నేటి సినిమాలలో వికృత పోకడలు – విపరీత ధోరణులు

ఆధునిక కాలంలో విజ్ఞానం అందించిన ఒక దృశ్యరూపం ‘సినిమా’. ఇది మనుషులకో వరం! సంగీతం, నృత్యం, సాహిత్యం వంటి లలితకళల సమ్మేళనం సినిమా. ఈ కళారూపాన్ని ‘పవర్‌ఫుల్‌ మీడియా’గా గుర్తించిన నాటి సినీనిర్మాతలు, దర్శకులు ప్రజలను చైతన్యవంతుల్ని చేసే సాధనంగా మార్చారు. సినిమా ఒక కళేకాదు. నాటినుంచి నేటివరకు సమాజంలోని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వినోదాన్ని, విజ్ఞానాన్ని, వికాసాన్ని, చైతన్యాన్ని అందించవలసిన దీపిక.

తెలుగు సినిమా ‘‘మూకీ’’ (1921)గా ప్రారంభమై ‘‘టాకీ’’ (1931)గా వికసించి, ఈనాడు యావదాంధ్రలోనున్న టాకీసుల్లో తన విశ్వమోహన రూపాన్ని ప్రదర్శిస్తున్నది. ఆ రోజుల్లో ప్రజల మనోభావాలు, దేశ పరిస్థితుల్ని అవలోకనం చేసి నిర్మాతలు చిత్రాలు నిర్మిస్తుండే వారు. సినిమా చరిత్ర పౌరాణిక చిత్రాలతో ప్రారంభమయింది. 30వ దశకంలో ‘‘భక్త ప్రహ్లాద’’ (1931)తో టాకీ చిత్రాలు ప్రారంభమయాయి. ఆ తరువాత సాంఘిక, జానపద చిత్రాలు జోరందుకున్నాయి.

‘‘మాలపిల్ల’’ (1938), ‘‘రైతుబిడ్డ’’ (1939), ‘‘సుమంగళి’’ (1940), ‘‘దేవత’’ (1941), ‘‘బాలనాగమ్మ’’ (1942), ‘‘భాగ్యలక్ష్మి’’ (1943), ‘‘రత్నమాల’’ (1947), ‘‘ద్రోహి’’ (1948), ‘‘కీలుగుర్రం’’ (1949), ‘‘షావుకారు’’ (1950), ‘‘పాతాళ భైరవి’’ (1951), ‘‘పెళ్ళి చేసి చూడు’’ (1952), ‘‘దేవదాసు’’ (1953), ‘‘చక్రపాణి’’ (1954), ‘‘బంగారు పాప’’ (1954), ‘‘మిస్సమ్మ’’ (1955), ‘‘అర్థాంగి’’ (1955), ‘‘ఇలవేలుపు’’ (1956) – ఇలా ఎన్నో అద్భుతమైన కళాఖండాలు నిర్మాణమై తెలుగు ప్రేక్షక హృదయాలలో చెరగనిముద్ర వేశాయి. ముఖ్యంగా జానపద చిత్రాలే ప్రేక్షకుల్ని తమ వశం చేసుకున్నాయి. ఆ తరువాతి స్థానం సాంఘికాలది.

