మంత్రి – మహిషం

మంత్రి – మహిషం – 18

మహిషం, సామాన్య జంతువు కాదు. మానసం కలది. ఎవరినైనా పోషించగలననే ధీమా కలది. అందుకే, దాని ప్రతిజ్ఞ ఏమిటో వివరిస్తున్నాడు మంత్రి.

మూఢాః కేచి దుపాశ్రయంతి ధనికాన్
క్లిశ్యంతు నశ్యంతు వా
యో మా మాశ్రయతే తమేవ బిభృయా
మాత్మప్రయాసై రితి
మృ ష్టాన్నైక వదాన్య సైరిభపతే
హుంభా రవ వ్యాజతో
ఘంటా ఘోష పురస్సరం వితను షే
శమ్య క్ప్రతిజ్ఞా మపి.

“కొందరు మూర్ఖులు, ధనవంతులను ఆశ్రయించుకు బతుకుతూంటారు. వాళ్ళు కష్టాల పాలుకానీ, చావనీ, మన కనవసరం. నన్ను ఆశ్రయించినవారికి నన్ను కష్టపెట్టుకునైనా సరే, పోషణ జరిపిస్తాను.” అంటూ నీ మెడలోని గంటమోత సాక్షిగా, “హుంభా” అని ధ్వనిచేసే నెపంతోనూ, ప్రతిజ్ఞ చేస్తున్నావయ్యా, సైరిభపతీ! మృష్టాన్నదాతా!!

ఆ ప్రతిజ్ఞ అర్ధం చేసుకున్న వాళ్ళు బాగుపడతారు. కానివాళ్ళు కష్టాలపాలవుతారని మంత్రి స్పష్టం చేస్తున్నాడు. నీ గుణగణాలను ఎంత పొగిడినా తనివి తీరదు. తలుచు కొనేకొద్దీ అవి ప్రశంసనీయాలే నంటున్నాడు మంత్రి.

ఖ్యాతా నాహరతు క్రతూ నపి శతం
క్రూరం విధత్తాం తపో
యోగాభ్యాస ముపైతు వా కలయతాం
తీర్థాటనం వా పునః
త్వ త్సందర్శన మంతరా న మహిష
ప్రాప్నోతి లోక శ్శుభాన్
హం హో ప శ్వథమోపి సైరిభ గుణై
శ్శ్లాఘ్యోసి లోకోత్తరైః.

ఎవరు కానీ సుప్రసిద్ధంగా జ్యోతిష్టోమం మొదలైన యజ్ఞాలు చెయ్యవచ్చు గాక, కఠిన నియమాలతో తపస్సు చేయవచ్చు గాక, అష్టాంగ యుక్త చిత్తవృత్తి నిరోధకమైన యోగాభ్యాసం చేయవచ్చు గాక! అలాగే, ధనుష్కోటి, ప్రయాగ మొదలైన తీర్థాలు తిరిగి స్నానాలు ఆచరించవచ్చుగాక, ఒకసారి కాదు మళ్ళీ మళ్ళీ చేయవచ్చుగాక! అయినప్పటికీ, నీ దర్శనం లేకుండా నీతో సహవాసం లేకుండా, ప్రజలు శుభాలు, యజ్ఞ దాన భోగాలు, పొందజాలరు. నువ్వు అందరూ లోకువగా చూసే పశువువే కావచ్చు. కొందరి దృష్టిలో నికృష్టుడవే కావచ్చు. ధాన్యాలు ఉత్పత్తి చేయడం ద్వారా, యజ్ఞ హవిస్సులు ఉత్పత్తి చేయడం ద్వారా, జనజీవనానికి ఉపకారం చేస్తూ ప్రశంసా యోగ్యత సంపాదించుకున్నావు. ఇది ఆశ్చర్యకరమే!!

మంత్రి – మహిషం – 19

నిజమాలోచించి, నిష్పక్షపాతంగా చెప్పవలసి వస్తే ఈ ప్రపంచపు నిలకడతనానికి, దున్నపోతే ఆధారమని నిరూపిస్తున్నాడు మంత్రి.

