ప్రస్తుత తెలుగు కథ – ఒక జీవన కఠోర వాస్తవం

6

సృష్టిలోని సమస్త జీవులు, జాతులు, దేశాలు ఒకటేనన్న సమభావనే నిజమయిన ప్రపంచీకరణ అయితే ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోయినట్టయితే ఒకే నమూనాలో వస్తువుల్ని ఉత్పత్తి చేయడం తేలికవుతుంది కాబట్టి ప్రపంచమంతా ఒకే సరుకు వాడే గుత్తాధిపత్యాన్ని హస్తగతం చేసుకోవడం ఇప్పటి ప్రపంచీకరణ ….

మానవ జీవితానికి దిశానిర్దేశం చేస్తూ నిరాడంబరంగా జీవించే మనిషి ధోరణిని వెక్కిరిస్తూ …. సమస్త చర్యల్ని, భావాల్ని సైతం వ్యాపారమయం చేస్తోన్న ఈ మార్కెట్‌ …. మనిషిని ఎలా ప్రభావితం చేయగలదో రానున్న ప్రమాదాన్ని హెచ్చరిస్తూ చాలా ఏళ్ళక్రితమే సింగమనేని నారాయణ ‘ప్రమాదవీణ’ అన్న కథ రాశారు ….

ప్రపంచ వ్యాపార సంస్థ ఏర్పడి బహుళజాతి సంస్థలన్నీ మన దేశంలోకి యదేచ్ఛగా ప్రవహించడం మొదలయ్యాక …. ఈ వ్యాపారం కోసం, తమ వస్తువుల్ని అమ్ముకోవడం కోసం …. అప్పటికే మన జీవితాల్లోకి ప్రవేశించి ఉన్న టి.వి మనల్ని మనకి కాకుండా చేసి పారేసింది …. ఈ ప్రకటనల వ్యామోహంలో పడి ప్రతీ వస్తువూ మనింట్లో ఉండాలని ఆతృతపడ్డం …. ఈ విషయాన్ని ప్రతిబింబిస్తూ టి.వి ఇంట్లో ఉండడం మూలంగా మానవీయ బంధాలు ఎలా విచ్ఛిన్నమై పోతున్నాయో తెలుపుతూ బమ్మడి జగదీశ్వరావు ‘మహామాయగాడు’ అన్న కథ రాశారు.

మనుషుల్ని తమ వ్యాపార సంబంధాల కనుగుణంగా ముఖ్యంగా స్త్రీలను తమకు నచ్చిన రీతిలో తయారుచేసుకోగలిగే ఒక ప్రక్రియ జీవితాల్లోకి చొచ్చుకు వచ్చే ప్రమాదాన్ని చెప్తూ ‘తిమింగిల స్వర్గం’ అన్న కథ పి.సత్యవతి రాసిన కథ ….

అమెరికా అల్లుళ్ళకోసం ఆడపిల్లల్ని తయారుచేసే ఒక సంస్కృతి ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది …. అయితే అమెరికా వెళ్ళిన ఈ కొత్త పెళ్ళికూతుళ్ళు ఏమవుతున్నారు? …. ఏం జరుగుతోందక్కడ …. ఏం జరగడానికి అవకాశముంది? అన్న విషయాన్ని స్పష్టంచేస్తూ ఆరి సీతారామయ్య ‘‘గట్టు తెగిన చెరువు’’ అన్న కథ రాశారు….

తల్లిదండ్రుల కోరిక మేరకు అమెరికా కోడలుగా వెళ్ళిన మరో అంధ్రుల ఆడకూతురి మరో రకపు వేదన ముదిగంటి సుజాతారెడ్డి రాసిన ‘నిశ్శబ్దం నిశ్శబ్దం’లో మనకి కనిపిస్తుంది….

అయితే ఈ అమెరికా అల్లుళ్ళ వ్యామోహం ఇటీవలి కాలంలో కంత తగ్గినట్టుగా అన్పించినప్పటికీ అది గణనీయంగా అయితే మాత్రం కాదు …. నల్లూరి రుక్మిణి ‘దూరపుకొండలు’, ‘మిడిసి పాటు’ వంటి కథలు ఈ అమెరికా డాలర్ల వ్యామోహం మీద చెంపపెట్టులా సాగిన కథలు ….