1940-65ల మధ్యకాలం అనేక కళాఖండాలతో విరిసి తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో స్వర్ణయుగంగా రూపొందింది. ఈ యుగంలోనే ‘‘సుమంగళి’’, ‘‘మళ్ళీ పెళ్ళి’’, ‘‘దేవత’’ ఇంకా ఈనాటి పోకడలతో రూపుదిద్దుకున్న నాటి మేటి చిత్రం ‘‘చూడామణి’’ (1941) కూడా మంచి పేరు తెచ్చుకున్నదే. ఈ చిత్రంలో వచ్చిన ఇబ్బంది ఏమిటంటే ఏడుపు తెప్పించాల్సిన సన్నివేశాలలో కూడా ప్రేక్షకులు నవ్వటం! ఇందులో ‘పుష్పవల్లి’ నటన అమోఘం, అద్భుతం. ఆమె నటనా కౌశలం గురించి చెప్పలేము, సినిమా చూసి తెలుసుకోవలసిందే …! మైసూరు మహారాజా గారి సన్మానం అందుకున్న నాగయ్య గారి ‘‘త్యాగయ్య’’ (1946) గొప్ప కళాఖండమే! నటుడుగా, దర్శకుడిగా, నాగయ్య గారి జీవితంలో ‘‘త్యాగయ్య’’ ఓ మైలురాయిలా నిలిచిపోతుంది. ఇక్కడో సంఘటన చెప్పాలి: మైసూరు మహారాజాగారు తన రాజభవనంలో ‘‘త్యాగయ్య’’ చిత్రాన్ని ప్రత్యేక షో ఏర్పాటు చేయించుకని నాగయ్య గారిని వెండి శాలువాతోనూ, 101 బంగారు నాణాలతోనూ సత్కరించారు. శ్రీరామచంద్రుడి బొమ్మ ఉన్న ఒక బంగారు నెక్లెస్‌ను కూడా బహూకరించారు. 1948లో విడుదలైన ‘‘ద్రోహి’’ కూడా గొప్ప పేరు తెచ్చుకుంది. ఆ మరుసటి సంవత్సరం 1949లో ఓ దేశభక్తుని కథ ఆధారంగా ‘‘నవ జీవనం’’ చిత్రం వచ్చింది. ఈ చిత్రం గాంధేయ వాదంలో రూపుదిద్దుకున్నదని చెప్పవచ్చు. 1949లో రిలీజైన ‘‘గుణసుందరి కథ’’ కూడా తెలుగువారు మర్చిపోలేని చిత్రరాజమే! ఇదో ఫాంటసీ కథ …! ‘‘ఏళైపడుంపాడు’’ తమిళ చిత్రమే తెలుగులో ‘‘బీదలపాట్లు’’గా 1950లో వచ్చింది. ఇక్కడో విషయం ముఖ్యంగా ప్రస్తావించడం చాలా అవసరం: 1947లో స్వరాజ్యమొచ్చింది. స్వతంత్ర భారతదేశ తీరుతెన్నులను గత మూడు సంవత్సరాలుగా గమనిస్తున్న నాటి ప్రజలకు, ఈ చిత్రం ఓ గొప్ప సందేశాన్ని అందించిందనే చెప్పాలి. అప్పటికి దారిద్య్రం దేశం నలుమూలలా ఆవరించి ఉంది. అయితే ప్రభుత్వం దానిని పట్టించుకున్నట్టు లేదు. అధికార మార్పిడిలో రాజకీయ వేత్తలంతా మునిగి ఉన్నారే కానీ, వేళ్ళూనుకొని ఉన్న దారిద్య్రాన్ని నాశనం చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలూ చేపట్టలేదు. దారిద్య్రానికి కారణమేమిటి? కొందరు ఎత్తయిన భవనాల్లో నివసిస్తుంటే, కొందరు పూరి గుడిసెల్లో ఎందుకు నివసించాల్సి వస్తూంది? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘‘బీదల పాట్లు’’ చిత్రమని చెప్పవచ్చు. నేరాలకు కారణం దారిద్య్రం! ఉన్నవాడి దగ్గర లేనివాడు దోచుకోవడం చట్టరీత్యా నేరమే! కానీ, దానిని నేరమనగలమా? అన్న అభిప్రాయాన్ని వ్యక్తీకరింపజేసే ప్రయత్నమే ‘‘బీదల పాట్లు’’ చిత్రం.

