ఈమాట » మనుచరిత్ర - ద్వితీయాశ్వాసము

Expand to right
Expand to left

మనుచరిత్ర - ద్వితీయాశ్వాసము

ద్వితీయాశ్వాసము

శ్రీఖండ శీతనగ మ
ధ్యాఖండక్షోణిమండ లాఖండల వి
ద్యాఖేలనభోజ సుధీ
లేఖద్రుమ కృష్ణరాయ లీలామదనా

అవధరింపుము జైమిని మునీంద్రునకుం ప్రజ్ఞాసాంద్రంబులగు పక్షీంద్రంబు లవ్వలికథ ఇట్లని చెప్పందొడంగె

అటజనికాంచె భూమిసురు డంబరచుంబి శిర స్సర జ్ఝరీ
పటల ముహుర్ముహు ర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్‌
కటకచరత్‌ కరేణు కర కంపిత సాలము శీతశైలమున్‌

కాంచి అంతరంగంబునం తరంగితంబగు హర్షోత్కర్షంబున

నరనారాయణ చరణాం
బురుహ ద్వయ భద్రచిహ్నముద్రిత బదరీ
తరు షండమండలాంతర
సరణిన్‌ ధరణిసురుండు సన చన నెదుటన్‌

ఉల్లల దలకా జలకణ
పల్లవిత కదంబ ముకుళ పరిమళ లహరీ
హల్లోహల మద బంభర
మల్లధ్వనులెసగ విసరె మరుదంకురముల్‌

తొండముల్‌ సాచి యందుగు చిగుళ్ళకు నిక్కు
కరుల దంతచ్ఛాయ కడలుకొనగ
నెలవుల వనదంశములుమూగి నెరెవెట్ట
కోల్పులుల్‌ పొదరిండ్ల గురకలిడగ
సెలయేటి యిసుకలంకల వరాహంబులు
మొత్తంబులై త్రవ్వి ముస్తెలెత్త
అడ్డంబు నిడువు నాబడ్డలగతి మను
బిళ్ళు డొంకలనుండి క్రేళ్ళుదాట

ప్రబల భల్లుక నఖ భల్ల భయద మథన
శిథిల మధుకోశ విసర వికీర్ణ మక్షి
కాంతరాంతర దంతురి తాతపమున
పుడమి తిలతండుల న్యాయమున వెలుంగ

పరికించుచు డెందంబున
పురికొను కౌతుకముతోడ భూమీసురు డ
గ్గిరి కటక తట నిరంతర
తరు గహన గుహా విహార తత్పరమతియై

నిడుద పెన్నెరిగుంపు జడగట్ట సగరు ము
మ్మనుమండు తపము గైకొనిన చోటు
జరఠ కచ్ఛప కులేశ్వరు వెన్ను గానరా
జగతికి మిన్నేరు దిగిన చోటు
పుచ్చడీకతనంబుపోబెట్టి గిరికన్య
పతిగొల్వ నాయాసపడిన చోటు
వలరాచరాచవా డలికాక్షు కనువెచ్చ
కరగిన యల కనికరపు చోటు

తపసియిల్లాండ్ర చెలువంబు తలచి తలచి
మున్ను ముచ్చిచ్చును విరాళిగొన్న చోటు
కనుపవులు వేల్పుబడవాలు కన్నచోటు
హర్షమున జూచి ప్రవరాఖ్యు డాత్మలోన

విలయ కృశానుకీలముల వేడిమి పోడిమి మాలి వెల్మిడిన్‌
కలసిన భూతధాత్రి మరి క్రమ్మర రూపయినిల్చి యోషధుల్‌
మొలవగ జేయునట్టి నయముం ప్రతికల్పము నెట్లు గాంచు నీ
చలిమలవల్ల నుల్లసిలు చల్లదనంబును నూనకుండినన్‌

పసపునిగ్గులుదేరు పాపజన్నిదమొప్ప
ప్రమథాధిపతి యింటిపట్టెరింగె
శచి కీత గరపుచు చదలేట సురరాజు
జలకేశి సవరించు చెలువెరింగె
అదనుతో చేపి చన్నవిసి యోషధుల మ
న్మొదవు కొండలకెల్ల పిదుకనెరిగె
వేల్పుటింతులలోన విర్రవీగుచు మేన
నవరత్నరచనల రవణమెరిగె

పరిపరివిధంపు జన్మంపు పరికరంపు
సొంపుసంపద నిఖిల నిలింపసభయు
నప్పటప్పటికిని జిహ్వత్రుప్పు డుల్ల
నామెత లెరింగెనీ తుషారాద్రి కతన

తలమే బ్రహ్మకునైన యీ నగమహత్వ్తంబెన్న నే నియ్యడం
గల చోద్యంబులు రేపు కన్గొనియెదం గాకేమి నేడేగెదన్‌
నళినీబాంధవ భాను తప్త రవికాంత స్యంది నీహార కం
దళ చూత్కారపరంపరల్‌ పయిపయిన్‌ మధ్యాహ్నముం దెల్పెడున్‌

అనుచు గ్రమ్మరువేళ నీహారవారి
బెరసి తత్పాదలేపంబు కరగిపోయె
కరగిపోవుట యెరుగ డద్ధరణిసురుడు
దైవకృతమున కిల నసాధ్యంబు కలదె

అతడ ట్లౌషధహీనుడై నిజపురీ యాత్రా మిళత్‌ కౌతుకో
ద్ధతి బోవన్‌ సపది స్ఫుటార్తి చరణద్వంద్వంబు రాకుండినన్‌
మతి చింతించుచు నవ్విధం బెరిగి హా నన్నిట్లు దైవంబ తె
చ్చితె యీ ఘోర వనప్రదేశమునకున్‌ సిద్ధాపదేశంబునన్‌

ఎక్కడి యరుణాస్పదపుర
మెక్కడి తుహినాద్రి క్రొవ్వి యే రాదగునే
అక్కట మును సనుదెంచిన
దిక్కిదియని యెరుగ వెడలుతెరు వెయ్యదియో

అకలం కౌషధసత్వముం దెలియ మాయా ద్వార కావంతి కా
శి కురుక్షేత్ర గయా ప్రయాగములు నే సేవింప కుద్దండ గం
డక వేదండ వరాహ వాహరిపు ఖడ్గ వ్యాఘ్ర మిమ్మంచుకొం
డకు రాజెల్లునె బుద్ధిజాడ్యజని తోన్మాదుల్‌ గదా శ్రోత్రియుల్‌

నను నిముసంబుగానకయున్న నూరెల్ల
నరయు మజ్జనకుడెం తడలునొక్కొ
ఎపుడు సంధ్యలయందు నిలువెళ్ళనీక న
న్నోమెడు తల్లి యెంతొరలునొక్కొ
అనుకూలవతి నాదు మనసులో వర్తించు
కులకాంత మదినెంత కుందునొక్కొ
కేడ తోడునీడలై వర్తించు సచ్ఛాత్రు
లింతకు నెంత చింతింతురొక్కొ

అతిథిసంతర్పణంబు లేమయ్యెనొక్కొ
అగ్నులేమయ్యెనొక్కొ నిత్యంబులైన
కృత్యములబాసి దైవంబ కినుకనిట్లు
పారవైచితె మిన్నులుపడ్డ చోట

నను నిలుసేర్చు నుపాయం
బొనరింపగజాలు సుకృతి యొక డొదవడొకో
యనుచున్‌ చింతాసాగర
మున మునిగి భయంబు గదుర పోవుచు నెదురన్‌

కులిశధారాహతి పొలుపున పైనుండి
యడుగుమోవగ జేగురైనతటుల
కనుపట్టులోయ గంగానిర్ఝరము వార
చలువయౌ నయ్యేటి కొలకులందు
నిసుకవెట్టిన నేల నేచి యర్కాంశుల
చొరనీక దట్టమై యిరులు గవియు
క్రముక పున్నాగ సారంగ రంభా నారి
కేళాది విటపి కాంతారవీథి

