3
వెనకబడిన కులాలను, వర్గాలను అభివృద్ధిలోకి తెస్తామంటూ చిరకాలంగా కల్పించబడిన భ్రమలు కేవలం భ్రమలుగానే తేలిపోయాయి తొంభయిల నాటికే ….
చుండూరు, కారంచేడు, పదిరికుప్పం సంఘటనలు తరతారాలుగా దళితుల్లో పేరుకుపోయిన అసంతృప్తిని ఆగ్రహంగా మార్చి ఒక కొత్త చైతన్యాన్ని, కొత్త దృక్పధాన్నీ పెంపొందించుకునేట్టు చేశాయి.
ఈ సామాజిక వివక్షకు అసలైన మూలం ఎక్కడుందో తెలుసుకోవాలనే వెదుకులాట దళితుల్లో ఎక్కువయింది. స్వేచ్ఛాయుత జీవనం …. ఆర్థిక, రాజకీయ రంగాలలో బలపడాలన్న ఆలోచన ప్రారంభమైంది ….
ఆ క్రమంలో దళితుల్లో పెరిగిన జ్ఞానచైతన్యాలు ఉద్యమ రూపాన్ని తీసుకోవడంలో వెనుకంజవేయలేదు …. మనందరికీ తెలుసు లక్ష్మీనరసయ్య, సి.వి., కత్తి పద్మారావు, మద్దూరి నగేష్‌బాబు, బి.ఎస్.రాములు వంటి వారెందరో దళిత ఉద్యమం కోసం కష్టపడి పనిచేశారు….
ఈ చైతన్యమంతా దళిత జీవిత నేపథ్యంలోని సామాజికార్థిక కోణాలతో సాహిత్యంలో ప్రతి ఫలిస్తూ వచ్చాయి …. దళిత కవులూ, రచయితలూ తమ జీవితాలలోని కథలూ, గాథలూ తామే అక్షరీకరించుకోవడం మొదలుపెట్టారు ….
మొదట కవిత్వ రూపంలో ఎక్కువగా బయటికొచ్చినప్పటికీ క్రమక్రమంగా కథాసాహిత్యంలో కూడా దళితవాదం ప్రతిఫలించసాగింది.
నాగప్పగారి సుందరాజు, మద్దూరి నగేష్‌బాబు, పైడి తెరేష్ బాబు నితీష్ చందర్, ఎండ్లూరి సుధాకర్, బి.ఎస్.రాములు, ఎస్.జయ వంటి వారెందరో దళిత జనజీవితాలను వివిధ కోణాల నుంచి కథలుగా మలిచారు.
అయితే ఈ కథలు శ్రీపాద కథల్లానో, కరుణకుమార, పులికంటి వంటి వారి కథల్లోలా కేవలం మానవతా దృక్పధంతో కాక ఒక ధిక్కార స్వరంతో, ప్రతిఘటనా రూపంతో వెలువడడం మొదలయింది …. కుల పరమైన అసహనాన్ని ఆర్థిక రాజకీయ నియంతృత్వాన్ని ఈ రచయితలు ప్రతిఘటించారు …. పీడన నుంచి విముక్తి …. సమానత్వం దిశగా ఈ కథాసాహిత్యం ముందుకు సాగింది ….
‘ఊరబావి’ …. దళిత కథాసాహిత్యంలో మైలురాయి వంటి కథ రాసిన కలకలూరి ఇనాక్ ఆకలి, దొంగగొడ్డు, ఎర్నీళ్ళ వంటి మరెన్నో కథలు రాసి దళితవాదం ముందుకు సాగడానికి తనవంతు శక్తిని సరఫరా చేశారు.
మునుపు ఎప్పుడయినా రాత్రి ఆకలయితే, తెల్లవారితే తీరుతుందన్న ఆశ ఉండడంతో …. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూడ్డం చిన్నికి ఆనందమే. మొన్న తెల్లవారింది ఆకలి తీరలేదు …. నిన్న తెల్లవారింది ఆకలి ఆకలిగానే ఉంది. ఇవాళ తెల్లవారింది ఆకలి ఎక్కువయింది …, ఇంకొక ఉదయం వస్తుందంటే చిన్నికి సంతోషం కంటే దు:ఖమే కలుగుతుంది …. ఆకలికి ఎడతెగని విజయం చిన్ని భరించలేదు …. అంటాడు కథకుడు ….
