తెలుగు డయాస్పోరా: సాహిత్యం, సంస్కృతి

అచ్చు పత్రికలు రావడం, అమెరికాలో తెలుగు సంఘాలు ఏర్పడడం దాదాపూ ఒకే దశలో జరిగాయి. అచ్చుపత్రికలు ఇక్కడి రచయితల సాహిత్యజీవితంలో వైవిధ్యాన్ని పెంచితే, తెలుగు సంఘాలు ఆ సాహిత్యక్రమానికి వొక సాంస్కృతిక వేగాన్నిచ్చాయి. సాహిత్యకృషిని ఏ వొక్క నగరంలోని పెద్ద తెలుగు సమూహాలకో పరిమితం చెయ్యకుండా, దానికి విశాలమైన వేదికనీ, భిన్న ప్రాంతాల్లో ప్రచారాన్నీ ఇచ్చాయి. చిన్నపట్టణాల్లో చిన్న చిన్న తెలుగుసమూహాల్లో కూడా సాహిత్య సాంస్కృతిక అభిలాషని పెంచాయి. అయితే, ఈ అభిలాష క్రమంగా సాహిత్యం కంటే ఇతర సాంస్కృతిక అంశాలు – నృత్యం, సంగీతం, కొంత చిత్రకళ – వైపు మళ్ళడం గమనించాల్సిన మార్పు. మనకి సంస్కృతి అంటే అవి మాత్రమే అనే భావన గూడుకట్టుకుంటున్న స్థితి కూడా వుంది. అవి- సాహిత్య సంస్కృతిని కొంత ప్రభావితం చేస్తున్నాయి.

3

అమెరికా తెలుగు డయాస్పొరా సంస్కృతి వున్నట్టుండి చుక్కలా రాలిపడలేదు. దీనికి ముందు సుదూర చరిత్రా, తక్షణ చరిత్రా రెండూ వున్నాయి. సుదూర చరిత్రలో మొదటితరం రచయితల ప్రయత్నాలు 1990ల తరవాత వొక స్థిరరూపం దాల్చడం మొదలెట్టాయి. సాహిత్యసంస్కృతి స్థిరత్వానికీ, అమెరికాలోని తెలుగు సమూహాలు స్థిరపడడానికీ దగ్గిర సంబంధం వుంది. వృత్తిగతమైన సంబంధాల నుంచి వ్యక్తిగతంగా అమెరికా నేలకి దగ్గిరవడం, రెండోతరం రావడం, వాళ్ళ ఎదుగుదలకి ఇక్కడి స్థానికతలో పునాదులుండడం, ఇల్లూవాకిలీ, ఇరుగూపొరుగూ, కుటుంబం, వృత్తి, వ్యక్తిత్వం, అభిరుచి లాంటి మౌలిక భావనల్లో పూర్తి మార్పు ఈ దశలో సాధ్యపడింది. సాహిత్యంలో ఈ మార్పు చాలా గట్టిగా కనిపిస్తుంది. ఈ మార్పు మాచిరాజు సావిత్రి మాటల్లో:

‘1970 లలో రాసిన కథలకీ ఇప్పుడు రాస్తున్న వాటికీ చాలా తేడా వున్నది. అప్పుడు చాలా మటుకు అప్పుడే ఇండియా వదిలి వచ్చినవాళ్ళు రాసిన కథలు. అప్పుడు ముఖ్యంగా చాలా నాస్టాల్జిక్‌గా వుండే కథలు వచ్చేవి. అంటే, ఇండియాలో వున్నప్పటి జీవితాలను తల్చుకుని మళ్ళీ ఆ వాతావరణం, ఆ అనుభూతీ సృష్టించాలనే ఉద్దేశంతో రాసిన కథలివి. కథలు చాలా మట్టుకు ఇండియాలోనే జరిగేవి. తరవాత క్రమక్రమంగా అమెరికాలో జీవితాలను గురించీ, ఇక్కడ వచ్చే సమస్యలను గురించీ రాస్తున్నారు’(సావిత్రి:2000)