గెరలు పిక శారికా కీర కేకి భృంగ
సారసధ్వని తనలోని చంద్రకాంత
దరులు ప్రతిశబ్దమీన గంధర్వ యక్ష
గాన ఘూర్ణితమగు నొక్క కోనగనియె

కనుగొని యిది మునియాశ్రమ
మను తహతహవొడమి యిచటి కరిగిన నాకున్‌
కననగు నొక తెరకువ యని
మనమునగల దిగులు కొంత మట్టువడంగన్‌

నికట మహీధరాగ్ర తట నిర్గత నిర్ఝరధార బాసి లో
యకు తలక్రిందుగా మలకలైదిగు కాలువవెంట పూచు మ
ల్లిక లవలంబనంబుగ నలిప్రకరధ్వని చిమ్మిరేగ లో
నికి మణిపట్టభంగసరణిన్‌ ధరణీసురుడేగి చెంగటన్‌

తావుల్‌ క్రేవలజల్లు చెంగలువ కేదారంబు తీరంబునన్‌
మావుల్‌ క్రోవులు నల్లిబిల్లిగొను కాంతారంబునం దైందవ
గ్రావాకల్పిత కాయమాన జటిల ద్రాక్షా గుళుచ్ఛంబులన్‌
పూవుందీవెల నొప్పు నొక్క భవనంబున్‌ గారుడోత్కీర్ణమున్‌

కాంచి తదీయ విచిత్రో
దంచిత సౌభాగ్యగరిమ కచ్చెరువడి య
క్కాంచనగర్భాన్వయమణి
యించుక దరియంగ నచటికేగెడు వేళన్‌

మృగమద సౌరభ విభవ
ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీగంధ
స్థగితేతర పరిమళమై
మగువ పొలుపు తెలుపు నొక్క మారుతమొలసెన్‌

అతడా వాతపరంపరా పరిమళ వ్యాపార లీలన్‌ జనా
న్విత మిచ్చోటని చేరబోయి కనియెన్‌ విద్యుల్లతావిగ్రహన్‌
శతపత్రేక్షణ చంచరీకచికురన్‌ చంద్రాస్య చక్రస్తనిన్‌
నతనాభిన్‌ నవలా నొకానొక మరున్నారీ శిరోరత్నమున్‌

అమల మణిమయ నిజమందిరాంగణస్థ
తరుణసహకార మూల వితర్ధి మీద
శీతలానిల మొలయ నాసీనయైన
అన్నిలింపాబ్జముఖియు అయ్యవసరమున

తతనితం బాభోగ ధవళాంశుకములోని
అంగదట్టపు కావిరంగువలన
శశికాంతమణిపీఠి జాజువారగ కాయ
లుత్తుంగ కుచపాళి నత్తమిల్ల
తరుణాంగుళీ ధూత తంత్రీస్వనంబుతో
జిలిబిలిపాట ముద్దులు నటింప
ఆలాపగతి చొక్కి యరమోడ్పు కనుదోయి
రతిపారవశ్య విభ్రమము తెలుప

ప్రౌఢి పలికించు గీతప్రబంధములకు
కమ్ర కరపంకరుహ రత్న కటక ఝణఝ
ణధ్వనిస్ఫూర్తి తాళమానములు కొలుప
నింపు తళుకొత్త వీణ వాయింపుచుండి

అబ్బురపాటుతోడ నయనాంబుజముల్‌ వికసింప కాంతి పె
ల్లుబ్బి కనీనికల్‌ వికసితోత్పలపంక్తుల క్రుమ్మరింపగా
గుబ్బమెరుంగు చన్గవ గగుర్పొడువన్‌ మదిలోన కోరికల్‌
గుబ్బతిలంగ చూచె నలకూబరసన్నిభు నద్ధరామరున్‌

చూచి ఝళంఝళత్‌ కటకసూచిత వేగ పదారవిందయై
లేచి కుచంబులున్‌ తురుము లేనడు మల్లలనాడ నయ్యెడన్‌
పూచిన యొక్క పోక నునుబోదియజేరి విలోకనప్రభా
వీచికలన్‌ తదీయ పదవీ కలశాంబుధి వెల్లిగొల్పుచున్‌

మునుమున్‌ పుట్టెడు కొంకు లౌల్యమునిడన్‌ మోదంబు విస్తీర్ణతన్‌
జొనుపన్‌ కోర్కులు క్రేళ్ళుద్రిప్ప మదిమెచ్చుల్‌ రెప్పలల్లార్ప న
త్యనుషంగస్థితి రిచ్చపాటొసగ నొయ్యారంబునన్‌ చంద్రికల్‌
దనుకన్‌ చూచె లతాంగి భూసురు ప్రఫుల్లన్నేత్రపద్మంబులన్‌

పంకజముఖి కప్పుడు మై
నంకురితములయ్యె పులక లావిష్కృత మీ
నాం కానల సూచక ధూ
మాంకురములు బోలె మరియు నతనిన్‌ చూడన్‌

తొంగలిరెప్పలం తొలగద్రోయుచు పైపయి విస్తరిల్లు క
న్నుంగవ యాక్రమించుకొనునో ముఖచంద్రు నటంచు పోవనీ
కంగజు డానవెట్టి కదియన్‌ గురివ్రాసె ననంగ జారి సా
రంగమదంబు లేజెమట క్రమ్మె లలాటము డిగ్గి చెక్కులన్‌

అనిమేషస్థితిమాన్పె బిత్తరపుచూ పస్వేదతావృత్తి మా
న్పె నవస్వేదసమృద్ధి బోధకళమాన్పెన్‌ మోహవిభ్రాంతి తో
డనె గీర్వాణవధూటికిన్‌ భ్రమరకీటన్యాయ మొప్పన్‌ మను
ష్యుని భావించుట మానుషత్వము మెయింజూపెట్టెనా నత్తరిన్‌

ఇట్లతని రూపరేఖావిలాసంబులకుం జొక్కి యక్కమలపత్రేక్షణ యాత్మగతంబున

ఎక్కడివాడొ యక్షతన యేందు జయంత వసంత కంతులన్‌
చక్కదనంబునన్‌ గెలువజాలెడువాడు మహీసురాన్వయం
బెక్కడ ఈ తనూవిభవమెక్కడ యేలనిబంటుగా మరున్‌
డక్కకొనంగరాదె అకటా నను వీడు పరిగ్రహించినన్‌

వదనప్రభూత లావణ్యాంబుసంభూత
కమలంబులన వీని కన్నులమరు
నిక్కి వీనులతోడ నెక్కసక్కెములాడు
కరణినున్నవి వీని ఘనభుజములు
సంకల్పసంభ వాస్థానపీఠికవోలె
వెడదయైకనుపట్టు వీని యురము
ప్రతిఘటించు చిగుళ్ళపై నెర్రవారిన
రీతినున్నవి వీని మృదుపదములు

నేరెటేటియసల్‌ తెచ్చి నీరజాప్తు
సానబట్టిన రాపొడిచల్లి మెదిసి
పదను సుధనిడి చేసెనో పద్మభవుడు
వీని కాకున్న కలదె ఈ మేనికాంతి

సుర గరు డోరగ నర ఖే
చర కిన్నర సిద్ధ సాధ్య చారణ విద్యా
ధర గంధర్వ కుమారుల
నిరతము కనుగొనమె పోలనేర్తురె వీనిన్‌

అని చింతించుచు మీనకేతన ధనుర్య్జా ముక్త నారాచ దు
ర్దిన సమ్మూర్ఛిత మానసాంబురుహయై దీపించు పెందత్తరం
బున పేటెత్తిన లజ్జ నంఘ్రికటకంబుల్‌ మ్రోయ నడ్డంబు ని
ల్చిన నయ్యచ్చర జూచి చేరజని పల్కెన్‌ వాడు విభ్రాంతుడై

ఎవ్వతెవీవు భీతహరిణేక్షణ ఒంటి చరించె దోటలే
కివ్వనభూమి భూసురుడ నే ప్రవరాఖ్యుడ త్రోవతప్పితిన్‌
క్రొవ్వున నిన్నగాగ్రమునకున్‌ చనుదెంచి పురంబుచేర నిం
కెవ్విధి కాంతు తెల్పగదవే తెరువెద్ది శుభంబు నీకగున్‌