మనసున మల్లెలమాల లూగించిన మనోహరమైన దృశ్య కావ్యంగా ‘‘మల్లీశ్వరి’’ని చెప్పుకోవాలి. ఈ చిత్రం 1951లో విడుదలయింది. విదేశాలలో జరిగిన అనేక చిత్రోత్సవాలలో ‘‘మల్లీశ్వరి’’ ప్రదర్శింపబడి ప్రశంసల్ని అందుకున్న ఉత్తమ చిత్రం. 1950లో విడుదలయిన ‘‘షావుకారు’’, 1952లో రిలీజైన ‘‘పెళ్ళి చేసి చూడు’’ – ఈ రెండూ అభ్యుదయ చిత్రాలే. ‘‘షావుకారు’’లో ధనికుడికీ, పేదవాడికీ మధ్య ఉండే వైరుధ్యాన్ని నేరుగా చూపటం జరిగింది. వరకట్నాన్ని, సంప్రదాయ వివాహాల్ని నిరసించే విధానంలో రూపొందిన చిత్రం ‘‘పెళ్ళి చేసి చూడు’’. రెండూ సమాజాన్ని ప్రతిబింబించే విధంగా రూపొంది, ఆరోగ్యకరమైన చిత్రాలుగా ప్రజాదరణ పొందాయి. 1953లో రిలీజైన ‘‘నా ఇల్లు’’ యుగధర్మాన్ని ప్రతిబింబించినదైతే, దు:ఖాంతమయిన ఓ అమర ప్రేమ కథ ‘‘దేవదాసు’’ (1953). దేవదాసు పాటలన్నిటిని తెలుగువారు ఏనాటికీ మరువలేరంటే అతిశయోక్తి కాదు …! సాంఘిక చిత్రాల్లో ‘‘దేవదాసు’’ లాగా ప్రజాదరణ పొందిన సినిమా మరొకటి లేదనంటే – ఇది అక్షర సత్యమని అంగీకరించక తప్పదు. నవ్వులు పువ్వులు అందించిన ‘‘చక్రపాణి’’, శృంగారంలో వేదాంతముందని తెలియజెప్పిన ‘‘విప్రనారాయణ’’, ఇంకా ‘‘బంగారుపాప’’ ఇవన్నీ ఆణిముత్యాలే …! ‘‘బంగారుపాప’’ గొప్ప కళాత్మక చిత్రంగా పేరుగాంచింది. నవ్వుల నవరత్నమాల ‘‘మిస్సమ్మ’’ కూడా 1955లోనే విడుదలయింది. ప్రకృతి వైద్య చికిత్సను గూర్చి తొలిసారిగా ‘‘ఇలవేలుపు’’ (1956) చిత్రంలో ప్రస్తావించారు. ప్రకృతి వైద్య చికిత్సాలయం చుట్టూ ఈ కథ అల్లుకొని ఉంటుంది. ఈ చిత్రంలో మెలోడ్రామా పుష్కలంగా ఉంది. కానీ అది హద్దు దాటలేదు. ఇంకా ‘‘పెళ్ళినాటి ప్రమాణాలు’’ (1958), ‘‘మాంగల్యబలం’’ (1959) కూడా ప్రజాదరణ పొందిన చిత్రాలే.

తెలుగు టాకీ నాల్గవ దశకం (1961-70)లో మంచి చిత్రాలే వచ్చాయి. ప్రేక్షకులను ఆకర్షించడానికి హాస్యం, శృంగారం మొదలైన మసాలాలను కలిపి పాకం చేయడం 1960కి ముందు రోజుల్లో అంతగా కనబడదు. హాస్యమైనా, శృంగారమైనా కథలో భాగంగా ఇమిడి ఉండాలి. అలాంటి కోవకు చెందిన కథలను ఆనాటి దర్శకులు ఎంచుకొనే వారు. అందుకే ఆనాటి చిత్రాల్లో కళాత్మక విలువలు, నైతిక విలువలు మిశ్రితమై పొంగిపొరలేవి. ఈ దశకంలో విడుదలైన ‘‘భార్యాభర్తలు’’ (1961), ‘‘ఇద్దరు మిత్రులు’’ (1961), ‘‘రాముడు – భీముడు’’ (1964), ‘‘డాక్టర్‌ చక్రవర్తి’’ (1964), ‘‘మూగమనసులు’’ (1964), ‘‘ఇల్లాలు’’ (1965), ‘‘ఆడపడుచు’’ (1967) మంచి పేరు పొందినవే. ఆ తరువాత ‘‘అంతులేని కథ’’ (1976) మంచి చిత్రంగా పేరుగాంచింది. 1985లో రిలీజయిన ‘‘ప్రతిఘటన’’ అత్యంత సహజమైన సన్నివేశాలతో నిర్మితమై, సినీజగత్తులో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. 1980-2000 వరకు – ఈ కాలాన్ని సినీ పరిశ్రమ చరిత్రలో ఓ అయోమయ యుగంగా పేర్కొనవచ్చు. ఈ రెండు దశాబ్దాల కాలంలో రిలీజయిన చిత్రాల్లో ‘‘శృంగారం’’ శ్రుతి మించి ఉంది. రిలీజయిన సినిమాకు రెండేసి పేర్లు పెడుతున్నారు – పెద్ద అక్షరాల్లో ఒక పేరు, దానికింద చిన్న అక్షరాల్లో ఇంగ్లీషులో – మరో పేరు! ఎందుకో మరి ఈ పద్ధతి అలవాటుగా మారి, ప్రేక్షకుల్ని తికమకపెట్టే వరకు వచ్చింది.

