తెలుగు గ్రామాలు – ఒక అవలోకనం

రాత్రివేళల్లో తీరిక ఉన్నప్పుడు పెద్దలు భారత రామాయణాది కథలు చదువుతూ ఉంటే, ఇంకొక పెద్ద వివరిస్తూ ఉంటే మిగిలిన వారంతా ఏకాగ్రతతో వింటుండే వారు. వర్షాలు సకాలంలో రాని రోజుల్లో విరాటపర్వాన్ని, సుందరకాండను పారాయణం చేసేవారు. కుటుంబాలన్నీ గ్రామం వెలుపల వనాల్లో చేరి ‘వనభోజనాలు’ చేసేవారు. సామాజికంగా గ్రామాల్లో జరిగే ఈ సత్సంప్రదాయాలు దేశ ప్రగతికి మూలకందాలు.

గ్రామాల్లో 40-50 ఏళ్ళు పైబడినవారు కూడా రాత్రివేళల్లో ‘చెడుగుడు’ ఆడేవారు. తీరిక వేళల్లో ‘పులిజూదం’, ‘చర్‌పర్‌’ మొదలైన గళ్ళ ఆటలు చిన్న చిన్న రాళ్ళతో ఆడేవారు. స్త్రీలు ఆడే ఆటల్లో ‘బారాకట్ట’, ‘వామన గుంతలు’, ‘పరమపద సోపానం’ ముఖ్యమైనవి. ఇలా పెద్దవాళ్ళు కూడా ఆటల్లో కలిసి స్నేహ సహకారాలు చెక్కు చెదరకుండా కాపాడుకొనే వారు.

బాలబాలికలు సాయం వేళల్లో – ముఖ్యంగా వెన్నెల రోజుల్లో – ఎన్నో సంప్రదాయ బద్ధమైన ఆటలు ఆడుకొనే వారు.

‘చెమ్మ చెక్క చారడేసి మొగ్గ – అట్లు పోయంగ ఆరగించంగ’ అని పాడుతూ ఇద్దరు లేక నలుగురు అమ్మాయిలు అడుగులు వేసి ఎగురుతూ చప్పట్లు కొడుతూ ఆనందంతో ‘చెమ్మ చెక్క’ ఆట ఆడేవారు. ‘గిన్నెరగోల్‌’ తిరుగుతూ …

‘ఒప్పుల కుప్పా వయారి భామా – గూట్లో ముక్కురాయ్‌ నీ మొగుడు సిపాయ్‌’ అని చమత్కారంగా పాడుకంటూ అమ్మాయిలు ఆడుకొనే వారు.

– ‘చిటిమిటి దంతులు చిన్నారి దంతులు – దాదీ మీరేమంటారు జాజీ మొగ్గళ్ళూ’ అంటూ స్త్రీలు రెండు జట్లుగా ఏర్పడి ఒక జట్టును మరొక జట్టు పెళ్ళికి సంబంధించిన ప్రశ్నలు అడిగేవారు. ఇది ఒక్కొక్క జట్టు ఐకమత్యాన్ని చాటి చెబుతుంది.

‘అట్ల తద్దోయ్‌ ఆరట్లోయ్‌ – ముద్ద పప్పోయ్‌ మూడట్లోయ్‌’ అని ఆశ్వయుజ మాసంలో అమ్మాయిలంతా ఉయ్యాల లూగుతూ, గాలిలో తేలుతూ వారు – వీరు అనే భేదం లేకుండా పాడుకొనే వారు. ఈ పాట పాడుకొనే కన్నెపిల్లలకు మంచి మొగుడొస్తాడంటారు. పిల్లలందరూ కాళ్ళు చాచుకొని కూర్చుంటే ఒకడు ఒక్కొక్కరి కాలు తాకుతూ …

‘కాళ్ళా గజ్జి కంకాళమ్మ – వేగుచుక్క వెలగా మొగ్గ
మొగ్గాకాదుర మోదుగనీరు – కాలుదీసి కడగా పెట్టు!’

