నేటి సినిమాలలో వికృత పోకడలు – విపరీత ధోరణులు

ఈ సందర్భంలో శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్య కూడా గుర్తు పెట్టుకోవలసినదే: ‘‘ప్రస్తుతం ఒక వింత ప్రవాహంలాగా అతి వేగంగా కొట్టుకు పోతున్న నేటి సినిమా రంగంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే అసభ్యం, అశ్లీలం, ద్వంద్వార్థాల మాటలు, బూతు మాటలనే అర్థం చెప్పుకుంటున్న ఈ రోజుల్లో నాలాంటి చాదస్తపు కళాకారుడు కొట్టుకు పోగలడే తప్ప ఎదురీదలేడు.’’ (14-4-1997 ‘‘ఈనాడు సినిమా’’.)

అక్కినేని నాగేశ్వరరావుగారు ఏమన్నారో చూడండి: ‘‘….సినిమాల్లో అయితే సాంకేతిక విప్లవం కనిపిస్తోంది. గ్రాఫిక్‌ ప్రభావం ఎక్కువైంది. కథ పలుచబడింది.’’ (‘‘ఈనాడు సినిమా’’ జనవరి 13. 2006)

సుప్రసిద్ధ నటీమణి భానుమతి గారి వ్యాఖ్య కూడా పదును గానే ఉంది: ‘‘ఈనాడు డబ్బులకోసం బూతుచిత్రాలు తీస్తున్న నిర్మాతల కంటే, పొట్ట కూటికోసం ఒళ్ళు అమ్ముకుంటున్న ఆడది నయం అనిపిస్తోంది’’. (7-8-1996. ‘‘ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక’’.)

‘‘తెలుగు సినిమా విషయానికి వస్తే, వాటివాటి అవసరాన్ని బట్టి కత్తిరించుకుంటూ కథలకి విశాలత్వం లేకుండా చేశాయి. తెరమీద కనిపించే జీవితపు పరిమితులు, పాత్రల పరిమితులు మరీ విసిగించి పారేసి ‘ఇంతకంటే మంచి సినిమాని తెలుగులో చూడలేమా’’ అని మనం వాపోయేలా చేశాయి. గత కొద్ది సంవత్సరాలుగా తెలుగు సినిమాలు ఎంత కమర్షియల్‌ సక్సెస్‌ సాధిస్తున్నాయో అంత చొప్పదంటు కథల్ని అల్లుతున్నాయి’’. అని ఇంద్రగంటి కిరణ్మయి గారు తన ‘‘సినిమాలోచన’’ గ్రందం¸లో వ్యాఖ్యానించారు.

‘‘మనం సినిమా థియేటర్లో కూర్చున్నాం అనే ఆలోచన రానీయకుండా తనలో లీనమై, తనతోపాటు మనల్ని కూడా ఆ వాతావరణంలో విహరింపజేసేదే నిజమైన సినిమా’’.

‘‘మంచిని చెడుని కూడా సమంగా ప్రదర్శించే సినిమా చాలా శక్తిమంతమైన మాధ్యమం. రెండు వైపులా పదును గల కత్తి. దాని ప్రభావం ఏమిటో, ఎంతవరకో కాలమే నిర్ణయిస్తుంది.’’ అంటూ శ్రీ ఎస్‌.వి.రామారావుగారు తన ‘‘తెలుగుతెర’’ గ్రంథంలో తెలియజేశారు.

‘‘ఆధునిక యుగంలో కళాపోషణకు సినిమా రంగం బలమైన సాధనంగా పరిణమించింది. కానీ, ఈ పరిశ్రమ ప్రారంభమైన తొలిదశల్లో కనిపించిన విలువలు కొంతకాలం తరువాత క్షీణించడం మొదలయింది. వ్యాపారానికి ప్రాముఖ్యత పెరిగి, జనాకర్షణ నెపంతో, చౌకబారు సంగీతమూ, జీవంలేని సాహిత్యమూ అందులో ప్రవేశించాయి’’ అని శ్రీ ఎం.వి.రమణారెడ్డి గారు తను రచించిన ‘‘తెలుగు సినిమా – స్వర్ణయుగం’’ గ్రంథంలో తన అమూల్యమైన అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘‘తెలుగు సినిమా పయనం ఎటువైపు’’ – అనే తన వ్యాసంలో ప్రసిద్ధ రచయిత శ్రీ వాసిరాజు ప్రకాశం గారు వెలిబుచ్చిన అంశాలు కూడా విచారించదగ్గవే: ‘‘ఇంత వినోదం చాటున నైతిక విలువలు ఏమవుతున్నాయి? యువతరాన్ని ఆకర్షించే ప్రయత్నంలో శృంగారం శ్రుతి మించింది కదా? బూతును నియంత్రించవలసిన సెన్సార్‌ ప్రేక్షక పాత్రకే ఎందుకు పరిమితం అయ్యారు? ఇలా ఎంతకాలం కొనసాగుతుంది. సినిమా అనే సమగ్ర కళాస్వరూపానికి పూర్వవైభవం వస్తుందా? లేక తెలుగు సినిమా నైతిక విలువల చౌరాస్తాలో బందీగా ఇలా ఉండి పోవలసిందేనా? ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటి? సినీపరిశ్రమలో పెద్ద తలలు ఒక్క సారయినా ఒకచోట కూర్చొని, పరిస్థితిని సింహావలోకనం చేసి, ఈ పరిస్థితి మెరుగయ్యేందుకు మార్గోపాయాలు ఆలోచించకుండా వుంటే …. ఈ పరిస్థితే నానాటికి తీసికట్టు నాగం బొట్టు!’’ (ఆదివారం ‘‘వార్త’’, 31 మార్చి 2002)

