ప్రస్తుత తెలుగు కథ – ఒక జీవన కఠోర వాస్తవం

2

స్త్రీ, పురుషులిరువురూ సమాజంలో భాగమైనప్పుడు ఈ అధీన, అధీకృత సంబంధాలెందుకు, కౌటుంబిక, సామాజిక అధికార రాజకీయాలెందుకు? అన్న చిన్న ప్రశ్నతో ప్రారంభమై పితృస్వామ్య అధికారిక చట్రాన్నీ, నమూనా కుటుంబంలోని డొల్లతనాన్ని చర్చకు పెట్టింది స్త్రీవాద కథ ….

గత శతాబ్దపు ఎనిమిదో దశకం నాటికి స్త్రీ సమస్య స్వరూపాన్ని అర్థం చేసుకునే విప్లవాత్మక సిద్ధాంతం స్త్రీలకు అందివచ్చింది. అదే స్త్రీవాదం అయితే ఈ వాదం ఒక ఉద్యమంగా సాహిత్యంలో బలపడింది మాత్రం తొంభయిల నాటికి అని చెప్పుకోవచ్చు ….

స్త్రీ తనను తాను మానవిగా ఆవిష్కరించుకునే క్రమంలో …. తనని మనిషిగా గుర్తించని వ్యవస్థ మీద ఒక అస్త్రంలా కవిత్వ రూపంలో దూసుకొచ్చినప్పటికీ క్రమంగా తన సమస్యలను చర్చించటానికి ఒక విస్తృతమయిన ప్రాతిపదికగా స్త్రీ వాదులు కథా సాహిత్యాన్ని ఎంచుకున్నారు ….

పురుష సమాజ ప్రయోజనాల కనుగుణంగా తమ కివ్వబడిన నమూనా, మూసపాత్రలు స్వీయాభివృద్ధికి ఎంత అవరోధంగా ఉన్నాయో తెలుసుకుని ఆ జ్ఞానంతో కథా సాహిత్యం వెలువరించడం మొదలుపెట్టిన స్త్రీ రచయితలు పురుషుడి దృష్టికోణానికి అందని ఎన్నో సూక్ష్మ విషయాలను కూడా తమ కథల్లో చర్చకు పెట్టారు …. మనం వ్యక్తిగత విషయాలుగా భావిస్తోన్న వాటి మూలాలు అధికార, ఆధిపత్య రాజకీయాలతో ముడిపడి ఉన్నాయని గుర్తించి కథలు రాయడం మొదలు పెట్టారు ….

పితృస్వామ్య కుటుంబ సంబంధాలలో స్త్రీల శరీరాల మీద, వారి కదలికల మీద ఎంత అదుపు ఉంటుందో స్త్రీలు తమకే తెలీని క్రమంలో ఎలా తమ శరీరాలలో తామే బందీలయి పోతున్నారో …. స్త్రీల శరీరాలలోని ప్రతీ అవయవం మీద జుట్టు, కళ్ళు, నోరు, గర్భసంచి ఇలా …. అన్నింటి మీదా ఎంత పోలీసింగ్‌ ఉంటుందో లోతుగా చర్చించిన కథలు ఓల్గా ‘‘రాజకీయ కథలు.’’

తన జుట్టులో తానే బందీ అయిపోయి బయటికి రాలేక ఊపిరాడని విధంగా జీవితకాలం గడిపేయడం …. కనురెప్పల కింద తానే కదలిక లేకుండా నిశ్చలమై పోయిన కనుగుడ్డవడాన్ని …. అంటే కదిలి లోకంవైపు చూసే శక్తిని హరించి వేయడాన్ని …. ఇంకా నోరు తెరిచి స్వతంత్రంగా మాట్లాడ లేనివిధంగా ఆమె నోరు మీద …. ఇలా సమస్త అవయవాల మీద ఎంత నియంత్రణ ఉంటుందో మనకు సూక్ష్మంగా అర్థం చేయిస్తాయి ఈ కథలు ….

