ఈమాట » పిచ్చి నాన్న

Expand to right
Expand to left

పిచ్చి నాన్న

(9వ ఆటా మహాసభల కవితల పోటీ లో రూ. 4000 పారితోషికం అందుకున్న కవిత)

ఎప్పుడూ
గుండెల మీద రెండు కలువపూల పాదాలు
కదలాడుతున్నట్టుగానే వుంటుంది
రెండు వెన్నపూస పెదాలు
నా బుగ్గల్ని ఎంగిలిచేసి నవ్వుతున్నట్టే ఉంటుంది.
రెండు తమలపాకు చేతులు
నా మెడని సుతారంగా చుట్టుకుని
ఉయ్యాల లూగుతున్నట్టే అనిపిస్తుంది.

చెడ్డీల నుండి చమ్కీల చుడీదార్ల దాక
పప్పీ షేముల నుండి పట్టు పావడాల దాకా
అదెన్ని వేషాలు మార్చినా
ఈ నాన్న కన్నుల్లో తానింకా కుందేలు పిల్లే
ఈ తండ్రి గుండెల్లో తానింకా మంచుపూలజల్లే.

పిల్లల్లో పిల్లలా, అమ్మాయిల్లో అమ్మాయిలా కనిపిస్తూ
నన్ను లక్షల కూతుళ్ళున్న లక్షాధికారిని చేసేస్తుంది.

ఏ షాపుకైనా వెళతానా
అక్కడ బొమ్మలన్నీ నా చిట్టితల్లిలా
నాన్నా నాన్నా అని పిలుస్తున్నట్టే అనిపిస్తుంది.
అలా దారిలో కాన్వెంటు పిల్లల్ని చూస్తానా
అనేక రూపాల్లో మా అమ్మాయే ఆడుకుంటున్నట్టు ఉంటుంది.

ఏ కాలేజీ దగ్గర నిలబడ్డా
రంగు రంగుల దుస్తుల్లో మా పిల్లే
తూనీగలా ఎగురుతున్నట్టు ఉంటుంది
క్రిక్కిరిసిన ఏ బజారులో నిలుచున్నా
నేనూ నా కూతురూ వందల వేల రూపాల్లో విడిపోయి
చెట్టా పట్టాలు వేసుకు తిరుగుతున్నట్టే అనిపిస్తుంది.

ఎవరికీ కనబడదు గాని
నా నెత్తిమీద ఓ బుల్లి సింహాసనం - దానిలో నా బుజ్జి యువరాణి.
ఈ ప్రపంచం తిరునాళ్ళలో తనను అలా అలుపులేకుండా తిప్పుతున్నట్టే ఉంటుంది.

దానికిప్పుడు అద్దంలో తన బొమ్మ తప్ప
ఏమీ పట్టదు గాని
అది రాత్రంతా పడీ పడీ చదువుతుంటే
నేను టీ డికాక్షన్‌లా మరుగుతూనే ఉంటాను
అది పరీక్షలు రాస్తుంటే
ఆ మూడు గంటలూ రోడ్డు మీద వాహనాలేవీ కదలొద్దని
కసురుకునే ట్రాఫిక్‌ పోలీసునై పోతాను.

తను చలితో వణికిపోతే
నేను పత్తికాయనై పగిలిపోతాను
తను జ్వరంతో మండిపోతే
వంద రెక్కల విసనకర్రనై తన చుట్టూ ప్రదక్షిణలు చేస్తాను
తను జబ్బు పడితే మొత్తం వైద్యశాస్త్రాన్నే తప్పుపడతాను.

ఒక్కసారి నవ్విందా
ఒళ్ళంతా వేల పియానోలు చుట్టుకొని
సజల సంగీతమై ద్రవించిపోతాను.

ఇంక తన పుట్టినరోజు వచ్చిందంటే
ఆకాశానికి నేనే బెలూనై వేలాడతాను.
కొమ్మకొమ్మకీ చాక్లెట్లూ, కేకులూ వేలాడదీసి
పక్షులకు ఫలహారంగా పెడతాను.
ఇప్పుడు తను పెద్దదయ్యింది కదా
నాన్న బొజ్జతో ఆడుకోవడం ఎప్పుడో మానేసింది
పైగా నన్ను చూసి
‘పిచ్చి నాన్న’ అంటూ నవ్వేస్తుంది.