అని పాడుతాడు. ఈ ఆటలో కాళ్ళు తాకడంలో భేదభావం లేక అందరూ ఒకటేనని పిల్లలంతా కలిసిపోయే అవకాశముంది. ఈ పాటలో కాళ్ళకు లేచే గజ్జికి మందు సూచితమైందని పెద్దలంటారు.

ఇలాగే ముక్కులు గిల్లే ఆట, వెన్నెల కుప్పలు, కోతికొమ్మచ్చులు, తొక్కుడు బిళ్ళ, గోలీలాట, బొంగరాలాట, పేడబుర్రాట మొదలుగా ఎన్నో ఆటలు, పాటలు నాటి గ్రామాల్లోని సంస్కృతికి, సంప్రదాయానికి నిదర్శనాలు. ఇటువంటి ఆటలు, పాటలు అతి ప్రాచీనకాలం నుంచి గ్రామాల్లో సాగుతూ ఉండేవని చరిత్ర ద్వారా మనకు తెలుస్తున్నది. కాని నేడు అవి కనుమరుగై పోతున్నాయి.

వర్షాభావ పరిస్థితుల్లో కప్పను వేప మండల మధ్య ఒక కర్రకు కట్టి ఆ కర్రను పిల్లలు భుజాన పెట్టుకని …

‘కప్ప – కప్ప నీళ్ళాడె కడవనిండా వానకురిసె …. మొర్రో వానదేవుడా!’ అని పాడుకొంటూ ఇల్లిల్లూ తిరిగి నీళ్ళు పోయించుకొంటూ ‘బియ్యం’ సేకరించి ఆ బియ్యంతో పాయసం వండి వానదేవునికి నైవేద్యం పెట్టి అందరూ ప్రసాదంగా స్వీకరించే వారు. గ్రామంలో వానకురవకుంటే ఎవరి వంతు కృషి వాళ్ళు ఎవరికి చేతనైనంత వారు చేసేవాళ్ళు. అందరూ కలసికట్టుగా తమ కర్తవ్యాన్ని నిర్వహించాలనే తపన, బాధ్యత, దేశభక్తి ఆ రోజుల్లో ప్రతి గ్రామీణునిలోను ఉండేవి.

ఈ విధమైన ఆటలు, పాటలే కాక బలప్రదర్శనకు సంబంధించిన పోటీల్లో కూడా అందరూ జట్లుగా కలిసి ఎవరి ప్రతిభను వారు చాటేవారు. ‘ఎన్ని లడ్లు తింటాప్‌?’ ‘ఎన్ని పచ్చిమిరపకాయలు తింటాప్‌?’ మొదలైన పందేలు, కొబ్బరికాయను పగులగొట్టటం, బండి ఇరుసులు, రాతిగుండ్లు ఎత్తటం, 8లోడీలు తిప్పటం, చక్రాల బండిని ఓటు వేయడం లాంటి ఎన్నో బలప్రదర్శనకు సంబంధించిన పందేలు నాడు గ్రామాల్లో జరుగుతుండేవి. పర్వదినాలల్లో యువకులు, బలాఢ్యులు వారి ప్రతిభను ప్రదర్శించి తగిన బహుమతులు పొందేవారు. ఈ పోటీలు ప్రజలకే కాక పశువులకు కూడా నిర్వహించే వారు. ఎద్దులతో బండలాగించటం, బండి చక్రాలను తిరగకుండా కట్టి ఆ బండిని ఎద్దులతో లాగించటం మొదలైన పోటీలు నిర్వహించి గెలుపొందిన ఎద్దుల యజమానిని బంగారు లేక వెండి పతకాలతో సత్కరించే వారు. ఈ పోటీలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి.