‘స్త్రీలు స్త్రీలుగా పుట్టరు తయారుచేయబడతారు’ అంటుంది సిమోనే డి బోవర్‌ …. అంటే పుట్టినప్పటి నుంచీ ఈ కుటుంబ, సమాజ సంబంధాలు స్త్రీల శరీరాన్నీ, స్త్రీల ప్రవర్తననూ ఎలా అధికారికంగా కట్టడి చేస్తూ వస్తాయో …. ఇంకా ఇవ్వాళ అమలులో ఉన్న నమూనా కుటుంబం అసలు స్వభావమేమిటో కూడా ‘రాజకీయ కథలు’ విప్పి చెప్పాయి ….

ఒక వేళ కుటుంబం లోపల తల్లిదండ్రులుగా మనం కూతుళ్ళ మీద ఆంక్షలను సడలించినప్పటికీ బయటి ప్రపంచంలో అమ్మాయి కట్టు బొట్టు తీరును నిర్దేశించే పని టీచర్లే చేస్తారు …. ఈ విషయాన్ని ప్రతిబింబిస్తూ ఎస్‌.జయ ‘‘మా అమ్మాయి’’ అన్న కథ రాస్తారు …. అమ్మాయి నడతను, నవ్వును, ఆహార్యాన్నీ నిర్దేశించి చివరికి ఆ పిల్లను ఒక నమూనా మూసపాత్రలోకి ఒదిగించేస్తేనే తప్ప సమాజానికి మనశ్శాంతి దొరకదు …. కొండొకచో అమ్మాయి స్నేహం మీద కూడా ఎంతటి నియంత్రణ ఉంటుందో కుప్పిలి పద్మ ‘తలుపులు’ అన్న కథలో చెప్పారు ….

పాఠం ఒప్పజెప్పకపోతే పెళ్ళి చేస్తానని

పంతులు గారన్నప్పుడే భయమేసింది …. అంటుంది సావిత్రి ….

పెళ్ళి అనేది ఇరువురు స్త్రీ పురుషుల నడుమ స్నేహం, ప్రేమ, గౌరవం పరస్పరావగాహన వంటి సంబంధాల మీదగాక పురుషుడి అధీకృత, స్త్రీ యొక్క అధీన సంబంధ పునాదుల మీద నిలబడ్డం ఒక అంగీకృత విధానమైపోయిన నేపథ్యంలో స్త్రీ జీవితకాలం పురుషుడి అధికారంలోకి వెళ్ళిపోతుంది పెళ్ళి పేరుతో ….

ఆ చట్రంలో ఒదిగిపోయి అదే జీవితంగా భావించి ఆనందంగా ఎందరో స్త్రీలు బతికీడుస్తూంటే …. మరికొందరు ఆ చట్రంలో ఊపిరాడక బయటికి రాలేక కొట్టుకు లాడుతూ ఒక మహా మౌనంలోకి, ఏకాంత వాసంలోకి వెళ్ళిపోతారు …. ఎవరయినా తమ సహజశక్తులన్నీ హరించిపోతున్నాయన్న విషయాన్ని గుర్తెరిగి ఒక చైతన్యంతో బయటికి రావాలనుకుంటే వారిని పొడిచి పొడిచి మళ్ళీ ఆ చట్రంలోపలికి నెడుతుంది సమాజం ….

ఈ మొత్తం విభిన్న కోణాలనీ చర్చకు పెడుతూ పి.సత్యవతి అనేక కథలు రాశారు …. తనలోని సృజనాత్మకతనంతా మరుగుపరుచుకుని భర్త ఆశించిన స్థాయిలో వివాహ చట్రంలోకి ఒదిగిపోయి తనను తాను కోల్పోతూ …. పరాయాకరించబడి బ్రతికేస్తోన్న స్త్రీల మీద మౌఖిక శైలిలో పి.సత్యవతి సంధించిన వ్యంగ్యాస్త్రం ‘‘ఇల్లలక గానే ….’’

ఇల్లలుకుతూ పేరు మర్చిపోయిన ఈగల కంటే ఇంటి చాకిరీలో మునిగిపోయి తమను తాము మరిచిపోయిన స్త్రీలు ఏమంత గొప్పవాళ్ళు కాదు …. ఆ అస్థిత్వ వేదనతో పేరు తెలుసుకోడం కోసం విముక్తి మార్గంలో ప్రయాణం ప్రారంభించిన తొలి స్త్రీవాద కథగా మనం దీనిని చెప్పుకోవచ్చు ….