అని తనకథ నెరిగించిన
తన కనుగవ మెరుగులుబ్బ తాటంకములున్‌
చనుగవయు నడుము వడకగ
వనిత సెలవివార నవ్వి వానికి ననియెన్‌

ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర ఏ
కాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు లా
గింతియ కాక నీవెరుగవే మునువచ్చిన త్రోవచొప్పు నీ
కింత భయంబులే కడుగ నెల్లిదమైతిమె మాటలేటికిన్‌

అని నర్మగర్భంబుగా బలికి క్రమ్మర నమ్మగువ యమ్మహీసురున కిట్లనియె

చిన్ని వెన్నెలకందు వెన్నుదన్ని సుధాబ్ధి
పొడమిన చెలువ తోబుట్టు మాకు
రహివుట్ట జంత్రగాత్రముల రాల్‌ కరగించు
విమలగాంధర్వంబు విద్య మాకు
అనవిల్తుశాస్త్రంపు మినుకు లావర్తించు
పని వెన్నతోడ పెట్టినది మాకు
హయమేధ రాజసూయములన పేర్వడ్డ
సవనతంత్రంబు లుంకువలు మాకు

కనకనగసీమ కల్పవృక్షముల నీడ
పచ్చరా చట్టుగమి రచ్చపట్టు మాకు
పద్మసంభవ వైకుంఠ భర్గ సభలు
సాముగరిడీలు మాకు గోత్రామరేంద్ర

పేరు వరూధిని విప్ర కు
మార ఘృతాచీ తిలోత్తమా హరిణీ హే
మా రంభా శశిరేఖ లు
దారగుణాఢ్యలు మదీయలగు ప్రాణసఖుల్‌

బహురత్న ద్యుతిమేదురోదర దరీభాగంబులం బొల్చు ని
మ్మిహికాహార్యమునన్‌ చరింతుమెపుడున్‌ ప్రేమన్‌ నభోవాహినీ
లహరీ శీతల గంధవాహ పరిఖేల న్మంజరీ సౌరభ
గ్రహణేందిందిర తుందిలంబులివి మత్కాంతార సంతానముల్‌

భూసుర కైతవకుసుమశ
రానన మాయింటి విందవైతివి గైకొ
మ్మా సముదంచ న్మణిభవ
నాసీనత సేద తీరి యాతిథ్యంబున్‌

కుందనమువంటి మేను మధ్యంది నాత
పోష్మహతి కందె వడదాకె నొప్పులొలుకు
వదన మస్మద్గృహంబు పావనము సేసి
బడలికలు వాసిచను మన్న బ్రాహ్మణుండు

అండజయాన నీవొసగునట్టి సపర్యలు మాకునచ్చె నిం
దుండగరాదు పోవలయునూరికి నింటికి నిప్పుడేను రా
కుండ నొకండువచ్చి మరియొండునె భక్తియ చాలు సత్క్రియా
కాండముతీర్ప వేగ చనగావలయున్‌ కరుణింపు నాపయిన్‌

ఏ నిక నిల్లుసేరుటకు నెద్ది యుపాయము మీ మహత్వ్తముల్‌
మానిని దివ్యముల్‌ మది తలంచిన నెందును మీ కసాధ్యముల్‌
కానము కాన తల్లి ప్రజలన్‌ నను కూర్పుమటన్న లేత న
వ్వాననసీమ తోప ధవళాయతలోచన వానికిట్లనున్‌

ఎక్కడియూరు కాల్నిలువ కింటికిబోయెదనంచు పల్కె దీ
వక్కట మీ కుటీరనిలయంబులకున్‌ సరిరాకపోయెనే
యిక్కడి రత్నకందరము లిక్కడి నందనచందనోత్కరం
బిక్కడి గాంగసైకతము లిక్కడి యీ లవలీనికుంజముల్‌

నిక్కముదాపనేల ధరణీసురనందన యింక నీపయిన్‌
చిక్కె మనంబు నాకు నను చిత్తజుబారికి నప్పగించెదో
చొక్కి మరందమద్యముల చూరల పాటలువాడు తేంట్ల సొం
పెక్కినయట్టి పూవు పొదరిండ్లను కౌగిట గారవించెదో

అనుటయు ప్రవరుం డిట్లను
వనజేక్షణ యిట్లు పలుక వరుసయె వ్రతులై
దినములు గడిపెడు విప్రుల
చనునే కామింప మది విచారము వలదే

వేలిమియున్‌ సురార్చనయు విప్రసపర్యయు చిక్కె భుక్తికిన్‌
వేళ యతిక్రమించె జననీజనకుల్‌ కడువృద్ధు లాకటన్‌
సోలుచు చింతతో నెదురుసూచుచునుండుదు రాహితాగ్ని నే
దూలు సమస్తధర్మములు తొయ్యలి నేడిలుసేరకుండినన్‌

నావుడు విన్నబాటు వదనంబున నించుక దోప పల్కె నో
భావజరూప యిట్టి యెలప్రాయము వైదికకర్మనిష్ఠలం
పోవగ నింక భోగములబొందుట యెన్నడు యజ్ఞకోటులం
బావనులౌటకున్‌ ఫలము మా కవుగిళ్ళ సుఖించుటే కదా

సద్యోవినిర్భిన్న సారంగనాభికా
హృదమై పిసాళించు మృగమదంబు
కసటువో బీరెండ కరగి కర్రలవంటి
గమగమ వలచు చొక్కపుజవాజి
పొరలెత్తి ఘనసారతరువుల తనుతాన
దొరగిన పచ్చకప్పురపు సిరము
గొజ్జంగి పూబొదల్‌ కురియంగ పటికంపు
దొనల నిండినయట్టి తుహినజలము

వివిధ కుసుమకదంబంబు దివిజతరుజ
మృదుల పనస ఫలాస వామేయ రత్న
భూషణంబులు కలవిందు భోగపరుడ
వయి రమింపుము ననుగూడి యనుదినంబు

అందునకు కొరయె వెన్నెల
గంధర్వాంగనల పొందు కాదని సంసా
రాంధువున పడియె దకట ది
వాంధము వెలుగుగని గొందినడగిన భంగిన్‌

ఎన్ని భవంబులన్‌ కలుగు నిక్షుశరాసన సాయక వ్యథా
ఖిన్నత వాడి వత్తలయి కేల కపోలములూది చూపులన్‌
విన్నదనంబు తోప కనువేదురునన్‌ పయిగాలి సోకినన్‌
వెన్నవలెన్‌ కరంగు అలివేణుల కౌగిటచేర్చు భాగ్యముల్‌

కుశలత యే వ్రతములనగు
నశనాయాపీడ నింద్రియనిరోధమునన్‌
కృశుడవయి యాత్మనలచుట
సశరీరస్వర్గసుఖము సమకొని యుండన్‌

అనిన ప్రవరుండు నీవన్న యర్థమెల్ల
నిజము కాముకుడైనవానికి అకాము
డిది గణించునె జలజాక్షి యెరిగితేని
నగరమార్గంబు చూపి పుణ్యమున పొమ్ము

బ్రాహ్మణు డింద్రియవశగతి
జిహ్మాచరణైక నిపుణ చిత్తజ నిశితా
జిహ్మగముల పాలై చెడు
బ్రహ్మానందాధిరాజ్య పదవీచ్యుతుడై

