వ్యవసాయం గిట్టుబాటు కాక సన్నకారు రైతులంతా రైతు కూలీలుగా మారిపోవడం లేదా పొట్టచేత పట్టుకుని జీవనోపాధి వెతుక్కుంటూ దూరప్రాంతాలకు వలసపోవడం అత్యంత సాధారణమై పోయిన నేపధ్యంలోంచి భూమితల్లిని ఒదిలి వెళ్ళలేని దుర్భర పరిస్థితినీ, రైతు గుండెల్లో చెలరేగుతున్న సంఘర్షణకి అద్దంపడుతూ.
జి.ఎస్.చలం రాసిన ‘అంకురం’ …. గౌరునాయుడు ‘‘ ఒక దృశ్యం – రెండు స్వప్నాలూ’’ వచ్చాయి …. ఇనాయతుల్లా రాసిన ‘వలస పక్షి’ కూడా ఈ కోవలోదే.
సింగమనేని నారాయణ రాసిన ‘ఒక పయనం’ కథ వలసల మరో కోణాన్ని చిత్రిస్తూ ఆశాజనకంగా ముగుస్తుంది.
పూలమ్మిన చోట కట్టెలమ్మ లేనట్టు …. వ్యవసాయం జూదమయిపోయి కడుపు నింపుకోవడం కూడా చేతకాని క్రమంలో ఒకానొక రైతు గంగన్న కుటుంబంతో సహా ఊరు విడిచి అనంతపురం జిల్లా నుంచి బళ్ళారి ప్రాంతానికి వలస పోతాడు ….
గంగన్న ముందు నడుస్తున్నాడు …. అతని నెత్తిమీద ఒక పాత ట్రంకు పెట్టి ఉంది …. ఆ పెట్టిలో ఏముందో అతడు తెరిచి చూపిస్తే తప్ప మనకి అర్థంకాదు అంటూ ప్రారంభమవుతుందీ కథ …. గంగన్న దృష్టి కోణం నుంచి, గంగన్న ఆలోచనల్లో నుంచి మొత్తం సంక్షోభంలో కూరుకు పోయిన అనంత రైతు జీవితాన్నంతా కళ్ళముందు పరుస్తాడు రచయిత ….
ఎంతో మంది బీదా బిక్కీ తమ ఇంటివద్ద బతికిపోయిన క్రమంలో నుంచి గంగన్న కుటుంబం రామప్ప నాయుడి వద్దకెళ్ళి చేతులు జోడించి బతుకుదారి చూపించమని అడుక్కుంటుంది….
రామప్పనాయుడు బళ్ళారి ప్రాంతంలోని మోతుబరి ….
‘‘అట్లాగేప్పా మీ ప్రాంతంలో పరిస్తితులు చక్కబడేంతవరకూ ఇక్కడే ఉండండి ….’’ అంటూ బస, పని చూపిస్తాడు ….
అందుకు గంగన్న
‘మా ప్రాంతంలో ఏ పరిస్థితులూ చక్కబడవు నాయినా నలభయి యేండ్ల నుంచీ సేద్యం చేస్తున్నాను …. రాను రాను కాలం మరీ ఘోరమయి పోయింది …. సేద్యం అంటేనే విరక్తి పుడుతోంది …. మా జిల్లా రైతులు చేతుల్లో ఇప్పుడు ఉత్త భూమి మాత్రమే ఉంది …. విత్తనాలు మా చేతుల్లో లేవు …. ఎరువులు మా చేతుల్లో లేవు …. మందులు మా చేతుల్లో లేవు …. నీళ్ళు మా చేతుల్లో లేవు కరెంటు మా చేతుల్లో లేదు …. వీటన్నింటినీ ఎవరో కట్టకట్టి మా చేతుల్లో నుంచి లాక్కుపోయారు …. అవన్నీ మా చేతుల్లోకి వస్తేనే తప్ప బతికి బట్టకట్టలేము’’ అంటాడు నిర్వేదంతో ….
రామప్ప నాయుడు సుదీర్ఘమైన ఆలోచనలో పడిపోయి చాలా సేపటి తర్వాత …. ‘మరీ అంత నిరాశ పడొద్దు గంగన్నా …. ఇవాళ కాకపోతే రేపయినా రైతు అన్నీ తన చేతుల్లోకి తెచ్చుకుంటాడు’ అంటూ ధైర్యం చెప్తాడు ….
