1991 - 2005 తెలుగు నవల - విస్తరించిన వివిధ కోణాలు
(9వ ఆటా మహాసభల వ్యాసాల పోటీ లో రూ. 15000 పారితోషికం అందుకున్న వ్యాసం)
జాతీయ అంతర్జాతీయ సంస్థలు దళిత హక్కుల కోసం పోరాటం చేస్తున్నాయి. సాంఘిక వివక్షకు, అసమానలతకు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికాలో డర్బన్‌లో 2001లో సదస్సు జరిగింది. భోపాల్ డిక్లరేషన్, అంబేద్కర్ శత జయంతి ఉత్సవాలు, ఇవి ఇలా ఉండగా, దళితులకు రాజ్యాధికారం అనే నినాదంతో 1984లో కాన్షీరాం దళితుల రాజకీయ హక్కులు సాధించడానికి బహుజన పార్టీ స్థాపించడం, 85లో మన రాష్ట్రంలో కారంచేడులో దళితుల ఊచకోత, 86లో దళిత మహాసభ ఆవిర్భావం, చుండూరు, నీరుకొండల్లో దళితులపై పునరావృతమైన దాడులు జరిగాయి. రాష్ట్రంలో రిజర్వేషన్‌లు పెంచారు. కేంద్రంలో మండల కమిషన్ నివేదిక అమలు ప్రకటన, రిజర్వేషన్ అనుకూల ప్రతికూల పవనాలు, ఫలితంగా నూతన సామాజిక సమీకరణాలు రూపొందాయి.
87లో మహారాష్ట్ర రాజధానిలో అఖిలభారత దళిత రచయితల మొదటి సభలు జరిగాయి. ఇవి సాహిత్యంలో దళితుల ఉనికిని తెలియచేశాయి. 93లో హైదరాబాద్‌లోను, 95లో వరంగల్లోనూ ‘ఆంధ్రప్రదేశ్ దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదిక సభలు జరిగాయి. సమస్త వర్ణ లింగ, కుల, జాతి, మత, భాష, ప్రాంతీయ అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతూ, అణచివేతకూ, దోపిడీకి, అసమానతలకు తావులేని నిజమయిన ప్రజాస్వామికతనూ తన సాంస్కృతిక విలువలతో కూడిన నిర్మాణానికి కృషి చెయ్యాలని తీర్మానించడం జరిగింది. అంతకు మునుపే కోస్తాలో మిషనరీల సహాయంతో ఆరంభమైన దళిత వికాసం, మార్క్సిస్ట్ ఉద్యమాలు దళితులకు ఆత్మ స్థైర్యాన్నిచ్చాయి. విద్యా, ఉద్యోగ రంగాల్లో ప్రవేశించిన నేటి దళితయువత, ఆత్మన్యూనతాభావం విడనాడి కులం పేర్లను తమ పేర్లతో సహా ప్రకటించుకునే ఆత్మ గౌరవాన్ని పెంపొందించుకుంది. ఈ కారణాలన్నీ గత పది పదిహేనేళ్ళలో వచ్చిన సాహిత్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపాయి.
ఈ కాలంలో వచ్చిన గొప్ప దళిత నవల ‘‘అంటరాని వసంతం’’ (కళ్యాణరావు). దాదాపు ఒకటిన్నర శతాబ్దాల కోస్తా ప్రాంత దళితుల జీవన గమనాన్ని ఉద్వేగభరితంగా వర్ణించింది. మాలమాదిగల ఉమ్మడిచరిత్ర, సంస్కృతి, జానపద కళల సంప్రదాయ నేపథ్యంలో సాగుతుంది. ఆరుతరాల అంటరాని ఇతిహాసం ఇది.
నల్లమల అడవుల నుంచి నెల్లూరు సముద్రతీరం వరకూ విస్తరించిన సంచార గిరిజనతెగ యానాదులు, సామాజిక పరిణామంలో ఆహార సేకరణ దశకు చెందిన జాతి. అలాంటి ఒక యానాది, మన్నోడుక,ి భూస్వామి మణియంకు, మధ్య సంఘర్ణణను గొప్ప శిల్పసౌందర్యంతో ప్రతీకాత్మకంగా డా॥ కేశవరెడ్డి ‘‘చివరి గుడిసె’’ నవలలో చిత్రించారు.
తన అధికార ప్రాబల్యంకోసం కురవల్లో, రెండు తెగల వారినీ ఎర్రమరెడ్డి విడదీసినప్పుడు, చివరికి వాళ్ళంతా నిలకడ మీద నిజాన్ని గ్రహించి ఏకమవ్వడం (వి.ఆర్.రాసాని) ‘‘చీకటి రాజ్యం’’ ఇతివృత్తం.