సావిత్రి గమనించిన ఈ మార్పునే నేను తెలుగుదనానికీ, అమెరికా తెలుగుదనానికీ మధ్య గీసిన గీతగా భావిస్తున్నాను. అమెరికన్‌ తెలుగు రచయిత నాస్టాల్జియా నుంచి బయటపడడం అంత తేలికగా జరిగిన మార్పు కాదు. అది మొత్తంగా ఇక్కడి తెలుగు సమూహాల్లో వ్యక్తిత్వ స్థాయి నుంచి సంఘజీవితం వరకూ ఉమ్మడిగా వస్తున్న మార్పు. అలాగే, ఇది కేవలం కొద్ది మంది బుద్ధిజీవుల ఆలోచనల్లో వచ్చిన మార్పుకూడా కాదు, స్థలకాలాల దూరాలతో సంబంధం లేకుండా అందరిలో ప్రత్యక్షంగా వచ్చిన మార్పు. నిజానికి సామాజికంగా వచ్చిన మార్పుని చెప్పడానికి అమెరికా తెలుగు రచనలు డాక్యుమెంట్లలాంటివి. ‘డాక్యుమెంట్‌’ అన్నంతమాత్రాన్న వాటిల్లో వున్న కళాత్మకతని తక్కువ అంచనా వేయడం లేదు. డయాస్పొరా సాంస్కృతిక చరిత్రకి ప్రస్తుతానికి అంతకంటే మంచి ఆధారాలు లేవని చెప్పడం మాత్రమే.అమెరికా తెలుగు కథల్లో ఈ మార్పుని నిర్దిష్టంగా ఏ లక్షణాలతో చెప్పుకోవచ్చు? అవి ఆంధ్రా నుంచి వస్తున్న కథలకి, లేదా అమెరికాలోని తెలుగురచయితలు అంతకు ముందు నుంచి రాస్తూ వచ్చిన రచనలకి సాంస్కృతికంగా ఏ విధంగా భిన్నంగా వుంటున్నాయి? ఈ విషయం కాస్త ఆలోచిద్దాం.

ఇప్పటి కథల్లో నాస్టాల్జియా లేదని మాచిరాజు సావిత్రితో పాటు చాలా మంది విమర్శకులు చెబుతూనే వున్నారు. నాస్టాల్జియా చాలాకాలం పాటు ఇక్కడి తెలుగు రచనలకి చాలా బలమైన ప్రేరణగా నిలిచింది. అందులో సందేహమేమీ లేదు. కాని, ఆ బలమైన ప్రేరణ బలహీనపడడానికి మరో బలమైన కారణం ఏమిటి? ఆ కారణం – అసలు వ్యక్తిత్వం అనే భావనలో వచ్చిన మార్పు కావచ్చా? లేదా, సంస్కృతి గురించి అంతకు ముందు మనం ఇచ్చుకుంటూ వచ్చిన నిర్వచనాన్ని అమెరికన్‌తెలుగులు మార్చుకున్నారా? మార్చుకుంటే, అది ఆంధ్రాలోని తెలుగు సంస్కృతికి ఏ విధంగా భిన్నంగా వుంది? – వీటికి సమాధానాలు అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి ఇటీవలి కాలంలో బాగా విస్తరించిన లిటరరీ క్లబ్బులు, పుస్తక ప్రచురణలు, ఇక్కడి పత్రికలు, ఇక్కడి పత్రికలతోపాటు అక్కడి పత్రికల్లో పెరిగిన అమెరికన్‌ తెలుగు రచయితల ప్రాముఖ్యం – ఇలాంటి భౌతికమైన కారణాలు చాలా వున్నాయి. 1998లో అట్లాంటా సాహితీ సమితి సదస్సు ఈ పరిణామంలో కీలకమైన మలుపు. ‘డయాస్పొరా’ అన్న మాట అక్కడే మొదటిసారిగా విన్నాను. నేను నా అనుభవాల్నించి రాస్తున్నానే తప్ప, ఆ రాతలకి వొక దారీదిక్కూ వున్నాయని మొదటిసారి అర్ధమైంది అట్లాంటా సదస్సు తరవాతే!’ అని వివిధ ప్రాంతాలలో సాహిత్య సమావేశాలకి వెళ్ళినప్పుడు చాలామంది రచయితలు అనడం విన్నాను. రచయితల్లో భావజాలానికి సంబంధించిన సాంద్రతని పెంచడంలో అట్లాంటా సదస్సు బాగా పనిచేసిందని తరవాత షికాగోలో జరిగిన సభల్లో వ్యక్తమైన అబిప్రాయాల్ని బట్టి మనకు అర్ధమవుతుంది. ఈ రెండు సభల మధ్య డయాస్పొరా రచనల కోసమే పోటీలు నిర్వహించడం, నిరంతరాయంగా ప్రచురణలు తీసుకురావడం ఈ ప్రక్రియని వేగవంతం చేసింది. ఈ క్రమం తరవాత రచ్చబండలాంటి వెబ్‌చర్చావేదికలతో పాటు, ‘ఈమాట’(eemaata.com) ‘సుజనరంజని’ వెబ్‌మాగజైన్లలాంటి భౌతికమైన వనరులు తెలుగు డయాస్పొరా సాంస్కృతికతని ఎట్లా నిర్వచిస్తున్నాయన్నది కూడా మనం సమీక్షించుకోవాలి. అలాగే – ఈ మార్పులకీ ఆంధ్రాలో జరుగుతున్న అస్తిత్వ ధోరణుల చర్చకి ఎట్లాంటి సంబంధం వుందన్నది కూడా పోలిక చూసుకోవాలి. 1990ల తరవాత ఆంధ్రాలో మొదలైన స్త్రీ, దళిత, మైనారిటీవాదాల చర్చ డయాస్పొరా చర్చని ఏమైనా ప్రభావితం చేసిందా అన్నది ఆలోచించాలి, ఆ ప్రభావం వున్న మాట వాస్తవమే అయితే – అక్కడికీ, ఇక్కడికీ ఆ నిర్దిష్ట వాదాల (డయాస్పొరా కూడా వొక నిర్దిష్టవాదమే అనుకుంటే) స్వభావంలో తేడా ఏమిటన్నది అన్నిటికీ మించి చాలా ముఖ్యమైన విషయం.