వలసల మీదొచ్చిన అనేక కథల్లో ‘ఒక పయనం’ విలక్షణమైన కథ ….
గతంలో ‘వానరాలె’ అంటూ ఆకాశంకేసి మోరెత్తి చూసే అనంత రైతు దీనస్థితి మీద …. కరువుమీద మంచి కథ రాసిన స్వామి ఈ కొత్త శతాబ్దం రైతు పాతన్నను పరిచయం చేస్తూ మన సమజాతాలనీ, మన పనిముట్లనీ చివరికి మన ఆహార పదార్థాలనీ కూడా ఏ దెయ్యం మాయం చేసిపోతోందో తెలుసుకోమంటూ ‘తెల్లదెయ్యం’ అన్న గ్రామ వివక్ష కథ రాశారు ….
సామ్రాజ్యవాద సంస్కృతి పల్లెల మీద, వ్యవసాయం మీద దాడిచేసి మార్కెట్లను పెంచుకోవడంకోసం …. వాణిజ్య అవసరాల కనుగుణంగా ఇక్కడి పంటల పద్ధతినే మార్చిపారేసింది …. పంటల ఉత్పత్తి వినియోగం కోసం కాకుండా కేవలం లాభాలకోసమే అన్న పద్దతి క్రమంగా స్థిరపడిపోయింది ….
ఇలా వ్యాపార పంటలు రైతుల జీవితాల్లోకి చొచ్చుకు వచ్చి రైతుని అప్పులపాలు చేసి ఆత్మహత్యలకు ప్రేరేపించిన వైనాన్ని తెలుపుతూ నల్లూరి రుక్మిణి ‘బీటలెత్తిన బీళ్ళశోకం’ అన్న కథ రాశారు …. ఆ కథలోని ప్రధాన పాత్ర సుబ్బయ్య తమ కాలానికీ, ఇప్పటికీ వ్యవసాయం మారిపోయిన తీరుని గురించి మధనపడతాడు …. చిన్ననాడు డబ్బంటే ఏమిటో తెలిని స్థితిలో నుంచి ఈనాడు డబ్బులొచ్చే పంటలదాకా అనేక పరిణామాలు అతని మెదడులో సుళ్ళు తిరుగుతాయి. మరి ఆ డబ్బు చేతిలో నిలిచిందా? …. ఏమయిపోతోంది? …. డబ్బు మాయావిలా ఎలా మనిషిని ఆడించి విధ్వంసానికి దారితీస్తూంది …. అన్నీ చర్చలోకి వస్తాయి ఈ కథలో ….
ఇదే ఇతివృత్తంతో కాట్రగడ్డ దయానంద్ రాసిన తలపాగా స్వగతం రైతు జీవిత దుర్భర స్థితిని ప్రతీకాత్మకంగా ఆత్మకథాత్మక విధానంలో చెప్పబడిన కథ ….
కృష్ణాజిల్లా మాగాణి ప్రాంత గ్రామాలు …. అక్కడ్నుండి ఉద్యోగాల పేరుతోనో, అభివృద్ధి పేరుతోనో దూర ప్రాంతాలకు వెళ్ళి పట్టణ సంస్కృతిని జీర్ణించుకున్న వాళ్ళు, పల్లెల్ని కన్నతల్లిని ఒదిలిపెట్టలేక గ్రామాల్లోకి కొత్తగా పాకుతోన్న పట్టణ సంస్కృతిని జీర్ణించుకోలేక కట్టుమిట్టాడుతూనే …. పెళ్ళి, పేరంటాలు పేరుతోనే అయినా బంధుమిత్రులందరినీ కలిపి ముడేయాలనుకుంటున్న వాళ్ళూ …. మారిపోయిన భూమి సంబంధాలూ వీటినన్నింటినీ చాలా చక్కగా పట్టుకుంది పి.సత్యవతి రాసిన ‘పెళ్ళి ప్రయాణం’ కథ మారుతున్న భూమి సంబంధాలనీ, గ్రామాలలో విచ్ఛిన్నమైపోతూన్న మానవ సంబంధాలను లోతుగా చర్చకు పెడుతుందీ కథ ….