పెళ్ళి చూపుల వద్ద నుంచి ప్రారంభమై ఈ పెళ్ళి, దాంపత్యం, సంసారం అంతా కూడా ఒక హింసాపూరిత తతంగంగా ఎలా సాగుతుందో చెపుతూ కొండేపూడి నిర్మల ‘ఉష్ట్రపక్షి’ …. ‘శత్రుస్పర్శ’ వంటి కథలు రాశారు ….

భార్య ఇష్టాయిష్టాలతో, బాధతో ఎటువంటి సంబంధం లేనట్టుగా వారి నుంచి లైంగికానుభవాన్ని కోరే పురుషుల పట్ల అసహ్యాన్నీ, అసహనాన్నీ వ్యక్తంచేస్తూ ఆమె ‘ఎద్దుపుండు’ అన్న కథ రాస్తారు …. ఈ వివాహ వ్యవస్థ ‘ఎద్దు పుండు’ వంటిదనీ …. కాకుల అనుభవం కోసం తానెందుకు ఆ వ్యవస్థనీ అంగీకరిచాలనీ ఒక అవివాహిత స్త్రీ ధిక్కార స్వరంతో ప్రశ్నిస్తుందీ కథలో ….

కుటుంబాల్లో స్త్రీలు చేస్తూన్న వెట్టిచాకిరీ అంతా ఎలా ఎందుకూ కొరగాకుండా నిష్పలమైపోతోందో …. తండ్రులు మాత్రమే తెలివయిన వాళ్ళుగా …. తమ అవసరాలూ, కష్టసుఖాలూ తీర్చగల వాళ్ళుగా పిల్లల చేత భ్రమింపచేస్తూ, నమ్మిస్తూ …. తల్లులు కేవలం వంటింట్లో మసిగుడ్డలుగా మాత్రమే మిగిలిపోయేటువంటి సమాజ వాస్తవాన్ని తెలుపుతూ కుప్పిలి పద్మ ‘మసిగుడ్డ’ అన్న కథ రాస్తే ….

ఈ చాకిరీ చేసే క్రమంలో …. భర్తల ఇష్టాల కనుగుణంగా తమ చైతన్యాన్ని మార్చుకుని …. తమ తెలివితేటలనూ, సృజనాత్మక శక్తుల నన్నింటినీ కుదించి వేసుకుని …. భర్తకు చూపు లేకపోవడం వల్ల తాను కూడా కళ్ళకు గంతలు కట్టుకున్న గాంధారిలా …. ప్రతీ కుటుంబంలోనూ గాంధారి రాగాలు పాడుతోన్న స్త్రీల దుస్థితి గురించి ‘గాంధారి రాగం’ కథలో విశ్లేషిస్తారు పి.సత్యవతి ….

పెంపుడు కుక్కలకయినా సరే ఒక్కొక్కసారి యజమాని చర్యలని భరించలేక తిరగబడతాయి …. ఉగ్గు పాలతో రంగరించి అలవాటు చేయబడిన ఈ సహన సంస్కృతి మూలంగా కుటుంబంలోని లోలోపలి హింసని చివరిదాకా భరిచుకుంటూ పోతారు స్త్రీలు …. భరించడం సాధ్యంకాని క్రమంలో కనీసం కుక్కకున్న చైతన్యమయినా స్త్రీలకు అవసరమన్న స్పృహని మృణాళిని ‘కుక్కబతుకు’ అన్న కథలో స్పష్టం చేస్తారు ….

ఇంతింత దోపిడీకి గురయ్యి కూడా స్త్రీలకు తమకంటూ ఖర్చుపెట్టుకోవడానికి, తమ అవసరాలను గురించి ఆలోచించడానికీ అవకాశం లేకపోవడం …. అన్న విషయాలని చర్చిస్తూ …. ఈనాటి పితృస్వామిక కుటుంబపు ఆర్థిక నిర్మాణంపై నిశ్శబ్దపు తిరుగుబాటు పాటిబండ్ల రజని రాసిన ‘జేబు’ …. స్త్రీల ఇంటి చాకిరీకి విలువ లేక పోవడాన్ని ప్రశ్నిస్తూ ఎస్‌.జయ ‘ఖరీదు’ అన్న కథ రాస్తారు ….