అనిన నత్తెరవ యక్కరకరిపలుకుల కులికి గరిగరింగరప గరకరిం జెరకువిలుకాడు పరగించు విరిదమ్మిగొరకలు నెరకుల చురుకుచురుక్కునం గాడిన గడుం గెరలి పరిణత వివిధ విబుధతరు జనిత మధురమధురసం బాను మదంబు నదటునం జిదిమిన నెరుంగక మదనహరునైన జదురునం గదియ గమకించు తిమురునం గొమిరెప్రాయంపు మదంబునను నొంటిపాటునం గంటికిం బ్రియంబై తంగేటిజున్ను చందంబునం గొంటుదనంబెరుంగక కురంగటనున్న యమ్మహీసురవరకుమారు తారుణ్య మౌగ్య్ధంబులం జేసి తన వైదగ్య్ధంబు మెరయగలిగెనని పల్లవించు నుల్లంబు నుల్లాసంబునం గదురు మదంబున నోసరించక చంచల దృగంచలప్రభ లతని ముఖాంబుజంబున బొలయ వలయ మణిగణచ్ఛాయాకలాపంబు లుప్పరంబెగయ కొప్పుచక్కం జెక్కుచు జక్కవగిబ్బలుంబోని గబ్బిగుబ్బలన్‌ జొబ్బిల్లు కుంకుమరసంబునం బంకిలంబులగు హారముక్తా తారకంబుల నఖకోరకంబులం గీరి తీరువడంజేయుచు పతిత వనతరు కుసుమ కేసరంబులు రాల్చు నెపంబున పయ్యెదవిదిల్చి చక్కసవరించుచు నంతంతం బొలయు చెలులం దలచూపకయుండం దత్తరంబునంజేసి బొమముడిపాటుతో మగిడిమగిడి చూచుచు జిడిముడిపాటు చూపుల నంకురించు జంకెల వారించుచుం జేరి యిట్లనియె

ఎందే డెందము కందళించు రహిచే నేకాగ్రతన్‌ నిర్వృతిం
జెందుం కుంభగత ప్రదీపకళికాశ్రీ దోప నెందెందు పో
కెందే నింద్రియముల్‌ సుఖంబు గను నా యింపే పరబ్రహ్మ, “మా
నందో బ్రహ్మ” యటన్న ప్రాజదువు నంతర్బుద్ధి నూహింపుమా

అనుచు తన్నొడబరుచు నయ్యమరకాంత
తత్తరము జూచి యాత్మ నతండు తనకు
సిగ్గు వెగటును బొడమ నిస్పృహత తెలుపు
నొక్క చిరునవ్వు నవ్వి యయ్యువిద కనియె

ఈ పాండిత్యము నీకు దక్క మరియెందే కంటిమే కామశా
స్త్రోపాధ్యాయిని
నా వచించెదవు మేలోహో త్రయీధర్మముల్‌
పాపంబుల్‌ రతి పుణ్యమంచు నిక నేలా తర్కముల్‌ మోక్ష ల
క్ష్మీప థ్యాగమసూత్ర పంక్తికివెపో మీ సంప్రదాయార్థముల్‌

తరుణీ రేపును మాపు హవ్యములచేతం తృప్తుడౌ వహ్ని స
త్కరుణాదృష్టి నొసంగు సౌఖ్యము లెరుంగన్‌ శక్యమే నీకు ఆ
కరణుల్‌ దర్భలు నగ్నులుం ప్రియములైన ట్లన్యముల్‌ కా వొడల్‌
తిరమే చెప్పకు మిట్టితుచ్ఛసుఖముల్‌ మీసాలపై తేనియల్‌

అనుటయు మాటలేక హృదయాబ్జము జల్లన మోము వెల్లనై
కనలుచు నీరుదేరు తెలికన్నుల నాతని పుల్కుపుల్కునన్‌
కనుగొని మాటలం బొదువు గద్గదికం తలయూచి యక్కటా
వనిత తనంతతా వలచివచ్చిన చుల్కన కాదె యేరికిన్‌

వెతలంబెట్టకుమింక నన్ననుచు నీవీబంధమూడన్‌ రయో
ద్ధతి నూర్పుల్‌ నిగుడన్‌ వడిన్‌ విరులుచిందం కొప్పువీడం తనూ
లత తోడ్తో పులకింపగా ననునయాలా పాతిదీ నాస్యయై
రతిసంరంభము మీర నిర్జరవధూరత్నంబు పైపాటునన్‌

ప్రాంచద్భూషణ బాహుమూలగతితో పాలిండ్లుపొంగార పై
యంచుల్‌ మోవగ కౌగిలించి యధరంబాసింప హా శ్రీహరీ
యంచున్‌ బ్రాహ్మణు డోరమోమిడి తదీయాంసద్వయం బంటి పొ
మ్మంచున్‌ ద్రోచె కలంచునే సతులమాయల్‌ ధీరచిత్తంబులన్‌

త్రోపువడి నిలిచి ఘన ల
జ్జా పరవశయగుచు కొప్పుసవరించి యొడల్‌
దీపింప నతని చురచుర
కోపమునన్‌ చూచి క్రేటుకొనుచున్‌ పలికెన్‌

పాటున కింతులోర్తురె కృపారహితాత్మక నీవు త్రోవ ని
చ్చోట భవన్నఖాంకురము సోకె కనుంగొనుమంచు చూపి య
ప్పాటలగంధి వేదననెపంబిడి యేడ్చె కలస్వనంబుతో
మీటిన విచ్చు గుబ్బచనుమిట్టల నశ్రులు చిందువందగన్‌

ఈ విధమున నతికరుణము
గా వనరుహనేత్ర కన్నుగవ ధవళరుచుల్‌
కావికొననేడ్చి వెండియు
నా విప్రకుమారు జూచి యలమట పల్కెన్‌

చేసితి జన్నముల్‌ తపము చేసితి నంటి దయావిహీనతన్‌
చేసిన పుణ్యముల్‌ ఫలముసెందునె పుణ్యములెన్నియేనియున్‌
చేసినవాని సద్గతియె చేకురు భూతదయార్ద్రబుద్ధి కో
భూసురవర్య యింత తలపోయవు నీచదువేల చెప్పుమా

వెలివెట్టిరే బాడబులు పరాశరు బట్టి
దాశకన్యాకేళి తప్పుచేసి
కులములో వన్నెతక్కువయయ్యెనే గాధి
పట్టికి మేనక చుట్టరికము
అనుపుకాడై వేల్పు నాగవాసము గూడి
మహిమ గోల్పడియెనే మాందకర్ణి
స్వారాజ్య మేలంగనీరైరె సుర లహ
ల్యాజారుడైన జంభాసురారి

వారికంటెను నీ మహత్వ్తంబు ఘనమె
పవన ప ర్ణాంబు భక్షులై నవసి యినుప
కచ్చడాల్‌ కట్టుకొను మునిమ్రుచ్చులెల్ల
తామరసనేత్ర లిండ్ల బందాలు కారె

అనిన నేమియు ననక యవ్వనజగంధి
మేని జవ్వాదిపస కదంబించు నొడలు
కడిగికొని వార్చి ప్రవరుండు గార్హపత్య
వహ్ని నిట్లని పొగడె భావమున తలచి

దివిషద్వర్గము నీముఖంబునన తృప్తిం గాంచు నిన్నీశుగా
స్తవముల్‌ సేయు శ్రుతుల్‌ సమస్తజగదంతర్యామివిన్‌ నీవ యా
హవనీయంబును దక్షిణాగ్నియును నీయం దుద్భవించున్‌ క్రతూ
త్సవసంధాయక నన్ను కావగదవే స్వాహావధూవల్లభా

దాన జ పాగ్నిహోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజ
ధ్యానరతుండనేని పరదారధనాదుల కోరనేని స
న్మానముతోడ నన్ను సదనంబున నిల్పు మినుండు పశ్చిమాం
భోనిధిలోన క్రుంకకయమున్న రయంబున హవ్యవాహనా

అని సంస్తుతించిన నగ్నిదేవుం డమ్మహీదేవు దేహంబున సన్నిహితుం డగుటయు నమ్మహాభాగుండు గండుమీరి పొడుపుగొండ నఖండ సంధ్యారాగ ప్రభామండ లాంతర్గతుండగు పుండరీకవనబంధుడుంబోలె నుత్తప్త కనకద్రవధారాగౌరంబగు తనూచ్ఛాయా పూరంబున నక్కాన వెలిగించుచు నిజగమననిరోధిని యగు నవ్వరూధిని హృదయకంజంబున రంజిల్లు నమందానురాగరస మకరందంబు నందంద పొంగంజేయుచు పావకప్రసాద లబ్ధంబగు పవనజవంబున నిజమందిరంబునకరిగి నిత్యకృత్య సత్కర్మకలాపంబులు నిర్వర్తించెనని మార్కండేయుండు క్రోష్టికిం జెప్పెనని చెప్పిన