త్వా మాదౌ గణయంతి మూఢగణనా
ప్రస్తావనా యాం జనా
స్తే మూఢా మహి మావిద స్తవ న తే
మృష్యామి తాం వాచ్యతాం
స స్యోత్పత్తి నిదాన మ స్యథ హవి
ర్మూలం సురాణా మసి
బ్రూమః కిం బహు కాసరేంద్ర జగతా
మాధారతాం గా హసే.

ఈ లోకంలో జనం చిత్రం చూశావా? మూర్ఖుల్ని లెక్కించే సందర్భాల్లో మొట్ట మొదట నిన్ను లెక్కిస్తూంటారు. వాళ్ళు వట్టి మూర్ఖులు. అంతే కాదు, నీ మహిమ బొత్తిగా ఎరగనివారు. అటువంటి వారి మాటల్ని సహించను. ధాన్యాల ఉత్పత్తికి నువ్వే ఆధారం. దేవతలకు యజ్ఞాలలో సమర్పించే హవిర్ద్రవ్యాలను ఉత్పత్తి చేయడానికి సైతం నువ్వే మూలాధారం. అసలిన్ని మాటలనుకోవడమెందుకు? ఈ ప్రపంచం మొత్తానికే నువ్వు మూలాధారం. నిన్ను ఇంత శక్తిమంతుడ్ని, మూర్ఖుల జాబితాలో జేర్చిన వారే మూర్ఖులు అంటూ ఈసడిస్తున్నాడు. రాజ గృహ ద్వారాలు పట్టుకొని వ్రేలాడే వారేపాటి వారు? ఆ పని చేసిన దోషం నశించడం కోసం, మంత్రి, మహిషానికి నమస్కరిస్తూ ఇలా అంటున్నాడు.

దుర్వాణీక సముద్య దుద్భట భట
శ్రేణీ కర వ్యాపృత
ద్రాఘీయ స్ఫుట ధూమవర్తి విగళ
ద్ధూమాంధకారా వృతే
తన్నిష్ఠీవన పూతిగంథ భరితే
భూపాల బాహ్యాంగణే
వాసక్లేశ హరాయ సైరిభపతే
మన్నాధ! తుభ్యం నమః.

మహిషరాజా! నీకు నా నమస్కారం. ఎందుకంటే, నువ్వే నా ప్రభువ్వి! చాలాకాలంగా, నిలబడడానికి దుర్భరంగా వుండే రాజగృహాల వాకిళ్ళలో నేను పడిగాపులు కాశాను. పొగరుతలకెక్కిన రాజభటులు మెరిసే కత్తులు ధరించి, ద్వారంలో నిలుచుండి, వచ్చిన వారి యోగ్యత విచారించకుండా కటువుగా మాట్లాడుతూ, పొడుగాటి పొగాకు చుట్టలు, చేత వహించి పొగ వదులుతూ, ఆ పొగ దట్టంగా చుట్టూ అలుముకొనేలాగ చేస్తూ, తుపుకు తుపుక్కున ఉమ్ముతూ, దుర్గంధం నింపుతూండే రాజద్వారాలవి! అటువంటి చోట నిలబడిన కష్టం హరించి పోవడానికి గాను నీకీ నమస్కారమయ్యా అని పాపపరిహారం చెప్పుకుంటున్నాడు మంత్రి.

మంత్రి – మహిషం – 20

కవులూ, ఆశ్రితులూ, తమ ప్రభువుల శృంగార చేష్టల్ని గొప్ప చేసి వర్ణిస్తూవుంటారు. ఆయా శృంగార చేష్టలు తప్ప, ఆ ప్రభువులు తమ జీవితాల్లో ఏమీ సాధించిన దాఖలాలు కనిపించవు! మరి, నాకు ప్రభువువైన, ఉదారుడవు, శ్రమజీవివి అయిన నీ శృంగార చేష్టలు నేను వర్ణిస్తే మాత్రం తప్పేముంది? అని సంజాయిషీ చెప్పుకుంటూ వర్ణనకు దిగుగున్నాడు మంత్రి.