4

‘అదేలే.. ఈ మధ్య అమెరికాలో తెలుగువాళ్ళకి కొత్త కేకలొచ్చాయి. అందులో ఈ డయాస్పొరా అన్న మాట వొకటి..అంటే పవిత్ర తెలుగుదేశాన్ని వదిలేసి అమెరికాలోనూ, ఇతర దేశాల్లోనూ పూర్వం జ్యూయిష్‌ వాళ్ళలా పరాయిదేశాల్లో సెటిల్‌ అయిపోయిన తెలుగు వాళ్ళన్నమాట.’(వంగూరి చిట్టెన్‌ రాజు కథ ‘స్వామి డి. ఆనంద్‌ మహరాజ్‌ కథ’,2000)

గత జ్ఞాపకాల నుంచి బయటపడి, అమెరికన్‌ సమాజంతో కలుపుగోలుగా వుంటూ, వాటి ప్రభావంతో తెలుగువాళ్ళు తమ జీవనానుభవాల్ని కలగలిపి రాసే ధోరణి 1990ల నుంచి గట్టిగానే వున్నా, తమలోని సాహిత్య భిన్నత్వాన్ని తరచి చూసుకునే సందర్భం 2000దాకా రాలేదు. వాస్తవానికి 1998 అట్లాంటా సమావేశాల్లోనే తెలుగు డయాస్పొరా ప్రాధాన్యాన్ని ఇక్కడి రచయితలు గుర్తించారు. ఇంకో రెండేళ్ళ తరవాత షికాగోలో జరిగిన అమెరికా తెలుగుసాహితీ సదస్సులో ‘తెలుగు డయాస్పొరా గురించి ప్రత్యేకంగా చర్చాగోష్ఠులు జరిగాయి. .మనం ఇక ఇమిగ్రెంట్లం కాదు, డయాస్పొరా’ అంటూ గట్టి వాదనని ముందుకు తీసుకువచ్చారు. ( ఈ చర్చలికి సంబంధించిన వివరాలకు చూడండి: వంగూరి ఫౌండేషన్‌ ఆప్‌ అమెరికా ప్రచురించిన రెండవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు సభావిశేష సంచిక: 2002)

