అమమెరికాకు వచ్చి కొద్దికాలం గడిపివెళ్ళిన అనుభవాలతో కె.రామలక్ష్మి (నన్ను వెళ్ళి పోనివ్వండి), మహెజబీన్ (ఆకు పచ్చని ఆకాశం కింద), పి.సత్యవతి (మంత్రనగరి, తిమింగల స్వర్గం), వాసా ప్రభావతి, భార్గవీరావు (తూరుపుగాలి), యద్దనపూడి సులోచనారాణిలాంటి వారు రచనలు చేశారు. మహెజబీన్ కథ గురించి తీవ్రస్థాయిలోనే చర్చ జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ చర్చించడం అనవసరం. ఆ కథలో రచయిత్రి ప్రస్తావించిన అంశాలు వాస్తవ విరుద్ధంగా వున్నాయన్నది అమెరికాలో వున్న సాహిత్యాభిమానుల ప్రధాన విమర్శ.
ఇక పి.సత్యవతి కథల్ని చూస్తే…‘తిమింగలస్వర్గం’(1996) ఓ అలీగరి. అదొక తిమింగలలోకం. అందులో శ్యాంమామయ్య, బిల్ అన్నయ్య, వందకాళ్ళ ఎలక్ట్రానిక్ పురుగు, ధవళగృహం అన్నీ వుంటాయి. సల్మాన్‌రష్దీ టైపులో కలలొచ్చే అమ్మాయికి వాళ్ళ నాన్న గుండెమార్పిడి, బ్రెయిన్ మార్పిడి ఆపరేషన్ చేస్తాడు. ట్యూబు నుండి ఆ అమ్మాయికి ఆక్సిజన్‌కి బదులు కరెన్సీనోట్లు పంపిస్తారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ కరెన్సీ నోట్లనే ఊపిరిగా పీల్చడం వల్ల ఆ అమ్మాయికి జీవితాంతం ఊపిరాడకపోవడమనేదే వుండదు. ఆపరేషన్‌లో భాగంగా ఆ అమ్మాయి మెదడు ట్యూన్ అయ్యేందుకు వీలుగా పాల్ ఫౌండర్ రాసిన ఫాల్స్ టేల్స్ చదివి వినిపిస్తారు. అందులో ఆణి ముత్యాల్లాంటి నాలుగుకథల సారాంశమేమిటంటే.. సొంత ఆస్తి, కుటుంబం వుండాలి. కులాలు, ఉపకులాలు, శాఖల్ని కాపాడుకోవాలి. పక్కవాడ్ని కిందపడేసైనా పోటీ ప్రపంచంలో పైకి రావాలి. మరింత అణచివేత వద్దనుకుంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళల్లా వుండాలి. వీటన్నింటికి ఆ అమ్మాయి మెదడు ట్యూన్ అయిపోయినా ఆ అమ్మాయి స్నేహితులు రవి, కాంతిలాంటి వాళ్ళు పట్టుదలతో ఆ తిమింగలస్వర్గం కోరల్లో చిక్కుకోకుండా తప్పించుకోగలుగుతారు. ఇది అమెరికా జీవితం గురించిన కథ కాదు గానీ అగ్రరాజ్యం దుర్నీతిని ప్రతీకాత్మకంగా అవహేళన చేస్తూ రాసిన కథ.
