నేటి సినిమాలలో వికృత పోకడలు – విపరీత ధోరణులు

సృష్టిలో మానవజన్మ ఉత్తమమైనది. అతనిలో మాత్రమే అనేక సద్గుణాలు – నీతి, న్యాయం, నిజాయితీ, సత్యం, త్యాగం, ధర్మం మొదలైనవి కనిపిస్తాయి. ఈ గుణాల్ని వికసింపచేసేందుకు కళలు సాధనాలుగా ఉపయోగపడాలి. వ్యక్తిత్వ వికాసానికి కళలు దోహదపడాలి. మరి సినిమా కూడా ఓ కళే! అందుచేత సినిమాలు ప్రజల మనసులలో నైతిక విలువల్ని పెంచడం ద్వారా, వ్యక్తులలో వికాసత్వాన్ని కలిగించి సమాజ గమనాన్ని చైతన్య మార్గాల వైపు తిప్పాలి. వినయ విధేయతల్ని, ప్రేమ వాత్సల్యాల్ని, నీతిమార్గాల్ని బోధించాలి. ప్రజలకు ఆశావాదాన్ని. బ్రతుకు విలువల్ని నేర్పాలి. ఇంతటి గురుతరమైన బాధ్యత భుజాల మీద మోస్తున్న సినిమా పక్కదారి పడితే, అది అందించే సందేశం ఎలా ఉంటుంది? సమాజ గమ్యం ఏమవుతుంది? మేధావులు, విజ్ఞులు, నేతలు ఆలోచించాల్సిన విషయమే కదా!

పాట మానవ జీవితంలో ఒక భాగం. మానవుని శారీరక మానసిక పరిశ్రమ నుంచి పాట పుట్టింది. సినిమా కూడా మానవ జీవితమే. అందుకే సినిమాకు పాట అవసరమయింది. పాత్రల ఆలోచనలను స్పష్టపరచడానికి, మాటల్లో చెప్పలేని భావాల్ని విశదం చేయడానికి, కధా గమనాన్ని వేగవంతం చెయ్యడానికి, పాత్రల విశిష్ట లక్షణాల్ని పెంచడానికి పాట అవసర మొచ్చింది. సినిమాల్లో పుట్టిన పాట మానవుని గతినే మార్చేస్తున్నది. సినిమా పాటలు మనకు ప్రశాంతతని, ఆశావాదాన్ని, ఐక్యతా భావాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాల్ని, వ్యక్తిత్వ వికాసాన్ని అందిస్తున్నవి. ఈ పాటల్లో ఎన్నో రకాలున్నాయి. దేవుని భక్తిపాటలు, దేశభక్తి పాటలు, చైతన్య గీతాలు, భావగీతాలు, విషాద గీతాలు, విరహ గీతాలు, వైరాగ్యగీతాలు,జానపద గీతాలు, ప్రేమ గీతాలు, హాస్య గీతాలు ఇలా చాలా రకాలున్నాయి.

సినిమా పాట మానవునిలో నిద్రాణమైవున్న శక్తిని ప్రేరేపించే ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. నాడు ‘రామ కథను వినరయ్యా’ పాట పిల్లల్లో పెద్దల్లో ఎంత చైతన్యాన్ని కలిగించిందో ఈనాటి పెద్దలకు తెలుసు. నాడు ఏ రకం పాటలోనైనా కొంత సందేశాన్ని చేర్చడానికి సినీపాటల రచయితలు శతవిధాలా ప్రయత్నించారు. ఇక్కడో విషయం చెప్పాలి. మల్లీశ్వరి నాట్యాన్ని చూసి ముగ్ధుడైన పెద్దన ఆశువుగా ఓ పద్యం చెబుతాడు. ‘‘భళిరా ఎన్నడు జారె నీభువికి, రంభారాగిణీ రత్నమేఖలయో …’’ అనేది. అల్లసాని వారు చెప్పిన పద్యం కాబట్టి అల్లసాని వారి శైలిలోనే ఉండాలనేది దర్శకుని పట్టుదల. దానికోసం దేవులపల్లి వారు 108 పద్యాలు తయారుచేశారు. కావలసింది మాత్రం ఒక్క పద్యమే. ఇంత ప్రయత్నం ఎవరినో సంతృప్తి పరచడానికి కాదు. ప్రేక్షకులకు వడ్డించే ముందు తమను తాము సంతృప్తి పరచుకోడానికి. ఆ దర్శక రచయితల పట్టుదలకూ, అంకిత భావానికి ఇదొక తార్కాణం. సూక్ష్మంగా చెప్పాలంటే పాటద్వారా శ్రోతలలో ఒక హృదయపు కదలికని వాళ్ళు ఆశించారు. ఈనాటి సినీపాటల రచయితల్లో లోపించినదదే!