జైమిని యా దివ్య ఖగ
గ్రామణులం జూచి వేడ్కగడలుకొనంగా
ఆ మీద వరూధిని విధ
మేమయ్యె నెరుంగ చెప్పరే నా కనుడున్‌

 

(20 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. baabjeelu అభిప్రాయం:

    August 5, 2008 7:45 am

    నాలుగవ తరగతి చదువుతున్న మా అమ్మాయికి, తెలుగు “రెసిటేషన్” పోటీకి, మూడు పెద్దన గారి పద్యాలు, మనుచరిత్రము నుండి, వాళ్ళ తెలుగు “మేమ్” ఇచ్చేరు.
    “మేమ్” గారూ శిష్యురాలూ కలిసి, మూడు పద్యాలూ వచన కవిత్వంలా రాసేరు.
    వచనకవిత్వాన్ని ఛందస్సర్పపరిష్వంగంలోకి తీసుకెళ్ళాలి. పగవాడికి కూడా వద్దు ఈ బాధ.
    “… ప్రాలేయ (కామా) రుణ్మండలీ..” అని రాసేరు “తెలుగుమేమ్ గారు”.(నా యూనీకోడ్ చేతకాని స్పెల్లింగ్ “రుణ్మండలీ”)

    మూడవ తరగతి లో “అల వైకుంఠపురములో..” పద్యం, “సిరికింజెప్పడు..” పద్యం “రిసైట్” చేసి “ఫస్ట్ ప్రైజ్” “కొట్టేసిన” విద్యార్ధినిని, “నాలుగోక్లాసు మేమ్” “బాగా చెప్పి ప్రైజ్ రాకపోతే వుంది నీ పెళ్ళి” అని భయపెట్టి మరీ పంపించింది.

    మనుచరిత్ర(ము, ప్రథమా విభక్తి????) ఇప్పుడెక్కడ దొరుకుతుందిరా “దేవుడా” (ప్రథమా విభక్తి కాదు) అని అనుకుంటూంటే, “ఈమాట” “గ్రంధాలయం” గుర్తొచ్చి బతుకుజీవుడా అనుకున్నాను.
    “ఈ మాట” చలవ వల్ల పద్యాలు, పద్యాల్లా దొరికేయి. “ప్రైజ్” మాట దేవుడెరుగు, “ప్రైజ్” రాకపోతే “నాలుగోక్లాసు మేమ్ చేతిలో మా అమ్మాయి పెళ్ళి దేవుడెరుగు.”
    “ఈ మాట” నామాం మరువాం, మరువాం.

    చిన్న పిట్టకథ: కిందటేడాది నాకు “ఈ మాట” పరిచయం లేక, “సిరికిం..” పద్యం కోసం, తెలిసిన వాళ్ళిళ్ళకి తిరిగేను. ఓ ఇంట్లో, ఓ ఐటీ అమ్మాయి, ఏడాది కొడుక్కి అన్నం పెడుతూ “అంకుల్, అది శ్రీరామదాసు సినిమాలోది” అంది. ఆ పిల్ల తల్లితండ్రులు చాలా గర్వంగా చూసేరు నావేపు. “ధన్యోస్మి” అని మనసులో అనుకుని, “థేంక్సు సుజాతా” అని బయటకని, బయటపడ్డాను.
    గణవిభజన చేసి “అల వైకుంఠపురములో…” “సెట్” చెయ్యగలిగేను. “సిరికింజెప్పడు..” మాత్రం “శ్రీరామదాసు సినిమా సిడిలో” బాలసుబ్రహ్మణ్యం పాడినదే దిక్కయిపోయింది.

    [బాబ్జీలు గారు: అభిప్రాయాలు రాసే పెట్టె పైన ఉన్న “కీబోర్డు మ్యాపింగ్ చూపించండి” అన్న లింకు నొక్కితే మీకు R.T.S. (Rice Transliteration Standard) కీబోర్డు మ్యాపింగ్ ప్రత్యక్షమవుతుంది. ఋకారానికి “ru” బదులు “R” అని టైపు చెయ్యాలి. ఉదా: కృష్ణుడు (kRshNuDu), సంస్కృతం (samskRtam). వర్గాల వారీగా అనునాసికాలు: ఙ (~ma), ఞ్ (~na), ణ (Na), న (na), మ (ma). మరికొన్ని ఉదాహరణలు: జ్ఞానము (j~nAnamu), ప్రాలేయరుఙ్మండలీ (prAlEyaru~mmanDalI) ఇవి మీకు ఉపయోగపడతాయని ఆశిస్తాను. — పద్మ, ఈమాట సంపాదక వర్గం.]

  2. Kameswara Rao అభిప్రాయం:

    August 6, 2008 3:32 am

    పద్యాలని వాటి ఛందస్సు ప్రకారం “రిసైట్” చేస్తారా?!

  3. baabjeelu అభిప్రాయం:

    August 7, 2008 9:44 am

    “ఈ మాట” సంపాదక వర్గానికి
    వుప్పల లక్ష్మణరావు గారి ప్రభావం వల్ల “అమ్రుతం”, “క్రుష్ణుడు”, “క్రుతగ్యత”, “సంస్క్రుతం” వగైరాలు.
    “ప్రాలేయరుఙ్మండలీ” తెలుగులో రాయడానికి సాయం చేసినందుకు సంపాదకవర్గానికి “క్రుతగ్యతలు”. “డబలెమ్” రాయాలని్ పట్టుకోలేకపోయేను.

    కామేశ్వర రావు గారికి,
    నేను కోరిన కొండ మీద వాన కురిసిందని “నామిని” రాస్తే పూర్తిగా అర్ధం కాలేదు. మీ చిన్న వాక్యం “డైనమైట్” లా పేలింది. ఆ వ్యాక్యం అర్ధం పూర్తిగా “అర్ధవయ్యింది”.

