ప్రస్తుత తెలుగు కథ - ఒక జీవన కఠోర వాస్తవం
(9వ ఆటా మహాసభల వ్యాసాల పోటీ లో రూ. 15000 పారితోషికం అందుకున్న వ్యాసం)
5
ఖాదర్ ‘పుట్టుమచ్చ’తో ప్రారంభమైన ముస్లిం సాహిత్యం అయోధ్య సంఘటనతో అస్థిత్వ వేదనకు గురయి హక్కుల్ని కోరుకుంటూ జల్‌జలా, జహాద్ అన్న కవిత్వ సంకలనాలుగా ఏర్పడి … క్రమంగా ఒక ఉద్యమ రూపం తీసుకుంది …
తెలుగు సాహిత్యంలో స్వీయానుభూతులను, జీవిత విశేషాలనూ సార్వజనీనం చేస్తూ ఆత్మకథా మాలికలు రాసిన వారిలో నామిని సుబ్రహ్మణ్యం నాయుడు పేరు మొదటగా మనం చెప్పుకున్నట్టయితే ఆ తరువాత ఈ పనిని చాలా సమర్థవంతంగా నిర్వహించారు ముస్లిం రచయితలు … మహమ్మద్ ఖదీర్‌బాబు రాసిన ‘దర్గామిట్ట కథలు’, రహముల్లా రాసిన ‘బా’ ఈ కోవలోకి వస్తాయి.
‘మైనార్టీలు అనడం కంటే ముస్లిములు అనడమే బావుంది … మైనార్టీ అనడంలో మా ఆత్మ తప్పిపోతుంది అంటారు ఖదీర్‌బాబు ఒకచోట … అలాగే మైనారిటీ సాహిత్యం అనడం కన్నా ముస్లిం సాహిత్యం అనడమే సబబుగా భావిస్తారు స్కైబాబా మరొకచోట … కాబట్టి మనం ముస్లింల కథా సాహిత్యంగానే దీన్ని పరిగణించుకుంటే …
ఖాజా, రహమతుల్లా, ఇనాయతుల్లా, గౌస్ మొహియుద్దీన్, యాకూబ్, ఖాదర్, షరీఫ్ … స్కైబాబా, షాజహానా వంటి వారెందరో మంచి మంచి కథలు రాస్తున్నారు…
ఖదీర్‌బాబు రాసిన ‘దావత్’ ముస్లిం స్త్రీల కథ … ముస్లింల పెళ్ళి విందుల్లో మగవాళ్ళు పూర్తిగా విందుభోజనం చేసేవరకూ స్త్రీలు కాచుకుని ఉండడం … ఒక్కొక్కసారి మిగలకపోవడం … స్త్రీల ఆకలినీ, స్త్రీలమీద ఒత్తిడినీ కూడా చాలా విపులంగా చిత్రించిన కథ ఇది … అంతా దాన్ని ముస్లింల పెళ్ళి విందుని చిత్రించిన కథగా భావించినప్పటికీ నిజానికది ముస్లిం స్త్రీవాద కథ …
ముస్లింలతో ఎటువంటి కులబేధం లేకుండా, ఎంతో ప్రేమగా, స్నేహంగా సాంస్కృతికంగా వాళ్ళతో కలగలిసి పోయిన దళిత బహుజనులలో విద్వేష మతబీజాలు నాటడానికి చేస్తోన్న ప్రయత్నాన్ని అత్యంత ఒడుపుగా పట్టుకున్న కథ ‘జమీన్’ … ముస్లింలకు ఇళ్ళు అద్దెకు ఇవ్వకపోవడం, స్థలాలు అమ్మకపోవడం, వాళ్ళని అంటరాని వాళ్ళుగా చాలా దూరంగా ఉంచడానికి జరిగే ప్రయత్నాలు వీటన్నింటితో పాటుగా మతోన్మాద దాడిని కూడా విపులంగా చర్చకు పెడుతుంది కథ …
ముస్లిం జీవితాలలోని వివక్షతలనీ, అణచివేతలనీ … బురఖా సాంప్రదాయాలనీ తీవ్రంగా ఖండిస్తూ వచ్చిన ముస్లిం కవులు కథా ప్రక్రియలో కూడా తమ జీవిత సమస్యలని చర్చకు పెట్టడం ఈ కొత్త శతాబ్దపు విశేషం…
దాదా హయాత్, అఫ్సర్, వేంపల్లి అబ్దుల్ ఖాదర్ వంటి వారెందరో కథా సాహిత్యాన్ని పండిస్తున్నారు…
గుజరాత్‌లో జరిగిన అమానవీయమైన, ఆటవికమైన మత మారణకాండ ఈ కథలకు మరింత ప్రేరణ నిచ్చింది …
మొత్తం దేశాన్నంతా భయభ్రాంతం చేసిన చారిత్రక సందర్భం అది … రెండున్నర నెలలు పాటు సాగిన ఆ సామూహిక హత్యాకాండలో … పిల్లలు, వృద్ధులు, స్త్రీలూ … గర్భస్థ పిండాలూ అన్న తేడా లేకుండా వేలాది మంది ముస్లింలను ఊచకోత కోశారు …
గుట్టలు గుట్టలుగా పేరుకు పోయిన శవాలను గెద్దలు పీక్కుతింటోన్న దృశ్యాలు మానవత్వమున్న వారి హృదయాలను ద్రవీభూతం చేశాయి…