పి.సత్యవతి రాసిన మరో కథ ‘మాతృనగరి’లో ఒక మహా మాయగాడు తన చేతి సంచిలో విభిన్న రకాల వస్తువులు వేసుకొచ్చి ఎలా యువతను భ్రమింపచేసి మాతృనగరి దారులు పట్టిస్తున్నాడో కళ్ళకు కట్టినట్టు తెలుపుతుందామె ….

మన ప్రమేయం లేకుండా టెక్నాలజీ మన జీవితాల్లోకి చొచ్చుకు వచ్చి మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తోన్న వైనాన్ని జి.ఉమామహేశ్వరావు ‘నిశ్శబ్ద విప్లవం’ …. వివినమూర్తి రాసిన ‘కృష్ణ స్వప్నం’ వంటి ఎన్నో కథలు వివరిస్తాయి ….

ఒకరాత్రి అమెరికా అధ్యక్షుడికి శ్రీకృష్ణుడు దర్శనమిచ్చి తన స్వప్నం నిజం చేసినందుకు అతడ్ని అభినందిస్తాడు …. ఏమిటన్నట్టుగా అశ్చర్యపోతాడు అమెరికా అధ్యక్షుడు …. అప్పుడు కృష్ణుడు తనది నాగరికతా స్వప్నమని చెబుతూ కన్ని దృశ్యాలను అమెరికా అధ్యక్షుడికి చూపుతాడు …. వాటిలో మొదటిది ఇంద్రప్రస్థాన్ని నిర్మించటం కోసం ఖాండవ దహనం చేయడం, నాగజాతిని నిర్మూలించడం …. అందులోని నాగరికతా సూత్రం ఏమిటంటే నాగరికతకు చిహ్నమైన ఆయుధాన్ని చేతిలో ధరించినంతవరకూ మనం ఎదుటివాళ్ళ నాగరికతను నియంత్రించగలం …. ఎంత దూరంనుంచి మనం శత్రువుమీదికి విసరగలిగితే మన నాగరికత అంత గొప్పది ….

పోతే ప్రపంచమంతా ఒకేజాతి, ఒకే నాగరికత ఏర్పడేంతవరకూ మనుషుల్ని చంపుతూ పోవడం అనివార్యమంటూ కురుక్షేత్ర సంగ్రామంలో పసిపిల్లల్ని, తమ వారిని చంపడానికి అర్జునుడికి చేతులాడని దృశ్యాన్ని రెండోదిగా చూపిస్తాడు …. శ్రీకృష్ణుడి ఈ సామ్రాజ్యవాద తత్త్వానికి తాను వారసుడయినందుకు చాలా సంతోషపడ్తాడు అమెరికా అధ్యక్షుడు ….

ఇంతలో ఉదయమయి అతడు టాయిలెట్‌లోకి వెళ్తాడు. మానవ హక్కుల మీద, ప్రజాస్వామ్యం మీద ఇతర దేశాలలో తానివ్వవలసిన ఉపన్యాసాలని తీసుకుని …. అతడికి నవ్వొస్తుంది …. ఆ నవ్వు క్రమక్రమంగా పెద్దదయి విశ్వాంతరాళంలోకి వ్యాపిస్తుంది. మనుషులంతా అందులోంచి పుట్టిన ఆకారం కింద నలిగిపోతూంటారు …. మేధావులంతా చుట్టూచేరి భజన చేస్తూంటారు …. ఆ ఆకారానికి హృదయం ఉండవలసిన చోట ఉన్న ఒక మహారంధ్రంలో నుంచి రకరకాల మారణాయుధాలూ, ప్రయాణ సౌకర్యాలూ, వినోద సమాచార సాధనాలు స్వేచ్ఛాయుతంగా ప్రవహిస్తూంటాయి …. జనమంతా ఎగబడతూంటారు ….

చివరికి ఆ రూపం ఒక చిన్న మాత్రగా మారి అధ్యక్షుడి కడుపులో ప్రవేశించి హాయిని కలిగిస్తుందతడికి …. సామ్రాజ్యవాద సంస్కృతిని భారతీయ పురాణ సంస్కృతితో పోలుస్తూ …. రాబోయే పరిణామాలను ఊహించి చెప్పిన ప్రతీకాత్మక కథ ఇది …. ఇమేజరీ క్రియేషన్‌….

సామ్రాజ్యవాద సంస్కృతి మన జీవితాల మీద చూపిస్తోన్న ప్రభావం మీద వచ్చిన కథల్లో ఈ కథ ఎన్నదగినది ….