షేర్ల వ్యాపారాలు అయాచిత డబ్బు ప్రలోభాన్ని చూపించి గ్రామీణ ప్రాంత రైతు జీవితాలను ఎలా నాశనం చేశాయో చెప్తూ వల్లూరు శివప్రసాద్ ‘నాగేటి చాలు’ అన్న కథ రాశారు ….
అలాగే అల్లం రాజయ్య కథలు గ్రామీణ జీవన నేపథ్యాన్ని విప్లవోద్యమ దృష్టితో చిత్రించిన కథలు …. ‘మహదేవుని కల’ చాలా విలక్షణమైన కథ …. భూమిని నమ్ముకున్న వాళ్ళ కలలన్నింటినీ వ్యవస్థ ఎలా విధ్వంసం చేస్తుందో ఈ కథ లోతుగా వివరిస్తుంది ….
‘‘మహాద్భుతమైన మనిషి, ఆరోగ్యవంతమైన మనిషి …. మట్టి నుంచి పచ్చటి మొక్కలు, సర్వసంపదలూ సృష్టించదలుచుకున్న మనిషి …. మహదేవుని సకల కలలను, సర్వశక్తులనూ హరించిందెవరు?’’ అంటూ వ్యవస్థ మీదికి ప్రశ్నలు సంధిస్తాడు కథకుడు ….
ఛిద్రమైన గ్రామీణ జీవితాన్ని అంతర్లీనంగా చెప్తూ డా॥ వి.చంద్రశేఖరరావు ‘‘ఆవు పులి మరి కొన్ని కథలు’’, ‘‘నీటి పిట్టల కథలు’’ అని రెండు కథలు రాశారు.
‘వ్యవసాయ శ్రామికుల మీద ప్రపంచీకరణ ప్రభావం’ అన్న అంశం మీద ఏర్పాటుచేయబడిన సెమినార్ హాలులోకి రైతు కూలీలకు ప్రవేశం లేకపోవడం విదేశీ డెలిగేట్లతో కలిసి స్వదేశీ మేధావులు చేస్తోన్న ఆ చర్చలోని భాష ఈ వ్యవసాయ శ్రామికులకు అర్థం కాకపోవడం ఈ కథలోని వైరుధ్యం ….
కొండకింద తెల్లపులి ‘‘నేను ఆవులను చంపి తినేదాన్ని కాదు. ఒక్కక్క ఆవునీ లేక గేదెనీ …. మేకనీ అదీ కాకపోతే మనిషినీ అయినా అయిదు వేలకు కనుక్కుంటానని నోట్లకట్టలు చూపించడంలో’’ …. గ్రామీణ జీవితం మీద ప్రపంచీకరణ ప్రభావం ఎంత క్రూరంగా, హింసాత్మకంగా పడుతోందో తెలియజేప్తుందీ కథ.
గ్రామీణ వ్యవసాయ జీవితాల్లోకి డబ్బు ప్రవేశించిన కోణం …. పెరుగుతున్న పెట్టుబడుల కనుగుణంగా ఎక్కడికక్కడ అధిక వడ్డీలతో పిలిచి పిలిచి అప్పులిస్తోన్న ధనిక వర్గం …. మొత్తం ఈ క్రమాన్ని రిమోట్ కంట్రోలుతో నడిపిస్తూన్న బహుళజాతి సంస్థలూ …. వ్యవసాయం రైతు చేతుల్లో లేకుండా వ్యాపారంగా మారిపోయిన వైనాన్ని ఎండగడ్తుంది ‘నీటి పిట్టలు’ కథ ….
పత్రికా విలేకరుల దృష్టికోణంలో నుంచి గ్రామీణ జీవిత విధ్వంసాన్ని చిత్రించిన రెండు కథలు ఈ దశాబ్ద కాలంలో వచ్చాయి …. కేతు విశ్వనాధరెడ్డి రాసిన ‘విరూపం’, పెద్దింటి అశోక్ కుమార్ రాసిన ‘కీలుబొమ్మలు.’