‘మంత్ర నగరి’ (2002) కథ చూస్తే…అమెరికా ఓ మంత్రనగరి. చదువుకొని విద్యార్థి సంఘాల్లో పనిచేసి, స్త్రీలహక్కులు, మానవహక్కుల ఉద్యమాల్లో తిరిగిన గీత లాంటి అమ్మాయిలు కూడా అందం, ఆస్తి, సొంత జీవితం అంటూ ఆ మత్తులో పడిపోతున్నారన్న ఆవేదనతో పాటు యువతరం ఎటువైపు వెళుతోందో ఆలోచించమన్న హెచ్చరిక కూడా ఈ కథ ద్వారా చేస్తుంది రచయిత్రి. రaాన్సీ కూతురు గీత అవకాశాల దేశంలో బాగాసెటిలై తల్లిని చూసిపోదువుగాని రమ్మంటే ఆమె అమెరికా వస్తుంది. అక్కడి జీవితాన్ని పరామర్శిస్తూ ఈ మంత్ర నగరికథ చెపుతుంది. ఈ కథలో ‘ఇక్కడ కూడా జీన్స్, టీషర్టులు ధరించిన మనుషులున్నారు’లాంటి వ్యాఖ్యలు కనిపిస్తాయి.
సత్యవతి ఇటీవల అంటే ఏప్రిల్, 2006లో రాసిన మరో కథ ‘ఒక రాజు – ఒక రాణి’. ఆంధ్రదేశంలో పుట్టి పెరిగిన ఒక్కడే(ఏకసంతు) అబ్బాయి, ఒక్కర్తే(ఏకసంతు) అమ్మాయికి పెళ్ళవుతుంది. అప్పటికే అమెరికాలో వున్న అబ్బాయి దగ్గరకు అమ్మాయి వస్తుంది. అమ్మాయికి వంటరాదని, ఇల్లు సర్దడం లేదని, బాత్‌రూమ్‌లు కడగడం లేదని అబ్బాయి ఆరోపణ. అసలు అవన్నీ నేను మాత్రమే ఎందుక చేయాలి? నువ్వెందుకు చేయవు? నేను పుట్టి బుద్ధెరిగాక ఇప్పటి వరకూ కాపీ కప్పు కూడా కడగలేదంటుంది అమ్మాయి. అవన్నీ చేసుకునేకాడికి ఈ పెళ్ళి ఎందుకు? పెళ్ళాంగా నువ్వెందుకు? అవన్నీ చేసుకోవాలనే కదా నిన్ను చేసుకుంది అంటాడు అబ్బాయి. ఇద్దరూ కౌన్సిలింగ్ తీసుకోండి లేకపోతే కాపురం చేయడం కష్టమని సలహా ఇస్తుంది స్నేహితురాలు. పిల్ల పుడుతుంది. కాన్పుకొచ్చిన అమ్మాయి తల్లి, ఇండియానుండి అబ్బాయి తండ్రి పిల్లను ఇండియా తీసుకెళ్ళి పెంచుతాం, మీరిద్దరూ హాయిగా ఉద్యోగం చేసుకొని ఇల్లు కొనుక్కోండని సలహా ఇస్తారు.‘ఎందుకు మరో మహారాణిని తయారు చేయడానికా? మా జీవితాల గురించి మమ్మల్ని ఆలోచించుకోనివ్వండి.’అంటాడు అబ్బాయి. ఇదండీ ఒకరాజు- ఒకరాణి కథ. కొన్ని అమెరికా పెళ్ళిళ్ళు విడాకుల దాకా పోతుండటానికి ఈ కథలో చూపించిన అంశం ఒక కారణం కావచ్చు. సెప్టెంబర్ 11 నాటి దాడుల నేపధ్యంలో డబ్ల్యుటిసిలో పని చేసే సుష్మ, బ్రిటిషర్ ఆర్డ్‌ల మధ్య చిగురించిన ప్రేమానుబంధాన్ని ‘9/11ప్రేమకథ’ ద్వారా చెప్పారు ముదిగంటి సుజాతారెడ్డి. 9/11 దాడులు జరిగినప్పుడు లిఫ్టు నుండి బైటకు వస్తున్న తన బాస్ ఆర్ట్ గాయపడితే రక్షించి తన రూమ్‌కు తీసుకొస్తుంది సుష్మ. అప్పటివరకూ సుష్మ అంటే ప్రేమ వున్నా తనజాతి గొప్పదన్న సుపీరియార్టీ కాంప్లెక్స్‌తో దాన్ని కప్పివుంచాలనుకున్నాడు ఆర్ట్. మృత్యువుకి దగ్గర దాకా వెళ్ళివచ్చిన సంక్లిష్ట సందర్భంలో తన ప్రాణాన్ని కాపాడిన సుష్మకు తన మనసులో మాట చెప్పకుండావుండలేక పోయాడు ఆర్ట్. జాతుల మధ్య వున్న అంతరాలు, ఎక్కువ తక్కువన్న భావనలు మరిచి వారిద్దరూ ఒకటై ఎత్తైన భవనాలు కూలిన చోట శాంతిశిఖరాలు మొలుస్తాయన్న ఆశతో ముందుకు సాగుతారు. పైకి అందరం ఒకరినొకరు ‘గ్రేట్ గ్రేట్’ అంటూ భుజాలు తట్టుకుంటున్నా లోపల్లోపల ‘ఓరియంటల్’ అనో ‘కొలోనియల్’ అనో వున్న భావనల గురించి రచయిత్రి ఈ కథలో ప్రస్తావిస్తారు.