నిత్యం అనావృష్టి పీడిత రాయలసీమలో నీటివనరుల వినియోగాన్ని ప్రాజెక్టుల రూపంలో వ్యవస్థీకరించి చివరకు అవ్యవస్థ విస్తరణకు ఎలా దారితీస్తుందో (స్వామి) ‘‘గెద్దలాడతండాయి నవలలో’’ చూపించారు.
అనంతపురం జిల్లా సామాజిక రాజకీయ చరిత్రను ‘‘మీ రాజ్యం మీరేలండి’’ (స్వామి)లో చూడవచ్చు. అందివచ్చిన అవకాశాలను చేజిక్కించుకుని మతాలు మార్చుకుని కులస్వభావాన్ని భద్రంగా అంటిపెట్టుకుని, రెండు అగ్రవర్ణాల వారు, ఎలా దళితుల్ని కీలుబొమ్మలుగా చేస్తారో, ఈ నవల నిరూపించింది.
దళిత నేపధ్యంలో కులవర్గ దృక్పధాల నుండి, దళిత సమస్యను విశ్లేషించిన నవల (చిలుకూరి దేవపుత్ర), ‘‘పంచమం’’. దళితుడు, అచేతన దశనుంచి హక్కులకోసం ఉద్యమాన్ని చేపట్టడం వరకూ సాగుతుంది. నవల్లో ప్రధానమైన కథతోపాటు స్త్రీవాదం, ముస్లింలు, క్రైస్తవులకు సంబంధించిన సమస్యలు చర్చకువచ్చాయి. గతశతాబ్దం ఎనిమిదో దశకానికి ముందట భూసంస్కరణలు మొదలుకొని, దండోరా వనాల మహానాడు వరకు, పరిణామాలను చిత్రించింది.
మాలమాదిగల మధ్య అంతరాలను, అనాదిగా వస్తున్న పంతాలను, ఆసరాగా చేసుకుని తమ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం అగ్రవర్ణాల వారు ఉపయోగించుకోడం మామూలు కథే అయినప్పటికీ ఏభై ఏళ్ళ కాలాన్ని నవలలో ఇనుమడింపచేస్తూనే గత పదేళ్ళ కాలంలో గ్రామాల్లో చోటుచేసుకున్న పరిణామాలను రికార్డు చేసింది. (ఎస్.వెంకట రామిరెడ్డి) ‘‘కాడి’’ నవల.
రాయలసీమ ముఠా కక్షల నేపథ్యంలో వేంపెంట సంఘటన స్ఫూర్తితో వెలువడిన నవల (పినాకపాణి) ‘‘నిప్పులవాగు’’. నల్లమల అటవీ ప్రాంతంలో పీపుల్స్‌వార్ ప్రవేశం నుంచి అనేక రాజకీయ పరిణామాలు ఇందులో చోటుచేసుకున్నాయి. భూస్వామ్య సాయుధ ముఠాలు పోలీసుల వెన్నుదన్నుతో, మాదిగల్ని సజీవ దహనం చెయ్యడం నుంచి, మాలమాదిగల మధ్య ఉన్న వైరుధ్యాలను, విప్లపోద్యమ క్రమం నుంచి దండోరా వరకూ, చిత్రించింది.
దళిత సమస్యకు మార్క్సిస్ట్ ఉద్యమాల సహాయం అవసరమని, దళిత బహుజన విముక్తికి వెలుగుదారి విప్లవమని, చెప్పిన నవల ‘‘దండంమీద చిలకలు’’(గోపరాజు నాగేశ్వరరావు). మధ్య కోస్తాలో దళిత బహుజనులు వృత్తుల పరాయాకరణ పొంది, దొరలకు కిరాయిహంతకులుగా, దళారులుగామారడం చాపకింద నీరులా విస్తరించిన పీపుల్స్‌వార్ కార్యక్రమాల పట్ల దళితులు ఆకర్షితులవ్వడం, ఈ రెండు అంశాలు కేంద్రంగా నడుస్తుందీ నవల.
దళిత జీవిత వాస్తవాల్ని, వాళ్ళు అనేక రకాలుగా ఎదుర్కొంటున్న సమస్యల్ని ‘‘మాదిగపల్లె’’ (పి.నాసరయ్య) నవలలో చూడొచ్చు. దళితులను చైతన్యపరిచి, వారిని సంఘటిత పరుస్తుంటే, వాళ్ళను విడదీసి బలహీనుల్ని చేయడానికి పెద్దలు ఎలా ప్రయత్నిస్తారో చెప్పారు.
కీలక పదాలు : కబురు, 9వ ఆటా మహాసభల వ్యాసాల పోటీ