మంత్రి – మహిషం

మంత్రి – మహిషం – 15

సేవించుకోదలిచినప్పుడు మాన మర్యాద లెరిగిన, వివేకం కలిగిన “పాలకుడు” దొరకడం కూడా అదృష్టమే! అంటున్నాడు మంత్రి.

పైశున్యం నహి కర్ణగామి భవతో
నాంచ స్యయే వంచనా
మేకా కారత యైవ తిష్ఠసి సఖే
సర్వా స్వవస్థా స్వపి
భూపాలై రల మవ్యవస్థ విషయై
ర్దిష్ట్యాద్య లబ్దోసి నః
శ్రీమత్కాసర సార్వభౌమ భవతా
నా ధేన మోదామహే

మిత్రమా! కాసర సమ్రాట్`! చెప్పుడు మాటలే పనిగా పెట్టుకొన్న కొండెగాళ్ళ మాటలు, నీ చెవి కెక్కవు. నువ్వు ఎవరినీ మోసం చేయవు. ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు ప్రవర్తనలో హెచ్చు, తగ్గులు లేకుండా ఒకే విధంగా వుంటావు. ఈ రాజులున్నారు చూశావా, వీళ్ళెప్పుడు అరాచకంగా వుంటారు. (వారి చేతల్లో మాటల్లో, నిలకడ వుండదు) చాలు చాలు. వాళ్ళు వద్దు. మా అదృష్టం కొద్దీ నువ్వు మాకు దక్కేవు. నీ వంటి ప్రభువు దొరికినందుకు మాకెంతో ఆనందంగా వుంది. ఆశ్రయించుకున్న వాళ్ళను రక్షించడంలో అగ్రేసరుడైన నిన్ను ఆశీర్వదించకుండా ఉండలేనంటున్నాడు మంత్రి.

న స్వప్నేపి దరిద్రతా ప్రసజతి
త్వా మాశ్రితానాం నృణాం
కో శే ద్రవ్య చయైః ప తంతి బహువ
శ్స్యాల్యాదయో వ్రీహయః
ఇత్థం సర్వ జనావన ప్రతి భువే
దీనా వళీ బంధవే
భూ యస్యో మహిషాధిరాజ భవతే
భూ యా సుర ద్యాశిషః.

నా మహిష రాజా! నిన్ను నమ్ముకొని బతికే మనుషులకు కలలో కూడా పేదరికాన్ని దరిజేరనివ్వవు. కోశాలలో, కొట్టాలలో ధన సంపద, ధాన్య సంపద వచ్చి పడతాయి. (అంటే డబ్బుకి డబ్బు, వివిధ ధాన్య రాశులకు రాశులు వృద్ధి అవుతాయి). ఇలాగ ప్రజలందరిని రక్షించడానికి కంకణం కట్టుకున్న దీన జనబంధువువైన నీ కివే మా ఆశీర్వాదాలు. నీకు ఏ రోగాలు లేకుండా, దృఢమైన శరీరం కలకాలం వుండాలని కోరుకుంటున్నామని సారాంశం.

నీ ఆరోగ్యం మా ఆరోగ్యం. నీ సేవ మా భాగ్యం. నీ దయా వీక్షణం మాకు రక్షణం. పది కాలాలపాటు నువ్వు బాగుండాలని కోరుకుంటామయ్యా! అని మంత్రి కృతజ్ఞతా వచనం!

మంత్రి – మహిషం – 16

రోజూ దుష్ట పాలకుల కటువైన మాటలు విని విని విసిగి పోయిన చెవులకు, మహిష కంఠధ్వని, అమృతపాయంగా వినిపిస్తుందంటున్నాడు మంత్రి.

నిత్యం హంత వివర్ధమాన సుమహా
దుష్ప్రాభవోత్సాహ వ
ద్దు ర్భూపాలకృపా లవ చ్యుత రుశ
త్యాకర్ణ నో దీర్ణయోః
నిర్వ్యా జం మమ కర్ణయో స్త్య మమృతం
హుంకారవం చా కృథా
దిష్ట్యా సంప్రతి సీద సీహ మహిష
క్షేత్రేషు కృ ష్యున్ముఖః.

ఒకనాటి కొకనాడు పెరిగిపోతున్న దురభిమానం, దుష్పరిపాలనం గల చెడ్డ పాలకులు మాట్లాడే మచ్చుకైనా దయలేని, కటువైన, మాటలు విని విని, చెవులు చిల్లులుపడ్డ నాకు, నువ్వు ఏ కారణం లేకుండానే చేసే హుంకారం అమృత సమానంగా వినిపిస్తోంది. అటువంటి నువ్వు, ఓ మహిషరాజా! దైవవశాత్తు (విధి ప్రేరణవల్ల) పొలం దున్నే నిమిత్తం వరిమళ్ళలో ఉత్సాహంగా శరీరాన్ని కష్టపెట్టుకుంటున్నావు. సుఖపడవలసిన నీకు కష్టాన్ని, సుఖాలకు తగని దుష్టులకు వైభవ సమృద్ధిని, ఆ “విధి” కల్పించిందని మంత్రి ఖేదపడుతున్నాడు.