వందలాది ముస్లిం స్త్రీలు కిరాతకంగా లైంగిక అత్యాచారానికి గురయిన సంఘటన దేశ వ్యాప్తంగా ముస్లింలలో తీవ్ర భయాందోళనలను రేకెత్తించి అభద్రతా భావాన్ని నింపివేసింది … మొత్తంగా దేశ ప్రజలలో లౌకికతత్త్వం ప్రశ్నార్థకమై పోయింది …
ఈ విధ్వంసాన్ని నిరసిస్తూ, తీవ్రంగా ఖండిస్తూ అనంతమైన కవిత్వం వచ్చినప్పటికీ అది కథారూపాన్ని కూడా తీసుకున్నది …
ఈ విధ్వంసానికి చలించి అభద్రతా భావంతో పిచ్చివాడుగా మారిపోయి ఆసుపత్రి పాలయిన ఇల్యాన్ కథ రహమతుల్లా రాసిన ‘బోర్డర్స్’ అభద్రతా భావం ఎంత తీవ్రమయిన దశలో ఉంటుందో విశ్లేషించిన కథ ఇది … అసలిది మన దేశమా కాదా? మన చోటు ఎక్కడున్నది అన్న సందిగ్ధం నుంచి రహమతుల్లాదే ‘కిరాయి మకాన్’ అన్న కథ వచ్చింది …
‘‘ముస్లిం కమ్యూనిటీ మీద జరుగుతోన్న హత్యాకాండ పూర్తిగా ఒక ఖామోషీనే నింపింది … స్వేచ్ఛతోని, ప్రేమతోని, స్నేహంతోని ఇన్ని దినాలు హిందూ ముస్లింలు ఒకర్నొకరు చూసుకున్న చూపులల్ల ఇప్పుడు ఒక ప్రశ్న, అపనమ్మకం, అభద్రత కన్పిస్తున్నాయి … గల్లీల ఉప్పొంగినట్లుందే ముస్లింల ప్రవర్తన చప్పున చల్లంగయినట్టయింది … ఒదిగి ఒదిగి నడుస్తున్నారు. ఈ బస్సులల్ల, రైళ్ళల్ల, స్టాపులల్ల, బజార్లసొంటి పోతున్న ముస్లింలల్ల ఒక బెదురు కన్పిస్తున్నది …’’ అంటూ ముస్లింలలో ఏర్పడిన ఒక అభద్రతా భావాన్ని గీతాంజలి రాసిన ‘బిచ్‌థీ చమన్’ అన్న కథ విశ్లేషిస్తుంది …
గుజరాత్‌లో జరిగిన హత్యాకాండలో భర్తనీ, పిల్లల్నీ అత్తమామల్ని పోగొట్టుకుని, ఆస్థులన్నీ పదులుకుని ఇక్కడికి తిరిగివచ్చిన నూర్జహాన్ అన్న మహిళ దీనహీన గాథనూ, ఆర్తినీ కూడా ఈ కథ విషాద భరితంగా చిత్రించింది.
ఈ గుజరాత్ విధ్వంసం మీద ముస్లింలే కాకుండా ముస్లిమేతర కథా రచయితలు కూడా స్పందించడం విశేషం … నల్లూరి రుక్మిణి రాసిన ‘నెత్తురోడుతోన్న నేల’ బి.వి.ఎన్.ఎల్.స్వామి రాసిన ‘విషప్రయోగం’ ఈ కోవలోకి వస్తాయి …
అసలు ముస్లింవాద సాహిత్యమనుకున్నప్పుడు మనకు చప్పున గుర్తొచ్చే స్త్రీ రచయిత షాజహానా … చాలాకాలంగా ముస్లిం స్త్రీల ఆవేదనను, బురఖా పద్ధతులను ఒక ధిక్కార స్వరంతో కవిత్వంలో ప్రతిబింబిస్తూ వచ్చిన షాజహానా ఈ కత్త శతాబ్దంలో తన సాహిత్య ప్రక్రియకి ఒక విస్తృతి ఏర్పరుచుకుని కథాసాహిత్యం వెలువరించడం విశేషం …
ముస్లిం లోగిళ్ళలోని, చీకట్లలోని స్త్రీల కష్టాలు, కన్నీళ్ళు, తన్నులు, ఆకలి, తలాక్, సండాస్‌ల గురించి ఆమె కథల్లో లోతుగా చర్చించారు…
కొన్ని ప్రాంతాలలో ముస్లిం స్త్రీలకు కక్కసుదొడ్లు కూడా లేని ఒక స్థితి ఆ సండాస్ లోపలికి వెళ్ళినప్పుడు … లుకలుక లాడుతోన్న పురుగులూ, విపరీతమైన గత్తుకంపూ చదువుతున్న పాఠకుడికే కడుపులో తిప్పినట్టయితే మరి ఇక అక్కడ ఆ పరిస్థితిని అనుభవిస్తోన్న మనుషుల సంగతేమిటి? …. అన్న ఆలోచనలో పడ్తాం మనం …
ఇదేకాకుండా ‘దాదీమా చెప్పిన ఖిస్సాలు’ … ‘సిల్‌సిలా’ వంటి ఎన్నో స్త్రీవాద కథలు షాజహానా కలం నుంచి వెలువడ్డాయి …
ముస్లిం ప్రజలకు తమ జీవితాల పట్ల చైతన్యం కలిగించడంలోనూ, ముస్లిమేతరులకు ముస్లిం జీవితాల వివక్షను అర్థం చేయించడంలోనూ షాజహానా స్కైబాబాతో కలిసి విస్తృతమైన కృషి చేస్తున్నారు.