ఈ కథ చదివిన చాలా రోజులదాకా పాఠకుడికి ఆకలి వేయదు …. నిద్రపట్టదు …. ఆకలికోసం …. వాళ్ళిచ్చే నాలుగు డబ్బుల కోసం లారీకింద పడి దెబ్బ తగిలించుకోవాలనుకున్న చిన్ని ప్రాణాలే అర్పిస్తుంది …. చిన్ని జీవితకాలం మన ఆలోచనలలో నిల్చిపోయే పాత్ర ….
దళిత స్త్రీలను బసివినులుగా మార్చే సాంప్రదాయం వెనుక ఎంత కుట్ర, హింస దాగి ఉందో …. దాని మూలంగా భూస్వాములు లబ్ధిపొందడం అగ్రవర్ణ అధికార రాజకీయాల పట్ల ఆగ్రహం ధ్వనించే కథలు నాగప్పగారి సుందరాజు రాస్తాడు ….
తమ శరీరాలకున్న ఈ నలుపువల్ల జీవిత పర్యంతం ఎన్నెన్ని అవమానాలను సహించాల్సి వచ్చిందో దృష్టాంతంగా చెప్తూ చివరికి చదువుకోడానికంటూ హాస్టలల్లో చేరితే దళిత స్త్రీలుగా …. కేవలం స్త్రీ అయినందువల్ల కాదు దళిత స్త్రీ అయినందువల్ల ఎంతటి తేలికభావం …. అత్యాచారం …. హృదయాలను ద్రవీభూతం చేస్తుంది ‘నలుపు’ డా॥ వి.చంద్రశేఖరావు రాసిన కథ ….
స్వామి రాసిన ‘ప్రశాంతం’, ‘ఒక హెచ్.సరస్వతి కథ’ వంటివి దళిత స్త్రీల జీవితాల్లోని వివక్షనూ, హింసనూ ప్రతిఘటనా తీరునూ కూడా విశ్లేషించిన కథలు …. చదువుకుని ఉద్యోగాలు చేస్తోన్న స్త్రీల విషయంలో కూడా ఈ తేలికభావం …. వివక్ష ఎంతగా ఉంటాయో ‘హెచ్.సరస్వతి కథ’ చదువుతుంటే మనకి అర్థమవుతుంది….
కందూరి సుధాకర్ రాసిన ‘మల్లెమొగ్గల గొడుగు’ ఒక అస్త్రంలా దూసుకొచ్చిన దళిత కథా సంపుటి …. కేవలం అగ్రకులాల అసహనాన్ని, పీడననీ మాత్రమే కాకుండా దళితుల్లో అంతర్లీనంగా ఉండే వైరుధ్యాలను కూడా చర్చిస్తాడు సుధాకర్ ….
దళిత స్త్రీ సమస్యల కథలు, దళిత రాజకీయార్థిక పరిణామ కథలు వంటి ఆరేడు సంకలనాలను కె.లక్ష్మీనారాయణ, కలకలూరి ఇనాక్ ఆధ్వర్యంలో తీసుకొచ్చారు …. ఈ సంకలనాలు దళిత జీవిత పరిణామాలనూ, సమస్యలనూ, చీకటి కోణాలనూ అర్థం చేసుకోవడానికి ఒక వాహికగా పని చేస్తాయి ….
ఇకపోతే దళిత స్త్రీ రచయితల విషయానికొస్తే చల్లపల్లి స్వరూపరాణి, జె.సుభద్ర, జి.విజయలక్ష్మి, గోగుశ్యాము, జాజులగౌరి, వినోదిని, శశినిర్మల, కె.దుర్గాదేవి …. గుజ్జర్లమూడి నిర్మలారాణి వంటి వారు మంచి కథాసాహిత్యాన్ని వెలువరిస్తున్నారు ….
సాహితీ రంగంలోని దళిత స్త్రీల సృజనాత్మకత మీద ‘నల్లపొద్దు’ అన్న సంకలనం ఈ శతాబ్దిలో(2002) వెలువడింది ….