ఎప్పటికప్పుడు కొత్త వస్తువులను సృష్టిస్తూ, అవసరాల నేర్పరుస్తూ, అందీ అందకుండా ఊరిస్తూ …. ఈ మార్కెట్లు వ్యక్తుల మాన, ప్రాణాలతో సహా ప్రతీదాన్నీ సరుకుగా మారుస్తోన్న క్రమంలో స్త్రీ, పురుష సంబంధాలు …. మొదట తరానికి, రెండోతరానికీ మధ్యన అగాధం లాంటి వ్యత్యాసం …. ఇవ్వాల్టి జీవన వ్యాపారంలో అనివార్యమై పోతోన్న పలాయనం గురించి సూటిగా ప్రశ్నిస్తాడు కథకుడు …. వివినమూర్తి రాసిన కథే ‘‘పయనం – పలాయనం’’….

ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు పడవల్లాటి కార్లు ప్రయాణించడానికి వీలుగా, ఉన్నట్టుండి ప్రభుత్వం రోడ్లను వెడల్పు చేసే కార్యక్రమాన్ని అమలుజరిపిన నేపథ్యంలోంచి మహమ్మద్‌ ఖదీర్‌ బాబు రాసిన ‘ఖాదర్‌లేడు’ అన్న కథ పాఠకుల హృదయాలను పిండుతుంది …. ఇదే నేపథ్యంలో కాట్రగడ్డ దయానంద్‌ ‘నీడ’ అన్న కథ రాశారు….

ప్రపంచీకరణ చిన్న పరిశ్రమల మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో నిరసిస్తూ సోమరాజు సుశీల ఒక సిరీస్‌గా మంచి కథలని పాఠకులకు అందించారు …. ఇదే నేపథ్యంలో దేశీయ కంపెనీలన్నీ ఎలా మట్టికరిచిపోతాయో తెలుపుతూ తోలేటి జగన్మోహన్రావు ‘కప్పడాలు’ అన్న కథ రాశారు.

ఈ మార్కెట్‌ మాయాజాలం మానవ సంబంధాలలో తీసుకొచ్చిన పెనుమార్పు, ఖాయిలా పడ్డ పరిశ్రమలు క్రమంగా వ్యక్తుల చేతుల్లోకి వెళ్తూన్న వైనం …. ఈ రెండింటికీ ఉన్న సంబంధాన్ని చాలా లోతుగా విప్పి చెప్పింది ‘జీవన్మృతుడు’ …. ఆడెపు లక్ష్మీపతి రాసిన ఈ కథ బహుశా ఈ నేపథ్యంలోంచి వచ్చిన కథల్లో తొలికథగా చెప్పుకోవచ్చు ….

వస్తు సంపదల సమీకరణా, పిల్లల చదువులకి పెట్టుబడుల సేకరణా ఇవ్వాళ మనిషికి ప్రాధమికావసరాలై పోయాయి .. ఇది మనిషిని దూర దేశాలకు పరుగులు తీయిస్తోన్న పరిస్థితినీ, ఆ క్రమంలో విచ్ఛిన్నమైపోతూన్న మానవ సంబంధాలనూ …. మనిషి తనకు తానే పరాయి వాడయిపోయి చివరికి జీవన్మృతుడుగా మిగిలిపోతూన్న దురవస్థనీ చాలా చక్కగా పట్టుకుందీ కథ ….

అయితే ఈ కథలోని లోపమేమిటంటే భార్యల ఒత్తిడి మీద మాత్రమే ఈ పురుషుడు సంపదల సమీకరణలోకి నెట్టబడుతున్నాడన్న ఆలోచన మీదే ఈ కథ నిర్మింపబడడం …. పురుషులు తమ ప్రవర్తనలకు సంజాయిషీ ఇచ్చుకోవడం కోసం నెపాన్ని స్త్రీల మీదకు నెట్టడంలా కనిపిస్తుంది.

వస్తు వ్యామోహమంతా స్త్రీలదేనని పురుషులు ఆరోపిస్తుంటారు కానీ నిజానికి పురుషుడికే ఈ వస్తు వ్యామోహం ఎక్కువగా ఉంటుంది ….