సుమారుగా 20 సంవత్సరాల నుంచి విడుదలైన, వస్తున్న చిత్రాల్లో కళాత్మక నైతిక విలువలు గానీ, మానవీయ విలువలు గానీ ఎక్కడా కనిపించవు. ఇవి ‘‘పుబ్బ’’లో పుట్టి ‘‘మఘ’’లో మాడి మసైపోతున్నాయి. చూసిన ‘‘పిక్చర్‌’’ ఏమిటో, ఇంటికి తిరిగి వచ్చేలోగా ప్రజలు పేరే మరిచిపోతున్నారు! ఇవి సమాజాన్ని ఎంతగా భ్రష్టుపట్టిస్తున్నాయో ప్రజలకు తెలుసు. అయినా, ప్రజలింకా ‘‘ప్రతిఘటన’’ చొక్కా ధరించడం లేదు! ‘‘నిర్లక్ష్యం’’ ముసుగులో కునుకుపాట్లు పడుతున్నారు!

హీరోలను దృష్టిలో పెట్టుకొని ఈనాటి రచయితలు కథలల్లుతుంటే అందులో వ్యక్తి పూజే దర్శనమిస్తుంది. రచయితలకు స్వేచ్ఛ కరువే! నిజాయితీగా కథ రాయలేకపోతున్నారు. ఆశయాల్ని, ఆదర్శాల్ని చూపించడంలో విఫలులవుతున్నారు. సినిమాలన్నీ ఇంచుమించు ఒకే మూసలో నుంచి వచ్చినట్టే కన్పిస్తున్నాయి! పాత్రలను దృష్టిలో పెట్టుకొని మాటలు, పాటలు రాయాలి, కానీ నేడు పాత్రధారులను దృష్టిలో పెట్టుకని రాస్తున్నారు! నటీనటుల వంశాన్నీ, వాళ్ళ గత కీర్తినీ ఉటంకిస్తూ మాటలు, పాటలు రాస్తుంటే వినేందుకు అసహ్యంగా, ఎంతో ఎబ్బెట్టుగా ఉంటున్నాయి! ‘‘సినిమా’’ అంటే అదో సామాజిక కథ – స్వేచ్ఛగా, స్వతంత్రంగా సాగిపోవాలి. అప్పుడే ఆ కథ సహజంగా ఉంటుంది. ఇప్పుడీ పద్ధతి అసలు లేదనే చెప్పాలి. నేటి సినిమాలు చూస్తుంటే, మనముంటున్నది ‘‘రంకు’’ సమాజంలోనా! అనే అనుమానం, ఆశ్చర్యం, ఆందోళన కలుగుతున్నాయి. ఆనాటి సినిమాలు స్వర్ణయుగానికి చెందినవై ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయి, వాటిని తలచుకనునప్పుడల్లా మనసులు సంతోషంతో నిండగా పరవశం చెందుతుంటారు జనమంతా. నాటి సినిమాలు ‘‘ప్రకృతి’’కి చెందుతాయి. నేటి సినిమాలు ‘‘వికృతి’’గా నిలిచి ప్రజల మనసుల్ని పాడుచేస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలన్నిటికీ ‘‘ప్రేమ’’ కథావస్తువు. దానిచుట్టూరా కథ తిరుగుతుంది. దేశంలో ఎన్నో సమస్యలుండగా వాటిని స్పృశించటం లేదు రచయితలు. పదవ తరగతికి రాక పూర్వమే ఈనాటి పిల్లలు ప్రేమలో పడిపోతున్నారు. విద్యార్థుల్ని సత్‌పౌరులుగా తీర్చి దిద్దేందుకు నేటి సినిమాలేమాత్రం దోహదం చేయడం లేదు. పితృభక్తి, గురుభక్తి, దేశభక్తి – వీటిమీద నేడు సినిమాలు నిర్మితం కావటంలేదు. అందుకే ఈనాటి యువతలో పైన పేర్కొన్న భక్తి భావాలు, పెద్దల ఎడల మర్యాద, మన్నన ఇత్యాది భావాలు మృగ్యమై పోతున్నాయి. విశృంఖలత్వంతో యువత పెడదారి పడుతుంది. ఈ కోవకు చెందిన చిత్రాలు ఎంతో అనర్థాన్ని తెచ్చి పెడుతున్నాయి. సమాజానికెంతో అనారోగ్యాన్ని కూడా కల్గిస్తున్నాయి.