పితృస్వామ్యంలోని లైంగిక రాజకీయాలు దళిత స్త్రీలను ఎంతగా అణిచివేస్తున్నాయో, కుల వర్గ రాజకీయాలు కూడా అంతే ప్రభావితం చేస్తున్నాయని హిందూ ఆధిపత్య కులాల పురుషులు దళితులను రాజకీయంగా అణిచివేసేందుకు దళిత స్త్రీలపై లైంగిక అత్యాచారాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించే విధానాన్ని గోగు శ్యామల నిరసిస్తారు …. వారు స్త్రీలైనందుకు కాదు కేవలం దళిత స్త్రీలయినందు వల్ల మాత్రమే వారిమీద ఈ అత్యాచారకాండ అంటారీమె. దళిత స్త్రీలలో ఇప్పుడిప్పుడే తిరుగుబాటు ధోరణి పదునెక్కుతోంది …. ఇది చాలా అవసరమైనదని భావించారామె ఒకచోట ….
అనంతపురం ప్రాంతం నుంచి కసాయి కరువును చిత్రిస్తూ ‘కాటేసిన కరువు’ అన్న కథ రాసిన గుజ్జర్లమూడి నిర్మలారాణి …. దళిత స్త్రీ సమస్యల మీద స్త్రీవాద దృక్పథంతో కథలు రాస్తున్నారు ….
అలాగే దళిత జీవన విధానాలనీ, బాధలనీ, గాథలనీ చిత్రిస్తూ జాజుల గౌరి ‘మన్నుబువ్వ’ కథా సంపుటి ఈ దశాబ్దంలో వెలుగు చూసింది ….
జె.సుభద్ర దళిత స్త్రీ మీద కులం, వర్గం, పురుషాధిపత్యాలతో పాటు ప్రాంతీయత కూడా పని చేస్తుందని అంటుంది…. సింగరేణి బాయి పనికి స్త్రీలను అడ్డుకోవడాన్ని గురించి ఆమె నిరసిస్తుంది …. అక్కడ మైసమ్మ ఉంటుంది కాబట్టి స్త్రీలకి ముట్టు ఉండడం మూలంగా పనికి వెళ్ళకూడదట …. పనిలో స్త్రీల భాగస్వామ్యానికి ప్రాధాన్యత, గుర్తింపు లేకపోవడాన్ని ప్రశ్నిస్తుంది సుభద్ర ….
మిగిలిన అన్ని రంగాలతో పాటుగా క్రీడారంగంలో కూడా దళితుల్ని అణిచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి …. మన దేశంలోని దళితుల, బహుజనుల క్రీడాస్ఫూర్తిని వినియోగించుకోకపోవడం వల్లనే మనకి బంగారు పతకాలు లభించడం లేదన్న అంశంతో చిలుకూరి దీవెన ‘ఆటకట్టు’ అన్న కథ రాసింది …. క్రీడారంగానికి సంబంధించిన వివక్షను ఈ కథ చర్చకు పెడుతుంది.
పుట్ల హేమలత అటు కవిత్వం రాస్తూనే ఇటు కథా సాహిత్యాన్ని కూడా పండిస్తున్నారు….కొలకలూరి స్వరూపరాణి పద్యాలు, కవితలు …. వ్యాసాలు వంటివి రాస్తూ దళిత వాదానికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు ….
ఈ విధంగా దళితులే కాకుండా దళితేతరులు కూడా దళిత జీవితాల్లోని విభిన్న కోణాలను కథలుగా మలిచిన వారిలో ముఖ్యంగా పులికంటి కృష్ణారెడ్డి, సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి, సింగమనేని నారాయణ, దాదాహయాత్, ఓల్గా, సుంకోజి దేవేంద్రాచారి వంటి వారున్నారు …. దగ్గుమాటి పద్మాకర్ రాసిన ‘పరిధులూ – ప్రమేయాలూ’ దళిత స్త్రీ చైతన్యాన్ని లోతుగా చెప్పిన కథ …. స్త్రీవాద దృష్టికోణం నుంచి దళితవాద సిద్ధాంతాలనూ, సూత్రాలనూ విమర్శకు పెట్టే పని చేసిందీ కథ ….