‘ఎవరికి వాళ్ళం ఇంట్లో కూర్చుని రాసుకుంటున్నప్పుడు ఏదో వెలితి కనిపించేది. ఇవాళ మనం ఒక కొత్త ప్రపంచాన్న నిర్మించుకున్నాం. ఇదే నా దృష్టిలో తెలుగు డయాస్పొరా సాహిత్య ప్రపంచం.’(వేలూరి:2000). డయాస్పొరా వెనుక ఈ విధమైన సామూహిక భావనని కలిగించడం ద్వారా షికాగో సదస్సు మరో మూలమలుపయింది. దానికి అటూ ఇటూగా ‘eemaata.com’ వెబ్‌ మాగజైన్‌ రచనలు బలాన్నిచ్చాయి. ఈ రెండు సదస్సులూ, ‘ఈమాట’ తెలుగు డయాస్పొరాకి కావలసిన ఊపిరినందిస్తే, వంగూరి ఫౌండేషన్‌ పెమ్మరాజు సంపాదకత్వంలో వరసగా ప్రచురిస్తూ వస్తున్న అమెరికా తెలుగు కథానిక సంకలనాలు దాన్ని వొక కొత్త సంప్రదాయంగా నిలబెట్టాయి. ఈ సిరీస్‌లో మొదటి కథా సంకలనం 1995లో వెలువడింది. ఈ సంకలనానికి పెమ్మరాజు రాసిన ముందుమాటలు డయాస్పొరా ఏర్పడుతున్న క్రమాన్ని వివరిస్తాయి.

‘మన మాతృభాషలో మనకున్న పరిచయాన్ని పోగొట్టుకోకుండా, మన ఆలోచనలను, మన సమస్యలను, మన అనుభవాలని ఆ బాషలో పదిలపరచడానికి ప్రయత్నం..ఈ రచయితలలో అందరూ తెలుగు భాషా పండితులు కాదు. కాని వీరు తమ భావాలని తాము వాడుకునే, వాడగలిగే భాషలో రాయగలిగిన వారు. ఈ రచనల్లో గ్రాంధిక బాష వుంది. వ్యావహారిక భాష వుంది. తెలుగుతో పరిచయం సన్నగిల్లడం వల్ల అలవాటయిన పరభాషా సమన్వితమైన భాష వుంది…’

పెమ్మరాజు చెప్పిన ఈ లక్షణాలు ఇక్కడి రచయితలు రెండు సాహిత్య సంస్కృతుల మధ్య అనుభవిస్తున్న పెనుగులాటని చెప్పకచెబుతున్నాయి. అంటే అప్పటికింకా డయాస్పొరా సంస్కృతి నిర్దిష్టం కాని స్థితిని మనం ఈ మాటల్లోనూ, ఈ సంకలనంలోని కథల్లోనూ చూస్తాం. 1998లో ‘ఈమాట’ని ప్రారంభిస్తూ సంపాదకవర్గం చెప్పుకున్న ఆశయాలు మూడు: మెదటిది భారతదేశం బయట వుంటున్న తెలుగువారి జీవనవిధానాల్ని, అనుభవాల్ని ప్రతిబింబించే రచనలకి, వాటి రచయిత(త్రు)లకి ఒక వేదిక కల్పించడం. రెండోది:ఈ వేదిక రాజకీయ, కుల, మత, వర్గ ధోరణులకి, వ్యాపార కలాపాలకి దూరంగా వుండేట్టు చూడడం. మూడోది:ఇంటర్నెట్‌ టెక్నాలజీని వీలైనన్ని విధాల వుపయోగించుకుంటూ ఇది ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారందరికీ తేలిక మార్గంలో అందేట్టు చూడడం.

డయాస్పొరా అనే పదం వాడలేదు కానీ, పరోక్షంగా దానికి సంబంధించిన సారాంశాన్నే ఆశయంగా చెప్పుకున్నారు ‘ఈమాట’సంపాదకులు. ఇందులో చాలా ముఖ్యమైన విషయం: ప్రవాసాన్ని కేవలం అమెరికా భౌగోళిక పరిధుల్లో చూడకుండా, తెలుగు సంస్కృతిని ఆంధ్ర దేశపు సరిహద్దుల్లోకి మాత్రమే కుదించకుండా ఒక విశాలమైన తెలుగు సాంస్కృతికతని ఊహించడం. ఇది డయాస్పొరా భావనకి చాలా బలమైన పునాది.

