వ్యవసాయ పనిముట్లు, గృహనిర్మాణాలకు వలసిన సామగ్రిని తయారు చేసే ‘వడ్రంగం’ వృత్తిని విశ్వబ్రాహ్మణులు చేపట్టి గ్రామ సాంఘికాభివృద్ధికి తమ వంతు సాయమందించే వారు. వడ్రంగి సంవత్సరాంతాన ధాన్యం రైతు ఇల్లు చేరే తరుణంలో తనకు నిర్ణయించిన4‘మేర’ (ధాన్యం, కంకులు, గడ్డి మొదలైనవి) తీసుకొనే వాడు. వీరు బండి చక్రాలు తయారుచేయటం, చక్రాలకు ఇనుపకమ్మీ అమర్చటం, కాడి, మేడి మొదలైన వ్యవసాయ పరికరాలు, కొడవలి, కర్రు, పార మొదలైన ఇనుప పరికరాలు తయారు చేసియిచ్చే వారు. పాడైపోయిన వ్యవసాయ పనిముట్ల మరమ్మత్తు చేసి వ్యవసాయం కుంటుపడకుండా చూసేవారు. గృహ నిర్మాణానికి సంబంధించిన మొగరాలు, దూరాలు, దంతెలు, ద్వారబంధాలు తయారు చేసేవారు. గృహ ముఖద్వారాన్ని శిల్పాలతో, నగిషీలతో సశాస్త్రీయంగా తీర్చిదిద్దే వారు. వీరే వివాహాలకు పెళ్ళి పీటలు, ‘బాసికం’ తయారుచేసి ఇచ్చేవారు. ఈ విధంగా వడ్రంగులు ఆ కాలంలో మర్యాద, మన్నన కలిగి ఉండేవారు.
వ్యవసాయ పనులకై కొన్ని కుటుంబాలకు ఒక ఆది ఆంధ్రుడు పని చేస్తుండే వాడు. కపిలబావి నుంచి నీళ్ళు తోడే ‘బక్కెన’, ‘ఓర్నె’ ఎద్దులకు ‘పంతాళ్ళు’, ‘బడ్డోరు’ రైతులకు చెప్పులు మొదలైనవి పశుచర్మంతో కుట్టించి ఇచ్చేవారు. పైరు కాలంలో పంటకు కావలి వెళ్ళి మిగతా రోజుల్లో యజమాని ఇంట్లోనే పనిచేసి అక్కడే తినేవాడు. పంటలన్నీ కళ్ళం చేరిన రోజుల్లో కళ్ళంలోనే పనిచేస్తూ (జనవరి నుంచి మార్చి వరకు) తయారైన ధాన్యాన్ని ఇల్లు చేర్చి రైతుకు అన్ని విధాలా తోడుగా ఉండేవాడు. చివరగా తనకు రావలసిన ‘మేర’తో పాటు కళ్ళంలో మిగిలిన ధాన్యం బాగుచేసుకొని రైతు బండిలోనే తన ఇంటికి తీసుకుపోయేవాడు.
గ్రామంలో పండిన ప్రత్తి అందరూ శ్రమించటం ద్వారా ‘గుడ్డ’ రూపం దాలుస్తుంది. కొందరు ప్రత్తి నుంచి విత్తనాలను చేతిరాట్నం ద్వారా వేరు చేసేవారు. మరికొందరు ఆ దూదిని ‘ఏకి’ ఏకులుగా చేసేవారు. ఆ ఏకులను ప్రతి కుటుంబంలోని స్త్రీలు వడికి దారం తీసేవారు. అందుకే ఒకానొక సందర్భంలో …
‘రసికుడు పోవడు పల్నా
డెసగంగా రంభయైన నేకులు వడుకున్
……………………..
……………………..’
అన్నాడు శ్రీనాథ మహాకవి. ఆనాడు ఇటువంటివి కుటీర పరిశ్రమలుగా ఉండేవి. దారాన్ని పెద్ద కండెలుగా తయారుచేసి, దారం ‘ఆసుమాను’కు ఆసుపోసి ‘సీళ్ళు’ కూడా తయారుచేసే వాళ్ళు. నాడు సాలెవాళ్ళు, మాలవాళ్ళు నేత వృత్తి చేసే వాళ్ళు. వీళ్ళు ఈ సీళ్ళను ‘పడుగు’గా పేర్చుకొని చేతిమగ్గంద్వారా బట్టనేసే వారు. ఇలా నేసిన ముతక ఖద్దరుతో నాడు చొక్కాలు, లాగులు కుట్టించుకనే వారు. ఆ ఖద్దరునే పంచెలు, చీరెలుగా కూడా వాడేవారు. పడుగు నేసిన వారికి పనిని బట్టి ధాన్యం ఇచ్చేవారు.