ఈతి బాధలూ…నీతి కథలూ!
పైన చెప్పిన కథలు కాకుండా అమెరికా మీద, అమెరికన్ తెలుగువారి మీద అనేక రకాల స్టీరియోటైపు కథలు వచ్చాయి. వస్తున్నాయి. ఆ కథల్లో ప్రధానంగా చూపించే అంశాలు —అమెరికాలో వున్న వారి మధ్య ఆర్ధిక సంబంధాలు తప్ప మానవసంబంధాలుండవు. వాళ్ళంతా డాలర్ల వెంపర్లాటలో వుంటారు. తల్లితండ్రుల్ని పట్టించుకోనివారో, తన్ని తరిమేసేవారో, ఓల్డ్‌ఏజ్‌హోముల్లో చేర్పించేవారో అయివుంటారు. డర్టీ ఇండియా అంటూ విసుక్కుంటారు రకరకాల మనుష్యులు, మనస్తత్వాలు సహజమైన సమాజంలో ఇలాంటి స్టీరియోటైపు వాళ్ళు ఆంధ్రలో వుంటారు. అమెరికాలో వుంటారు.
ఇండియా కథలు స్టీరియోటైపా…?
ఆంధ్రదేశంలో వున్న రచయిత్రులు తమ జీవితాల్లో అమెరికా ప్రభావం గురించో, తమకు తెలిసిన అమెరికా జీవితం గురించో కథలు రాశారు. ఈ కథలు ఇండియాలోని వారికి బాగానే నచ్చినా అమెరికాలోని సాహిత్యాభిమానులకు నచ్చలేదు. అందుకు వాళ్ళు చెప్పే కారణాలు అమెరికా జీవితం చూడకుండా అనుభవించకుండా రాయడం మీద ఒకటైతే, అందులో వాస్తవాలు లేవనడం మరొకటి. అమెరికాను, దాని ప్రభావాన్ని, లేదా ఇక్కడి డాలర్లను అక్కడి వారు నెగెటివ్ అంశంగానే చూపిస్తున్నారు తప్ప పాజిటివ్‌గా చూపించే రచనలేవీ కనిపించలేదు. వృద్ధులైన తల్లితండ్రుల్ని ఓల్డ్‌ఏజ్‌హోమ్‌లో చేర్పించే అంశం గురించి ఇండియాలో కేవలం అమెరికాకు వెళ్ళిన పిల్లల ప్రభావంగా చూస్తున్నారు తప్ప ఇండియాలోనే వున్న పిల్లలు కూడా తమ తల్లితండ్రుల్ని ఓల్డ్‌ఏజ్‌హోముల్లో చేర్పించటానికి ఇష్టపడుతున్నారని, అసలు చాలామంది తల్లితండ్రులే పిల్లల దగ్గర వుండటం కన్నా విడిగా వుండటమే మేలనుకుంటారన్న విషయాన్ని మనం గమనించాలి.
