ఈమాట » 1991 - 2005 తెలుగు నవల - విస్తరించిన వివిధ కోణాలు

Expand to right
Expand to left

1991 - 2005 తెలుగు నవల - విస్తరించిన వివిధ కోణాలు

(9వ ఆటా మహాసభల వ్యాసాల పోటీ లో రూ. 15000 పారితోషికం అందుకున్న వ్యాసం)

డభ్బయిలలో నిర్దిష్టమయిన లక్ష్యంతో కొత్త రూపం తీసుకున్న ప్రజారాజకీయ ఉద్యమాలు, పౌరహక్కుల ఉద్యమాలు, ఎనభైలలో మరింత బలపడి, ప్రజాఉద్యమాలకు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాలకు ఉన్న వైరుధ్యం స్పష్టంగా బయటపడింది. వర్గ సమాజంలో జీవితం తప్పనిసరిగా వర్గస్వభావాన్ని కలిగి ఉంటుందని, రచయితలకు దోపిడివర్గం దోపిడీకి గురవుతున్న వర్గం` ఈ రెండు రకాల వాళ్ళ జీవితం గురించి స్పష్టమయిన అవగాహన ఉండాలన్న చైతన్యం బలపడింది. ఈ రకమయిన చైతన్యంతో జీవితాన్ని కొత్త కోణాల నుంచి చూపిస్తూ వేరు వేరు రంగాలలో వివిధ అంతరువులలో ఉన్న సంక్లిష్టతను, సమస్యలనూ, సంఘర్షణనూ వస్తువుగా చేసికొని వస్తోన్న నవలలున్నాయి.

దళజీవితాన్ని, దళాలకు గ్రామీణజనజీవితంతో ఉన్న అనుబంధాన్ని, గ్రామీణ జీవితాన్ని అభివృద్ధికరంగా మార్చడం, 16 దళాలు నిర్వహించే పాత్రను, దళాలకు, ప్రభుత్వ పోలీసు యంత్రాంగానికి, మధ్య నడిచే రాజకీయ వ్యవహారాన్ని వస్తువుగా చేసుకుని, సామాజిక నవల, పోరాట నవలగా మలుచుకున్న నవలలు ‘‘సరిహద్దు’’ ‘‘రాగో’’ (సాధన) నవలలు.

మన రాష్ట్ర సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర అరణ్య ప్రాంతాలలోని ఆదివాసీ రైతాంగ ఉద్యమం, ‘‘సరిహద్దు’’ నవలకు ఇతివృత్తం. గిరిజనులపై పోలీసులు, ఫారెస్టు అధికారులు, సాగిస్తున్న నిరంకుశ దోపిడీ దౌర్జన్యాలే ముఖ్యమైన అంశాలు.

బలవంతపు పెళ్ళి నిర్బంధాల నుంచి విపరీతంగా పెనుగులాడి బయటపడి దళంతో కలుస్తుంది ‘‘రాగో’’. తను అనుభవించిన క్షోభ - స్వేచ్ఛకోసం పడే ఆరాటం, మీడియ్రాస్తీలందరిలోనూ చూస్తుంది రాగో. పంజరం లాంటి జీవితం నుంచి ఏ కట్టుబాట్లు లేని అరణ్యంలోక,ి అక్కడి నుంచి ఆశయ పథంలోకి పయనించింది.

నేటి యువతరం కంప్యూటర్‌లలో తమ భవిష్యత్తుని వెదుక్కుంటున్న సమయంలో సామాజిక భవిష్యత్తుని గురించి ఆలోచించవలసిన అవసరాన్ని గుర్తుచేస్తుంది ‘‘వేకువ పూలు’’ (జతిన్‌కుమార్‌). వామపక్ష ఉద్యమంలో పనిచేసే స్త్రీ పురుష సంబంధాల్లో నెలకొన్న వివక్షనూ బయటపెట్టింది.

ప్రాణభయంతో దొరలు ఎక్కడున్నా, గ్రామాలపై ఏదో ఒక పద్ధతిలో పట్టును బిగించి ఉండడం, ఆర్థికంగా జరిగిన మార్పులు, వ్యవసాయం, దాని అనుబంధ వృత్తులమీద ఎలాంటి చావుదెబ్బ తీసిందో, ఈ మార్పు ఎలాంటి అరాచకానికి దారితీస్తుందో చూపింది పులుగు శ్రీనివాస్‌ ‘‘అన్నలు’’. బూటకపు ఎన్‌కౌంటర్లు నిర్వహించే పోలీసులను విమర్శిస్తూనే, అన్నల్లో వివిధశిబిరాల మధ్య నెలకొన్న శత్రువైఖరులను, వాళ్ళు బలిగొంటున్న అమాయకులను, ఇలా అనేక అంశాలను విశదపరిచారు.