అలాగే పుట్టినప్పట్నుంచీ వివక్షకు, దోపిడీకి, హింసకు గురవుతూ వచ్చిన తాయమ్మ సహనం …. చివరికి ఎలా పోరాటమై పొంగి వెలుపలి మార్గం చూసుకుంటుందో ‘తాయమ్మ కథ’ (కరుణ రాసింది) చెప్తుంది ….

గృహిణులుగా భర్త సంపాదన మీద ఆధారపడి జీవిస్తోన్న స్త్రీల పరిస్థితి మాత్రమే ఇలా ఉందా? …. ఉద్యోగాలు చేసుకుంటూ తమ కాళ్ళమీద తాము నిలబడి ఆర్థిక స్వేచ్ఛను సంపాదించగలిగిన స్త్రీల సాంసారిక జీవనాలు ఇందుకు భిన్నంగా ఏమయినా ఉన్నాయా అనుకుంటే …. ఉద్యోగాలు చేస్తున్నంత మాత్రాన ఇంటి పని నుంచి ఆమెకి విముక్తి ఏమీలేదు …. ఇంటా, బయటా రెండు రకాల ఒత్తిడుల మధ్య నలిగిపోయేదిగా మాత్రమే అవుతోంది ఉద్యోగిని స్థితి ….

ఇలా రెండు రకాల బాధ్యతలనూ నిరంతరాయంగా నిర్వహిస్తూ తమ పిల్లలను అందరిలోనూ నెంబరువన్లుగా తీర్చిదిద్దాలనే ఆతృతలో పడి గొప్ప తల్లులమనిపించుకోవాలనే కోరికతో తమ ఆరోగ్యాలను నిర్లక్ష్యం చేస్తూ …. ఎప్పటికప్పుడు ఎటువంటి వైద్య సలహాలూ లేకుండా మింగుతూ వస్తోన్న మరణాలు …. అంటే స్త్రీలు తాము పరాయాకరింపబడడమే కాకుండా కుటుంబం కోసం చివరికి శరీరాలను కూడా సమర్పిస్తోన్న వైనం …. ఆ క్రమంలో స్త్రీల సహజ శక్తులన్నింటికీ ఎలా పాచిపట్టి పోతుందో …. చాలా తీవ్ర స్థాయిలో హెచ్చరించిన కథ పి.సత్యవతి రాసిన ‘సూపర్‌ మాప్‌ు సిండ్రోప్‌ు’

అలాగే భార్యలు ఉద్యోగం చేసే క్రమంలో తమకంటూ ఒకకొత్త ప్రపంచం ఏర్పడితే …. ఎక్కడ తమ స్థానం తగ్గిపోతుందోనని కించపడి పెళ్ళికి స్త్రీలను ఉద్యోగం మాన్పించడమనే షరతు విధించే ఒక దశ కూడా మనకి ఉన్నది …. ఆ విషయాన్ని చెప్తూ కుప్పిలి పద్మ ‘మంచుదీపం’ అన్న కథ రాశారు.

మారుతున్న సామాజిక, ఆర్థిక అవసరాల మూలంగా భార్యలను ఉద్యోగాలు చేయనిచ్చినప్పటికీ …. ఆ ఆర్థిక స్వావలంబన వారికి జీవితంలో, ఉద్యోగాల్లోనయినా స్వీయనిర్ణయాలు తీసుకోగలిగే అధికారాన్ని ఈ సమాజం ఇవ్వలేదు …. అంటే కుటుంబంలోనే కాకుండా భర్తల అధికారం కొండొకచో ఉద్యోగాలు చేసే చోట్లకు …. వాళ్ళ విధి నిర్వహణల మీదికి, నిర్ణయాల మీదికి కూడా ఎలా విస్తరిస్తుందో ఓల్గా ‘వెలుతురులోకి’ అన్న కథలో తనను తాను అసహ్యించుకుంటూ ఆ ఉద్యోగిని ఎంత సంఘర్షణకు గురవుతుందో తెలుపుతుంది …. అంటే సంపాదించే క్రమంలో కూడా భర్తల అధికారం స్త్రీల మీద మామూలుగానే చలాయించబడుతుంది ….