వెబ్‌మాగజైన్ల ద్వారా జరిగిన మేలు: డయాస్పొరా సంప్రదాయం కొన్ని కొత్త సాంస్కృతిక లక్షణాల్ని తీర్చి దిద్దుకుంది. మొదటి తరం రచయితల్లో గతజ్ఞాపకాల బరువు కింద తెలుగుదనాన్నీ,తెలుగు సంస్కృతినీ ఏకపక్షంగా పరామర్శించడమే కనిపిస్తే, డయాస్పొరా రచయితలో ఇప్పుడు విమర్శనాత్మక ధోరణి కూడా కనిపిస్తుంది. ఇది చాలా పెద్ద మార్పు. వేలూరి మాటల్లో:

‘తెలుగు దేశంలో వున్న రచయితలకీ, కవులకీ, మనకీ రచనాశైలిలో, ఆలోచనాసరళిలో, వూహల ప్రపంచాల్లో చెప్పుకోదగిన తేడా కనిపిస్తుంది. దేశం వదిలి రావడం వల్ల మనకి కలిగిన ఎడబాటు, మనలో ఒక స్వతంత్రతకీ, ధైర్యానికీ, ఒక కొత్త అనుభవాన్ని చెప్పడానికి, కావలసిన మాటలు ఏరుకోడానికి అవకాశం ఇచ్చింది.’

డయాస్పొరా రచయిత సాంస్కృతికంగా చాలా స్వతంత్రమైన వ్యక్తి. అతనికి ఇదివరకటి మొహమాటాలు లేవు. ఆ మేరకి అతని రచనల మీద పడమటి ప్రభావం కనిపిస్తుంది. వేలూరి రచనల సంకలనం ‘మెటమార్ఫసిస్‌’(1998)కి రాసిన పరిచయంలో వెల్చేరు నారాయణరావు అంటారు ‘వెంకటేశ్వర్రావు అమెరికా వచ్చేక రాసిన వ్యాసాలలో, కథల్లో, కల్పికల్లో మీకు కొట్టొచ్చినట్టు కనిపించేది – స్వతంత్రం’ అని. తరవాతి కాలంలో డయాస్పొరా రచయితలకి ఇదే లక్షణంగా అమరింది. కుటుంబం, సంస్కృతి, అక్కడి పరిస్థితులు కలగలిసిన వ్యక్తిత్వంలో ఇప్పుడు ఇక్కడి జీవలక్షణమైన స్వతంత్రం తోడయింది. ఇది సృజనాత్మక రచనలతోపాటు ఇతర అంశాల్లో అభిప్రాయాల వ్యక్తీకరణలో చాలా పదునుగా కనిపిస్తుంది. ‘ఈమాట’లో ఇటీవలి కాలంలో వెలువడుతున్న వ్యాసాలు, గల్పికల్లో ఈ ధోరణి బాగా కనిపిస్తుంది.

తెలుగు డయాస్పొరాలోని రెండో లక్షణం: కాస్మాపాలిటనిజం. అంటే, జాతి/జాతీయ/భాషల అధికారిక సరిహద్దుల్ని చెరిపేయడం. ఒకే ఒక్క భారతీయత లేదనీ, అనేక రకాల భారతీయతలున్నాయన్న భావన ఈ మధ్య రచనల్లో వ్యకమవుతోంది. అలాగే, ఒకే విధమైన ప్రామాణికమైన భాష లేదన్న విషయం ఇప్పుడు రచయితలు వాడుతున్న శిల్పంలో కనిపిస్తుంది. చరిత్రని అధికారికమైన/స్థిరపడిన చట్రంలోంచి కాకుండా ప్రత్యామ్నాయ దృష్టితో చూడడం డయాస్పొరా సాంస్కృతికతలోని మరో ముఖ్యమైన లక్షణం.

