23. నిద్దట్లో ఆమె కళ్ళు
అర్ధరాత్రి దూరాన
ఎక్కడో పడగవిప్పిన చప్పుడుకి
నిద్దట్లో
కలవరపడి
పక్కకి తిరిగి
నన్ను హత్తుకుందామె.
ఆమె కళ్ళు
జలజలపారే
నిద్దర సెలయేటి అడుగుని
గలగలమని పాడే
అందమైన
గులకరాళ్ళు.
ఈ మెరిసే నీళ్ళ చప్పుడుకి
ఆకర్షితులై
చీకట్లో మెసిలే
ఏవో వింతమృగాలు
ఆమె నిద్దర ఒడ్డుల్ని
తచ్చాడుతాయి.
(23-10-1972)
24. ఆడదన్నా, కొండలన్నా
“ఆడదాని అందానికి
అలవాటైపోతాం క్రమంగా
ఎంత అందకత్తైనా
కొంత పరిచయంతో విసుగుపుట్టిస్తుంది”
అన్నారెవరో: కాని
అలా అనిపించదు నాకు.
ఊరెనకాతల కొండలా
ఉన్నతంగా లేచి
నే చేసే ప్రతిపనికీ
నేపథ్యంగా నిలుస్తుందామె.
కొండలాగే క్షణక్షణమూ
రంగులు మారుస్తుంది.
కొండలకేసి చూస్తో నేను
కొన్ని యుగాలు గడిపేయగలను.
కొండొక ఊళ్ళో కొన్నాళ్ళు
కొండపక్క కాపురమున్నాం.
మిత్రుడొకతను మాట్లాడుతుంటే
చిత్రంగా మారే కొండకేసి చూస్తున్నా
‘Obsession(ఆ) నీకు? ‘
అన్నాడతను విసుగ్గా.
అంతే ననుకుంటా __
ఆడదన్నా, కొండలన్నా
చిన్నప్పుడు కొంతకాలం
గన్నవరంలో గడిపాం:
ఈ మధ్యని వెళితే
నేపథ్యంలో కొండలు తలెత్తి చూశాయి:
చెరువొక్కటే
చిన్నప్పటి జ్ఞాపకం.
ఇరు Obsession లూ ఒకేమారు
తరువాత పుట్టాయనుకుంటా.
(5-10-1974)
25. ఏకాంతానికి గేలం
పట్టణం ట్యూబు నించి
పంచరంగుల సంధ్యని
పిసికి పడేస్తారెవరో
పరిచయాల గోడలు
మరీదగ్గిరగా జరిగి
ఇరుకులోంచి ఉరికి
ఊరవతల పడతావు
కాలవొడ్డున ఏకాంతానికి
గేలమేసి కూచుంటావు
నీ మల్లే కాలవకి
బయళ్ళంటే ఇష్టం.
గట్లు లేని గగనాన్ని
గడగడా తాగేసి
కొత్త ఆకాశాలకోసం
వెతుక్కుంటో పోతుంది
సాయంత్రపు టూత్పేస్టు
సాంతమై పోయాక
కాలవా, నువ్వూ
లోలోన మెరుస్తారు
ఆకాశపు ప్రమిదలో
ఏకాంతపు వత్తిలా జ్వలిస్తారు
అప్పుడూళ్ళో దీపాలు
గప్పున వెలిగి
పట్టణం విశాలంగా
పరుచుకుంటుంది
అంతులేని ఆకాశంతో
అంతట పురప్రవేశం చేస్తావు
(13-5-1975)