    అ) చందస్సు ప్రకారం “రెసైట్” చెయ్యడానికని చందస్సు “చెక్” చెయ్యలేదు. పద్యం, పద్యంలా రాసుకోవాలి కదా. అందుకు.
    “అల వైకుంఠ…” చిన్నప్పుడు ఎందువల్ల కంఠతా పట్టేనో గుర్తులేదు, పద్యం గుర్తుంది. అందుకని ఇన్ని దశాబ్దాల తరవాత గణవిభజన చేసి పద్యం పద్యంలా “తయారు చేయగలిగేను. (ఇంకా “రిసైట్” చేయడం వరకూ రాలేదు.)
    “సిరికిం జెప్పడు..” బహుశా “ఎగ్జామ్” లో రాదని “మేషారు” చెబితే వదిలేసేనేమో? కొన్ని పదాలకి అర్ధం కూడా సరిగ్గా తెలీదు. “అభ్రతపతి” కి “గరుత్మంతుడని, “ఆకర్ణికాంతరథమిల్లము” అంటే “విల్లు బాణాలు” అని “జక్కనొత్తడు” అంటే “పట్టుకోడు” అని నాలుగో తరగతి పిల్లకి చెప్పేను. తప్పులయుండొచ్చు. తప్పులేనేమో.
    ఆ) నిన్న నేను “ఈ మాట” పాత సంచికలలో “దేశికాచారి” గారు రాసిన వ్యాసం, చందస్సు గురించి ( తారీఖు, ఇది రాస్తూ ఎలా వెనక్కి వెళ్ళి “చెక్” చెయ్యాలో నాకు తెలీదు, ఈ అభిప్రాయం “సబ్మిట్” చేసేక అది వెతుకుతాను. ) , చదివేను. చందస్సు కవిత్వం రాయడానికి బాగా వుపయోగపడుతుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీశ్రీ, కాళోజీ గారు కూడా చందస్సు అనే పాముకాటుకి ఎలా గురయ్యారో సోదాహరణంగా రాసేరు. “జయప్రభ” గారి కవిత్వం కూడా ఉదహరించేరు. ఇంకా చాలా మంది ఆధునిక కవుల కవిత్వాన్ని కూడా వుదహరించేరు. వ్యాసాలు రాసేవాళ్ళందరూ వాళ్ళకి అనువయిన వుదాహరణలే తీసుకుంటారు. అందువల్ల ఆ వుదాహరణలకి అంత “ఏల్యూయేషన్” వుండదు. ఎందుకంటే అన్ని సహజ సంఖ్యలకీ ఆ “థీరమ్” రుజువవాలి. దీని మీద ఎక్కువ ఇక్కడ నేను రాయను. దీని గురించి మీరేం రాయకండి.
    ఆ వ్యాసం చదివిన తరవాత, ఏపని చేస్తున్నా, ఒకటే ప్రశ్న వెంటాడింది.
    ఆ ప్రశ్న “సిరికిం జెప్పడు…” పద్యమే.
    “… శంఖచక్రయుగమున్ జేదోయి సంధింపడేపరివారంబున్ జీరడభ్రతపతింబన్నింపడాకర్ణికాంతరథమ్మిలములన్ జక్కనొత్తడు..”
    ఇదంతా కలిపి చదవాలా? చదవక్కర్లేదా? చదివినపుడు కలిపి, ఒకే గుక్కలో చదవక్కరలేక పోతే “డా” లన్నిటినీ కలపడవెందుకు? ఇలా ఎందుకు రాయకూడదు?
    “….శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు,
    ఏ పరివారంబున్ జీరడు, అభ్రతపతింబన్నింపడు,
    ఆకర్ణికాంతరథమ్మిలము జక్కనొత్తడు..” అని ఎందుకు రాయకూడదు.
    రాయడానికి చందస్సు కావాలి, చదవడానికి ఎందుకు అక్కర్లేదు?
    కామేశ్వర రావు గారూ,
    దయచేసి ఛందస్సు ప్రకారం పద్యమెందుకు రాయలి? చదివినపుడు ఎందుకు విడగొట్టాలి? దీని మీదే (ప్లీజ్) రాయండి. మిగిలినవాటిగురించి రాసి మీ సమయం వ్రుధా చేసుకోకండి.

    “ధారణ” ముఖ్యావసరం వేదకాలంనాటినుంచీ, తాళపత్ర గ్రంథాలొచ్చిన తరవాత కూడాతప్పలేదు. “గుటెన్ బెర్గ్” తరవాత ధారణ అక్కరలేదు. “కుందుర్తి ఆంజనేయులు” గారి “నగరంలో వాన” కవిత ధారణకి లొంగదు అయినా ఇబ్బంది లేదు. అందులోని “కోటబుల్ కోట్స్” గుర్తుంటాయి. పూర్తి పాఠం కావాలంటే పుస్తకం వుంటుంది. ఎక్కాలు గుర్తుంచుకోవలసిన తరం “రెండోట్ల రెండు. రెండ్రెళ్ళ్నాలుగు..” అని “రిథిమిక్” గా కంఠతా పట్టేరు. “కేలిక్యులేటర్” ఆ తరవాత “కంపూటర్” వచ్చేక కంఠతా అవసరం తీరిపోయిందికదా? “ఇంటర్నెట్” వచ్చాక ఇంకా సులువయిపోయిందికదా?

    పండితులకి ఛందస్సు “కంపల్సరీ” గా వస్తుంది. రాకపోతే పండితుడు అవుతాడా?
    ఛందస్సు వచ్చిన వాళ్ళందరూ కవులుకారు.

    సాయంకాలం అయిదు గంటల వేళ ఒక చక్కని అమ్మాయిని చూసి నాలాటివాడు “తూర్ణం మానీయతాం చూర్ణం పూర్ణచంద్రనిభాననే” అన్నాట్ట. మీ లాటి కవిగారు “పర్ణాని, స్వర్ణ పర్ణాని, కర్ణాంతాయతలోచనే” అన్నారుట. ఆ చక్కనమ్మ, పరిచారికకి నన్ను చూపించి “ఈ పండితుడికి సున్నప్పిడత ఇవ్వవే” అంది. మిమ్మల్ని “మేషారూ, ఇలారండి, ఇక్కడ కూచోండి, స్వర్ణ పర్ణానికి చాలా టైమ్ పడుతుందికదా? ఎంత చక్కని కవిత్వం మీది” అందిట. ఎంత తెలివయిన అమ్మాయి కదండీ? అలా ఎందుకందో మీకు తెలుసు. మాలాటివాళ్ళకి మీరు వివరించి చెప్పాలి.

  4. rajasankar kasinadhuni అభిప్రాయం:

    August 7, 2008 2:07 pm

    రెండవ పద్యంలో ‘అణా’”లు ఎక్కువగా ఉన్నందువలన అని మీకు తెలుసని మాకూ తెలుసు. అన్నీ తెలిసి ఏమీ తెలియనట్లుండడమే పండితుల లక్షణం.

  5. baabjeelu అభిప్రాయం:

    August 8, 2008 6:57 am

    కాశీనాథుని రాజశేఖర్ గారూ,
    కవులు, పండితులు కన్నా మిగిలిన వాళ్ళకన్నా “అణా” లు ఎక్కువివ్వగలిగిన రోజు ఇంతకుముందు లేదు, ఇప్పుడూ లేదు, ఇక ముందు వుంటే కవులందరూ మీ పేరు చెప్పుకుంటారు సంస్క్రుతంలో. గోదావరి ప్రాంతపు పండితులు “కాటన్” ని కూడా రోజూ స్మరిస్తున్నట్టు. విచిత్రవేవిటంటే “తానీషా” నో ఎవర్నో “ఇభరాముడు”, మల్కిభరాముడు” అని మార్చినట్టు కాదు, “ఇంగ్లండులో పుట్టిన కాటన్” అని సంస్క్రుతం లో.
    ఈ “అణా” ల గొడవ నేనేదో స్వంతంగా కల్పించింది కాదు (అది ఈ మాట పాఠకులందరికీ తెలుసు). “తాతాజీ” పుస్తకంలో చదివింది. సాహిత్యమొర్మరాలు నవిలినపుడు తగిలిన జీడిపప్పు.
    అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లుండడం “స్థితప్రజ్నుల” లక్షణం. పండితుల లక్షణం కాదు. అందుకే పండితులకీ పండితబ్రువులకీ తేడా మనలాటి సామాన్యులకి తెలీదు.
    అందుకే మీరు నన్ను పండితుడనీసేరు.
    “థేంక్స్ ఎవరో వొకరన్నారు”. మీకూ “రాజేంద్రకుమార్ దేవరపల్లి” గారికీ ధన్యవాదములు.

  6. Kameswara Rao అభిప్రాయం:

    August 8, 2008 7:00 am

    అన్నీ తెలిసి ఏమీ తెలియనట్లుండడమే పండితుల లక్షణం.

    నేను పండితుణి కాను కాబట్టి ఏమీ తెలియనట్లు ఉండలేక…

    బాబ్జీలుగారు,

    ముందుగా, “మిగిలినవాటిగురించి రాసి మీ సమయం వ్రుధా చేసుకోకండి.”, అన్న మీ సలహాకి ధన్యవాదాలు, ఎంతవరకూ పాటిస్తానో చెప్పలేను కాని. అది నా చేతుల్లో ఉంటేకదా!

    అభ్రతపతి కాదు అభ్రగపతి. అభ్ర = ఆకాశం; అభ్రగ = ఆకాశంలో తిరిగేది = పక్షి; అభ్రగపతి = పక్షుల రాజు = గరుత్మంతుడు

    ఆకర్ణికాంతరథమిల్లము; కర్ణిక = చెవి కమ్మ; అంతర = మధ్యలో; ఆకర్ణికాంతర = చెవి కమ్మ మధ్యలో చిక్కుకున్న; ధమ్మిల్లము = కొప్పు
    చక్కనొత్తక = సరిచెయ్యక
    విష్ణుమూర్తికి కొప్పుంటుంది కాబోలు!

    ఈ పద్యాన్ని చదవడం గురించి ఇంతకు ముందొక వ్యాసంలో (ఈమాట లోనే) రాసిన గుర్తు.