అమెరికాలో వున్న వారే డాలర్‌మాయలో వున్నారని, ఇక్కడ డబ్బు, స్వార్ధం తప్ప మానవసంబంధాలు లేవన్న ఆరోపణ కూడా సత్యదూరమే. అమెరికా నుండి ఇండియాకు రవాణా అవుతున్న డబ్బువల్ల అక్కడి పంటపొలాలన్నీ ఇళ్ళ స్థలాలుగా మారడం, అమెరికా నుండి వచ్చేవారిని కేవలం డాలర్ నోట్లుగా చూడటం, ఎన్నారై డబ్బుతో మారుతున్న ఇండియన్ల ఆలోచనా ధోరణుల్ని చూపిస్తోంది. ఇటీవల జరిగిన ‘ప్రవాసీదివస్’లో ఎన్నారైల అనుభవాల కథనాలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. వీటికి సాహిత్యానికి సంబంధమేమిటంటే సాహిత్యమెప్పుడూ సమాజరూపానికి ప్రతిబింబం కావాలి. అప్పుడే అది మంచి సాహిత్యమవుతుంది. వాస్తవ పరిస్థితుల్ని సాహిత్యంలో చర్చించినప్పుడు మాత్రమే మనకు సమాజం అసలు స్వరూపం బోధపడుతుంది.
అమెరికా తెలుగు రచయిత్రులు – కొత్త ఇతివృత్తాలు
అమెరికా నుండి ప్రముఖంగా రాస్తున్న రచయిత్రుల్లో మాచిరాజు సావిత్రి, పూడిపెద్ది శేషుశర్మ, చిమటా కమల, నోరిరాధిక, నిడదవోలు మాలతి, చెరుకూరి రమాదేవి, వడ్లమాని పద్మావతి, కొమరవోలు సరోజ, సుధేష్ణ, కలశపూడి వసుంధర, చింతం రాణి సంయుక్త, పుచ్చా అన్నపూర్ణ, పద్మలత, ఉపాధ్యాయుల సూర్యకుమారి, దామరాజు లక్ష్మి, శారదాపూర్ణ శొంఠి, పావనీ సుధాకర్, కల్పన రెంటాల, రాధికా శాస్త్రి, లలితా జొన్నాళ్, పుచ్చా వసంతలక్ష్మి, కొవ్వలి కాటూరి జ్యోతి, శ్యామల దశిక, ముత్యాల సీత, సులోచనా భండారు, అయ్యగారి రమామణి, మంగళాకందూర్, సాయిలక్ష్మి, కనకదుర్గ తదితరులున్నారు.
వీళ్ళల్లో కొందరి కథల్ని చూద్దాం. చాలా మంది మాట్లాడటానికి, గుర్తించటానికి నిరాకరించే గృహహింస (domestic abuse), డిప్రెషన్ లాంటి అంశాల్ని కనీసం రేఖామాత్రంగానైనా తన కథ ‘చీకటివెలుగులు’లో చూపించిన రచయిత్రి పూడిపెద్ది శేషుశర్మ. ఈ కథలో మాధవి గృహహింస బాధితురాలు. పెళ్ళై అమెరికా వచ్చాక కాలేజీలో చేరి చదువుకుంటోంది. ఆ అమ్మాయి వంటి మీద దెబ్బలు గమనించిన అదే కాలేజీలో పనిచేసే కిషోర్ ఆ అమ్మాయి మీద సానుభూతితో ఆమెతో స్నేహం చేసి భర్త ఇబ్బందులు పెడితే అవసరమైతే ఇంట్లోంచి ఎలా బైట పడవచ్చో ముందు జాగ్రత్తగా సలహాలిస్తాడు. భర్తకు ఎయిడ్స్‌వ్యాధి అన్న సంగతి తెలియగానే మాధవి ఇంట్లోంచి బైటపడి షెల్టర్‌కు చేరుకొని కిషోర్ సహాయంతో ఇండియా వెళ్ళిపోతుంది. కిషోర్‌ది మరోరకమైన సమస్య. ఇండియా నుండి పెళ్ళి చేసుకొని తీసుకువచ్చిన భార్య నాలుగు గోడల మధ్య వుండటంతో డిప్రెషన్‌కు గురైందన్న నిజాన్ని తెలుసుకోలేకపోవడంతో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. తన తప్పు తెలుసుకున్న కిషోర్ దాన్ని సరిదిద్దుకోవాలనుకుంటాడు. శాడిస్టు భర్త నుండి బైట పడ్డ మాధవి, కిషోర్ పెళ్ళి చేసుకోవాలనుకోవడంతో కథ సుఖాంతమవుతుంది. ఈ ఒక్క కథ తప్ప ఆడవాళ్ళలో డిప్రెషన్ గురించి, ఇక్కడి తెలుగు కుటుంబాల్లోని కుటుంబహింస గురించి చర్చించిన కథలేవీ నా దృష్టికి రాలేదు.