నాటి సినిమాల్లోని మధురగీతాల్ని ఓసారి పరిశీలిద్దాం.

‘‘బ్రతుకు తెరువు’’: ‘‘అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం’’

‘‘విచిత్ర కుటుంబం’’: ‘‘ఆడవే, ఆడవే జలకమ్ములాడవే కలహంసలాగ, జలకన్యలాగ’’

‘‘ఆరాధన’’: ‘‘పగలే వెన్నెల, జగమే ఊయల’’

దొంగరాముడు: ‘‘చిగురాకులలో చిలకమ్మా’’

గుండమ్మ కథ: ‘‘ఎంత హాయి ఈ రేయి, ఎంత మధుర మీ హాయి’’

దాగుడు మూతలు: ‘‘అడగక ఇచ్చిన మనసే ముద్దు అందీ అందని అందమే ముద్దు’’

సిరి సంపదలు: ‘‘ఈ పగలు రేయిగ పండువెన్నెలగ’’ ‘‘ఎందుకో సిగ్గెందుకో’’

మంచి చెడు: ‘‘రేపంటి రూపం కంటి, పూవింటి దొరనే కంటి’’

బందిపోటు: ‘‘ఊహలు గుసగుసలాడే, నా హృదయము ఊగిసలాడే’’

పరువు ప్రతిష్ట: ‘‘ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామా’’

కులగోత్రాలు: ‘‘చెలికాడు నిన్నే రమ్మని పిలువ’’

మల్లీశ్వరి: ‘‘ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు’’

తోడికోడల్లు: ‘‘కారులో షికారు కెళ్ళే పాల బుగ్గల పసిడి దానా’’

నిర్దోషి: ‘‘మల్లియలారా మాలికలారా మవునముగా ఉన్నారా’’

వెలుగునీడలు: ‘‘కల కానిది విలువైనది బ్రతుకు’’, ‘‘పాడవోయి భారతీయుడా’’

ఇల్లరికం: ‘‘నేడు శ్రీవారికి మేమంటే పరాకా’’

దేవదాసు: ‘‘జగమే మాయ …. బ్రతుకే మాయ!’’

పసిడి మనసులు: ‘‘చిన్నారి నీ చిరునవ్వు, విరిసిన మల్లెపువ్వు’’

ఇలాంటి మధుర గీతాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటి వివరాలన్నీ ఇక్కడ ప్రస్తావించడం అసాధ్యమే! వాటి గురించి ఎంత చెప్పినా (రాసినా) అది తక్కువే అవుతుంది ….!

ఇక, ప్రజల మనసుల్నేగాక, మెదడుల్ని కూడా కబళించే అయోమయ యుగానికి చెందిన సినిమాల గురించి కూడా తెలుసుకోవాలి. ఔచిత్యంలేని పేర్లు తగిలించుకని ఈ సినిమాలు మార్కెట్‌లో దిగుతున్నాయి. వాటిలో కన్ని: ‘‘రెండు తోకల పిట్ట’’, ‘‘ ఎదురింటి మొగుడు – పక్కింటి పెళ్ళాం’’, ‘‘దొంగ మొగుడు’’, ‘‘ ఉమ్మడి మొగుడు’’, (మరి ‘‘రంకు మొగుడు’’ సినిమా రాదని మనం చెప్పలేమే!) ‘‘కిరాయి అల్లుడు’’ (దీనర్థం రంకు మొగుడు అనేగా!) ‘‘ఇంట్లో ఇల్లాలు – వంటింట్లో ప్రియురాలు’’ (‘‘పడక గదిలో వెలయాలు’’ అనేది రావచ్చు!’’) ‘‘ఆయన కిద్దరు’’, ‘‘ఏవండీ, ఆవిడొచ్చింది’’. ‘‘నాతో వస్తావా’’, ‘‘జంబలకిడి పంబ’’, ‘‘ఆ ఒక్కటీ అడక్కు’’, ‘‘మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది’’, ‘‘తప్పు చేసి పప్పు కూడు’’, ‘‘అదుర్స్‌’’, ‘‘శీనుగాడు చిరంజీవి ఫ్యాన్‌’’, ‘‘ప్రేమించుకుందాం, రా’’, ‘‘పెళ్ళిచేసుకుందాం, రా’’ (పిల్లల్లి కందాం, రా! ఇదే కాదా తర్వాత రావాలి ….!) ‘‘అక్క మొగుడు – చెల్లెలి కాపురం’’ – వినడానికే ఈ పేర్లు అసహ్యంగా లేవూ? పాటల్ని కూడా పరిశీలిస్తే, సాహిత్యపు విలువలు ఏ స్థాయిలో ఉన్నాయో గమనించగలం.