పెళ్ళి పేరుతో మొత్తం ఈ వస్తువులన్నీ ఉచితంగా మన ఇంటికి నడిచి వచ్చే ఒక దారిని పురుషుడు ఎన్నుకుంటున్నాడు …. కట్నంతో పాటుగా మార్కెట్లోని వస్తువులన్నీ మన ఇంట్లో నింపుకోవడానికి పెళ్ళిని ఒక మార్గంగా ఎన్నుకుంటున్నాడు పురుషుడు …. అంటే అంతిమంగా ఈ మార్కెట్‌ ప్రభావం స్త్రీలమీద ఎంత ఒత్తిడిని తెస్తుందో తెలుపుతూ పి.సత్యవతి ‘గణితం’ అన్న కథలో రాశారు….

ప్రైవేటైజేషన్‌ కారణంగా రోడ్డున పడ్డ ఆంధ్రా స్టీలు ఫ్యాక్టరీ దీనస్థితి మీద సురేష్‌ రాసిన టైటానిక్‌ అన్న కథ వస్తు శిల్పాలు రెండింటిలోనూ ఎన్నదగిన కథ ….

ఒక పెద్ద కర్మాగారం ప్రభుత్వ రంగ సంస్థగా స్థాపింపబడినప్పుడు ఎన్నో వందల మందికి ఉపాధి లభిస్తుంది …. హఠాత్తుగా అది మూతపడిపోతేనే …. ఈ కార్మికులంతా రోడ్డున పడి అతలాకుతలమయిపోతారు ….

ఇలా ఒకప్పుడు వేల మందికి ఉపాధినిచ్చిన ‘ఆంధ్రా స్టీల్సు’ కర్మాగారం టైటానిక్‌ ఓడ మునిగి పోతున్నట్టుగా నష్టాల ఊబిలో కూరుకుపోయి కనపడకుండా అదృశ్యమై పోతున్న తీరును ఆ కంపెనీలో పనిచేసి తనకి ఆ ఉద్యోగాన్నీ, జీవనాన్నీ ఇచ్చిన కర్మాగారాన్ని గాఢంగా ప్రేమించిన ఒక యువకుడి అంతరంగ కథనం ఈ కథే ఇతివృత్తం ….

అట్లాగే గొరుసు జగదీశ్వరెడ్డి రాసిన ‘బతుకుగోస’, ‘చీడ’, ‘గజ ఈతరాలు’ వంటి కథలు కూడా ఇదే నేపథ్యంలోంచి వివిధ కోణాలను చర్చకు పెట్టిన కథలు …. ఈ రోడ్డున పడ్డ కర్మాగారాల మూలంగా అందులో పని చేస్తోండిన ఉద్యోగుల అభద్రతా భావంతో భార్యాభర్తల నడుమ ఎటువంటి విచ్ఛిన్నకరమైన పరిస్థితులు ఏర్పడతాయో ‘చీడ’ కథ చెపితే, ‘గజ ఈతరాలు’లో ఊరంతటికీ ఈత నేర్పిన పూర్ణమ్మకి గుండెజబ్బు వస్తే నయం చెయ్యించలేక కొడుకు అప్పుల పాలవుతాడు …. కొడుకు కష్టాలపాలు గావడం ఇష్టంలేని పూర్ణమ్మ కాళ్ళకు తాళ్ళు కట్టుకుని బలవంతపు చావుని వరిస్తుంది …. దీని వెనుకనున్న పాతికేళ్ళ సామాజిక జీవిత చరిత్రనీ …. దాని వెనుకనున్న కుట్రనీ గత స్మృతుల ద్వారా పాఠకుడికి గొప్ప అవగాహన కలిగిస్తాడు రచయిత ….

ఇదంతా ఇలా ఉంటే సంపదల సమీకరణ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఆ ఒత్తిడిలో నిత్య జీవితంలోని అనేక విషయాలని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం …. మనుషులనే పట్టించుకోలేని క్రమంలో మూగజీవాలను, పక్షులను, పిచ్చుకలను పట్టించుకునే సమయం మనకెక్కడిది?

ఇదివరకంటే మనిళ్ళు చాలా సాధారణమైనవి …. ఆ ఇళ్ళల్లో క్రమం తప్పకుండా పిచ్చుకల కోసం ఒక గూడు, దాంట్లో ధాన్యం కంకులు వేలాడదీయడమూ …. అవి వచ్చి ధాన్యం నములుతూ తమ కిచకిచ శబ్దాలతో ఇల్లంతా నింపిపోవడమూ తప్పనిసరి పరిస్థితిగా ఉండేది ….