పెళ్ళయిన పాతికేళ్ళకు భర్తకు, తనకు మధ్య వున్న అగాధాల్ని అందరి ముందు ధైర్యంగా చెప్పి ఇండియా వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది ‘సర్‌ప్రైజ్’ కథలో లత. నోరిరాధిక ‘అకాల వసంతం’ కథలో భార్య చనిపోతే ఆఫీసులో పనిచేసే కొలీగ్, స్నేహితురాలు ‘లిండా’తో కలిసి జీవితం పంచుకోవాలనుకున్న శంకరం నిర్ణయం పట్ల మొదట్లో పిల్లలకు వ్యతిరేకభావం కలిగినా, తమ మనసు మార్చుకొని తండ్రి నిర్ణయాన్ని ఆమోదిస్తారు . పెళ్ళీడుకొచ్చిన కొడుకో, కూతురో ‘సేమ్ సెక్స్‌మ్యారెజెస్’ వైపు వెళ్ళకుండా తెలుగు వాడ్ని, ఇండియన్‌ని కాకపోయినా కనీసం తెల్లవాడినో, నల్లవాడినో కట్టుకుంటే అమ్మయ్య గండం గట్టెక్కించారనుకునే తల్లితండ్రులు ఇంకా కోకొల్లలు. సుధేష్ణ ‘మొగుడు కావాలా?’ శేషు శర్మ ‘పెళ్ళి చేసుకుంటే చూడు’, లలితా జొన్నాళ్ ‘పి.పి.అమ్మ’, నోరి రాధిక ‘కాగల కార్యం గంధర్వులే తీర్చారు’ లాంటి కథలు, ఈ పెళ్ళిళ్ళ తంతులోని వైరుధ్యాల్ని, ఒత్తిడులను, సంఘర్షణలను చూపిస్తాయి
కలశపూడి వసుంధర కలం నుండి వెలువడ్డ ‘గిరీశం ఇన్ వైట్ హౌస్’, ‘పృచ్ఛకాభిమన్యులు’ రెండింటి ఇతివృత్తాలు కూడా ఇక్కడి స్త్రీల రచనల్లో కాస్త భిన్నంగా కనిపిస్తాయి. అమెరికన్ రాజకీయాల్లోని అప్రజాస్వామ్య, అనైతిక విలువల్ని గిరీశం పాత్ర ద్వారా అవహేళన చేయించారు, ‘గిరీశం ఇన్ వైట్ హౌస్’ కథలో. సహస్రావధానం పేరిట టక్కడ జరిగే తంతులోని చేదునిజాల్ని ‘పృచ్ఛకాభిమన్యులు’ కథలో ఎత్తి చూపించారు.