‘‘సూదిలో దారం – సందులో బేరం’’

‘‘నీ క్కావలసింది నా దగ్గర ఉంది’’

‘‘అడగనా …. అడగనా, నోరు విడిచి అడగరానిది’’

‘‘ఒక్కసారి …. ఒక్కసారి నొక్కి చూడయో’’

‘‘పట్టుకో పట్టుకో రెండు పట్టుకో’’

‘‘నూకలిస్తా మేకలు కాస్తావా,

రవికలిస్తా రాతిరి కొస్తావా?’’

అశ్లీల పదాలు, బూతు, ద్వంద్వార్థాల పదాలు పాటల్లో, మాటల్లో చోటు చేసుకుంటున్నాయి.

గొప్పింటి అల్లుడు:

‘‘మూడొచ్చి కూర్చుంది ఆ పద్దయో ఆ కాస్త కానీయరో’’.

రాజకుమారుడు:

‘‘కన్నులతో కన్నెరికం తీర్చిన వాడా

పైటలలో పాటలెన్నో దాచిన దానా’’

సమరసింహారెడ్డి:

‘‘నందమూరి నాయకా, అందమైన కానుక

బుల్లో బొంగరం తిప్పేయనా నీ బంగారి బొడ్డుమీద’’

కన్యాదానం:

‘‘అందాలే ఊరిస్తుంటే ఆగదు నా మనసు

ఆ సీనే మొదలయిపోతే స్టాపంటూ లేదంటూ’’

అల్లరి అల్లుడు:

‘‘రైక చూస్తే రాజమండ్రి

పైట చూస్తే పాలకొల్లు’’

మాయలోడు:

‘‘మనసు పట్టు తప్పింది.

వయసు గుట్టు తడిసింది.’’

అడవి రాముడు:

‘‘ఆరేసుకోబోయి పారేసుకున్నా’’

ఈ గీతంతో పాటల పతనం ప్రారంభమయిందని చెప్పాలి.

ఘరానా మొగుడు:

‘‘ఓంతమ్మా ఓంతమ్మా షేపులు అంతంత ఉన్నాయి ఎత్తులు బోలోబోలో

నీ కన్ను పడ్డాక ఓరయ్యో. పొంగేస్తున్నాయి గుత్తులు చలోచలో’’

నా అల్లుడు:

‘‘కన్నుకొడితే వచ్చేయనా

కన్నె పొంగులిచ్చేయనా

హే జారేసుకో పైట జారేసుకో

పరువాలు నామీద నూరేసుకో’’

అన్నయ్య:

‘‘మండపేట కుర్రదాన్ని ఓ బావయ్యో

మనీ పర్సు చూస్తే తస్సదియ్యా మహా ఇదయ్యో’’

ఆది:

‘‘పైన ఎన్ని అందాలున్నా లోపలుందీ తెలిసేదెట్టా

నా ఒళ్ళోకి వస్తావా, నే కోరింది కొరికి ఇస్తావా?’’

అక్కడమ్మాయి – ఇక్కడ అబ్బాయి:

‘‘జఘనముతో జగడములో చకచక సుఖపడదాం’’

తెలుగు పాటల్లో ఇంగ్లీషు, హిందీ పదాలు జోరందుకుంటున్నాయి.

