మృత్యు వృక్షం

18. శ్యామలరావు గారికి

శ్యామలరావు గారూ,
ప్రతి సాయంత్రం మీరు
స్మితవదనంతో వచ్చి
ఊరే గదిచీకట్లలో
కూరుకుపోయిన నన్ను
చెయ్యట్టుకు లాగి
షికారు తీసుకుపోతారు.

వంగిన సంధ్యాకాశాన్నించి
రంగులమాటల్ని తెంపుకుంటో
చీలిపోయిన రహదారుల్ని
చిరునవ్వుల్తో అతికిస్తో,
వీధుల్లో మన అంగలతో
విజయద్వారాల్ని సృష్టిస్తో,
ఊరంతా తిరుగుతాం.

అప్పుడు
మీ హాసాల హోరుగాలికో,
ఊహల ఋజుత్వానికో, తెలీదు,
ఇళ్ళు విశాలంగా వెనక్కి జరిగి
రోడ్లు తిన్నగా పరచుకుని
జగమంతా అందంగా తెల్లపడి
చంద్రోదయ మౌతుంది.

అప్పటికిగాని
ఇంటికి తిరిగిరాము.
అంతే కద,
శ్యామలరావు గారూ!

(20-12-1973)

19. కోసిన మామిడిపండు

అలల కనురెప్పల కింద
అలజడిలేని స్వప్నంలా
నిశ్చలంగా వేలాడుతుంది చేప.

ఆకుల జలపాతం కింద
ఆకుపచ్చని నీడల్లో
నిశ్చింతగా ఈత్తుంది మామిడికాయ.

ఎండాకాలం గాలం విసిరి
ఎండలాంటి ఎర్రటి ఎండుగడ్డిలో
పండబెడుతుంది కాయని.

ఎండాకాలం పుటుక్కున తెంచి
ఎండుగడ్డిలాంటి ఎర్రటి ఎండల్లో
మండబెడుతుంది నా కాయాన్ని.

మందహాసంవంటి కత్తి వచ్చి
అంతరాళాల్ని ఆరబెట్టి
చెర విడిపిస్తుంది మామిడిపండును.

మంతహాసంలాగో మాన్సూనులాగో
అంతరాళాల్ని కోసి ఏ కత్తి
చెర విడిపిస్తుందో నన్ను.

(24-7-1972)

20. హాస్పిటల్లో ప్రేమ

నువ్వొచ్చేవేళ కాలేదింకా
గవాక్షంలోంచి చూస్తున్నాను ఊరివంక
నీడల వాడిగోళ్ళని చాచింది ధరణి
నింగి పొట్టని చీల్చి మింగింది రవిని
మూలమూలలా ” బేసిలై ” తోడుకుంటున్నాయి
మూలుగుల్లోని వెలుగుల్నికూడా తోడేస్తున్నాయి.

నువొచ్చే వేళైంది
చివాల్న ట్యూబ్లైట్ల ఇంజక్షను మొదలైంది
పట్టణం నరాల్లోకి కాంతులు ప్రవహించాయి
కట్టకడకు కిటికీలు కళ్ళుతెరిచాయి
మెల్లగా మెట్లపై నీ బూట్ల చప్పుడు
తెల్ల జీవకణంలా ప్రవేశిస్తావప్పుడు.

(21-1-1974)