పూర్వం నుంచి కూడా తెలుగు గ్రామాలు హస్తకళలకు ఎంతో ప్రసిద్ధి గాంచాయి. రంగురంగుల దారాలతో లేసులు, తివాచీలు అల్లేవారు. ముఖ్యంగా స్త్రీలు దారాలతో చీరలపై తీగలు, ఆకులు, పూలు అల్లి అద్దాలు కూడా కుట్టేవారు. గుడ్డలతో చేసిన ఆడుకొనే బొమ్మలు, చెక్కబొమ్మలు, తలుపులకు, ద్వారబంధాలకు నగిషీలు గ్రామహస్త కళలకు నిదర్శనాలు. కాటికాపరులు తాటాకుల పైన రాజుల బొమ్మలు చిత్రించి రంగులు వేసేవారు. చిత్రలేఖనం కూడా నాటి ప్రముఖ కళే! గోడలపైన, రాళ్ళపైన బొమ్మలు చిత్రించి వాటికి ఆకు పసరు రంగులు వేసేవారు. నాటి గ్రామ వాసులు కరక్కాయలతో సిరా తయారుచేసి రాసుకొనే వారు. రెండు, మూడు శతాబ్దాలకు ముందు రాసిన ఈ సిరావ్రాతలు, ‘దస్తావేజులు’ నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయంటే నాటి గ్రామవాసుల బుద్ధికుశలతను అభినందించక తప్పదు.
శిల్పాలు చెక్కడం నాడు గ్రామ స్థాయి నుంచి ప్రారంభమయ్యింది. ఎంత కఠిన శిలనైనా శిల్పి తాననుకొన్న రీతిలో దాన్ని మైనంలా మలిచేవాడు. అది ఒక యోగవిద్యలా సాగేది. ముఖ్యంగా శిల్పులు గ్రామవాసులే! నాటి భారతీయ శిల్పం శాస్త్ర సమ్మతంగా తరతరాల నుంచి వంశపారంపర్యంగా వస్తూ దేశ, విదేశాల్లో ప్రఖ్యాతి గాంచింది. గ్రామ శిల్పుల శిల్పకళాప్రావీణ్యాన్ని నేటి దేవాలయాల్లో చూసి తన్మయత్వంతో తరించవచ్చు మనం.
పల్లెవాసుల ఇళ్ళ నిర్మాణం, కట్టాల నిర్మాణం ఎంత ఉన్నత స్థాయిలో ఉండేవో రెండు దశాబ్దాలకు పూర్వం కట్టిన గృహాల్లోని కళాకౌశలమే నిదర్శనం. గృహనిర్మాణంలో నాటి గ్రామస్తులు ముఖద్వారం శాస్త్రీయ శిల్పాలు, నగిషీలు, గిలకలు, లతలు, పూలు మొదలైన వాటిని చెక్కి అలంకరించే వారు. గృహంలో మొగరాలను, దూలాలను పైకెత్తి అమర్చిన నైపుణ్యం ఈనాటి ఇంజనీర్ల ప్లానుకు ఏ మాత్రం తీసిపోదు. ఆ విధంగా నాటి గ్రామాలు చతుష్షష్టి కళావిలాసాలతో విలసిల్లాయి.
