ్వు అమ్ముతున్నట్టు ఎలా తెలుస్తుంది అని అడిగారు. ఆ అమాయకుడు “ద్రాక్ష పళ్ళు అమ్ముతాం, బత్తాయి పళ్ళు అమ్ముతాం….” అని అరవడం మొదలుపెట్టాడు. అప్పుడు మీరు, ఊరికే అమ్ముతాననేసి ఊరుకుంటే ఎప్పుడు అమ్ముతావో కొనేవాడికి ఎలా తెలుస్తుందని అడిగారు. ఇలా మీ బారిన పడ్డ అ అభాగ్యుడి కథ ఎక్కడి దాకా వెళ్ళిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ లెక్కన కథ పూర్తయ్యేసరికి మీరు ఎన్ని మాటలు add చేసి ఉంటారో చెప్పుకోండి చూద్దాం?
మన వాదనకి అనుగుణంగా ఎన్ని కథలైనా అల్లుకోవచ్చు. పాఠకుడు ఇచ్చిన సూచన నచ్చడం నచ్చకపోవడాన్ని బట్టి రచయత దానిని అనుసరించాలా వద్దా అని నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఎవడికి obsession లేదు? మీరన్నట్లు ఎవరి ఏడుపు వారిది.
వినయంతో,
కాశీనాథుని రాజాశంకర్
P. Siva అభిప్రాయం:
April 20, 2007 12:58 pm
కా.రా. గారు,
మీ కథ బావుంది.
క్లుప్తత అన్నిచోట్లా పనికిరాదంటే ఎక్కడా పనికి రాదని కాదు. సందర్భాన్నిబట్టి అవసరం మారుతుంది.
ఈ రెండు కవితల్లో ఏ మాటలు అనవసరంగా చేరి మీకు రసభంగం కలిగించాయో వివరిస్తారా? లేదా అదే భావస్ఫూర్తి కలిగిస్తూ ఏ మాటలు తొలగించవచ్చో తెలియజేయగలరా?
జిజ్ఞాసతో,
శివ
rajasankar kasinadhuni అభిప్రాయం:
April 20, 2007 7:10 pm
అయ్యా శివ గారు,
రసభంగాలూ, కొంపలంటుకోవడాల దాకా మీ అలోచనలు వెళ్ళిడానికి నా అభిప్రాయాలలో ఏవుందో నాకు ఎంత వెతుకున్నా అర్థం కాలేదు. నాకు నచ్చిన కవితలు కనుక రెండింటికీ చెరి ఒక (చిన్న) సవరణ సూచించాను. అవి,
1. విన్నకోట రవి శంకర్ గారు కవితని (భావం ఏ మాత్రం దెబ్బ తినకుండా) ఇంకొంత concise గా చెప్పి ఉండవచ్చని
2. వైదేహి గారు పోలికలని కూడా ముచ్చటగా మూడేసి పంక్తులలో చెప్పినట్లైతే structural uniformity వల్ల కవిత మరింత రక్తి కట్టేదని
వచనకవిత్వానికి ఏ నియమాలులేవు కనుక నా సూచనలు అంత సమంజసమైనవి కావని వచన కవిత్వం రాసే వాళ్ళూ, చదివేవాళ్ళూ అనుకోవచ్చు. కానీ వచన కవిత్వంలో కూడా సందర్భోచితంగా కొన్ని లక్షణాల విషయంలో శ్రధ్ధ చూపించడం అవసరం అని నా నమ్మకం. ఒక్క Economy of words మాత్రం అన్ని సందర్భాలలోనూ సముచితమైనది (We will have to agree to disagree here).
చివరగా, ఎవరి రచనలు వారికి అపురూపం కనుక పై రెండు కవితలనీ (నా సూచనలు మీకు అర్థం అవడం కోసం) నాకు తోచినట్లుగా మార్పులు చేసి ఇక్కడ చూపెట్టడం అంత సబబు కాదు నా అభిప్రాయం.
శలవు,
కా.రా
Pavan garikapati అభిప్రాయం:
April 30, 2007 8:36 am
చాలా అనందంగా ఉంది, వాదన ప్రతి వాదనలు చూడడం ఈ కవిత మీద,
మనం వ్యాసాలు రాయకుండా కవితలు రాయడమెందుకు? వ్యాసాలకు వచన కవితలకు ఎక్కడ తేడా? ఎంతో గొప్ప భావాన్ని ఎన్నో పదాలని ఉపయోగించి చెప్పినా అది కవిత్వమేనా? ఈ మధ్య చాలా మంది ‘కవులు?’ క్లుప్తత అంత పెద్ద విషయమే కాదని వాదిస్తున్నారు, దాని కోసం చేపల కధని ఉపమానంగా ఉపయోగించడం? హాస్యాస్పదం.
ఏ కవి కైనా ఏదో ఒక భావావేశంతొ కవిత మొదలవుతుంది, అది అప్పుడే గని నుండి బయట పడ్డ వజ్రం లాంటిది. దానికి ఎంతో సాన పెడితే గాని అది చూపరులకు అనందాన్ని ఇవ్వలేదు.
ఉదాహరణకు: పైన కవిత
పునశ్చరణ ఎందుకు? మాతృత్వ ప్రేమతోనా? అయితే ఈ తొలి చూలాలు ఎందుకు? పాఠకుడు ఏ భావనకు లోనవ్వాలని?
ఒక్క క్షణం కూడా వదలలేక — నిజంగా మాతృమూర్తికి ఆ భావన సహజమా?
అప్పుడే పుట్టిన పసికందును
ముద్దాడే మాతృమూర్తిలా
ఈ రెండు పంక్తులు సరిపోవా? ఎక్కువ గా వివరిస్తే భావాలు బంధీ అయిపోవా? అప్పుడే పుట్టిన పసికందుని ముద్దాడే మతృమూర్తి ‘ఒక్క క్షణం కూడా వదలలేక’ అనే భావానికే పరిమితమా?
అన్నీ ప్రశ్నలే వేసాను పరిశీలించండి.
ఇలాగే ప్రతి వాక్యాన్ని ప్రతి పదాన్ని పరిశీలించి సరి చేస్తే కవిత తప్పకుండా బాగుంటుంది.
పవన్
Aruna Gosukonda అభిప్రాయం:
July 4, 2007 1:43 am
very nice Vaidehi garu. :)
baabjeelu అభిప్రాయం:
July 25, 2008 7:41 am
ఇదీ “ఈ మాట” గొప్పతనం.
క్లుప్తత గురించి వొకరు, దానికి ప్రతివాదం తో ఇంకొకరు. అద్భుతం.
కవయిత్రి వొక్క ముక్క కూడా రాయలేదు, కవిత తప్ప. అది సరైన పధ్ధతి.
రాస్తూ వుండడవే, విమర్శకులకీ, అభిమానులకీ సరైన సమాధానం.
మీరు రాస్తూ వుండండి వైదేహి గారూ. భావవ్యక్తీకరణ ముఖ్యం. భావాన్ని ఏదో వొక నడకతో చకచకా నడిపించడం కవిత. అంతే కదా కవులూ, కవయిత్రులూ చెయ్యవలసిన పని.
అభిప్రాయాల్ని జాగ్రత్తగా చదవండి. మీ కవితల్లో కవిత్వం, మీ ఈ కవితలో చెప్పిన పసికందులాగా పెరిగి పెద్దవాడయిపోతుంది. మామూలుగా కాదు, “ఏడాదికే నాలుగేళ్ళు రావాలీ….. ఎప్పటికి ముప్ఫయ్యిలోపె వుండాలీ…” లాగ.