గ్రామంలో ‘రజకులు’ కొన్ని కుటుంబాలకు ఒక కుటుంబం చొప్పున రోజు మార్చి రోజు బట్టలు ఉతుకుతూ ప్రతి దినం అన్నం పెట్టించుకొని వెళ్ళేవారు. పదవులు నిర్వహించే వారు, భాగ్యవంతులు చాకలికి ‘ఇస్త్రీ పెట్టె’(iron box) ఇచ్చి బట్టలు ‘చలువ’ చేయించుకొనే వారు. సంవత్సరానికి కుటుంబానికి నిర్ణయించిన ‘మేర’ ప్రకారం ధాన్యం వగైరా తీసుకనే వారు. చాకలి వాళ్ళే రైతుల సహాయంతో ‘బట్టీ’ల ద్వారా సున్నం తయారుచేసి కుటుంబానికి కావలసినంత ఇచ్చేవారు. తాంబూలం వేసుకొనే వారికి వీరు ప్రత్యేకమైన సున్నం ఇచ్చేవారు. పెళ్ళి మొదలైన శుభకార్యాలకూ, దైవకార్యాలకూ రజకులు పందిళ్ళు వేసి మామిడి తోరణాలు కట్టేవారు. వంట చెరకు విషయంలో కూడా వీరు రైతులకు ఎంతో సహకరించే వారు.
వంటకు నాడు గ్రామాల్లో దాదాపు అందరూ మట్టి పాత్రలే వాడేవారు. కుమ్మరులు మట్టితో తయారుచేసిన చట్లు, కుండలు, మూకుళ్ళు, బానలు, కడవలు, ముంతలు, అన్నం తినే చిప్పలు బియ్యం, ధాన్యం పోసుకొనే పెద్ద ‘గరిసెలు’ ప్రత్యేకంగా తయారుచేసి ఇచ్చేవాళ్ళు. సంవత్సరాంతంలో తమకు వచ్చే ‘మేర’ రైతుల నుండి తీసుకొనే వారు. అదనంగా వీరు వివిధ రకాల మట్టిపాత్రలు తయారుచేసుకొని ‘కావిళ్ళ’తో మోసుకొనిపోయి సమీపంలోని పట్టణాల్లో వాటిని అమ్ముకొనే వారు. దైవకార్యాల్లో కుమ్మరులు తమకు కేటాయించిన పనులు నియమంగా నిర్వహించే వారు.
నాయా బ్రాహ్మణులు (మంగలి వాళ్ళు) గ్రామంలో కొన్ని కుటుంబాలకు ఒకరు చొప్పున ఇంటింటికి వెళ్ళి ‘తలపని’ (క్షవరం) చేసేవారు. సంవత్సరాంతంలో వీరు తమ ‘మేర’ తీసుకొనే వారు. వివాహ కార్యాల్లో వీరు వధూవరుల చేతి, కాళ్ళ గోళ్ళు తీయటం మొదలైన ‘కన్నెపెళ్ళి’ పనులు చేసే వారు. పుట్టు వెండ్రుకలు తీయటం, శుభకార్యాల్లో మంగళ వాద్యాలు వాయించి తగిన పారితోషికం పొందటం వల్ల వీరి జీవనం సాగేది. వీరు దైవకార్యాల్లో నిలయ విద్వాంసులుగా ఉండటం వల్ల ‘దేవుని మాన్యం’ కూడా భుక్తంగా ఉండేది.
ఈ విధంగా 5’Artisans’ అనీ, పంచభట వృత్తుల వారనీ వీరు గ్రామాల్లో కొన్ని ప్రత్యేక సంప్రదాయ విధానాలు కలిగి, పని హక్కు గలిగి, ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వహించే వారు. ప్రాచీన కాలం నుంచి వీరికిచ్చిన6‘మాన్యము’ వంశపారంపర్యంగా అనుభవిస్తూ కార్యసాధకులుగా ఉండేవారు.
