తెలుగదేమిటనిన… కాదు… తెలుగదెందుకనగ…
తెలుగు రాని వాళ్ళకి తెలుగు గురించి తెలియని వాళ్ళకి తెలుగు గురించి చెప్పవలసి వస్తే, భారతదేశంలో ఈ భాష డెబ్భై మిలియన్లకి మాతృభాష అనో, ఈ భాషలో పదకొండువందల ఏళ్ళుగా ధారావాహికంగా గొప్ప సాహిత్యం వస్తూవున్నదనో చెప్పడం ఇక్కడి విద్యావంతులకి మొక్కుబడి, మామూలు. అంతేకాదు, ఆరువందల ఏళ్ళక్రితం ఒక రాయడు గారో, మరొక రాయలు గారో, “దేశభాషలందు తెలుగు లెస్స” అని ఒక ఆటవెలది పాదంతో మా భాషని పొగిడారనో ఒక పాత చప్పడిపోయిన పాట పాడడం కూడా మామూలే! ఈ పాట పాడి పాడి మన బుర్రలు పాడు పాడు చేశారు ఏటా వచ్చే రాజకీయనాయకులు, వారివెంట వచ్చే రాజకీయకవులూ! అందుకే, ఈ పద్యపాదం పరమ పేలవంగా తయారయ్యింది.
పై మకుటం అచ్చుతప్పు కాదు; ఛందోభంగం అయిందేమో తెలియదు కానీ, అచ్చు తప్పు మాత్రం కానే కాదు.
ఇకముందు అమెరికాలో అటువంటి ప్రశ్నలు అడగే ఆవశ్యకత లేకండా ఇక్కడ స్థిరపడ్డ తెలుగు వాళ్ళు తేలికగా చెయ్యగలరు.
అమెరికాలో విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో మూడు దశాబ్దాల పైచిలుకుగా తెలుగు భాషాబోధన, తెలుగు సాహిత్య పరిశోధనా ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి మూలకారకులు ప్రొఫెసర్ వెల్చేరు నారాయణ రావు గారు. ఇకపోతే, తెలుగు బోధనా భాషగా చికాగో విశ్వవిద్యాలయంలోను, కొలంబియా లోనూ ఉన్నాయి. ఈ మూడు చోట్లా దక్షిణ ఆసియా భాషల విభాగాలు (South Asian Languages Departments)బలమైనవి కావడమే కారణం కావచ్చు. మిగిలిన ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో దక్షిణ ఆసియా భాషా విభాగం ఉన్నప్పటికీ తెలుగు చెప్పడం, తెలుగులో పరిశోధనని ప్రోత్సహించడం ఎక్కడా లేదు. ఇది చాలా విచారకరం.
ఈ విచారకరమైన పరిస్థితిని మార్చడానికి స్థానిక తెలుగు సంస్థలు, దేశవ్యాప్తంగా బలపడ్డ తెలుగు సంస్థలూ, ముఖ్యంగా తెలుగంటే నిజమైన మమకారం ఉన్న వాళ్ళు కలిసి విశ్వవిద్యాలయాల్లో తెలుగు బోధనకి కృషిచెయ్యడం అసాధ్యం కాదు.
ఆ పని మొట్టమొదటిగా డెట్రాయట్ తెలుగు వాళ్ళు మూడు సంవత్సరాల క్రితం, సాధించారు. డెట్రాయట్ లో తెలుగు సాహిత్యాభిమానులు (DTLC), డెట్రాయట్ తెలుగు సంఘం, తానా ప్రముఖులూ కలిసి మిషిగన్ విశ్వవిద్యాలయం, యాన్ ఆర్బర్ లో తెలుగు భాషా బోధనకి అవకాశం కల్పించగలిగారు. అందుకుగాను విశ్వవిద్యాలయం కోరిన విధంగా ధన సహాయం విరాళంగా అందిచారు. విశ్వవిద్యాలయం కోరిన ధనసహాయం చాలా పరిమిత మైనదే అని చెప్పాలి. ఐదు సంవత్సరాలకి 150,000 డాలర్లు మాత్రమే! అంటే, ఏడాదికి 30,000 డాలర్లు డెట్రాయట్ తెలుగు వారు మిచిగన్ విశ్వవిద్యాలయానికి విరాళం ఇస్తున్నారు! ఉమ్మడిగా మనం చెయ్యలేని పని లేదని డెట్రాయట్ తెలుగు వాళ్ళు రుజువు చేశారు. ఈ ఒప్పందానికి ప్రొఫెసర్ నారాయణ రావుగారి ప్రోద్బలం ఉన్నది.