నాటి తెలుగు గ్రామాల్లో ఆటలు, పాటలు, బలప్రదర్శనలు ఈ విధంగా సాంప్రదాయకంగా సాగేవి. బాలబాలికలు ఐకమత్యంగా, పట్టుదల, కృషి, స్నేహం, సౌశీల్యం, సమభావం, సంఘటిత స్ఫూర్తితో వ్యవహరించే వారు. దీనికి తోడు గ్రామాలన్నీ ‘evergreen’గా ఉండబట్టి నాటి దేశ స్వాతంత్య్ర సమరానికి, ఆర్థిక ప్రగతికి, ఉమ్మడి విధానానికి గ్రామాలే మూలాలా అన్నంతగా అవి కొనియాడబడినాయనటంలో ఆవంతైనా అతిశయోక్తి లేదు.

కాలక్రమేణా వృత్తులు వ్యాపార దృష్టిని సంతరించుకొన్నాయి. సమాజం సమూలంగా మార్పు చెందింది. ఆధునిక పరికరాభివృద్ధి ఫలాలైన ‘లాండ్రీలు’, ‘బార్బర్‌ షాపులు’, నూలుమిల్లులు మొదలైన వాటి పోటీలో చేతివృత్తుల వారు వెనుకబడిపోయి బ్రతుకు దెరువుకోసం పట్టణాలకు వలసలు పోవలసిన దౌర్భాగ్యం పట్టింది. సకాల వర్షాలు లేక, పంటలు పండక, కరువు కాటకాలతో చివరకు రైతుల ఆత్మహత్యలతో దేశ ఆహారోత్పత్తి కుంటుబడుతున్నది. వ్యాపార పంటలు, ఉన్నత విద్యపై మోజు పెరగడంతో నగరీకరణ జరుగుతూ పల్లెలు చాలావరకు నగరాల్లో కలిసిపోగా మిగిలినవి వెనుకబడిపోయాయి.

‘గ్రామ పాలన’ నాడు మునసబు, కరణాల ద్వారా నిర్వహించబడేది. వీరికి ‘తలారులు’ (కట్టుబడులు) సహాయకులుగా ఉండేవారు. గ్రామంలో అవాంఛనీయ పరిస్థితులు చోటుచేసుకోకుండా, అక్రమాలు జరుగకుండా, భూమివాదాలు రాకుండా వీరు శాంతిభద్రతలు కాపాడే వారు. జననమరణ రిజిష్టర్లు, రెవెన్యూ సంబంధిత విషయాలు పర్యవేక్షిస్తూ ప్రభుత్వానికి తమ సేవలందించే వారు. జ్ఞాన, వయోవృద్ధులు కూడా ప్రజల మధ్య తలెత్తే చిన్న చిన్న తగాదాలను పంచాయితీ రూపంగా తీర్చి ఇరువర్గాల వారిని సమ్మతింపజేసేవారు. భూమి పన్ను కట్టే వారికి ఓటు హక్కు ఉన్న రోజుల్లో గ్రామ ప్రజలు ఒక చోటచేరి చేతులెత్తి నాయకుని ఎన్నుకొనే వారు. ‘జిల్లా బోర్డులు’ అమల్లో ఉండే రోజుల్లో కూడా ఎన్నికలు నామమాత్రమై నాయకుని సాధ్యమైనంతవరకు ఏకగ్రీవంగానే ఎన్నుకొనే వారు. మొన్నమొన్నటి వరకు ‘పంచాయితీ’ ఎన్నికలు సక్రమంగా, శాంతియుతంగా జరిగి చక్కని పరిపాలన జరుగుతూ ఉండేది. గ్రామానికి కావలసిన వాడు, నైతిక విలువలకు కట్టుబడి ఉండేవారు. ఏ వర్గం వాడైనా ఒకటే అనుకొనేవారు. ప్రజాపాలన సక్రమంగా జరుగుతుండేది ఆ గ్రామాల్లో.