ఒక చేతిలో గరుడ స్తంభం, మరో చేతిలో మోగుతూన్న జేగంటతో ‘అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా తిరునామధారీ సర్వజగద్రక్షకా’ అంటూ తిరుమంత్రం వల్లిస్తూ ఇల్లిల్లూ తిరిగి బిక్షం ఎత్తుకునే తండ్రిని ‘‘మనం సేద్యం చేద్దాం నాయినా ఈ అడుక్కునే పని వద్దు’’ అంటూ గట్టిగా వారించిన నారాయణ ఆ వృత్తి వదిలి రైతు అవతారమెత్తి వ్యవసాయం చేసి నిలదొక్కుకోవాలని ఎంతగానో ప్రయత్నించి చివరికి అప్పుల పాలయి …. దుర్భర పరిస్థితినీ, దు:ఖాన్నీ భరించలేక …. అనివార్యంగా తిరిగి గరుడ స్థంభాన్నందుకుని చీకటి వీధుల వెంట నడక అందుకుంటాడు …. అతడు మోగిస్తున్న జేగంటతో ఊరు మేలుకుంటుంది …. కానీ వికలమయిన మనసుతో పాఠకుడు తేరుకోవడానికి మాత్రం చాలా రోజులే పడుతుంది…. జి.వెంకటకృష్ణ రాసిన ‘గరుడ స్తంభం’ కథ ఇది.
వ్యవసాయంతో పాటుగా వ్యవసాయాధారిత చేతివృత్తులన్నీ కూడా అణగారిపోయాయి …. ఆయా వృత్తిపని వానలకు మనుగడే లేకుండా పోయింది.
కుల వృత్తుల విషయం మాట్లాడుకోవలసి వస్తే మన గ్రామాలలో కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చేనేత వంటి ఉత్పత్తిపరమైన కులవృత్తులే కాకుండా మంగలి, చాకలి, కాటికాపర్లు, పారిశుధ్యం వంటి సేవాపరమైన కులవృత్తుల వారు కూడా ఉంటారు ….
అభివృద్ధి పేరిట యంత్రాలు, ఆధునిక పరికరాలు ఒకే ఒక్క గంటలో బోలెడన్ని చీరలు నేయగల మగ్గాలు …. మట్టి పాత్రలని అధిగమిస్తూ ప్లాస్టిక్ పరిశ్రమ …. చీప్‌లిక్కర్ ప్రవేశంతో గీత కార్మికుల ఉపాధి …. ఇలా రకరకాల యంత్రాలు కులవృత్తులను పొట్టన పెట్టుకున్నాయి …. ఈ యంత్రాలద్వారా నాణ్యమైన చౌక ఉత్పత్తులు లభించడంతో అవి ప్రజాదరణ పొంది క్రమంగా కుల, చేతి వృత్తులన్నీ మూలపడి పోయాయి….
పైవిషయాలన్నింటినీ కూడా రచయితలు చర్చకు పెడుతూ కథాసాహిత్యాన్ని వెలువరించారు …. పెద్దింటి అశోకకుమార్ రాసిన ‘కాగుబొత్త’ …. ప్లాస్టిక్ వస్తువులు, ఫ్రిజ్జులు వచ్చి ఎలా మనుషులకు కుండల అవసరాన్ని లేకుండా చేశాయో మనిషి మరణించినప్పుడు తప్ప ‘కుండ’ అవసరం లేని స్థితికి ఎలా నెట్టబడ్డాయో వివరంగా చర్చిస్తుందీ కథ …. ‘తెగిన బంధాలు’, ‘గోస’ వంటి కథలు యంత్రాలు వివిధ రకాల కులవృత్తులని మింగేసిన వైనాన్నీ …. పెళ్ళిళ్ళ సమయంలో కూడా మంగలి, చాకలి వంటి వారి అవసరాలు లేకుండా పోవడాన్ని …. చేనేత పని వారి గోప్పనీ వివరంగా అర్థం చేయిస్తాయి ….
అలాగే క్రమంగా వృత్తిని కోల్పోతోన్న వడ్రంగి పని వారల మీద సుంకోజి దేవేంద్రాచారి రాసిన ‘అన్నంగుడ్డ’ …. జాతశ్రీ రాసిన ‘కుట్ర’ వంటి కథ లచ్చాయి…. చేనేత పని వారలు ఎలా తెగిన పోగులయి విలవిల్లాడి పోతున్నారో తెలుపుతూ ధూళిపాళ అన్నపూర్ణ రాసిన ‘సాలెగూ(గో)డు. అన్న కథ వచ్చింది ….
