ఎప్పుడు? ఎక్కడ? ఎలా?
డయాస్పోరా సాహిత్యాన్ని చూసేటప్పుడు కాలవిభజన చేసుకోవడం వల్ల మనకు ఏ టైంలో ఎలాంటి రచనలు వచ్చాయి అన్న విషయం, దాని వెనకవున్న కారణాలు మరింత స్పష్టమవుతాయి. మొదట మనం అర్ధం చేసుకోవాల్సింది, వీళ్ళందరికీ రచన ప్రవృత్తే కాని వృత్తి కాదు. అదెందుకు చెపుతున్నానంటే వీళ్ళు పాపులారిటీ కోసం అంటే కాలానుగుణంగా కాకుండా తమ మనసుకు దగ్గరగా వచ్చిన విషయాల మీద మాత్రమే రచనలు చేస్తున్నారు.
మొదటి తరం రచయిత్రులు మొదట్లో పుట్టినగడ్డకు దూరంగా వుండటం వల్ల ఆ జ్ఞాపకాలు, అనుభూతులు ఒకరితో మరొకరు పంచు కోవాలనుకున్నారు. అందుకు ప్రారంభంలో చిన్నగా ఏర్పడిన తెలుగు సంఘాలు, వాటి సావనీర్లు ఆలంబన అయ్యాయి. కాబట్టే తొలుత చాలామంది నొస్టాల్జియాతో రాశారు. దాదాపు 25,30 ఏళ్ళుగా ఈ దేశంలో వుంటున్న మొదటితరానికి చెందిన రచయిత్రులు ఇప్పటికీ ఆ ప్రపంచం నుండి బైటపడలేకపోతున్నారు. వాళ్ళు ఏంరాసినా మాతృదేశంతో వాళ్ళ మానసిక సాన్నిహిత్యం కనిపిస్తుంటుంది. ఆ విషయాన్ని నేను నెగెటివ్‌గా కాకుండా అది మన తెలుగుసమాజానికి ఓ బలమైన పార్శ్వంగా మాత్రమే చూస్తున్నాను. ఇన్నేళ్ళుగా వాళ్ళు భౌతికంగా ఈ దేశంలో వున్నా తమ మూలాల్ని మరిచిపోలేదు. వారి మాటల్లో వారి భాషలో తెలుగు నుడికారం ఇంకా సజీవంగా వుంది. కథల్లో సందర్భోచితంగా కృష్ణదేవరాయల కవిపోషణ గురించో, ముక్కు తిమ్మన్న పారిజాతాపహరణం గురించో, సత్యభామ వాల్జెడ గురించో, ఉరగాంగనస వ్యుత్పత్తి అర్ధం గురించో రాయగలుగుతున్నారు. మాచిరాజు సావిత్రి, నిడదవోలు మాలతి (చాతక పక్షులు) వడ్లమాని పద్మావతి (పడమటి గాలులు) మీరాబాయి (అమెరికా జీవితం గురించి ఆమె రాసిన నవల స్వాతి మాసపత్రికలో అనుబంధ నవలగా ప్రచురితమైంది), చింతం రాణి సంయుక్త లాంటి వాళ్ళు అక్కడి జీవితంతో పాటు ఇక్కడి జీవితాన్ని గురించికూడా అంతే బలంగా చిత్రిస్తూ రచనలు చేశారు. దామరాజు లక్ష్మి, శారదాపూర్ణ శొంఠి లాంటివాళ్ళు పూర్తిగా మాతృదేశపు జ్ఞాపకాలతో కథల్లాంటివి రాశారు. మొదటి తరం వాళ్ళు ఈ దేశం వచ్చేటప్పటికి తెలుగువారి సంఖ్య ఇప్పటితో పోలిస్తే చాలాతక్కువ వుండటం, అప్పుడు ఆంధ్రదేశం వున్న తీరు, వాళ్ళు వచ్చినప్పుడు అమెరికా వున్న తీరు – ఇవన్నీకూడా మొదటితరం రచయిత్రులు ఎలాంటి కథలు రాశారన్నదానికి స్పష్టమైన ఆధారం. ఈ దేశం వచ్చిన మొదట్లో వ్యక్తిగతంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా నిలదొక్కుకోవడానికి మొదటితరం వారు పడిన సంఘర్షణ, దాని తాలూకు అనుభవాలు తర్వాత వచ్చిన తరాల వారికి ఉపయోగపడ్డాయి.
90ల తర్వాత వచ్చిన రెండో తరం రచయిత్రుల నుండి పెద్దగా నోస్టాల్జియా రచనలు వచ్చినట్టు కనిపించలేదు. గత పదిహేనేళ్ళుగా మొదటి, రెండోతరం రచయిత్రులంతా కూడా కలగలసిపోయిన అమెరికన్ తెలుగు సంస్కృతి, జీవనవిధానం, పిల్లల పెంపకంలో ఎదురయ్యే ఇబ్బందులు, మారుతున్న భార్యాభర్తల అనుబంధాలు, పిల్లల పెళ్ళిళ్ళల్లో ఎదురవుతున్న అవస్థల్లాంటి ఇతివృత్తాలతో ప్రధానంగా కథలు రాశారు. ఈ కథలన్నీ కూడా పాతిక, ముప్ఫై ఏళ్ళుగా క్రమంగా మారుతూ వచ్చిన అమెరికన్ తెలుగు సమాజ స్వరూపాన్ని మన కళ్ళకు కటినట్టు చూపిస్తాయి. ఇవాళ మనకు అమెరికా తెలుగువారి జీవనవిధానం సంపూర్ణంగా అర్ధం కావాలంటే ఈ కథలు చదవాలి.