డెట్రాయట్ తెలుగు వారు నాందీ వాక్యం పలికారు. వాళ్ళని అభినందించి తీరాలి. ఇదేవిధంగా, అమెరికా వ్యాప్తంగా దక్షిణ ఆసియా భాషల్లోను, సంస్కృతంలోనూ బోధన స్థిరపడ్డ ప్రతి విశ్వవిద్యాలయంలోనూ తెలుగు భాషా బోధనకి, తెలుగు సాహిత్య పరిశోధనకీ అవకాశం కల్పించవలసిన అవసరం ఉన్నది.
ఇది గుర్తించి, అట్లాంటాలో ఎమరీ విశ్వవిద్యాలయంలో కేవలం బోధనకే కాక, తెలుగు సాహిత్యం సంస్కృతులపై పరిశోధనకికూడా అవకాశం కల్పించడానికి సుమారు ఆరు నెలలనుంచీ కృషి జరుగుతూన్నది. స్థానిక తెలుగు సంఘం తామా, తదితర స్వచ్ఛంద కార్యకర్తలతో కలిసి ఈ పనికి పూనుకున్నారు. ఐదు సంవత్సరాల పరిమితిలో ఎమరీ విశ్వవిద్యాలయంకి 200,000 డాలర్లు విరాళం ఇవ్వగలమని వాగ్దానం (monetary commitment) చేస్తే, వచ్చే సంవత్సరంలో ఎమరీలో తెలుగు భాషా బోధనే కాకుండా, తెలుగు సాహిత్యం, సంస్కృతుల పై పండితుల ఉపన్యాసాలు, వాటిపై పరిశోధన సాధ్యపడతాయి. ఎమరీలో తెలుగు పెట్టించడానికి పట్టుదలతో పనిచేస్తున్న ముఖ్య సూత్రధారిణి, ఎమరీ ప్రొఫెసర్ శ్రీమతి జాయిస్ ఫ్లూకిగెర్. విరాళాల వివరాలకు, Telugu Initiative at Emory, Prof. Joyce B. Flueckiger, reljbf@emory.edu Emory University, Atlanta కి దయచేసి వ్రాయండి.
సుమారు ఒక నెలక్రిందట కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం బర్కెలీ లో కూడా తెలుగు బోధనకి, సాహిత్య పరిశోధనకీ ఏర్పాట్లు చేయించేనిమిత్తం బే ఏరియా తెలుగు సంస్థలు, సాహితీ బృందాలు కలిసి పనిచేయడం మొదలుపెట్టాయి. బే ఏరియాలో డాలర్ల పంటకి కొదవలేదని వినికిడి. అమెరికాలో ఉన్న తెలుగు కోటీశ్వరులలో సగం మంది బే ఏరియాలోనే ఉన్నారుట! బర్కెలీలో అతి త్వరలో తెలుగులో ఆచార్య పదవీ స్థాపన జరుగుతుందని నా దృఢనమ్మకం. ఇతర వివరాలకు, Raka Ray, Center for South Asian Studies, University of California, Berkeley, rakaray@berkeley.edu ని సంప్రదించండి.
ఆఖరిగా మరొక్క మాట. సంస్కృత భాషా బోధన, సంస్కృతసాహిత్య పరిశోధన, ఈ దేశంలో పేరుమోసిన విశ్వవిద్యాలయాలలో చాలా కాలంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో, కారణాలు ఏమయితేనేం, హిందీ భాషా బోధన చాలా చోట్ల మొదలయ్యింది. ఈ రెండు భాషలూ ఉన్న ప్రతిచోటా తెలుగు ప్రవేశ పెట్టడం కోసం ప్రయత్నాలు జోరుగా సాగాలి. ఈ పనికి, స్థానిక సంస్థలు పూనుకోవాలి. స్థానిక సంస్థలకి, దేశవ్యాప్తంగా ఉన్న తానా, ఆటాలు ప్రోత్సహించాలి, మద్దతు ఇవ్వాలి. మాటల ప్రోత్సాహం నిరుపయోగం. మూటల మద్దతు అవశ్యం. ఇది ఎలా సాధ్యమవుతుంది అన్న ప్రశ్నకి సమాధానం: ప్రతి సంవత్సరమూ తానా వారో, ఆటా వారో, సాంస్కృతికోత్సవాలు చాలా పెద్ద ఎత్తున ఎంతో సందడిగా చేసుకుంటారు. ప్రతి ఏడూ ఆ ఉత్సవాలకి పెట్టే ఖర్చులో 10 శాతం తెలుగు బోధనకి తెలుగు సాహిత్య పరిశోధనకీ నిర్దేశిస్తే, హార్వర్డు నుంచి హోనోలూలూ దాకా ఉన్న విశ్వవిద్యాలయాలలో తెలుగు బోధనకి ఏర్పాట్లు చేయించడం ఎంత సులువైన పనో ఆలోచించండి.
