మృత్యు వృక్షం

4. ఫ్యాను కింద లోకం

ఎరుపెక్కిన కన్నులతో
ఎండ పొంచుంది బైట,
నా గదిలో మంచంపై
ఈగలా అంటుకుని
కప్పుకేసి చూస్తో
కదల్లేని నేను.

కదల్లేని నాపైన
కదలాడే సాలీడు
పలుకాళ్ళు ఆడిస్తో
తలకిందులు ఫ్యాను,
తన మాయాజాలంలో
తగుల్కున్న బందీని.

తగుల్కున్న బందీని
ఎగతాళిగ పిలుస్తో
కటి ఊపే గోడమీది
క్యాలెండరు తార
కృత్రిమావేశం తప్ప
కదలికలేని గది.

కదలిక లేని గది బైట
అదయార్కుని వాడికి
తెగిపడిన పగటి బంటి
ఎగరలేని డిప్పల్లా
భూవియత్తులు రెండూ
జీవముడిగి పడుతున్నాయి.

జీవముడిగి పడుంటే
చేతనా ప్రపంచం,
విపరీత చేష్టలతో
వెక్కిరిస్తున్నాయి జడాలు :
తలకిందులు ఫ్యాను కింద
తలకిందులు లోకం.

(24-4-72)

5. వర్షాల్లో కాలేజి

కలత నిద్దరోయే చెరువుల
కళ్ళు తెరిపించి,
చేతులెత్తేసిన చెట్లకు
కర్తవ్యం బోధించే వాన
మా కాలేజికి రాత్రంతా
మహోపన్యాసం దంచినట్టుంది.

పొద్దున వెళ్ళి
చూద్దును కదా
కాలేజి పునాదుల్నించి
వేలాడుతున్నాయి నీడలు
మెరిసే నీళ్ళలో
మెల్లిగా కదుల్తో.

కాలేజి నిజస్వరూపం
కళ్ళెదుట నిలిచినట్టుంది :
పంచరంగుల దారాలు వేలాడుతో
మగ్గంపై సగం నేసిన తివాచీలా ఉంది.

నాయుడుగారే కాంతులతో
నేయాలనుకున్నారో కాలేజిని
ఇప్పుడు బోధపడింది నాకు.
బిగుసుకున్న మన హృదయాల్లోకి
గగనపు లోతులు దింపాలనీ,
తెరిచికొన్న పసికళ్ళల్లో
తెలిమబ్బులు నడిపించాలనీ.

కుంటినీడ వంటి కుర్రతనానికి
నీటిరెక్కల్ని అతికించాలనీ,
నాయుడుగారనుకునుంటారు.

నాయుడు గారి రంగుల తివాచీ
నేత సగంలోనే ఆగింది.
ఇవాళ కాలేజికి నిండా
ఎగజిమ్మిన కాంతులు
ఇంకిపోయి, చివరికి
ఏ మూల గుంటలోనో
తారకం గారి కళ్ళల్లో
నాయుడు గారి జ్ఞాపకంలా
తళుక్కుమంటాయి కావును.

(5-10-1975)

6. దాహం

వేసవి గాడ్పులకి
దాహపు ఖర్జూరచెట్టు
యెడారి గొంతులో
అమ్ములపొదిలా
విచ్చుకుని
గరగరలాడుతోంది.

చల్లటి నీళ్ళు
గొంతు దిగుతోంటే
ఎంత హాయి.
ఇంకా తాగాలనుంటుంది కాని
కడుప్పట్టదు.

ఇప్పుడు __
నీకు వచ్చిన స్వర్గం
కోరుకొమ్మంటే,
అంతులేని మంచినీళ్ళూ
అంచుల్లేని దాహమూ
పుష్పకములాంటి పొట్టా
కోరుకొంటాను.

ఆ యెడారిలో
బారలేసుకొంటో
ఒంటెనై
సూర్యుడిబంతిని
సూటిగా ఎగరేసి,
దాహపు నావలు
వికసించే
మంచినీళ్ళ సముద్రంగా,
పొడుగాటి కాళ్ళని
తెడ్లు వేసుకుంటో
యెడారి ఓడగా,
అ ల ల ల ల ల లు గా,
ఊగుతో
ప్రయాణిస్తాను.

(14-7-74)