మూడో లక్షణం: మిశ్రమ సాంస్కృతికతని చెప్పడం. అమెరికన్‌, తెలుగు సంస్కృతులు కలగలిపే సందర్భాలు రచనల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది కథాశిల్పంలో కూడా ఇప్పుడు భాగమవుతోంది. నాలుగో లక్షణం: సాహిత్య చర్చల్లో డయాస్పొరా స్వరం బలపడడం. వెబ్‌ చర్చావేదికలమీదనే కాకుండా స్వదేశం నుంచి వెలువడే పత్రికల్లోనూ డయాస్పొరా రచయితలు/విమర్శకులు గట్టిగా మాట్లాడడం ఈ మధ్యనే మొదలైంది. ఇందులో కొన్ని సందర్భాల్లో స్వదేశంలో స్థిరపడిన అభిప్రాయాల్ని/వాదనల్ని ప్రశ్నించే స్వభావం కనిపిస్తుంది.

5

అమెరికాలోనూ, ఇతర దేశాల్లోనూ ఇప్పుడు క్రమంగా తెలుగు సమూహాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా స్థలకాలాల ప్రాముఖ్యం బాగా తగ్గిపోయిన ప్రస్తుత స్థితిలో భావప్రసారానికి వేగం పెరిగింది. సాంస్కృతికంగా ఇంతకుముందు వున్న కట్టుబాట్లు, వొత్తిళ్ళు ఇప్పుడు లేవు. స్వయం నిర్మిత చట్రాలు నెమ్మదిగా వదులవుతున్నాయి. మిగిలిన సంస్కృతుల్ని లీనం చేసుకుంటూ, వొక స్వతంత్ర భావన వైపు ఈ తెలుగు సమూహాలు ప్రయాణిస్తున్నాయి. సంప్రదాయాన్ని, సంస్కృతిని ఏకశిలగా మలిచే ప్రయత్నాలు జరుగుతున్నా, సాహిత్య సామాజికతని అవి పెద్దగా శాసించలేకపోతున్నాయి. అలాంటి కృత్రిమ ఏకత్వం కన్నా, భిన్నత్వం తెలుగు డయాస్పొరా జీవలక్షణంగా మారుతోంది. పెరుగుతున్న రచయితల సంఖ్య, ప్రచురణ సౌకర్యాలు, స్థానికంగా ఏర్పడుతున్న లిటరరీ క్లబ్బులు, టెక్నాలజీని ఇంకా సమర్ధంగా వుపయోగించుకోవాలన్న తపన తెలుగు డయాస్పొరాకి బలాన్నిస్తాయి. ఇవి క్రమంగా మిగిలిన దేశాలలో తెలుగువాళ్ళతో గట్టి అనుబంధాన్ని పెంచుతాయి. అలాంటి సంభాషణకి ఇది మొదలు. సాహిత్యం ఆ సంభాషణకి వొక ఆధారభూమిక.*


అఫ్సర్

రచయిత అఫ్సర్ గురించి:

కవి, విమర్శకుడు, రచయిత, సీనియర్ ఉపన్యాసకుడు అఫ్సర్ కు బాల్యం నుండి సాహిత్యవాతావరణంలో పెరగటం వల్ల కవిత్వం పట్ల మక్కువ ఏర్పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి బి.ఏ. గోల్డ్ మెడల్‌తో ఉత్తీర్ణుడయ్యారు. తులనాత్మక సాహిత్యంలో ఎం.ఏ చేశారు. “ఆధునిక కవిత్వము తెలంగాణా నేపథ్యం” అనే విషయంపై పి.హెచ్.డి చేశాడు. అమెరికా లోని విస్కాన్సిన్ యూనివర్శిటీ నుండి 2010లో Following the Saint: Devotion and Public Religious Performances in South India అనే అంశం పై పరిశోధించి డాక్టరేట్ సంపాదించారు. అమెరికాలో విస్కాన్సిన్ యూనివర్సిటీ, టెక్సాస్ యూనివర్సిటీలలో దక్షిణాసియా సాహిత్య సంస్కృతుల సీనియర్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, భారత ప్రభుత్వంనుండి సరస్వతీ భాషాసమ్మాన్ అవార్డుతో సహా అనేక అవార్డులు అందుకున్నారు. సారంగ సాహిత్య పక్ష పత్రికకు సారథ్యం వహిస్తున్నారు.

 ...