‘‘సినిమా’’ ఒకప్పుడు ‘‘కళ’’ ఆ కాలంలో – ప్రారంభ దశలో గొప్ప ‘‘కళాఖండాలు’’ మనోహరమైన ‘‘దృశ్యకావ్యాలు’’ నిర్మితమై ఆబాలగోపాలాన్ని ఆనందపరిచేవి, ఆహ్లాద పరిచేవి. ఈ రోజుల్లో ‘‘సినిమా’’ వ్యాపారమయిపోయింది. వ్యాపారంలో రాబడీ – లాభం మాత్రం చూసుకుంటారు గదా! అందుచేత ‘‘సరుకు’’ నాణ్యతలోపించింది. ఈ విషయం నేను వ్యాసం ప్రారంభంలోనే విశదం చేశాను. ఈనాడు నైతిక విలువలు లేవు. మంచి కుటుంబ గాథా చిత్రాలు రావడం లేదు. ప్రజలకోసం ఎవరు ఆలోచిస్తున్నారు? నేల విడిచి సాము చేస్తున్నారు. ప్రజలే విరక్తి చెంది సినిమాలను బహిష్కరిస్తే, మరి ఎవరికోసం సినిమాలు నిర్మిస్తారు? రాజకీయంలో ఎలాగయితే పెట్టిన ఖర్చు సంపాదించుకుంటారో సినిమా ద్వారా అంతే జరుగుతోంది….!

ఆనాటి స్వర్ణయుగానికి చెందిన సినిమాల్లోని గౌరవ గరిమలు నేడు కానరావు. కేవలం ప్రేమకోసమో, ఆధిపత్యం కోసమో హత్యలు – రక్తపాతాలు, చేతులు నరికేయడం, కాలు తెగ్గొట్టడం, చివరకు (హింస క్లై మాక్స్‌లో) తలలు కూడా నరికెయ్యడం చాలా సులువుగా జరిగి పోతున్నాయి….! లాటరీలు నడిపి సినిమాలు ఆడించే రోజులు కూడా ప్రజలు చూశారు. దీన్నిబట్టి సినిమాల్లో ఎంతటి పస, పట్టు ఉన్నాయో తెలుస్తుంది కదా! ఏ రోజైతే అడ్డు, అదుపులేకుండా స్వైర విహారం చేస్తున్న సెక్స్‌, బూతు సన్నివేశాలు తొలగిస్తారో ఆ రోజు సినిమా ‘‘రంగు’’ బయటపడుతుంది, దాని ‘‘వయసు’’లోని బింకమేమిటో తేట తెల్లమవుతుంది! రారాజు దుర్యోధనుడు మయసభలో ప్రవేశించినప్పుడు తనకు కలిగిన అనుభవాల వల్ల ‘‘ఖంగు’’ తింటాడు. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా అతనికి దర్శనమిస్తాయి. సరిగ్గా అదేవిధంగా నేటి సినిమాల్లో మయసభ సీనులు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి! సమాజంలోని యదార్థ దృశ్యాలు ఈనాడు చిత్రాల్లో కానరావడం లేదు.