K. Vardhani అభిప్రాయం:
July 2, 2006 9:58 am
I was so pleased to read the editorial. Telugu chair is not only important for teaching the languange but it will tremendously be helpful for our future generations. Since India is becoming a global business center, exposing the language and culture to non telugu speaking people is also crucial, especially for doctors, public health professionals, business people who visit Andhra Predesh . Even American professionals will get a better feel about Telugu culture and a little understaning of our language. It is about time the national Telugu organizations should take the lead.
సుధాకర్ అభిప్రాయం:
July 3, 2006 2:15 am
ఈ మాట తెలుగు యూనికోడ్ లో చాలా బాగుంది. కృతజ్ఞతలు.
Malathi అభిప్రాయం:
July 18, 2006 4:52 pm
A few days ago I posted a short msg, hoping that I’ll learn the unicode necessary for this site and will be able to write in Telugu. But it’s not going to happen any time soon. Therefore, here are my thoughts on the subject.
I am glad to see that the Telugu community is coming together to promote Telugu teaching/learning in this country. Beyond that, I am curious to know if the organizers had studied how the Telugu programs currently in place are faring and what is their status in the larger context of higher education in the US.
I have been associated with the Telugu program in Madison for several years. (The program is running for over 50 years now. I will post the complete article on the history of Telugu program in Madison on my website, www.thulika.net soon).
Secondly, what is the strategy of these organizers to get sufficient numbers enrolled in the program so the program could be self-supportive; how long will it take to make the program self-supportive.
Third is about Telugu fiction which may not be directly related to starting Telugu programs in universities but certainly has its share in it. This thought occurred to me while reading Kalpana Rentala’s article on the themes in diaspora fiction by women writers. She asked why Telugu women in America were not writing about today’s topics such as share market and gay/lesbian issues. I was thinking maybe because those topics are of immediate relevance to our youth and only they can write those stories effectively. But then again, how many of our youth are interested in writing fiction in Telugu, and do they have the language skills to write such stories in Telugu. I think this question also should be part of those planning sessions. In the final analysis, they are the ones that will register in your courses.
Let’s see if we can get more students committed to learning the language.
Thanks.
Malathi Nidadavolu.
C Rajendra prasad అభిప్రాయం:
July 27, 2006 11:26 am
మీ చివరి మాట,తానా ఆటా ల ఖర్చు లొ 10శాతం పెట్టినా తెలుగు బోధన సులభమవుతుందనటం నిజం.ఆ దిశలో ఆలొచన ప్రయత్నం జరిగితే చాలా బాగుంటుంది
Anuradha అభిప్రాయం:
November 8, 2006 7:20 pm
శ్రీ వెంకటేశ్వరరావు గారి సూచనలు చాలా బాగున్నాయి.వినోదాత్మక విషయాలకు పెట్టే ఖర్చులో 10% ,భాషాభివృద్ధికోసం ఉపయోగిస్తే ,తెలుగు జాతి తప్పకుండా ప్రగతిని సాధిస్తుంది.భాష,సంస్కృతి,ప్రగతి అనే ఈ మూడు విషయాల మధ్య అవినాభావ సంబంధం ఉంది. భాషలో సంస్కృతి పొదగబడి ఉంటుంది.సంస్కృతి లేని ప్రగతిని నిలుపుకోవడం సాధ్యం కాని విషయం.
pingali sasidhar అభిప్రాయం:
July 31, 2008 1:55 am
నేను గత కొంత కాలంగా ఈమాట చదువుతున్నాను. ముఖ్యంగా కొందరి కవితలు ఎంతగానో ఆకట్టుకుంటున్నయి. ఉదా: వైదేహి శశిధర్ గారివి చాలా చాలా ఇష్టము.
ఆయితే, నాకూ ఈమాటలో సభ్యుడినయ్యి నావీ కొన్ని కవితలు పంపాలని ఉంది. చాలా సార్లు యెలా పంపాలని అడిగాను. ప్రవాసాంధ్రులకే ఈ ఈమాట ప్రత్యేక మైతే సరే. అదే తెలియజేయండి. అదీ సంతొషమే ఒక పాఠకుడిగానే ఆనందిస్తా.
పింగళి శశిధర్ (జాబిల్లి)
[శశిధర్ గారు: ఈమాట ఎల్లలులేని ప్రపంచ పత్రిక. మీ రచనలకి ఆహ్వానం. దయచేసి రచయితలకి సూచనల పేజీ చూడండి. మీ రచనలని ఈ పేజీ క్రింద ఉన్న ఈమెయిల్ అడ్రస్‌కు మెయిల్ చెయ్యవచ్చు. అన్ని రచనలూ సమీక్షించబడతాయని గమనించగలరు. మీ నించి మంచి రచనలకై ఎదురు చూస్తాము.
– ఈమాట సంపాదక వర్గం]