ఉగాది పర్వదినానికి ముందు రైతులు అన్ని రకాల పంటల్ని కళ్ళానికి తరలిస్తారు. పనివాళ్ళు ధాన్యం ‘తూర్పార’బోస్తూ ‘పొలియోపోలీ పొలియోపొలీ – రావేలుగలవాడ రారా పొలిగాడ’ అనికొందరు పాడుతుంటే మరికొందరు ‘సాలపొలిగలగాలి’ అని పాడుతూ చతురోక్తులతో భూ – ధాన్య విశేషాలు ముచ్చటించు కొంటూ శరీర కష్టాన్ని మరిచిపోయి సమధికోత్సాహంతో పనులు చేస్తూ రైతుకు ధాన్యం సమకూర్చి పనికి తగిన ఫలితంగా ‘మేర’గా ధాన్యాన్ని పొందేవారు.
గ్రామాల్లో ప్రతి కుటుంబంలో జరిగే శుభకార్యాలకు బంధు మిత్రులంతా పందిళ్ళు వేయటంలోనూ, బియ్యం బాగుచేయటం, వండటం, బంతులు పెట్టటంలోనూ సహాయ సహకారాలు అందించుకొనే వారు. అన్నదమ్ములు, వారి కొడుకులు, కోడళ్ళు, మనుమలు కలిసి ఒకే చోటవున్నా తర తమ భేదం లేకుండా అందరు ఒకే సంతానంగా కలిసి మెలసి ఉండేవారు. అంటే ‘ఉమ్మడి కుటుంబ వ్యవస్థ’ అంతగా వేళ్ళూని ఉండేదన్న మాట ఆ నాటి గ్రామాలల్లో!
ఏ కుటుంబంలోనైనా ఎవరైనా చనిపోతే బంధు మిత్రులంతా సంతాప దినాలుగా దాదాపు 15 రోజులు నియమాలు పాటించి చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం, సంస్మరణార్థం పెద్దకర్మ చేసి పంక్తి భోజనాలు, దానధర్మాలు చేసేవారు. ఈ ఆచారం అన్ని గ్రామాల్లో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇలా ప్రతి కుటుంబంలో పుట్టిన బిడ్డకు నామకరణం ఆదిగా పుట్టువెండ్రుకలు తీయించటం, ఆ తర్వాత పెళ్ళి మొదలైన శుభకార్యాలు జరుపుకొంటూ అందరూ ప్రేమాభిమానాలతో ఆనందోత్సాహాలతో గౌరవప్రదమైన జీవితం సాగించే వారు.
కుటుంబంలో సభ్యులు ఎక్కువై చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటే ఇక లాభం లేదు, వీలు కాదనుకొన్నప్పుడు మాత్రమే ధర్మయుక్తంగా పెద్దల సంప్రదింపులు, సలహాల మేరకు సమభాగాలుగా పంచుకొని అన్నా తమ్ముళ్ళు వేరుపడే వారు. అసలు విడిపోవటమంటే ఆ కాలంలో అగౌరవంగా భావించే వారు. వేరుపడినా వారి అనుబంధాల్ని మాత్రం వదలుకొనేవారు కాదు.
ఇలా నాడు కుటుంబ జీవనం ఉన్నతంగా, ఐకమత్యానికి ప్రతీకగా, గౌరవ ప్రదంగా సాగేది. కాని నేడు పిల్లలు పెద్దయి పెళ్ళయిన వెంటనే ఉద్యోగరీత్యా కాని, కలిసి ఉండలేక కాని వ్యష్టి కుటుంబాలుగా విడిపోతున్నారు – తల్లిదండ్రులను నిరాదరణకు గురిచేస్తున్నారు.
నాడు గ్రామ సమగ్రాభివృద్ధికి అన్ని వృత్తుల వారు సమైక్య భావంతో ‘సాంఘిక జీవనం’ సాగించే వారు.
‘తన కుల ధర్మము విడువక
మనుట పరమ ధర్మమండ్రు మాన్యులు
………………………
………………………’
(భార. అర. 5-37)
అని కౌశికునితో ధర్మవ్యాధుడు చెప్పినట్టుగా గ్రామంలో ఎవరి వృత్తిని వారు ఉన్నతంగా గౌరవించుకంటూ అంకిత భావంతో జీవించే వారు. వ్యవసాయం ఆనాడు ముఖ్యవృత్తిగా విరాజిల్లేది. మిగతా వృత్తులన్నీ వ్యవసాయానికి సహాయ సహకారాలందించుకొంటూ ఉండేవి. అందరూ తమ వృత్తి నైపుణిని ఆర్థిక ప్రగతికి వినియోగించటం వల్లనే ‘భారతదేశం వ్యవసాయిక దేశం, సాంప్రదాయిక దేశమ’ని పేరు పొందింది. అందుకే జనజీవన ఆర్థిక సౌభాగ్యాలకు మూలకారకుడు రైతు అంటూ ‘కృషీవలుడు’ కావ్యంలో …
‘సైరికా! నీవు భారత క్ష్మాతలాత్మ
గౌరవ పవిత్రమూర్తివి, శూరమణివి
ధారుణీపతి పాలన దండమెపుడు
నీ హలంబుకన్నను బ్రార్థనీయమగునె?…’
అని ‘కవికోకిల’ దువ్వూరి రామిరెడ్డి హాలికునితో అంటారు. రైతు వ్యవసాయంలో కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అయి రేయింబవళ్ళు చెమటోడ్చి పంటలు పండించే వాడు. వ్యవసాయ క్షేత్రంలో తనతో పాటు తన కష్టాలను పాలుపంచుకొనే పశువులను రైతు తన కన్నబిడ్డల వలె ఆలనా పాలనా చూసుకనే వాడు.
‘పౌరోహిత్యం’ జీవనంగా స్వీకరించిన బ్రాహ్మణులు దేవాలయాల్లో దేవతార్చనతో పాటు వివాహాది శుభకార్యాలు నిర్వహించి నవధాన్యాలు, నూతన వస్త్రాలు పొందేవారు. నాడు బ్రాహ్మణులతో పాటు ‘భట్రాజులు’ కూడా విద్యార్థులకు ‘అమర కోశము’, బాల రామాయణం, పెద్ద బాలశిక్ష మొదలైనవి బోధిస్తూ వీధి బడులను నిర్వహించి గురుదక్షిణలు స్వీకరించే వారు.