కేదారే మహిషీ మనోజ గృహ మా
ఘ్రా యోన్నమ య్యావనం
దంతాన్ ఖురైః క్ష్మాం ఖనన్
ప్రత్యగ్రాయిత సూరణాంకుర నిభం
త త్కించి దుజ్జృంభయ
న్నానందం మహిషేంద్ర నిర్విశసి య
త్త ద్ద్రష్టృ నేత్రోత్సవః.

మహిష రసిక రాజేంద్రా! నువ్వు వరిపొలంలో, నీ ప్రేయసి గేదె “మనోజగృహాన్ని” మూజూసి, మోరపైకెత్తి, పళ్ళు బయట పెట్టి (పళ్ళికిలించి) వికృతంగా కూతకూసి, గిట్టలతో నేలను తవ్వి, కొత్త కందమొలక వంటి “ఒకానొకదాన్ని” (నీ అంగభాగాన్ని) రిక్కబెట్టి, ఎంత ఆనందం అనుభవిస్తున్నావో! చూసే వాళ్ళకు ఎంత కన్నుల పండువుగా వుంటుందో ఎంతని చెప్పేది? మంత్రి ఈ “నాటు వర్ణన”, తెలిసి తెలిసి చెయ్యడంలో వుద్దేశం, కవులు తమ ప్రభువుల మితిమీరిన శృంగార వర్ణనల పట్ల తనకు గల ఏవగింపు ప్రకటించడం. వాళ్ళది శృంగారమైతే, నీ శృంగారం వర్ణనీయం కాకుండా పోతుందా? అని మహిషాన్ని రెచ్చగొట్టడం!!

పోనీ అదెందుకు? వద్దులే నీలో ఋషీశ్వరుణ్ణి చూసే ప్రయత్నం చేస్తానంటూ పూర్తిగా వేరైన వర్ణనకు ఉపక్రమిస్తున్నాడు మంత్రి.

పర్ణానాం పయసాం చ నిత్యమశనైః
కాలం క్షిపన్ వర్తసేనిష్కంప స్తపసి స్థితో హి నిభృతం
త్వం పర్ణశాలాంతరే
శేషే స్థండిల ఏవ చాను దివసం
ద్వి స్త్రి ర్ని మజ్జ స్యపి
ప్రార్థ్యం కిం తవ? కాసరేంద్ర య దృషే
శ్చర్యాం సమాలంబ సే.

కాసరేంద్ర! నువ్వు ఋషి మాదిరిగానే ఆకులు తిని బతుకుతున్నావు. కేవలం జలభక్షణ చేస్తున్నావు. కుటీరంలో నివసిస్తూ, చలనం నిరోధించి కాలం గడుపుతున్నావు. ఋషి పర్ణశాలలో తపస్సు చేసుకుంటూనట్టే, నువ్వు కూడా (తపసి – మాఘమాసంలో) పర్ణశాలలో గడుపుతున్నావు. ఆయనగారి మాదిరిగా, కటిక నేలమీద పడుకుంటున్నావు. ఋషి రోజూ రెండుసార్లు స్నానం చేస్తే, నువ్వు రెండుమూడు మార్లు నీటిలో మునుగుతున్నావు (స్నానమాచరిస్తున్నావు). ఇదంతా చూడగా నువ్వు ఋషి చర్యను అనుసరించగోరితే, అంతకంటె కావలసిన దేముంది? అనిపిస్తోంది.

(అసంపూర్ణం)

[త్వరలోనే పూర్తి పాఠం అందించడానికి ప్రయత్నిస్తున్నాము – సం.]


ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

రచయిత ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గురించి:

అభ్యుదయ కవిగా పేరొందిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (1944-2019) తండ్రి, కవి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి. చిన్ననాటినుండే సాహిత్యవాతావరణంలో పెరిగి విద్యార్థి దశలోనే రచనావ్యాసంగం చేపట్టారు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో (విజయవాడ) సబ్-ఎడిటర్ గా 1969-76 మధ్య పనిచేశారు.

 ...