నేడు గ్రామాల్లో గ్రంథపఠనం చేసేవారే కనిపించరు. పూర్వకవుల, పండితుల గ్రంథాలు నేడు నగరాల్లో ‘‘ఫుట్‌పాత్‌ల’ పాలవుతున్నాయి. రాజాశ్రయాల్లో పూజలందుకన్న సాహిత్యం నేడొక వ్యాపార మయ్యింది. కనీసం ఉత్తర ప్రత్యుత్తరాల సాహిత్యం కరవైంది. మంచి సాహిత్యం కాని, శ్రవణ పేయమైన సంగీతం కాని, మధురంగా పాడే గాయకుడు కాని నేటి గ్రామాల్లో మచ్చుకు కూడా కనిపించటం లేదు. అర్ధనగ్న నాట్యాలే తప్ప హరికథలు, భజనలు, కోలాటాలు కనిపించటమే లేదు. తోలుబొమ్మలు, వానిని ఆడించే కళాకారులు, హరిదాసుల ఆనవాళ్ళు కూడా నేడు లేవు. శిల్పకళ, చిత్రకళలకు ఆదరణ కరవైపోగా పూర్వశిల్ప సంపదను కాపాడుకోవటమే గగనమయ్యింది. నాటక కళ దాదాపు కనుమరుగయ్యింది.
ఇలా సంప్రదాయ బద్ధమైన కళలన్నీ నేడు నిరాదరణకు గురై, ప్రోత్సాహం కరవై మరుగున పడిపోతున్నాయి. ధనార్జనా మార్గాలు వెదుక్కోవటంలో ప్రజలు కళావైభవాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. చివరకు ‘తీయ తేనె లొలుకు తెలుగు భాష’ను సైతం నిరాదరణకు గురిచేస్తూ పరభాషా వ్యామోహంలో పడిపోతున్నారు నేడు.
ఈ విధంగా ‘తెలుగు గ్రామాలు’ భౌతికంగా అన్ని వనరులు, సదుపాయాలు కలిగివుండేవి. ప్రజలు గృహాలను తీర్చిదిద్దుకొని సమస్త వసతులతో జీవనం సాగించే వారు. సహజ సంపద కలిగి ఆ వనరుల ద్వారా వ్యాపారం చేసేవారు. నాటి గ్రామాలు సకాల వర్షాలతో, మంచి పర్యావరణం కలిగి కాలుష్యాలు లేని వాతావరణంలో ఆరోగ్యదాయకంగా ఉండేవి. నేడు ప్రజలు వాడే నకిలీ వస్తువులతో, కల్తీ సరుకుతో, వాహనాల పొగతో, దుమ్ము – ధూళి, రణగొణ ధ్వనులతో గ్రామాలు కూడా కాలుష్యంతో నిండిపోయాయి. నగరాల్లోని నాగరికత వేరు పురుగులా గ్రామ గ్రామానికీ ప్రాకటం వల్ల నేటి గ్రామాలు భ్రష్టుపట్టి పోతున్నాయి.
నాటి గ్రామాలు ‘ఉమ్మడి కుటుంబ వ్యవస్థ’కు అగ్ర తాంబూలమిచ్చేవి. కుటుంబ సభ్యులంతా పొలం పని చేసే వాళ్ళని, చదువుకొనే వాళ్ళని భేదభావం లేక ఐకమత్యంగా, ఆదర్శంగా సమిష్టి జీవనం సాగించే వారు. కుటుంబీకుల ముఖ్య జీవనాధారం వ్యవసాయం. వారంతా కుటుంబ ప్రతిష్టకు, సాంఘిక విలువలకు అత్యంత ప్రాధాన్యమిచ్చే వారు. కాని నేడు వ్యష్టి కుటుంబాలుగా వేరుపడిపోయి ప్రేమాభిమానాలు మృగ్యమై స్వార్థపూరిత జీవనం గడుపుతున్నారు. వ్యవసాయాన్ని మాని, ఉద్యోగార్థులై పట్టణాలకు పరుగెడుతూ తల్లిదండ్రులను సైతం నిర్లక్ష్యం చేస్తున్నారు.
దేశ సమైక్యతను చాటే విధంగా నాడు అన్ని వృత్తుల వారు, కులాల వారు, తెగల వారు, మతాల వారు కలిసిపోయి సాంఘిక జీవనం గడిపే వారు. గ్రామాల్లో ముఖ్యవృత్తి వ్యవసాయం. మిగతా ఉపవృత్తుల వారు వ్యవసాయంలో మమేకమై జనజీవన ఆర్థిక ప్రగతికి తోడ్పడే వారు. గ్రామం కేంద్రంగా అందరూ కలిసి సమభావం, సహజీవనం సాగిస్తూ మన సంస్కృతిని, సంప్రదాయాలను గౌరవిస్తూ సమతా విలువలతో, జీవించే వారు.