    పర్ణాని, స్వర్ణ పర్ణాని, కర్ణాంతాయతలోచనే

    దీనికి నేను విన్న పాఠం “పర్ణాని, స్వర్ణ వర్ణాని, కర్ణాంతాకీర్ణ లోచనే”. ఒక అణా ఎక్కువుంది :)

  7. baabjeelu అభిప్రాయం:

    August 8, 2008 6:53 pm

    కామేశ్వర రావు గారికి,
    ఈమాట అభిప్రాయవేదిక లో నెమలి వాలింది. బంగారు వాన కురుసింది. చాలా “కన్స్ట్రక్టివ్ గా” “పాజిటివ్” గా రాసేరు. విష్ణుమూర్తికి గిరజాలు వుంటాయి కదండీ, బహుశా అవయుండొచ్చు. “త” కి “గ” కీ లఘువే కదా, అక్కడ దొరికిపోయేను.
    ఇవాళ “డ్యూటూ బేడ్ వెదర్” సెలవు. మీ వ్యాసం కోసం హాయిగా వెతుక్కుంటాను, ఆ వెతుకులాటలో మరిన్ని ఆణిముత్యాలు దొరుకుతాయి.

    “భైరవభట్ల” వారేనని నా నమ్మకం. ఒకవేళ కాకపోతే మీరిరువురూ క్షమించగలిగినధైర్యం వున్న వాళ్ళు.
    “అణా” ల గొడవ సరైనది కాదని నా నమ్మకం.

  8. baabjeelu అభిప్రాయం:

    August 8, 2008 7:01 pm

    కాశీనాథుని రాజాశంకర్ గారూ
    క్షమించండి, మీ పేరు తప్పు రాసేను. క్షమించండి.

  9. baabjeelu అభిప్రాయం:

    August 11, 2008 11:18 am

    కామేశ్వర రావు గారూ,
    దాసన్నపేటతో మొదలెట్టి, గుమ్ చీ మీంచి, బొంకులదిబ్బ దాటి, మూళ్ళాంతర్లు దాటి, గంటస్తంభం మీంచి, కన్యకాపరమేశ్వరి కోవెల దాకా వచ్చినా, మీరు “ఈ పద్యాన్ని చదవడం గురించి..” రాసిన వ్యాసం దొరకలేదు.
    పెచ్చెరువు దాటి, రైల్వే స్టేషను మీంచి, “కంటోన్మెంటు” వెళ్ళమంటే వెళ్తాను.
    “చాలా కష్టపడ్డావొయ్” అని “ఈ పద్యాన్ని” ఎలా చదవాలో చెబ్తే “ధన్యోస్మి” అనుకుంటాను.
    దాంతో పాటూ, రాసీ ఛందస్సుకీ, “రిసైట్” చేసీ పధ్ధతికీ తేడా తెలిపితే, నేనూ నాతోపాటూ చాలా మంది “క్రుతార్థులవుతారు”.
    మీ దయ, మా ప్రాప్తి.

  10. rAmakRshNa అభిప్రాయం:

    August 11, 2008 11:23 am

    దీనికి నేను విన్న పాఠం “పర్ణాని, స్వర్ణ వర్ణాని, కర్ణాంతాకీర్ణ లోచనే”. ఒక అణా ఎక్కువుంది :)

    ఇద్దరూ స్నేహితుల లాగా ఉన్నారు, ఒక అణా అటూ-ఇటూ అవుతే ఏం?

  11. Kameswara Rao అభిప్రాయం:

    August 15, 2008 11:16 pm

    బాబ్జీలుగారు,
    మీరు వెతికిన రూటు రైటే, నేనిచ్చిన ఎడ్రసే తప్పులా ఉంది! దీని గురించి ఎక్కడో రాసానని ఇప్పటికీ అనిపిస్తోంది కానీ ఎక్కడో గుర్తుకురాటం లేదు.
    ఇంతకీ అసలు విషయానికి వస్తే, ఈ పద్యాన్ని చాలామంది,
    “సిరికిన్ జెప్పడు, శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు, ఏ పరివారమ్మును జీరడు, అభ్రగపతిన్ పన్నింపడు…” ఇలా విడదీసి సాగదీసి చదవడం వింటూంటాను. అది నాకు కాస్త చిరాకు కలిగిస్తుంది. ఇంత మెల్లిగా విష్ణుమూర్తి వెళితే, అక్కడ గజేంద్రునికి మొసలే ముక్తిని ప్రసాదించెయ్యదూ! పాపం పోతనగారు కష్టపడి అక్కడ సంధులు చేసి, “సిరికింజెప్పడు శంఖచక్ర యుగమున్ జేదోయి సంధింపడే పరివారమ్మును జీరడభ్రగ పతిం బన్నింపడాకర్ణికాంతర ధమ్మిల్లము…” అంటూ పద్యాన్ని పరిగెట్టిస్తే, అలా చదవక, సాగదీస్తారేమిటని అనిపిస్తుంది.
    అన్ని పద్యాలకీ ఇదే సూత్రం వర్తిస్తుందని హామీ ఇవ్వలేను సుమండీ!సందర్భానికి తగ్గట్టు కవి వాక్యాలని కూర్చితే, దానికి తగ్గట్టు ఆ పద్యాన్ని చదువితే బావుంటుందనేది నా ఉద్దేశం.
    అయతే ఇందులో ఛందస్సు ఒరగబెడుతున్నది ఏవిటీ అంటే, అది రాసే కవి బట్టి ఉంటుంది. ఛందస్సుని సందర్భానికి తగ్గట్టుగా ఉపయోగించుకుంటే, దానికి తగ్గట్టే మనం చదువుకోవచ్చు. ఛందస్సని సందర్భానికి తగ్గట్టు వాడుకోవడం గూర్చి నాకున్న ఆలోచనలు ఈ వ్యాసంలో రాసాను:
    http://www.eemaata.com/em/issues/200211/1323.html

  12. baabjeelu అభిప్రాయం:

    August 17, 2008 8:16 am

    తమ దయకి క్రుతజ్నతలు.

    మీ వ్యాసం చదివేను. అందులో “విశ్వనాథ” వారి అభిప్రాయంకూడా తెలిపేరు. శబ్దం గురించి మిగిలినవాటి గురించీ ఆయన చక్కగా చెప్పేరు. మీరు కూడా ఛందస్సు కవికి ఒరగబెడుతున్న దానికీ, కవి ఛందస్సుని సందర్భానికి తగినట్టు వాడుకోడానికీ తేడా బాగా రాసేరు.

    అయితే “అంబర చుంబి శిరస్సురజ్ఝరీ పటల” “ముహుర్ముహుర్లుఠ” విడగొట్టాలా, కూడదా? “దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుటల” తోటే “నటనానుకూల” చదవాలా” అక్కర్లేదా? తెలీక అడుగుతున్నవివి. తెలిసిన వాళ్ళు మీరు చెప్పాలి మరింత దయతో.

  13. mOhana అభిప్రాయం:

    August 17, 2008 1:12 pm

    నాకు కూడా ఈ పద్యమంటే చాల యిష్టం. నేను రాసిన
    చంపకోత్పలమాలల కథలో (సెప్టెంబర్ 2007) దీనిని ఉదహరించాను.
    దీనిని నేను ఇలా చదువుతాను -
    అట చని కాంచె భూమిసురుడు
    అంబర…కలాపిజాలమున్
    కటక…సాలము
    శీతశైలమున్
    అంబర నుండి జాలమున్ వరకు ఒకే సమాసము,
    గుక్క తిప్పుకోడానికి వీలు లేదు. ఒకే మారు చదవాలి!
    ఇట్టి సమాసాలలో పదాలను డాష్ (-) గుర్తుతో విరుచుట వాడుక.
    విధేయుడు - మోహన

  14. Kameswara Rao అభిప్రాయం:

    August 18, 2008 8:03 pm

    “అటజని గాంచె” పద్యం గురించి నా వివరణ ఇక్కడ రాసాను:

            అటజని కాంచె…

    అదేమైనా ఉపయోగ్యమైనదే అనుకుంటే , దాని బట్టి మీకు తోచినట్టు చదువుకోండి!