స్త్రీల శరీరావయవాల మీద ఆంక్షలకు గర్భ సంచులు కూడా మినహాయింపు కాదు …. తమకు సంతానం అవసరమా కాదా అన్నది తన అభీష్టం మేరకు మాత్రమే ఉండాలిగానీ దాని మీదకూడా పురుషుడి అధికారం ఉండడం …. దాని మూలంగా స్త్రీలు పడుతోన్న హింస ఓల్గా రాసిన ‘భిన్న సందర్భాలు’ అన్న కథ ద్వారానూ …. గీతాంజలి రాసిన ‘బచ్చేదాని’ ద్వారానూ స్పష్టమవుతాయి ….

‘‘నిత్యం గర్భాలు మోస్తూ తన కోరిక తీరుస్తలేదని వేరే పెండ్లిచేస్కునుడు …. నాలుగు పెండ్లిండ్లు చేస్కునే వీలు చట్టంలో ఉండడం మూలంగా మొగుడు ఎక్కడ తలాక్‌ అనేసో …. అనకో రెండో పెళ్ళి చేసుకుంటాడేమోనని భయం ….తో ఐదుమంది పిల్లల్నికని ఇంకకరిని కడుపులో మోస్తూ పాడైన బచ్చేదానితోనే కాలం వెళ్ళదీస్తుంది సాదైకా .. తాను బతికుండగానే ఇద్దరాడపిల్లల్నీ, ఒక మగ పిల్లాడినీ ఒదిలిపెట్టి భర్త ఇంకో పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు …. అది తెలిసి తలాకయివ్వడానికి సిద్ధపడడమే కాకుండా బచ్చేదానిని సాఫ్‌ చేయించుకుంటుంది నసీం ….

స్త్రీలను అవమానించడానికి పురుషుడు ఉపయోగించే ఒక అసహ్యకరమైన ఆయుధం అత్యాచారం …. ఈ దుస్థితికి యువతులే కాదు బాలికలు సైతం ఎదుర్కొంటున్న తీరును విశదీకరిస్తూ తన శరీరంలోని ఏ అవయవం ఈ దుస్థితికి కారణమైందో ఆ అవయవం లేకుండా ఉండే స్థితిని కోరుకుంటుందా చిన్నారి బాధగా …. ‘అయోని’ ఓల్గా కథ ….

స్త్రీలను అధీన సంబంధాలలోకి నెడుతోన్న ఇప్పటి నమూనా కుటుంబాల పునర్నిర్మాణం జరగాలంటే ముందు వాటిని సమూలంగా కూలగొట్టవలసి ఉంది …. పెళ్ళి సంస్కృతి పురుషుడికి సర్వాధికారాలనూ కట్టబెడుతోంది కనక పురుషుడికి ఆ అవకాశం, అధికారం ఇవ్వకుండా అమానవీయబంధాల నుంచి మానవీయ సంబంధాలలోకి ప్రయాణించే ఒక ‘ప్రయోగం’ ఓల్గా స్త్రీ …. అనే నేపథ్యంలో ఇంకొంచెం మార్పుతో ఈ వివాహ చట్రంలోకి ఇమడకుండా ఒంటరిగా బతకగలిగే ఒక నిర్ణయాన్ని కుప్పిలి పద్మ ‘ముక్త’ కథల్లో చెప్తారు ….

కేవలం శారీరక, కౌటుంబిక స్త్రీ పురుష సంబంధాలను, వాటిలోని డొల్లతనాన్ని ప్రశ్నించడం …. చర్చకు పెట్టడం దగ్గర్నుండి తాము ఎంత కాలమయినా ఇలా ఇంటి పనులలోనే మునిగి ఉన్నట్టయితే స్వేచ్ఛను సాధించడం అసంభవం అన్న విషయాన్ని గుర్తెరిగి …. తాము కూడా సమాజంలో భాగమని నమ్మి సమాజ సంబంధిత అనేకానేక పరిణామాలను కూడా వస్తువులుగా తీసుకుని కథా సాహిత్యాన్ని వెలువరించడం ప్రారంభించారు స్త్రీ రచయితలు ….