గ్రామంలో అధికారులు, పాలకులు ఉన్నప్పటికీ దైవకార్యాల్లోను, పండగలు, తిరునాళ్ళు, గ్రామాభివృద్ది విషయంలోను గ్రామంలోని అన్ని వర్గాల పెద్దలు సమావేశమై అన్ని విషయాలు సమగ్రంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చేవారు. ఆయా పనులను సమానంగా, బాధ్యతాయుతంగా ప్రజలందరూ నిర్వహించే వారు. ఇటువంటి సమైక్య పాలన గ్రామాల్లో ఉండబట్టే స్వాతంత్య్రానంతరం ఎన్నికల్లో గెల్చిన M.L.A.లు, M.P.లు, మంత్రులుగా ఎన్నుకోబడిన వారు అధికశాతం పల్లెవాసులు ఎన్నుకున్న వారేనన్నది నగ్న సత్యం.

పాలనలో మాత్రమే కాక ‘మట్టిలో మాణిక్యాలుంటాయ’న్నట్టు ఇంజనీర్లు, డాక్టర్లు, ఉన్నత పదవులు నిర్వహించే వారు కూడా అధికశాతం పల్లెవాసులే. పల్లెల్లోని విద్యార్థులు బాల్యం నుంచే సైన్సుకు సంబంధించిన ఉమ్మెత్త, తామర, ఆకులు, పూలు, కప్ప, జలగ, చేప, సీతాకోక చిలుకలను చూస్తున్న వారు కాబట్టి సైన్సు వారి కళ్ళకు కట్టినట్లుండేది. అలాగే వాగులు, వంకలు, కొండలు, గుట్టలకు సమీపంలో మనుగడ సాగించటం వల్ల పల్లె విద్యార్థులకు ఆ పరిజ్ఞానం అధికంగా ఉండి డాక్టర్లు, ఇంజనీర్లు ఎక్కువగా అయ్యే వీలు కలిగింది. అలాగే ఆటపాటల్లో కూడా వీరు ముందుండే వారు. ‘అచట పుట్టిన చిగురు కొమ్మయిన చేవ’ అన్నట్టుగా పల్లెవాసులు ప్రకృతిలో మమేకమై జీవించటం వల్ల వారి ప్రతిభా పాటవాలతో అన్ని రంగాలలోను రాణించే వారు.

పాలనాపరంగా రాను రాను అధికార వ్యామోహం పెరిగి కక్షలు, కలహాలు ఎక్కువై పోయాయి.

‘అల్పబుద్ధి వాని కధికార మిచ్చిన
దొడ్డ వారినెల్ల తొలగగొట్టు’

అని వేమన చెప్పినట్టు రాజకీయం నీచ‘కీచకీయం’గా మారి విజయం కోసం దౌర్జన్యాలు, దౌష్ట్యాలు, ‘రిగ్గింగు’లు, బాంబులు, బరిసెలతో రాజకీయం చేస్తూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కాలరాచి నేటి బడాబాబులు ‘ఓటు’ హక్కును కొల్లగొడుతున్నారు. ఈ హంగులున్న వాళ్ళే నాయకులు. నాయకుడైన వాడే పైఆర్భాటాలతో అన్ని హక్కులు హస్తగతం చేసుకంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అవినాభావ సంబంధాలున్న గ్రామాలు రాజకీయ రొచ్చులో, ఉచ్చులో చిక్కుకొని కలుషితమై పోయాయి. కక్షలు – కార్పణ్యాలతో, హత్యలు – దోపిడీలతో ఆస్తులు హరించిపోగా, బాంధవ్యాలు భ్రష్టుపట్టి, నైతిక విలువలకు తిలోదకాలివ్వటం వల్ల ఒకనాడు సమసమాజ సహజీవనం చేస్తూ పైరు పంటలతో కళకళ లాడుతుండే గ్రామాలు నేడు ఆరని రాజకీయ ‘అగ్ని గుండాలు’గా మండుతూ రావణకాష్ఠంలా పొగలు గ్రక్కుతూ ఉన్నాయి.