గ్రామంలోని పశువులను, మేకలను, గొర్రెలను కాయటానికి ‘యాదవులు’ (గొల్లవాళ్ళు) ఉండేవారు. ఇదే వీరి ముఖ్య జీవనాధారం. కొందరు మేకలను, గొర్రెలను స్వయంగా పెంచిపోషించి ఆ జాతులను ఉత్పత్తి చేసేవారు. గొల్లలు గ్రామంలో ‘గణదేవతల’కు (గంగమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, నూకాలమ్మ, చౌడమ్మ మొదలైన వారు) గణాచారులుగా విధులు నిర్వర్తించే వారు. కాటమ రాజు తిరునాళ్ళలో వీరు ప్రత్యేకంగా ‘బల్లావు’లను (తెల్ల పొడల ఆవు) ఊరేగించుకొంటూ వెళ్ళి తిరునాళ్ళు ఘనంగా జరుపుకొనే వారు ఆ కాలపు గ్రామంలో.
‘పిచ్చికుంట్ల’ వారు గ్రామాల్లో వంశ, కుల, గోత్రాలను, రామయణ, భారతాది కథలను అన్ని కుటుంబాల వారికి చెబుతూ ధాన్యం, సంభావనలు తీసుకొనే వారు. వీరందరితో పాటు కొమ్ము ఊదేవారు, జోగి, జంగం, కమ్మరులు మొదలైన సమస్త వృత్తుల వారు, కులాల వారు సామరస్యంగా, మత సహనంతో పండుగలు జరుపుకొనే వారు. ముఖ్యంగా సంక్రాంతి, శివరాత్రి, ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి, మొహరం (పీర్ల పండుగ) మొదలైనవి సంతోషంగా, సరదాగా జరుపుకొనే వారు.
సంక్రాంతి పండుగ దినాల్లో జనవరి మొదలుగా తెలుగు గ్రామాల్లో, ప్రతి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చి దిద్దేవారు. బంతి, గుమ్మడి పూల గొబ్బెమ్మలతో, ముగ్గులతో గ్రామమంతా కళకళ లాడుతుండేది. హరిదాసులు హరిసంకీర్తన చేస్తూ ఇల్లిల్లూ తిరిగి బియ్యం స్వీకరించే వారు. బుడబుక్క కళాకారుల వృత్తి భిక్షాటనమే అయినా వారి పట్ల జానపదుల్లో గౌరవాదరాలుండేవి. వారు గ్రామాల్లో పదాలు చెప్పుకొంటూ సంచరిస్తే తమకు శుభం జరుగుతుందని ఆనాటి గ్రామస్తుల నమ్మకం. అందుకే వాళ్ళను కసురుకోకుండా దానధర్మాలు చేసేవారు. బుడబుక్కల వారు గ్రామంలో తెల్లవారు జాము నుంచి ప్రతి ఇంటి దగ్గర ‘అంబ పలుకు జగదంబ పలుకు, కంచిలోని కామాక్షి పలుకు’, అని పాడుతూ ‘డబుక్‌డక్’ అని డమరుకం వాయించుకొంటూ ‘నీ కుటుంబం సల్లంగుండ ఒక పాతగుడ్డ పారెయ్యర సామి!’ అని అడుగుతూ ధనధాన్యాలతో పాటు పాత బట్టలు అడుక్కొని వెళ్ళేవారు.
తెలుగు గ్రామాల్లో తెలుగు సంవత్సరాది (ఉగాది)తో మిగతా పండుగలన్నీ ప్రారంభమవుతాయి. ఉగాదినాడు ప్రజలందరూ పవిత్రభావంతో పండుగ జరుపుకొంటారు. ఆ పర్వదినాన ఎలాంటి కలహాలు, కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో గడిపితే సంవత్సరమంతా అలాగే సాగిపోతుందని ప్రజల నమ్మకం. ప్రతి కుటుంబంలోనూ అన్నీ కొత్తదనంతో శుభారంభం పలుకుతాయి. అందరూ అభ్యంగన స్నానమాచరించి దేవునికి పూజలు, అభిషేకాలు చేసి ఉపవాసాలతో, పంచభక్ష్య పరమాన్నాలతో, కొత్త బట్టలు ధరించి సంతోషంగా ఉంటారు. ఆనాడు ప్రత్యేకంగా పురోహితుడు ప్రతి ఇంటికి వెళ్ళి ఉగాది పచ్చడి ప్రసాదంగా పెట్టి నవధాన్యాలు స్వీకరించి దీవించి వెళతాడు.