నిజంగా దయగలిగి రక్షించగల మహిష రాజాధిరాజును ఆశ్రయించకుండా, కొందరు దుష్ట ప్రభువుల్ని పట్టుకు వ్రేలాడతారెందుకు? అని మంత్రి అసహనంతో ప్రశ్నిస్తున్నాడు.

మూఢా భాస ధనోష్మ భీష్మవదన
క్ష్మాపాల పాశాంగణే
ష్యాశా పాశ వికృష్యమాణ హృదయా
వ్యర్ధాం స్థితిం తన్యతే
అస్మ ద్భూపతి మాశ్రయంతి న బుధాః
కామప్రదం సైరిభం
యోస్మా నక్షతి రక్షతి క్షితిఫలై
సౌమ్య స్సమస్తై రపి.

మూర్ఖులు, నిందితులు, డబ్బున్నది కదా అని ఎప్పుడూ రుస రుసలాడుతూ ముఖాన్ని కోపంతో మటమట లాడించుకొంటూండే తుచ్ఛ పాలకుల, ఇంటి వాకిళ్ళలో పడిగాపులు కాస్తూ, వాళ్ళేదో ఒరగబెట్టక పోతారా అనే ఆశాపాశాలు యీడ్చి పెడుతూండగా నిరర్ధకంగా కొందరు గడుపుతున్నారు. అంతే గాని కోరిన కోరికలు తీర్చి, ధనధాన్యాలు సమకూర్చి, రక్షించగల ప్రసన్నమూర్తి మా మహిష ప్రభువును ఆశ్రయించరుకదా!

తుచ్ఛులు, మదమత్తులు, అయిన పాలకుల వెంట ఎందుకు పడి, అవమానపడతారయ్యా? మహిషాన్ని నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటే ఎంత సుఖం!! అని మంత్రి గట్టిగా మందలిస్తున్నాడు.

మంత్రి – మహిషం – 17

దున్నపోతుకు ఏమి తక్కువ? మహారాజయోగమంటే ఏమిటి? మనం అనుకోవడంలోనే వుంది. ఆ మాటకు వస్తే, దున్నపోతుకు రాజభోగాలు తక్కువా? అని ప్రశ్నించి, అవేమిటో చెపుతున్నాడు మంత్రి.

గోష్ఠం తే నృప మందిరం శకృ దపి
ప్రాయేణ కస్తూరికా
పృధ్వీరేణు సముత్కర స్తు వపుషః
ప్రత్యగ్ర పిష్టాతకః
నిర్వ్యా జోపకృతి ప్రవీణ మనసో
మానేన ల బ్ధోన్నతే
స్సర్వం తే మహిషాధిరాజ త దిదం
భూషా విశేషాయతే.

మహిష రాజాధిరాజా! నీది మహారాజ యోగమే! మహారాజులకు భవనాలుంటే, నీకు నువ్వుండే పశుశాలే రాజభవనం. వాళ్ళకు ఒంటికి పూసుకొనడానికి కస్తూరి వుంటే, నీ పేడ నీకు కస్తూరి. వారి బట్టలకు, వాసన సమకూర్చే పరిమళ ద్రవ్యం “పట వాసకం” వుంటే, నీకు నీ నేల ధూళే “పట వాసకం”! కారణం లేకుండానే ఇతరులకు ఉపకారం చేయడంలో నిపుణుడివి. ఉన్నతమైన మనస్సు కలిగి ప్రతిష్ఠ సంపాదించుకున్న వాడివి అయిన నీకు అందుబాటులో ఉన్నవి గొప్ప అలంకారాలుగా పరిణమిస్తున్నాయి.

మహిషం, నానా కష్టాలు పడి, పాలకుడి ధనాగారాన్ని నింపుతూండగా, ఆ పాలకుడు మాత్రం దానికి ద్రోహం చేస్తున్నాడని మంత్రి యీసడిస్తున్నాడు.

హా! జానుద్వయసే దురుద్ధరపదే
పంకే వహన్` లాంగలం
పశ్చా చ్ఛూద్రకర ప్రతోద ఘటనా
సంజాత భూరి వ్రణః
క్లేశం యాసి హి కోశపూరణ కృతే
రాజ్ఞ స్స తు ద్రుహ్యతి
బ్రూమః కిం మహిషేంద్ర! తే శివ శివ
త్వ ద్భాగ సర్వస్వహృత్.

మహిషేంద్ర! మోకాలి లోతు బురదలో, కాలు కదపడానికి వీలులేని స్థితిలో, నాగలి మోస్తూ నీ వెనక వైపున నిలబడి ఆ నాగలి నడిపించే పెద్దకాపు ముల్లు గర్రతో పొడవడం వల్ల ఏర్పడిన పెద్దగాయంతో, బాధను సహిస్తూ పాలకుడిగారి బొక్కసం నింపడానికి కష్టపడుతున్నావు. ఇంత చేస్తున్న నీ పట్ల ఆయన గారికి కృతజ్ఞత ఏమైనా వుందా? శివ శివా! ఇంక చెప్పేదేముంది! నీ సర్వస్వం దోచుకుని నీకు ద్రోహమే చేస్తున్నాడయ్యా!

ఆయాస పడేది నువ్వు! అందలాలెక్కినవాడు దోపిడిగాడు! వాడికి కృతజ్ఞత ఎక్కడిది! ద్రోహమే చేస్తాడని గమనించమని మంత్రి నిప్పులు చెరుగుతున్నాడు.