బద్రి:

‘‘వై డు యు వర్రీ వేర్‌ యు బోర్స్‌ ఆర్‌ యు దేర్‌ బ్రదర్‌’’

‘‘ఏ దేశ్‌ ద ష్యారా ప్యారా కిన్‌ కీ నజర్‌ లగీ సే’’

అర్థంలేని మరో పాట:

‘‘కాలేజీకి టీనేజీకి స్వీటేజీకి హటేజీకి కట్టెయి తకధిమి

లవ్వేజీకి నవ్వేజీకి కన్యాజీకి మారేజీకి పెట్టెయి పెదరిమ’’

శంకర్‌ దాదా M.B.B.S.,:

‘‘చైలా చైలా చైలా …. నేను వెంటపడ్డ పిల్లపేరు లైలా’’

ఏమాత్రం మాధుర్యం లేని, పసలేని పాట. పోనీ – ‘‘నేను ప్రేమించే పిల్ల పేరు లైలా’’ అని అంటే ఎంతో బావుణ్ణు గదా! ‘‘వెంటపడ్డ’’ అనే పదాలతో నాయకుని స్థాయి, హుందాతనం దిగజారిపోలేదా? నిజం చెప్పాలంటే, ఇలాంటి చౌకబారు నటనలు చాలా అనారోగ్య కరమైనవే….!

ముఖ్యంగా, ఈనాటి సినిమా పాటలు …. అవి ఏవైనా పాటలా? అయ్యో రామ….! వెరైటీ గొంతులు….! అర్థంకాని పదజాలంతో సాహిత్యం!! కలవరపరిచే వాయిద్య ధ్వనులు!!! ఏం కాలం దాపురించిందిరా దేవుడా! ఈనాటి రచయితలు, గాయకులు, సంగీత దర్శకులు కాస్త కళ్ళుతెరిచి గమనిస్తే ఎంత బాగుంటుంది! ప్రేక్షకుల ‘‘అభిరుచి’’ అనే వంకతో అందర్నీ పక్కదారి పట్టిస్తే నిర్మాత పరిస్థితి అధోగతే! షుగరువ్యాధి ఉన్న కొద్దిమందిని దృష్టిలో ఉంచుకొని పాయసాన్ని చేదుగా చేసి అందరికీ ఇస్తే దాన్ని కాలువలో పోసుకోవడమేగా చివరికి! విలువల్లేని సాహిత్యం, రణగొణ ధ్వనుల సంగీతం ఎక్కువకాలం నిలబడవు. ప్రజలు చూస్తున్నారనుకుంటున్నారేమో! నిర్మాతల చేతులు కాలిపోతున్నాయి. సినీరంగమే బావురుమనే పరిస్థితులు వచ్చేశాయి. కొత్త పాటలు రాగానే ముందు పాటలు గోవింద….! కానీ లవకుశ, మాయాబజార్‌, మిస్సమ్మ, దేవదాసు, ఆత్మీయులు, అప్పుచేసి పప్పుకూడు, ప్రేమనగర్‌ లాంటి చిత్రాలు ఎప్పుడు విడుదలయ్యాయి, ఇప్పటికీ ప్రజలు ఎందుకిష్టపడుతున్నారు. అందుకే, సంగీత దర్శకులు పాటలోని మాటలు వినిపించేలాగ మంచి ట్యూన్‌ కట్టాలి. ఆ బాధ్యత దర్శకులదే. మంచి ట్యూన్‌ లేకపోతే పాట బ్రతకదు. అది గుర్తుంచుకోవాలి. అలాగే పాటల రచయితలు ఇంగ్లీషు, హిందీ, తెలుగు పదాలతో పాటల్ని రాస్తున్నారు. శ్రోతలు కొంత కాలం వింటారు. చాలా తొందరగా మర్చిపోతారు. రచయితలూ ఆలోచించాలి. వాళ్ళకు డబ్బు కావాలి, హాయిగా బ్రతకాలి. మరి, వాళ్ళు రాసిన పాటలు దశాబ్దాల పాటు బ్రతకద్దూ!

నేటి సినిమాలను వ్యాఖ్యానిస్తూ ప్రముఖ నటులు శ్రీ జగ్గయ్యగారు ఏమన్నారో చూడండి: ‘‘ఈ మధ్య వస్తున్న తెలుగు చిత్రాలను చూస్తుంటే పాతతరం నటులైన మేము రాజీపడలేకపోతున్నాం. కుటుంబంతో సినిమాకు పోలేని పరిస్థితి. కాసులు కూడగట్టుకోవాలను కోవడం నిర్మాతల అవివేకం. ఈ చిత్రాలని విద్యార్థులే బహిష్కరించి సమాజానికి మార్గదర్శకులు కావాలి’’. (10-7-1996, ఆంధ్రప్రభ సచిత్రవార పత్రిక)