ఉగాది పర్వదినాన పశువులను సైతం – ముఖ్యంగా ఎద్దులను – శుభ్రంగా కడుగుతారు (స్నానం చేయిస్తారు). వ్యవసాయ సామగ్రిని కూడా కడిగి రంగులు అద్దుతారు. వ్యవసాయం ఉగాదినాడే ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరి పేరు బలంమీద వ్యవసాయం సాగించాలో చూచి ఎద్దులను అలంకరించి వాటితో పాయసం తినిపిస్తారు. ‘అరక’ కట్టి కబ్బరికాయ కట్టి పూజచేస్తారు. శకునం చూసుకని అరక తోలుకొని చేలోకి వెళ్ళి మూడు చాళ్ళు అరక దున్ని రావటం ఆనవాయితీ. ముఖ్యవృత్తి అయిన వ్యవసాయాన్ని నమ్ముకొన్న రైతు ఈ విధంగా సేద్యాన్ని ప్రారంభించి సంవత్సరమంతా ఫలసాయం బాగుండాలని కోరుకొంటాడు. వ్యవసాయం లేని ఇతరులు కూడా కనీసం గొడ్డలి, కడవళ్ళతో పొలంలో పని ప్రారంభించి వస్తారు.
శ్రీరామనవమి నాడు పందిళ్ళు వేసేవారూ, పానకం – వడపప్పు తయారు చేసేవారూ అందరూ భక్తితో ఆనందంగా 7‘పారువేట’ జరుపుకొంటారు. ‘దసరా నవరాత్రులు’, సంక్రాంతి, శివరాత్రి తిరునాళ్ళలో ప్రజలందరు కలిసి ఎవరివృత్తి ధర్మాలను, బాధ్యతలను వారు అంకితభావంతో నిర్వహిస్తూ సంతోషాన్ని, సౌభ్రాతృత్వాన్ని పంచుకొంటారు. పిండివంటలు తృప్తిగా భోంచేసి వారి కష్టాల్ని మరచి సంతోషంగా గ్రామాల్లో సంబరాలు జరుపుకొంటారు.
మొహరం (పీర్లపండగ) ముస్లిం పండుగ దేశ విభజన జరిగి భారత్ – పాకిస్తాన్‌లుగా విడిపోయినా భారతదేశంలో నేటికీ తెలుగు గ్రామాల్లో ఈ పీర్ల పండుగను మత సామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా అన్ని మతాల వారు ఆనందంగా జరుపుకొంటారు. ఇలాగే గ్రామంలో జరిగే జాతరలు, తిరునాళ్ళు గ్రామవాసులు ఐకమత్యంతో జరుపుకోవటం వల్ల సామాజికాభివృద్ధికి గ్రామాలు గీటురాళ్ళుగా నిలిచాయని చెప్పవచ్చు. ఇలా మనిషి పుట్టినది మొదలు నామకరణం, అక్షరాభ్యాసం చేయించే బ్రాహ్మణుల నుంచి కాటికాపరి వరకు …
‘కలమెత్తిన హలమెత్తిన
మలమెత్తినవారి నొక్కమై జూడవలెన్
వలతియు నలతియు లేదిట
బలు వృత్తులు సాగినపుడె బ్రతుకులు సాగున్!’
అని ‘తెలుగులెంక’ తుమ్మల వారన్నట్టు నాడు సమాజంలో అందరూ వృత్తులను గౌరవ భావంతో చూసుకొంటూ ఎవరి పనిని వారు అంకిత భావంతో చేసుకొనే వారు.
గ్రామాల్లో ఇలా భిన్న మతాలు, విభిన్న కులాలు ఉన్నా సామాజికంగా ప్రాచీనకాలం నుంచి వస్తున్న ఆటలతో, పాటలతో అన్నీ మరచిపోయి భిన్నత్వంలో ఏకత్వంలా ఆనందంగా జీవనం సాగించే వారు. ఏ వయసు వారు ఆ వయసుకు తగిన ఆటలు, పాటలు, బలప్రదర్శనలు, ఆరోగ్యకరమైన పోటీలు నిర్వహించుకొంటూ ఆదర్శవంతంగా సంప్రదాయ బద్ధంగా సాగిపోయే వారు.