అయితే ముఫ్ఫై ఏళ్ళనాటి అమెరికాకి, ‘బూమ్’ తర్వాతి అమెరికాకు, మరీ ముఖ్యంగా చెప్పాలంటే సెప్టెంబర్ 11 తర్వాత అమెరికాకు చాలా తేడా వుంది. ఈ తేడాను పట్టుకొని తమ రచనల్లో బలంగా చూపించిన రచయిత్రులు దాదాపుగా లేరనే చెప్పుకోవాలి. మాచిరాజు సావిత్రి, నిడదవోలు మాలతి, కలశపూడి వసుంధర, శేషుశర్మ లాంటి అతికొద్దిమంది రచయిత్రులు తప్ప ఎక్కువ మంది అమెరికన్ తెలుగు జీవనానికి సంబంధించి కౌటుంబిక ఇతివృత్తాలతోనే కథలు రాశారు. వర్తమాన పరిస్థితులపై, రాజకీయార్ధిక విషయాలపై ఒకటో, రెండో కథలు తప్ప కనిపించవు.
ఇక్కడి షేర్ మార్కెట్ గురించో, సెప్టెంబర్ 11 దాడుల గురించో, క్రెడిట్‌కార్డ్‌ల మోసాల గురించో ఆడవాళ్ళ నుంచి కథలెందుకు రావన్నది నన్ను ఆలోచింపచేస్తున్న అంశం.
అలాగే ఇండియాలో మారుమూల పల్లెల్లో కూడా మనకు ‘లెస్బియన్, గే’లాంటి సంఘటనలు జరుగుతుంటే, అమెరికన్ సమాజంలో అవి మరింత ఎక్కువ, చట్టబద్ధం, అతిసామాన్యం అయినప్పుడు దాని ప్రభావం అమెరికన్ తెలుగు సమాజంపై ఎలా వుంది. అది కేవలం పిల్లల పెళ్ళిళ్ళకు సంబంధించి భయాందోళనలకు సంబంధించిన అంశంగా కాకుండా అలాంటివాటిపట్ల మన అమెరికన్ తెలుగుపిల్లలు ఎలా ప్రతిస్పందిస్తున్నారు. వాటి పట్ల వాళ్ళ ఆలోచనలు ఎలా వుంటున్నాయి. అలాంటి సంఘటనలు మన కమ్యూనిటీలో ఏమైనా జరిగాయా? అన్న విషయాలు ఇక్కడి రచనల్లో ఎందుకు చర్చకు రావడం లేదన్నది నా సందేహం.
గత పదిపదిహేనేళ్ళుగా ఇక్కడి తెలుగు అమెరికన్ సమాజంలో ప్రముఖంగా కనిపిస్తున్న లేదా వినిపిస్తున్న విడాకులకేసులు, గృహహింస, కట్నం వేధింపులు, పెళ్ళి పట్ల పిల్లల, పెద్దల ఆలోచనల్లో వచ్చిన మార్పు, కొత్తగా పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్న వివాహ వేదికలు, ఆన్ లైన్ మారేజీ బ్యూరోలు ఇలాంటి అంశాల మీద ఇక్కడి రచయిత్రుల నుండి కథలు వచ్చినట్టు కనిపించలేదు.
రచయితల్ని ఫలానా అంశాలు ఎందుకు తీసుకుంటున్నారని కానీ, ఎందుకు తీసుకోలేదని కానీ మనం అడగాల్సిన పనిలేదు. ఏ రచయితైనా తన మనసుకు దగ్గరగా వచ్చిన అంశాల్ని మాత్రమే కథావస్తువుగా స్వీకరిస్తారు. మరి ఈ ప్రశ్నలెందుకంటే నిజంగా అమెరికన్‌తెలుగు సమాజం ఎలా వుంది? ఎలాంటి జీవనవిధానాన్ని గడుపుతోంది? అన్న విషయాల మీద ఇక్కడి నుంచి వాస్తవ చిత్రణతో రచనలు రాకపోవడం, వాటి గురించి లోతైన పరిశీలన కానీ జరగకపోవడం ప్రవాసాంధ్ర సాహిత్యానికి ఓ లోపంగా మిగిలిపోతుంది కాబట్టి.
