మృత్యు వృక్షం

11. ఆత్మహత్య

తనని బాధిస్తున్న
ప్రపంచపు ముల్లుని
పీకి పారేసి
ఈ పిల్ల చక చకా
ఎటో నడిచిపోయింది.

(25-9-75)

12. ప్రేమలోంచి పడ్డం

ఎవరూ ప్రేమలో పడరు
ఎగురుతారు ప్రేమలోకి తేలిగ్గా,
రెక్కల్ని పోల్చుకొని
చక్కగా విదిల్చుకొని
పాతుకుపోయిన మనుషుల
ఎత్తిన తలకాయలమీదుగా,
చప్పట్లు కొట్టే ఆకుల
చప్పుళ్ళు సాగనంపగా
ప్రియురాలి నీలి
నయనగగనం లోకి
ఎగిరిపోతారు
ఎంచక్కా.
ప్రేమలోంచి పడ్డ
పిచ్చివాళ్ళ నెరుగుదును.
ప్రణయపు ఔన్నత్యాల్లో
ప్రాణవాయువు పలచబడో,
జవరాలి నేత్రగోళాల
ధ్రువాలు తారుమారైపోయో
దారీ తెన్నూ తెలీక
తపతప కొట్టుకొంటో
భూమికి రాలిపోతారు
ప్రేమికులు కొంతమంది.
మచ్చెకంటి నిసర్గభూమిపై
మచ్చగా మనగల్రు.

(10-2-74)

13. బావి

రివ్వున ఆకాశానికి
ఉవ్వెత్తుగ లేస్తుంది మంట.
సవ్వడిచెయ్యక భూమిబుగ్గపై చల్లటి
నవ్వు సొట్టలా ముడుచుకుంటుంది బావి.

పిల్లంగోవిలా లోతుగా
చల్లటి నీడల్ని ఊదుతో
వేళ్ళనీ పెదిమల్నీ
ఒళ్ళంతటినీ ఆహ్వానిస్తుంది బావి.

స్వరాల చల్లటి పిట్టలు వాలగా
పరచి సంగీతపు ఊడల్ని,
మరచిపోయిన పాతవానల్ని
గురుతుకు తెస్తుంది బావిపిల్లంగోవి.

నీడల విసనకర్రని విప్పి
ఎండలో సేదతేరుస్తుంది చెట్టు;
నీడల మడతవిసనకర్ర బావి,
వాడుకొమ్మంటుంది చేదలితో విప్పి.
పాతవానల రహస్యనిద్రల్ని తట్టి
పాతస్మృతుల సుడిగుండాల్ని గాలించి
ఆతపించే వర్తమానం కోసం
శైతల్యాన్ని తెస్తాయి చెట్టూ, బావీ, పిల్లంగోవీ.

(12-5-1972)

14. వర్షంలో ఊగే చెట్లు

సాగరంలా
ఊగుతోంది.
భోరున కురిసే వర్షంలో
పారం కనిపించని తోట
అహర్నిశీధులు క్షోభిస్తుందేం?
మహాసముద్రం చోద్యంగా ?
గుండెల్లో నిత్యం వానలు
కురుస్తో ఉంటాయి గావును.

అంత కల్లోలంలోనూ
ఎగిరిపడి కసిరేసే
వృక్షతరంగాల్నే
పక్షులాశ్రయిస్తాయేం?
తూర్పున నల్లటి ఉచ్చులు
తుఫాను పన్నుకుంటూ రాగా
చప్పున సాగరవృక్షాగ్రానికి
తప్పించుకుంటాయిట ఓడలు

మూలాల్ని ప్రశ్నించే గాలికి
కూలుతాయి మహావృక్షాలు,
ఊగుతాయి ఆ శూన్యంలో
ఊడిన వేళ్ళ ప్రశ్నార్థకాలు
చుట్టుకుపోయిన మహాసముద్రాల
అట్టడుగున మిగుల్తాయి
బలిసిన ప్రశ్నార్థకాలతో
కుల్కులలాడే మహానగరాలు.

భుజాలు పతనమైనా
బీజాలూ ద్విజాలూ ప్రసరిస్తాయి
కొత్తనీడల్ని పాతుతాయి
కొత్తపాటల్ని మొలకెత్తుతాయి
జలనిధికీ, ఝంఝ కీ
అలజడి పైకే కానీ
హృదయాలతి ప్రశాంతమట.

(21-3-73)