‘‘నిర్మాతగా నాలుగు దశాబ్దాలు’’ అనే తన వ్యాసంలో ప్రముఖ సినీరచయిత శ్రీ వాసిరాజు ప్రకాశం గారు ఇలా వివరిస్తున్నారు:

‘‘నాలుగు దశాబ్దాల కాలం ఓ అగ్రశ్రేణి నిర్మాత, దర్శకుడుగా తెలుగు తెరను శాసించిన శ్రీ వి.బి.రాజేంద్ర ప్రసాద్‌ గారు ప్రస్తుతం మవునంగా ఉన్నారు. ఈ రోజు ఎందుకు సినిమా నిర్మిచటం లేదన్న ప్రశ్నకు ఆయన వద్ద సంసిద్ధంగా ఉన్న సమాధానం ఒకటే! ‘‘ఆనాటి స్వర్ణయుగంలో పనిచేసిన మా తరం వారికి ఇప్పుడు సిగ్గు విడిచి సినిమాలు తీయాలి. ఆ పరిస్థితి అవసరం లేదు, కనుక సినిమాలు తీయటం లేదు’’. ఈనాటి పరిస్థితులకు తగినట్లు మెట్లు దిగలేక, విలువలు కోల్పోలేక మౌనరాగాలు ఆలపిస్తున్నారు’’. (ఆదివారం ‘‘వార్త’’, 8 డిసెంబరు 2002)

అధ్యాపకులు, మాజీ పార్లమెంట్‌ సభ్యులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు అయిన డా॥ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ గారు ‘‘ఇది ఉపాధ్యాయుడిగా నా ఆకాంక్ష’’ అనే తన వ్యాసంలో నేటి సినిమాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు కూడా మనమంతా మననం చేయదగినవే:

‘‘ప్రస్తుతం వస్తున్న తెలుగు చలన చిత్రాలలో అధ్యాపకులను హీనంగా, జుగుప్స కలిగించే విధంగా చూపిస్తున్నారు. ఉపాధ్యాయ విద్యార్థి సంబంధాలను వికృతంగా చిత్రించటం పరిపాటిగా మారింది. గత మూడు సంవత్సరాలుగా వెలువడుతున్న చాలా సినిమాల ఇతి వృత్తాలు కళాశాల జీవితంతో ముడిపడిన టీనేజీ ప్రేమ గాథలై ఉండడం గమనార్హం. విద్యాలయాలను ప్రేమ సంబంధాల కేంద్రాలుగా, విద్యార్థినీ విద్యార్థులను కేవలం ప్రేమ పక్షులుగా చిత్రీకరిస్తున్నారు. ఇది హద్దులుదాటి అధ్యాపకులను కూడా విద్యార్థుల ప్రేమ కలాపాలను వర్ణించే వారుగా, అతి జుగుప్సాకరంగా చిత్రిస్తున్నారు. అధ్యాపకులను విదూషకులుగా, జోకర్లుగా, ప్రేమ వ్యవహారాలు నడిపే బ్రోకర్లుగా, నైతిక విలువలు లేని వాజమ్మలుగా చిత్రిస్తున్నారు’’.

‘‘సామాన్య ప్రేక్షకుల ఆలోచనా సరళి పై సినిమాల ప్రభావం చాలా ఎక్కువుగా ఉంటుందన్న సంగతి మనకు. తెలుసు. ఈ సందర్భంగా గమనించాలి – ‘‘నాలుగు గోడల మధ్య నీలినీడల నడుమ చూసే సినిమా ప్రభావం గోడలుదాటి మొత్తం సమాజాన్నే శాసించగలిగే స్థాయి కలిగి ఉంటుంది. ఈ ప్రభావం మన ఆలోచనా ధోరణిపై ప్రస్ఫుటంగా కనపడుతుంది. ప్రేక్షకుల అనుభూతులను తీవ్రస్థాయిలో ప్రతి స్పందింప చేసే రీతిలో ఈ ప్రభావం విస్తరిస్తున్నది. అందుచేత మంచిగాని, చెడుగాని, సత్ప్రవర్తనను గాని, విద్రోహ చర్యలను కాని ప్రోత్సహించే మహత్తర సాధనంగా దీనిని గుర్తించి, దీనిపై నియంత్రణను సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది’’.