అదేమిటో గాని ఎప్పుడూ
కోతిపిల్ల తల్లిపొట్ట కరచుకు పట్టుకున్నట్టు
ఒక సుతిమెత్తని ప్రాణగీతమేదో
నా పొట్టను పెనవేసుకున్నట్టే ఉంటుంది.

నాకు మాత్రం కూతురంటే
ఒకే జన్మలో మనం పొందే రెండో అమ్మ
మన గుండె షోకేసుల్లో నిత్యం నవ్వే మురిపాల బొమ్మ.

 

(7 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. siva kumar అభిప్రాయం:

    July 9, 2006 12:01 am

    బాగా వుంది. ఇలాంటివి ఇంకా రాసి పిల్లల దృష్టికి తీసుకు వెళ్ళాలి.

  2. Raghuram అభిప్రాయం:

    July 10, 2006 10:21 pm

    ఆడ పిల్లల తండ్రులను ఒక విలన్ గానో లేక ఒక జోకర్ గానో చిత్రీకరించే ఈ రోజుల్లో నాన్న హృదయాన్ని అద్భుత రీతిలో ఆవిష్కరించినందుకు అభినందనీయులు. బహుమతికి ఖఛ్ఛితంగా అర్హులు.

  3. Lakshmi Tulasi Ramineni అభిప్రాయం:

    July 18, 2006 11:21 am

    చాలా బాగా రాశారు. ఎంతో హృద్యంగా వుంది

  4. Sarma అభిప్రాయం:

    July 19, 2006 3:54 pm

    ఛాలా బాగుంది. నాకు చదువుతఉంటె కళ్ళ వెంట నీళ్ళు కారినాయి.

  5. Mahesh అభిప్రాయం:

    November 14, 2006 11:44 pm

    ఫ్రసాద్ గారు ,
    చాలా చాలా బాగుంది, మనము చాలా ఇల్లల్లో చూసేదే ఐనా, అది పదముల్లో వర్ణించిన మీ ప్రతిభ చాలా గొప్పది. ఎంత దూరంగా ఉన్నా “మీ పిచ్చి నాన్న ” చూసిన వారు చలించాల్సిందే.

  6. Seetha అభిప్రాయం:

    April 2, 2008 11:26 pm

    అవును నిజమే నాన్న దృష్టిలో కూతురు ఎప్పుడూ యువరాణే…మంచి కవిత touching…

  7. bollojubaba అభిప్రాయం:

    April 30, 2008 11:26 am

    మూర్తిగారికి

    చాన్నాళ్లతరువాత ఒక మంచి కవిత చదివాను,
    మీ కవితలొ చక్కటి పదచిత్రాలు ఉన్నాయి
    ఉదా:టీ డికాషనై మారటం, పత్తికాయలా పగలటం, ఆకాశానికి బెలూనై వేలాడటం మార్వలెస్ ఇమేజెస్.
    నవ్యంగానూ, హృద్యంగానూ ఉన్నాయి.

    కాని చిన్న అబ్యంతరం
    ఆ అమ్మాయికి ఇపుడు అద్దంలో తనబొమ్మ తప్ప ఏమీ పట్టదు అని చెప్పటం అంత అందంగా లేదు. అది పెంపక లోపంగా అనిపించదూ. యవ్వనంలో యువత అద్దానికి అంటుకుపోవటం సహజమైనా, సత్యమైనా మీ కవితమొత్తం ఒక మూడ్ లో ఉంటే ఆ రెండు లైన్లు మిస్ ఫిట్ అయినట్లు గా అనిపిస్తూంది. తప్పైతే క్షమించండి.

    మరోచోట పిచ్చినాన్న అనిపించటం వ్యంగ్యంగా కాక ప్రేమగానే తీసుకున్నాను సుమా!

    నా బ్లాగును విసిట్ చేసి, దయచేసి మీ కామెంట్శ్ వ్రాయండి.

    బొల్లోజు బాబా
    http://sahitheeyanam.blogspot.com/

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a