మృత్యు వృక్షం

15. చేతులు తెగాక

మెరిసే నీ
చిరునవ్వుల్నేరుకుందామని వచ్చాను.
అరికాళ్ళ నిండా
అరచేతుల్లోనూ
గిచ్చుకున్నాయి.
పిచ్చివాణ్ణి!
మెరిసేవన్నీ
మెత్తటివనుకున్నాను.
పగిలిన నీ
పగటికలలని తెలీదు.

(28-8-1974)

16. ములిగిన ఓడలు

(కాశీ గారికి, ఆయన నలభైయో జన్మదినంనాడు)

బిడియంగా కాశీగారు
అడిగారొకనాడు
‘విస్మయమౌతుంది నాకు
ఇస్మాయిల్‌ గారు!
ఇంత కూల్గా మీరు
ఎలా ఉండగలుగుతున్నారు?’
ఈ ప్రశ్నే నేనూ
అప్పటి కెన్నాళ్ళనించో
ఆయన్నడుగుదామనుకుంటున్నా!

కాశీగారూ, మనం
జారిపోయే అలలతో
బేజారెత్తిపోయో,
ఏ గాలి కా తెరచాప
ఎత్తటం చాతకాకో
ఎప్పుడో మన చిన్నప్పుడు
పవనఝంఝామహాసోపానా
న్నవరోహించి
సాగరగర్భానికి
సాగిపోయిన ఓడలం.

మహాసముద్రఫలంలో
మధ్యని రెండు బీజాలమై
అల్లనల్లన ఊగుతో
ఆకుపచ్చటి కలల్ని కాదంటాం,
పగడాలుగా చివురించి కొత్త
జగత్తుని సృష్టిస్తాం,
అర్కబింబం ఆవర్తాలని
అంతఃచ్చక్షువులతో అనుసరిస్తాం.

సంవర్తాలూ సంక్షోభాలూ
సాగిపోయాక పైని
మెత్తటి అలొకటి వచ్చి
మెల్లిగా చెబుతుంది ఊసు,
చప్పుడు చెయ్యని
చేపలు మన నేస్తాలు,
సూర్యుడి జండా మన తెరచాపకొయ్యని
సుతారంగా రెపరెపలాడుతుంది.

కాశీగారూ!
నిశ్చలంగా మనం
నిలబడి ఉన్నా
పయోరాశి మనచుట్టూ
ప్రయాణిస్తుంది,
మనకోసమే మహాసముద్రం
పరిపక్వమౌతోంది.

(15-9-1974)

17. చిగిర్చే చెట్లు

నడచివచ్చి నిశ్శబ్దంగా
నా కిటికీ దగ్గిరాగి
హటాత్తుగా
పటేలుమని
వంద వాయిద్యాలతో
వికసించిన బ్యాండుమేళంలా
ఒక రోజు
అకస్మాత్తుగా
చివురించిన చెట్టు
గవాక్షం వద్ద నన్ను ఆపేసింది.

పడవంచున కూచుని
పరికించే సాగరప్రియుడికి
ఒకొక్కప్పుడు
అకస్మాత్తుగా
సముద్రపు నీలికళ్ళల్లో
సందర్శనమిచ్చే
చేపల గుంపులా
చిరుతోకల్ని ఊపుతో
ఏకాభిముఖంగా
ఆకుచివుళ్ళు ఈదుతున్నాయి.
కొమ్మల
కొసల్ని

దూరాభారం చేత పలచబడ్డ
దూరపు కొండల్లా
నిద్దట్లో వికసించిన
పొద్దుటి కనురెప్పల్లా
ఆకాశాన్ని వడపోస్తున్నాయి
ఆకులు
చిగిర్చే చెట్టుకి
ఎగిరే పిట్ట ఆదర్శం!
పత్రాల్ని విదిల్చి
పైకెగరాలని ప్రయత్నం.
కదలక మెదలక
కప్పులు మూసుకుని
నిద్రపోయే
క్షుద్రగృహాలకు
అతీతంగా ఎదుగుతుంది.

అందుకనే,
శీతాకాలం ఎత్తివచ్చినా
భీతిచెందును చెట్టు :

వీపులపై
మ్యాపులతో
పత్రాలన్నీ నిశ్శబ్దంగా
ధాత్రికి దిగివచ్చి
సామాన్యమైన మట్టితో
సారూప్యం పొంది
మ్యాపుల్లోని రహస్య
మార్గాల గుండా
చేరుకుని వృక్షశిఖరాన్ని
చలిమూకని
చావుదెబ్బ తీస్తాయి.

(2-6-1972)