అటు నక్సలైట్లకు, ఇటు పోలీసులకు, మధ్యనలిగే ఆదిలాబాద్‌ గోండు గిరిజన యదార్ధ జీవితం ‘‘ఊరు’’ (వసంతరావు దేశ్‌పాండే) నవల చిత్రీకరించింది. నక్సలైట్ల పునరావాసం గురించి ‘‘త్రేతాగ్ని’’ (అడవి సూర్యకుమారి) నవల చెబిత,ే గిరిజనులకు పునరావాసం పేరుతో పాలకులు చేసే ప్రచారాలు ఉత్తుత్తివేనని గిరిజన జీవన సంఘర్షణకు భూమి కేంద్రమనేది మనకు ఎరుకపరుస్తుంది, అప్పలనాయుడి ‘‘పునరావాసం’’. శ్రీకాకుళ ఉద్యమ నేపథ్యంలో వాస్తవాన్ని, కల్పననూ, జ్ఞాపకాన్ని, కలగలిపి అల్లిన నవలిది. ‘‘ఆ కొండల వెనుక’’ (ఇ.రామచంద్రం) నవల కూడా గిరిజనులను ప్రధాన జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం చేసే కృషిలో నిబద్ధత కొరవడి, గిరిజనులు పడేపాట్లు చిత్రించింది.

‘ప్రాంతీయత’ ఇటీవల తెలుగు సాహిత్యంలో ప్రధాన వస్తువయింది. నిర్దిష్ట ప్రాంతీయ ప్రత్యేకతతో రచన సాగించడమో ఆ ప్రాంతానికున్న చరిత్రని, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని, చెప్పడమో రచయితల ఉద్దేశంగా కనిపిస్తుంది. ఈ దృష్టితో చూసినప్పుడు మూడు ప్రాంతాల నుంచి వచ్చిన నాలుగు నవలలు ప్రత్యేకంగా అనిపించాయి. కళింగాంధ్ర నుంచి అప్పల నాయుడి ‘‘ఉత్కళం’’, రాయలసీమ నుంచి శాంతినారాయణ ‘‘పెన్నేటి మలుపులు’’, తెలంగాణ నుంచి దాశరధి రంగాచార్య ‘‘అమృతంగమయి’’, నవీన్‌ ‘‘కాలరేఖలు’’.

గత ఎనభై ఏళ్ళ కాలపరిమితి గల ‘‘ఉత్కళం’’లో ఒకే కుటుంబానికి చెందిన నాలుగు తరాల కథ ఉంది. ఉనికికోసం మనిషికోసం మట్టిమనుషులు ఎలాంటి పోరాటాలు చేయవలసివస్తుందో ఈ నవల వివరిస్తే ఎనభై దశకంలో రాజకీయ గ్రామాల నేపథ్యంలో అనంతపురం జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన సామాజిక చలనాన్ని రికార్డు చేసింది ‘‘పెన్నేటి మలుపులు’’. తుంగభద్ర కాలువ సాగునీటి మూలంగా భూస్వాముల సంబంధాల పరిధిలో చెన్నంపల్లి సామాన్య జనాల బతుకుల్లో భూస్వాముల రాక్షసత్వాన్ని మనకళ్ళకు కడుతుంది. గ్రామీణ జీవితంలోని అనేక పార్శ్వాలను వాటి అంత: సంబంధాలను వెల్లడించింది. ‘‘అమృతంగమయం’’లో స్వాతంత్య్రానికి పూర్వం ఏభై ఏళ్ళు, తరువాత ఏభై ఏళ్ళు, ఈ వందేళ్ళ కాలంలో తెలంగాణ గ్రామీణ జీవితంలో సాంఘిక ఆర్థిక రాజకీయ పరిణామాలు విచ్చలవిడి పాశ్చాత్య నాగరికత పోకడలు పర్యావరణం ఈ అంశాల నేపథ్యంలో సాగుతుంది. ‘‘కాలరేఖలో్ల’’, 1944 ఆంధ్ర మహాసభ ప్రారంభం నుంచి 56 ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినంతవరకూ మధ్య కాలాన్ని ప్రాతిపదికగా చేసుకుని నాటి సాయుధ రైతాంగ పోరాటం చెప్పబడుతుంది.

కె.ప్రతాపరెడ్డి ‘‘బందూక్‌’’ నవల నాటి నిజాం నవాబుల పాలనలో దొరల అక్రమాలు రజాకార్ల దురాగతాలు వివరిస్తే ముదిగంటి సుజాతారెడ్డి ‘‘మలుపుతిరిగిన రథచక్రాలు’’ కూడా తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన ఇతివృత్తంతోనే సాగింది.

‘‘మంటలు మానవత్వం’’ (సరిపల్లి కృష్ణారెడ్డి) నవలలో రజాకార్లు సృష్టించిన హింసలో కొంతమంది ముస్లింలు అనుకూలంగా ప్రవర్తించగా మరికొంతమంది ముస్లింలు మాత్రం ఎదురు తిరగడం ఇతివృత్తం.

ఇంకా ఉంది. పేజీలు: 1 2 3 4 5 6 7 8