    (నా, యీ సొంత ప్రోపగాండాని ఈమాట సంపాదకులు క్షమిస్తారని ఆశిస్తున్నాను :)

  15. mOhana అభిప్రాయం:

    August 19, 2008 5:32 am

    కామేశ్వరరావుగారూ, బాగుందండీ మీ బ్లాగు.. సాహిత్యంలో మీ
    ఆసక్తికి ఇది ఒక నిదర్శనమే.

    1) చంపకమాలలో పాదం మధ్యలో మూడు విధాలుగా
    ఒక గతిని కల్పించవచ్చును. మొదటిది స-స-స
    విరియై, సిరియై, ఝరియై లాటిది ఇది.
    ప్రగడ రాణ్ణరసా విరసా తుసా బుసా ఇట్టిదే.
    రెందవది మూడు జ-గణాలతో, అభంగ మృదంగ తరంగ లాటిది.
    మూడవది మనం మామూలుగా వాడేది భ-భ-ర.
    ఇక్కడ అల్లసానివారు మూడు జ-గణాలను వాడినా అది
    నా ఉద్దేశంలో యాదృచ్ఛికమే. అన్ని పాదాలలో అలా వాడితేనే
    ఒక కొత్త గతి వస్తుంది అని నా నమ్మకం.

    2) నాకు ఎన్నో సంవత్సరాలుగా ఈ సందేహం. అసలు
    ప్రవరాఖ్యుడు నిజంగా హిమాలయాలకు వెళ్లాడా అనేదే ఇది.
    ఎందుకంటే మంచుమలలలో కరేణువులు ఎక్కడుంటాయి?
    కలాపి జాలాలు ఎక్కడుంటాయి? పాపం వాటికి చలి వేయదా?
    జలపాతాలు కూడా అరుదే.
    బహుశా అతడు ఇప్పటి నేపాళ లేక ఉత్తరప్రదేశ, లేక
    హిమాచలప్రదేశపు లోయలకు వెళ్లి ఉండవచ్చు. అక్కడి
    అడవులలో ఏనుగులు, నెమళ్లు, వానాకాలపు ఉరుములు,
    మెరుపులు, మృదంగపు మ్రోతలా జలపాతాలు ఉండి
    ఉంటాయి. పర్వతాలలో చాలా చల్లగా ఉన్నా ఈ లోయలలో
    ఎండ ఒక్కొక్కప్పుడు ఎక్కువే. అందువల్ల అతని పాదలేపం
    కూడా కరిగిపోవడానికి అవకాసశం ఉంది. దూరంనుండి
    హిమవత్పర్వతాలను చూసి ఉంటాడు. సియాటుల్ నగరంనుండి
    మవుంట్ రెనియెర్ను చూచినట్లు. ఇట్టి సందేహం
    కాళిదాసు మేఘదూతం విషయంలో కూడ ఉంది.

    విధేయుడు - మోహన

  16. e.bhaskaranaidu అభిప్రాయం:

    November 30, 2008 2:20 am

    1965 లో ఎస్సెసెల్సి లో ప్రవరాఖ్యుని పాఠం ఉండేది. పరీక్షల్లో తెలుగులో ఒక ప్రశ్న వచ్చింది. అది: ప్రవరాఖ్యుడు హిమాలాయాలకు వెళ్ళి ఏమి చూసాడు? అని. దానికి సమాదానంగా నేను అందులోని పద్యం “అటజనికాంచె భూమిసురుదడంబరచుంబి…” అనే పద్యము రాసాను. సమాదానము గద్యంరూపములో రాయ కుండా పద్యంలో రాస్తె మార్కులు వేస్తారో లేదో అనే భయం వుండేది. కాని ఆ పద్యం మీద అభిమానంతో సమాదానం పద్యరూపంలోనే వ్రాసాను. ఆపద్యం అంటే అంత అభిమానం ఆనాడు నేర్చుకున్న్ ఆ పద్యం ఈనాటికి నాకు కంఠతా వచ్చు. ఆ రోజుల్లోనే తెలుగులో నాకు చాల ఎక్కువ మార్కులు వచ్చాయి.

    మను చరిత్రలోనె ననుకుంటా…. ఒక వచనం వుండేది అది….విద్యగొనుటయె గాక గుటగుటకు గురుతోనా యని……..” అని వుండేది. అది ఏ అస్వాసంలో వుందో ….

  17. nagaraju అభిప్రాయం:

    November 13, 2009 3:43 pm

    ఇందీవరాక్షుని వృత్తాంతం అని మాకు 1998 SSC లో పాఠం ఉండేది. అది మనుచరిత్ర లోనిది ఏమో? అందులో ఒక పద్యం “కలడుల్లోకయశఃపురంథ్రి …” అని.
    ఒక గద్య భాగం కూడా ఉండేది. అది “అని జటిలుండు హుమ్మని కటమ్ములదర ముకుపుటుమ్ములు నటింప గటా గటా కుటిలాత్మా యటమటమ్మున విద్య గొనుటయుంగాక గుటగుటలు గురువుతోనా యని కటకటంబడి కకపాలలోని బూదికేలంగొని యాసురి యగు మాయ మాయయెడం బ్రయోగించి వంచించి యుపహసించితివి గాన నసురవై పిసితంబును వసనంబుగా మెసవి వసుధ వసియింపుమని బసుమంబు సల్ల గుండె కల్లు వడి మునితల్లజు పదవల్లవంబులంబడి ఇట్లంటి
    నా యజ్ఞానముసైచి సంయమివరేణ్యా కావవే రాక్షసుండైయేనెట్లు భరింతువాడ….”
    అంటూ సాగుతుంది.
    అది ఏ ఆశ్వాసం లోనిదో ఎవరికైనా తెలిస్తే దయచేసి తెలియచేయమని కోరుతున్నాను.

    ఇట్లు,
    నాగరాజు
    తప్పులు ఏమైనా ఉన్న మన్నించమని కోరిక.

  18. వాడపల్లి శేషతల్పశాయి అభిప్రాయం:

    November 15, 2009 1:16 am

    నాగరాజు గారూ,

    మనుచరిత్రము - పంచమాశ్వాసము - 7

    “కలడుల్లోకయశఃపురంథ్రి …”

    మనుచరిత్రము - పంచమాశ్వాసము - 19

    అని జటిలుండు హుమ్మని

    http://www.andhrabharati.com/kAvyamulu/manu/manu501.html


    శేషతల్పశాయి.

  19. mOhana అభిప్రాయం:

    November 15, 2009 10:03 am

    కలఁ డుల్లోక యశః పురంధ్రి జగతిన్‌ గంధర్వ వంశంబునన్‌
    నలనాభాహ్వయుఁ డే దదీయ తనయుండన్‌ బ్రహ్మమిత్రుండు శి-
    ష్యులకున్‌ గంటను వత్తిఁ బెట్టుకొని యాయుర్వేద మోరంత ప్రొ-
    ద్దులఁ జెప్పన్‌ వినుచుండి మానసమునందుం దజ్జిఘృక్షారతిన్‌
    - మనుచరిత్రము (5.07)
    గొప్ప వంశములో జన్మించిన నలనాభుడనే పేరితో ఉండే గంధర్వుని కొడుకును నేను. ఆయుర్వేదశాస్త్రంలో విద్యానిధిలాటి వాడైన బ్రహ్మమిత్రుడు తన శిష్యులకు రేయింబవళ్ళు వైద్యవిద్యను బోధిస్తుండేవాడు. దానిని నేను వింటూ ఉండేవాడిని. నేను కూడా నేర్చుకోవాలని అనుకొని ….

    ఇది, జటిలుండు అనే వచనం మనుచరిత్రలోని పచమాశ్వాసములోనిది.

    - మోహన

  20. Lokeshwar అభిప్రాయం:

    February 6, 2010 8:01 am

    మనుచరిత్ర తెలుగులొ వచన రూపము లొ వుంటే బాగుండును.

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a