ప్రాక్, పశ్చిమ దృక్కోణాలలో ఇంతగాఅంతరాలు కనిపిస్తున్నా అంతరాంతరాల్లో ఆలోచనల్లో, ధోరణుల్లో అట్టే వ్యత్యాసం లేదని, మారుతున్న తరాలతో విలువలు ఎక్కడైనా మారిపోతున్నాయని నిడదవోలు మాలతి చెప్పే కథ ‘దృక్కోణాలు’. ఇక్కడున్న ఇండియన్లు లేదా తెలుగువారిలో అప్పుడప్పుడు స్పష్టంగా కనిపించే స్వార్ధం, పక్కవారిని తోసేసి లాభపడాలన్న దురాశ, ‘నువ్వు నా లాభం చూడు, నేను నా లాభం చూసుకుంటాను’ అన్న తత్త్త్వం, బంధుత్వాల్ని ఆసరాగా చేసుకొని చేయూతనిస్తామంటూ మనుష్యుల్ని కొనేసే డబ్బు మనస్తత్వం గురించి, ‘కొనే మనిషి’, ‘డాలర్‌కో గుప్పెడురూకలు’లాంటి కథల్లో మాలతి చిత్రించారు. అమెరికాలో తెలుగు ఇల్లాలుకి సుప్రభాతం నుండి పవళింపుసేవ వరకూ నిత్యజీవితంలో ఎదురయ్యే రకరకాల సన్నివేశాల్ని, సందేహాల్ని చిన్న చిన్న కథానికలుగా రాసి ‘అమెరికా ఇల్లాలు’ సంకలనంతో అందరి మెప్పు పొందారు చిమటాకమల. వినాయకచవితి పండుగ చేసుకోవడమో, ఫ్యామిలీ ఫొటో తీయించుకోవడమో దేన్లోనైనా అమెరికా తెలుగు ఇల్లాలిది తూర్పు పడమరల సమ్మిళిత సంస్కృతి. సరదాగా చదువుకొని పాత జ్ఞాపకాల్ని గుర్తుచేసుకోవడమే కాకుండా మనం సీరియస్‌గా మనసు పెట్టి ఆలోచించాల్సిన కొన్ని అంశాల గురించి కూడా ఆమె రచనలు చేశారు. అమెరికాలో కెరియర్ ఉమెన్‌కు సంబంధించిన సమస్యలేవీ రచయిత్రుల నుండి కథల రూపంలో రాలేదు. పావనీ సుధాకర్ రాసిన ‘కార్టూన్స్’(ఎ.పి.వీక్లీ) స్త్రీలకు సంబంధించిన కథ కాకపోయినా అందులో ప్రధాన పాత్ర షీనా ఓ కంపెనీలో బిజినెస్ అనలిస్ట్. అదే కంపెనీలో మరో ఇద్దరు అమ్మాయిలు ప్రీతి, చరణ్ పని చేస్తుంటారు. కాన్ఫరెన్స్‌కోసం కొత్తగా వచ్చిన ముగ్గురు తెలుగబ్బాయిలు ఒకే రకమైన డ్రెస్సింగ్‌లో వుండటం, ప్రతిదానికీ చేతులు కట్టుకొని ఎస్ సర్ అంటూ మాట్లాడటం చూసి అమ్మాయిలు వారిని కార్టూన్స్‌గా పిలుస్తూ, జోక్‌లేసుకుంటారు. అయితే ఆ ముగ్గురబ్బాయిల్లో ఓ అబ్బాయి ఇండియాకి ఫోన్లో మాట్లాడుతూన్న దాన్ని బట్టి తల్లి చనిపోయినా వెళ్ళలేని అతని అశక్తత, నిస్సహాయత అర్ధమైన షీనాకు అసలు కార్టూన్లు ఎవరో అర్ధమవుతుంది. హెచ్-1 వీసాల మోజులో పరుగెత్తుకుంటూ వస్తున్న కొందరి యువజీవితాల్లో అంతర్లీనంగా దాగుండే చీకటినీడల్ని బహిర్గతం చేస్తుంది ఈ కథ.