ఆ క్రమంలో భాగంగానే స్కైబాబా సంకలించిన ‘వతన్’ కథా సంపుటి ఇటీవలే వెలుగు చూసింది ….
ఈ సంపుటిలో నలభయి మంది రచయితలు రాసిన యాభయి రెండు కథలు ముస్లిం జీవితాలలోని అనేక చీకటికోణాలను విభిన్న రకాలుగా చర్చిస్తాయి …. ముస్లింలు ముసల్మానులుగా గొంతు విప్పిన కథలివి ….
ముస్లిమీయతను కాపాడుకునే నేపథ్యంలో నఖాబ్ నుంచి బయట పడడానికి జరిగిన ఒక గొప్ప ప్రయత్నమే ‘‘వతన్’’. వతన్ గురించి వివరంగా చెప్పుకుంటూ పోయినట్టయితే అది మళ్ళీ మరో వ్యాసమయ్యే ప్రమాదముంది. ఏదిఏమయినా వతన్ వంటి కథా సంకలనం రావడం ముస్లిం రచయితలు ఒక మేరకు సాధించిన విజయంగా మనం చెప్పుకోవచ్చు ….
స్కైబాబా ఈ క్రమంలో ‘ముల్కి’ అన్న పత్రికను కూడా నడుపుతుండడం విశేషం …. సత్యాగ్ని రాసిన ‘పాచికలు’ కథా సంపుటిని కూడా స్కైబాబా పాఠకుల కందించారు …. ఈ సంపుటిలోని కథలు కూడా ముస్లిం స్త్రీల జీవితాల్లోని కష్టాలనూ, కన్నీళ్ళను, వివిధ చీకటికోణాలనూ చర్చకు పెడతాయి ….
ముస్లిమేతరులు రాసిన ముస్లిం కథల్లో ఆదెపు లక్ష్మీపతి రాసిన ‘‘ఇలా ఎందుకు జరగకూడదు?’ అన్న కథ చెప్పుకోదగినది …. హిందూ, ముస్లిం ఐక్యత మీద, సంఘటిత భావనమీద ఆశావహంగా వచ్చిన కథ ఇది ….
రెడ్డి కులస్తురాలైన సునీత దర్జీపని నేర్చుకోవడానికి వెళ్తూ వస్తూ పని క్రమంలో అన్వర్ అనే టెయిలర్ని ప్రేమిస్తుంది …. ఆ పెళ్ళికి ఎలాగూ పెద్దల ఆమోదం లభించదు గనుక వాళిద్దరూ లేచిపోతారు …. అగ్రకులానికి చెందిన పెద్దలంతా లేపుకు పోయిన అన్వర్ని నానాతిట్లూ తిడుతూ అఖిశంసిస్తూండగా …. సునీత తండ్రి మాత్రం …. ‘‘ఇందులో తప్పేమిటి? …. ఇలా ఎందుకు జరగకూడదూ?’’ అనుకుంటాడు ….
ఇటువంటి ఆశాజనకమైన కథలు మరిన్ని రావలసిన అవసరముంది.
ముస్లిం హక్కుల్ని ఎలుగెత్తడం ద్వారా సొంత అస్థిత్వాలను ప్రకటించుకోవడమే కాకుండా ముస్లింలపైన జరుగుతోన్న దాడులను, వివక్షను అణగదొక్కే ప్రయత్నాలనూ తీవ్రంగా పరిగణించి ప్రతిఘటించడం ముస్లిం స్త్రీల జీవితాలలోని సమస్యలని చర్చించి వారిని చైతన్యపరచడం …. ముస్లిం జీవితాల పట్ల ముస్లిమేతరులను చైతన్యపరచడం వంటి ఆశయాలతో ముందుకు సాగుతోంది ముస్లిం వాదం G ముస్లిం కథా సాహిత్యం
ఇది నిజంగా అభినందనీయం ….
కీలక పదాలు : కబురు, 9వ ఆటా మహాసభల వ్యాసాల పోటీ