‘‘ప్రస్తుతం సినిమాలలో చూపిస్తున్న అసభ్యకరమైన దృశ్యాలను ఆదర్శంగా, ప్రేరణగా తీసుకొని చాలాచోట్ల విద్యార్థులు తమ తమ కళాశాలల్లో అనుచితంగా ప్రవర్తిస్తున్న సంగతి మనం నిత్యం చూస్తున్నాం’’.

‘‘జాతి నిర్మాణ ప్రక్రియ తరగతి గదులలో ప్రారంభ మవుతుందన్న కొఠారి భావాన్ని మనం అంగీకరిస్తే, ప్రస్తుతం సినిమాలు చూపిస్తున్న తరగతి గదుల వ్యవహారం, ఉపాధ్యాయ, విద్యార్థినీ విద్యార్థుల సంబంధాలు గమనిస్తే మన జాతి భవిత ఏమౌతుందో విజ్ఞులందరూ ఆలోచించవలసిన తరుణం ఆసన్నమయింది’’.

(‘‘ఆదివారం ఆంధ్రజ్యోతి’’ – 16 మార్చి 2003.)

‘‘కళ సరియైన ప్రయోజనం సాధించకపోయినా, ప్రజలకు దూరమైపోయినా, ప్రజలను మాయోపాయాలతో మభ్యపెట్టినా సరియైన విమర్శద్వారా ఈ లోపాల్ని చక్కబరచవచ్చు. విమర్శవల్ల కళలు తమ బాధ్యతను గుర్తించగలుగుతాయి’’ అని ప్రసిద్ధ కథా రచయిత కొడవటిగంటి కుటుంబరావు గారు విమర్శల మీద తనకున్న ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కానీ, కళగా పేరొందిన సినిమా తన బాధ్యతను గుర్తించలేదనే గట్టిగా మనం చెప్పవలసి వస్తుంది.

దర్శకేంద్రులు, దర్శక రత్నలు, నటసామ్రాట్‌, నటరత్నలు, ప్రతిష్టాత్మకమైన సాహితీ పురస్కారాలు అందుకున్న కవులు, రచయితలు గల తెలుగు సినీరంగానికి ‘‘తెగులు’’, ‘‘చీడ’’ పట్టుకున్నాయి. వ్యాపార ధోరణి అధికం కాగా, గాడితప్పి సినిమా ముందుకు ‘‘జారి’’ పోతుంది. సమాజాన్ని పెడదారి పట్టిస్తున్నాయి నేటి సినిమాలు. మార్పు సహజమే, అనివార్యమే. కానీ, శుభదాయకమైన మార్పుకాదిది. ఆరోగ్యదాయకమైనది కూడా కాదు. రంకుతనాన్ని, సెక్స్‌ని ప్రచారం చేసే సాధానాలుగా నిలిచిపోతున్నాయే తప్ప, నేటి సినిమాల వల్ల ప్రయోజనమేమీ కన్పించడంలేదు. ప్రేమంటే ఏమిటో ఎరుగని అమాయక పసివారి హృదయాల్లో విషబీజాలు నాటుతున్నాయి నేటి సినిమాలు. నేడు సమాజంలో పెచ్చు పెరిగిన మానభంగాలు, హత్యలు, అత్యాచారాలు, హింసాదౌర్జన్యాలకు నేటి సినిమాలే ముఖ్య కారణమంటూ ఎందరో తమ ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మధురమైన సంగీతం, మనోహరమైన గీతాలు, ఆహ్లాదకరమైన సన్నివేశాలతో మంచి కథాబలం కలిగిన సినిమాల కోసం ప్రజలు తహతహ లాడుతున్నారు. ఎదురు చూపులు చూస్తున్నారు. అలాంటి ‘‘విలువలు’’న్నటువంటి సినిమాలు తప్పక వస్తాయని ప్రజలు గంపెడాశతో ఉన్నారు. ప్రజల్ని నిరాశపరిచి, వారి ఆశల్ని నట్టేట ముంచవద్దని దర్శక, నిర్మాతలకు, నటీనటులకు, చివరగా రచయితలకు వినయ పూర్వకంగా విన్నవించుకుంటున్నాను.

నా ఈ వ్యాసానికి సహాయపడిన గ్రంథాలు:

  1. ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’’, రావికొండలరావు.
  2. ‘అలనాటి చలన చిత్రం’’, కె.ఎన్‌.టి.శాస్త్రి.
  3. ‘తెలుగు తెర’’, ఎస్‌.వి.రామారావు.
  4. ‘తెలుగు సినిమా స్వర్ణయుగం’’, డా॥ ఎం.వి.రమణారెడ్డి.
  5. ‘‘సినిమా లోచన’’, ఇంద్రగంటి కిరణ్మయి.
  6. ‘సినిమా పాటలు – వ్యక్తిత్వ వికాసం’’, నారాయణ డి.వి.వి.ఎస్‌.

రచయిత్రి, రచయితలందరకూ వినయపూర్వకంగా కృతజ్ఞలు తెలియజేసుకుంటున్నాను.*