ఈ అంశాలన్నీ కూడా అమెరికాలోనూ, ఇండియాలోనూ కనిపిస్తున్న ఆలోచనల గురించి, వాటిల్లో వస్తున్న మార్పునుగురించి చెప్పటం కోసమే. అక్కడి ప్రభావం ఇక్కడ, ఇక్కడి ప్రభావం అక్కడ వుండటం రెండూ సహజమే. అయితే ఈ ప్రభావాల్ని, మార్పుని సమన్వయం చేసి చెప్పాస్సిన బాధ్యత రచయితలదే. అమెరికాలో జీవిస్తున్నవాళ్ళు కూడా ఎక్కడి నుంచో దిగుమతి అయ్యేవాళ్ళు కాదుకదా. వాళ్ళు, వాళ్ళ మూలాలు ఇండియానుండి వచ్చినవే. ఇక్కడ కూడా భార్యల్ని రకరకాలుగా కట్టడి చేసే మనుషులుంటారు. మానసికంగా, భౌతికంగా ‘ముక్కలు ముక్కలు’గా నరికే నరహంతకులుంటారు. కొందరి ‘మాటల’ ప్రకారం గ్రీన్‌కార్డు కోసం అమెరికాలో వున్న అబ్బాయిల్ని పెళ్ళి చేసుకొని ఎయిర్‌పోర్టులోనే వదిలివెళ్ళిపోయే అమ్మాయిలుంటారు. మరి ఇవన్నీ రచనల్లో వచ్చినప్పుడే కదా మిగతా ప్రపంచానికి కూడా ఇక్కడేం జరుగుతోందో తెలిసేది. కాబట్టి ప్రేమించిన వాళ్ళు మోసం చేశారనో, కట్నం తక్కువ ఇచ్చారనో అమ్మాయిల ఆత్మహత్యలు, హత్యలు అక్కడైనా ఇక్కడైనా ఒక్కటే. అక్కడా ఇక్కడా విడాకుల రేటు సమానమే. ఎన్నారైల కట్నం వేధింపు కేసులు ఎక్కువవడం వల్ల ఇండియాలో ప్రత్యేకంగా ఎన్నారై సెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. కానీ కట్నం వేధింపుల గురించి ఒక్క కథ కూడా ఇక్కడి నుంచి రాలేదు. అంటే రచయిత్రులు వాస్తవాన్ని చూపించటానికి నిరాకరిస్తున్నారా? లేక అలాంటి వాటి గురించి రాయటానికి భయపడుతున్నారా? అన్నది ఆలోచించాల్సిన అంశం.
ఇక్కడున్న రచయిత్రుల్లో ఒకరిద్దరివి తప్ప మిగతావారి రచనలేవీ ఇండియాలోని ప్రధానస్రవంతి పత్రికల్లో ప్రచురితమైనట్లు చూడలేదు. ఇందుకు కారణం వాళ్ళకు అక్కడికి ఎలా పంపాలి అన్న విషయంపై అవగాహన లేకపోవడమైనా అయివుండాలి లేదా దాని పట్ల ఇంట్రస్టు అయినా వుండకపోవాలి. అందువల్లే చాలామంది ప్రవాసాంధ్ర రచయిత్రులు ఇక్కడున్న ఆన్‌లైన్ పత్రికలకు, సావనీర్లకు పరిమితమైపోయారు. ‘తెలుగునాడి’లో ఇండియాలో ప్రచురితమైన కథల్నే పునర్ముద్రిస్తున్నారు తప్ప డైరెక్టుగా అమెరికా వారి రచనల్ని ఎక్కువగా తీసుకోవడం లేదు. ప్రవాస సాహిత్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారు రాస్తున్న రచనల్ని ఎలక్ట్రానిక్ రూపంలో అందరికీ అందుబాటులోకి తెచ్చే సదాశయంతో మొదలు పెట్టారు ‘ఈమాట’. వంగూరి ఫౌండేషన్ వాళ్ళు డయాస్పోరా సాహిత్యాన్ని సంకలనాలుగా తీసుకువచ్చే బృహత్‌కార్యక్రమాన్ని నిరాటంకంగా చేస్తుండటం వల్ల కొంతన్నా ప్రవాసాంధ్ర సాహిత్యం మనకు ఓ చోట లభ్యమవుతోంది. ఆ ప్రచురణలే లేకపోతే ఇవాళ చాలా మంది కథలు సావనీర్లలో తప్ప మనకు దొరికేవి కావు. చిమటా కమల రాసిన ‘అమెరికా ఇల్లాలు’ సంకలనం, వడ్లమాని పద్మావతి ‘పడమటి గాలులు’ నవల రెండూ కూడా వంగూరి ఫౌండేషన్ ప్రచురణలే. ‘తెలుగు పీపుల్ డాట్ కామ్’ సుజనరంజని, ‘భువనవిజయం’ లాంటి వెబ్‌సైట్ల్ కూడా ఇతోధికంగా ప్రవాసాంధ్ర రచనల్ని ప్రోత్సహిస్తున్నాయి.
తెలుగు సాహిత్యంలో ప్రవాసాంధ్ర జీవితం ఓ పాయ. దళిత, స్త్రీ, మైనార్టీ ఉద్యమాలతో భాగంగా ప్రవాసాంధ్ర జీవితం గురించి అక్కడా, ఇక్కడా సరైన చర్చ జరిగినప్పుడే వర్తమాన తెలుగుసాహిత్య స్వరూపం మరింత స్పష్టమవుతుంది.*