సామ్రాజ్యవాద విధానాలు మన జీవితాలను ఎటువంటి ప్రకంపనాలకు గురిచేస్తున్నాయో …. అవి మన కుటుంబ, దాంపత్య జీవితాలను కూడా ఎలా ప్రభావితం చేస్తున్నాయో విమర్శకు పెడుతూ కుప్పిలి పద్మ ‘ప్రకంపనం’, ‘కుబుసం’ …. ‘ఇన్‌స్టెంట్‌ లైఫ్‌’ వంటి కథలు రాశారు ….

అలాగే మారుతోన్న సామాజిక పరిణామాల ప్రభావం భార్యాభర్తల నడుమ ఎటువంటి ఇనుప గోడలను దించుతుందో చాలా లోతుగా చర్చకు పెడుతూ రంగనాయకమ్మ ‘మురళీ వాళ్ళమ్మ’ అన్న కథను రాశారు ….

ఇందులో ప్రధాన పాత్ర అమ్మే …. రుక్మిణి …. తాను ఏ అన్యాయాన్ని అయితే ఎదిరించి కొడుకుని తీసుకుని బయటికొచ్చేసిందో అదే దుర్మార్గం తన కొడుకు చేయడాన్ని ఆమె ఎంతమాత్రమూ సహించదు …. కార్పొరేట్‌ కంపెనీలలో ఉద్యోగాలు స్త్రీ, పురుష సంబంధాలలోని విలువలను ఎంత పలచన చేసేస్తున్నాయో ఆ క్రమంలో భార్యభర్తల నడుమ తెలీకుండానే దిగిపోతూన్న ఇనుపతెరలు వాటిని కోడలికి స్పష్టం చేయిస్తుంది రుక్మిణి …. భర్త తప్పుని సహించలేని దాన్ని కొడుకు చేస్తూంటే మాత్రం ఎలా సహిస్తానంటూ మురళిని నిలదీస్తుంది …. కోడలికి నిర్ణయాన్ని తీసుకోవలసిన అవసరాన్ని సూచిస్తుంది ….

టెక్నాలజీ ప్రదేశాల మధ్య దూరాలని తగ్గించి ఒకే చోట నున్న ఆప్తుల మధ్య దూరాలను పెంచుతోన్న తీరును చంద్రలత ‘కలిగ్స్‌’ అన్న కథలో చాలా సున్నితంగా హృదయాలకు హత్తుకునేలా చేప్తారు …. భార్యా భర్తలిరువురూ ఒకే చదువు చదివి ఒకే వృత్తిలో ఉన్నా వృత్తికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో పురుషుడికి మాత్రమే ఉన్న అవకాశాన్ని విప్పిచెప్తుందీ కథ ….

స్త్రీవాద కథ బలపడక ముందు నుంచీ కూడా స్త్రీ చైతన్య కథలు రాస్తూ వచ్చిన అబ్బూరి ఛాయాదేవి ‘తన మార్గం’ వంటి కథలే కాకుండా కార్పొరేటీకరణ చెందిపోతూన్న వైద్యం మీద ఆఖరికి అయిదు నక్షత్రాలు అన్న కథ రాశారు …. సామ్రాజ్యవాద సంస్కృతి వైద్యం మీద కూడా చూపించిన ప్రభావాన్ని చర్చకు పెడుతుందీ కథ …. ఈమె ‘తన మార్గం’ కథా సంపుటికి వచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం స్త్రీవాద కథకి అందిన పురస్కారంగా స్త్రీ వాదులంతా భావించారు.

మహిళా సాధికారత సాధికారత అని మనం చెప్పుకోవడమే గాని మహిళలకు ఆ సాధికారత లభించినట్టుగా మనకేమీ కనిపించడం లేదు …. రిజర్వేషన్‌ నియమాల మూలంగా మహిళలు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయినప్పటికీ ఈ మొత్తం ప్రహసనమ్‌ వెనుక నుండి అధికారం చెలాయించేది మాత్రం పురుషుడే ….