గ్రామాల మీద …. గ్రామాలు ఎలా మాయమై పోతున్నాయో చెప్తూ బమ్మిడి జగదీశ్వరరావు రాసిన ‘ ఊరు’ చెప్పుకోదగిన కథ …. ఇవన్నీ చెప్పుకుని రైతు జీవిత విధ్వంసం మీద వారాల కృష్ణమూర్తి రాసిన ‘యాది’ అన్న కథను చెప్పుకోనట్టయితే ఈ విషయం సమగ్రం కానట్టే ….
జీవితంలోని దుర్భర పరిస్తితులను భారంగా ఎదుర్కొంటూ చివరికి తిండిలేక ఆకలికి మెత్తటి పుట్ట మట్టిని తీసుకొచ్చి వడలుగా చేసి ఎండబెట్టి పిల్లల కడుపు నింపాలని ప్రయత్నించిన యాదమ్మ …. అటువంటి స్థితిలో కూడా ధైర్యంగా నిలబడి యాదమ్మ ఆత్మహత్య చేసుకోడానికి సిద్ధపడ్డ భర్తతో ‘పిరికి వాడితో నేనెంత కాలము కాపురం చేయ్యను? …. నీ ఇష్టం …. నీ కోసం మీ అమ్మ బతికినట్టు నా పిల్లల కోసం నేను బతుకుతాను’ అంటూ అత్త రెక్క పట్టుకొని పైకి లేపుతుంది ….
యాదమ్మ అత్త కూడా కోడల్ని కౌగిలించుకుని ‘‘నా కడుపున నువ్వెందుకు పుట్టలేదే యాదు …. ఈ పిరికోడు పుట్టాడు అంటుంది …. ఈ ఇద్దరు ఆడవాళ్ళ నిబ్బరం చూసి లచ్చుము తనని ఆదుకోమంటూ చేయి చాపుతాడు …. అంతా కలిసి ఒకర్నొకరు కౌగలించుకుని ఏడ్చుకుంటారు.
ఆ ఏడుపు బాధపడి కాదు …. బాధల నుంచి విముక్తి కలిగినందుకు తనివితీరా ఏడ్చి మనసుల్ని దిటవు పరుచుకున్నారు …. కన్నీటితో పాత జీవితాన్ని కడిగి ముందుకు సాగుతోన్న మనుషులు వాళ్ళు …. రేపటిని పండిస్తారు అంటాడు రచయిత ….
చాలా రోజులుగా రైతులు ఆత్మహత్యల గురించి పేపర్లలోనూ, కథల్లోనూ చదివి చదివీ బండ బారిపోయిన గుండెమీద తొలకరి జల్లు చిలకరించినట్టయింది …. గొప్పకథ ‘యాది.’
అయితే ఈ రైతుల ఆత్మహత్యల తరువాత ఈ మొత్తం సంక్షోభాన్నీ, భర్తలేని దు:ఖాన్నీ అదనంగా మోయాల్సి వస్తోన్న స్త్రీల సంగతేమిటి?
పురుషుల్లాగా పలాయనవాదులు కాదు స్త్రీలు …. పిల్లల కోసమైనా వాళ్ళు బతికే తీరాలి …. మరి ఇటువంటి స్త్రీల దుర్భర స్థితినీ, జీవికకోసం వాళ్ళుపడే సంఘర్షణను వస్తువుగా మంచికంటి ‘మిత్తవ’ ముదిగంటి సుజాతారెడ్డి రాసిన ‘జవాబులేని ప్రశ్నలు’ గీతాంజలి రాసిన ‘సంటిది’వంటి కథలు వచ్చినప్పటికీ ఈ వస్తువు మీద మరిన్ని కథలు రావాల్సిన అవసరముందని నా కన్పించింది ….
ఇంకా ఇవేకాక రైతు జీవితం మీద ఎందరో కథకులు కథాసాహిత్యాన్ని వెలువరించారు …. అవేవీ కూడా కల్పితాలు కావు ….
ఊహించని మలుపులూ, అనుకోని అద్భుతమైన కొసమెరుపులూ, శైలీ విన్యాసాలూ ఈ కథల్లో కన్పించవు …. ఉన్నదంతా తమ చుట్టూ ఉన్న సహజ జీవితం …. దాన్ని చెప్పగలిగినంత సహజంగా చెప్పడం …. భాష కూడా గ్రామీణ జీవన సంస్కృతిని మేళవిస్తూ మట్టివాసన వేస్తూండడం విశేషం ….