నేడు గ్రామ సమాజం కుల కుత్సితాలతో, మత పిచ్చితో, నీచ రాజకీయాలతో, అవినీతితో కుళ్ళిపోయింది.
గ్రామ కట్టుబాట్లకు లోనై ప్రజలు నాడు సంప్రదాయ బద్ధంగా, ఐక్యభావనలతో గ్రామ పురోభివృద్ధే ధ్యేయంగా సహాయ సహకారాలందించుకొనే వారు. ప్రజలు అందరు గ్రామ ఔన్నత్యాన్ని చాటే దానికి పాటు పడేవారు. నాడు ఎన్నికలు ఏకగ్రీవంగానో, ప్రశాంతంగానో జరిగేవి. పాలనా పక్షపాతమనేది లేకుండా యంత్రాంగం నైతిక విలువలకు లోనై అందరి సౌకర్యాలను కోరుకంటూ, అభివృద్ధిని ఆకాంక్షిస్తూ గ్రామాన్ని తీర్చిదిద్దుకొనే విధంగా సాగేది.
నేటి గ్రామాలు అధికార వ్యామోహానికి, కక్షలకు, దౌర్జన్యాలకు, హత్యా రాజకీయాలకు నిలయాలయ్యాయి.
నాడు గ్రామాల్లో చతుష్షష్టి కళలు వంశపారంపర్యంగా, సంప్రదాయబద్ధంగా సంక్రమించేవి. గ్రామాల్లో సాహిత్యం, సంగీతం, నాటకాలు, శిల్పం, చిత్రలేఖనం మొదలైన కళలను అందరు గౌరరవించుకొంటూ ఆనందమయ జీవితం గడిపే వారు.
ప్రస్తుత గ్రామ ప్రజలు టి.వి., సినిమాల మోజులో పడి పురాతన కళలను ప్రోత్సహించకపోవటం వల్ల అవన్నీ మరుగునపడి పోతున్నాయి.
నాడు నగరాల్లో స్థిరపడిన ప్రతి పల్లెవాసి – విదేశాల్లో స్థిరపడిన వారు సైతం – వారి జన్మస్థానమైన పల్లెను, నదీ తీరాలను, కొండలను, గుట్టలను, ఆ గొర్రెపిల్ల, కుక్కపిల్ల, కోడిపిల్లలను, వాటి తోటి తమ ఆటపాటలను నెమరు వేసుకొంటూ …. ‘‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’’ అని తమలో తాము తన్మయత్వం చెందే వారంటే నాటి తెలుగు గ్రామాలు వారి ప్రేమానురాగాలకు, ఆప్యాతానుబంధాలకు ఎంతటి సంపూర్ణ నిలయాలో వారిని అడిగి తెలుసుకోవలసిందే! ఆ అనుభూతులను పంచుకోవలసిందే! రాతమూలంగా సమస్తం తెలుసుకోవటం సాధ్యం కాదన్నంత మహత్తరంగా ‘తెలుగు గ్రామాలు’ విలసిల్లాయి.
నేడు ‘తల్లిపల్లె’ను మరచి ధనార్జనే ధ్యేయంగా, ప్రేమానురాగాలు పూజ్యమై తల్లిదంద్రులను సైతం నిర్లక్ష్యం చేస్తూ గ్రామాలను విడిచి ఎక్కడెక్కడో స్తిరపడిపోయి ఎవరు ఎవరో గుర్తించుకోలేనంతగా ‘ఎవరికి వారే యమునా తీరే’ అవుతున్నారు. *