ఈ నేపథ్యంలో ఒకానొక ఊరి సర్పంచిగా ఎన్నికయిన మహిళ తన భర్త నిర్ణయాలను అమలుపరిచే ఆటబొమ్మలా కాకుండా తనకు తాను నిర్ణయాలు తీసుకోగల సబలగా ఎదగడం అన్న వస్తువుతో కొండవీటి సత్యవతి ‘ముందడుగు’ అన్న కథ రాశారు …. ఇదే నేపథ్యంతో ముదిగంటి సుజాతారెడ్డి ‘కబ్జా’, ‘ధర్మపత్ని’ అన్న రెండు కథలు రాశారు …. ఆ రెండు కథల్లోనూ పంచాయితీ సర్పంచులుగా ఎన్నికయిన మహిళలు ఆఫీసుకు వెళ్ళడాన్ని చిత్రిస్తారామె.

స్త్రీలలో చైతన్యం రానంతవరకూ ఇటువంటి రిజర్వేషన్లు దండుగ అని సూచిస్తుంది ధర్మపత్ని కథ ….

స్త్రీలంతా ఒక్కటిగా కలిసి ఉండడం …. అన్న విషయాన్ని ప్రధానంగా తీసుకుని ముందుకు సాగుతోంది స్త్రీ వాదం …. అంటే కుటుంబ సంబంధాలనూ, సమాజ సంబంధాలనూ ఉన్నతీకరించుకునే ఒక స్వభావాన్ని జీవలక్షణంగా తీసుకుని కథా సాహిత్యాన్ని పండిస్తున్నారివాళ స్త్రీ రచయితలు ….

ఎప్పటికప్పుడు స్త్రీవాద సాహిత్యానికి కథ, కవిత, నవలవంటి వాటన్నింటినీ విమర్శకు పెట్టి, ఉత్సాహాన్నీ, ప్రోత్సాహాన్నీ అందిస్తూ ముందుకు తీసుకెళ్తోన్న ప్రముఖ సాహితీ విమర్శకురాలు, ఉపన్యాసకురాలు అయిన కాత్యాయనీ విద్మహేని గురించి చెప్పుకోనట్టయితే స్త్రీవాద సాహిత్యం పూర్తి కానట్టే ….

అలాగే స్త్రీ పురుష అసమానతల పట్ల ద్వేషమూ, ఉన్నత మానవీయ విలువల ఆకాంక్షా ఉన్నటువంటి పురుష రచయితల గురించి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవలసి ఉంది ….

కేతువిశ్వనాథరెడ్డి రాసిన ‘‘రెక్కలు’’, ‘‘సతి’’, కవనశర్మ రాసిన ‘ఆమె ఇల్లు’, ‘విడాకులు’ …. వివిన మూర్తి రాసిన ‘వాల్‌పేపర్‌’ వైప్లవ్య వంటి కథలు బమ్మిడి జగదీశ్వరావు ‘రెక్కల గూడు’ …. మధురాంతకం నరేంద్ర ‘నిత్యమూ – నిరంతరమూ’ వాడ్రేవు చినవీర భద్రుడి ‘సుజాత’, అల్లం రాజయ్య ‘కము’, ‘నీల’ రఘోత్తమరెడ్డి ‘జాడ’ అంపశయ్య నవీన్‌ కథలు చెప్పుకోదగినవి …. ఆర్‌.ఎప్‌ు.ఉమామహేశ్వరావు రాసిన ‘నోరుగల్ల ఆడది’ ‘ఒంటేపమాను’ వంటి కథలు కళావంతుల ఇళ్ళలోని పాతతరం స్త్రీల వ్యక్తిత్వాలనీ, ఆత్మగౌరవాలనీ …. పరోపకార హృదయాలనీ. కొన్నిసార్లు నోటిని ఆయుధంగా అడ్డుపెట్టుకోవడాన్నీ హృద్యంగా వివరిస్తాయి ….