మరిప్పుడు మనిళ్ళు గ్రానైట్‌ ఫ్లోరింగ్‌లతో, కృత్రిమ ఆకాశాన్ని నింపుకున్న సీలింగులతో ఎటుచూసినా డబ్బుతో మిలమిలా మెరిసి పోతూండగా ఈపాడు పిచికలు ఇల్లంతా పాడుచేసి పోతూంటే శుభ్రం చేసుకునే తీరిక మన కెక్కడిది? …. ప్చ్‌ు….

పోనీ వాటిని పొలాల్లోనన్నా బతకనిచ్చామా అంటే అక్కడ కూడా రసాయన ఎరువులతో, పురుగుల మందులతో నింపి పిచ్చికలిని, పికిలి పిట్టలని, కాటుక పిట్టలనీ లేకుండా చేసుకుంటున్నాం …. ఆ క్రమంలో ఆఖరి పిచ్చుక పోతూ పోతూ ‘‘పిచ్చికలకి చోటులేని ఈ ప్రపంచం ఒకనాటికి ఎడారిగా మారిపోవునుగాక …. దయలేని రెండు చేతుల జాతి సమస్తాన్నీ ధ్వంసం చేసుకుంటూ వెళ్ళి చివరికి తానే ధ్వంసమై పోవును గాక’ అంటూ శాపం పెట్టిపోతుంది …. ఇది పిచ్చిక విసిరిన చివరి బ్రహ్మాస్త్రం అంటూ ముగిస్తాడు రచయిత ….

పాపినేని శివశంకర్‌ రాసిన ‘ఆఖరి పిచ్చుక’ మనల్ని ఒక భయాందోళనకి గురిచేస్తుంది …. మనకి తెలీకుండానే మనం నిర్లక్ష్యంతో ఎన్నింటిని ధ్వంసం చేసుకుంటున్నామో కదాని పాఠకుడి మనసులో దిగులూ, అలజడీ రేగుతుంది.

అలాగే రమణజీవి ‘చివరి మనిషి’ ఈ కథకు కొనసాగింపేమో అన్నట్టుగా సాగుతుంది …. బాల్యం మీద ప్రేమ లేకుండా …. బాల్యాన్ని ఒక గుదిబండగా మార్చేసిన సమాజాన్ని తీవ్ర స్వరంతో శపించిన కథా రూపం మానవ సమాజం నాశనమై పోవాలి అన్న ఆలోచన కాదు …. అలా నాశనమై పోతూన్న క్రమంలో వాళ్ళల్లో కలిగిన అనూహ్య పరిణామం ఈ కథకు పునాది …. దయ, జాలి, ప్రేమ, పశ్చాత్తాపం, పరోపకారం కలిగినటువంటి కొత్త పరిణామంతో మానవజాతి మళ్ళీ ఉద్భవించాలన్న ఆశావహకోణం కూడా ఈ కథలో ఉంది….

అనేక ప్రాంతాలలోని వివిధ సంఘటనల సమాహారంగా అనిపించినప్పటికీ ఒక ఏకసూత్రతతో సాగడం ఈ కథలోని విశేషం ….

రాజ్యానికి ఉన్న అవినీతి, అహంభావ …. నేర స్వభావాలను ‘రాజ్యపురుషుడి తొడలమధ్య వేళ్ళాడే మేఢ్రం’ వంటి అస్వతంత్ర అధికారులు తాము క్రమంగా అవినీతిలోకి కూరుకుపోయే క్రమం వెనక ఈ అధికారం ఎలా పనిచేస్తుందో సున్నితంగా తెలియచెప్తూ, ఆక్రమంలో వారి ఆత్మలు రాజ్యస్వభావం మీద, రాజ్యవ్యవస్థ మీద అనేకానేక ప్రశ్నలు సంధించడమే చినవీరభద్రుడు రాసిన ‘ప్రశ్నభూమి’….

ఈ కథ ఈ కొత్త శతాబ్దంలో వచ్చిన ఒకానొక శక్తివంతమైన కథగా మనం చెప్పుకోవచ్చు….

ఇవేకాక ఓల్గా రాసిన ‘మార్పు’, ‘కోకాకోలా’ …. మధురాంతకం నరేంద్ర ‘చోటు’ …. ‘రుక్మిణి’ రాసిన ‘పట్టు’ చంద్రశేఖర అజాద్‌ రాసిన ‘స్వ’దేశ ‘భక్తులు’ వంటి కథలన్నీ కూడా వివిధ రంగాల మీద ప్రపంచీకరణ చూపుతున్న ప్రభావాలే ….