చంద్రరేఖావిలాపము

కట్టినకోకలు కట్టక
పెట్టిన మణిభూషణములు పెట్టక సిరులం
దొట్టి విటకోటి కొలువగ
దిట్టతనంబునను కొలువుదీర్తు కడంకన్‌

జూదంబుల పటువీణా
నాదంబుల దండలాస్యనటనముల మతుల్‌
భేదించి విటజనంబుల
చే దండుగ కొందు ధనము చెప్పగ నేలా

వలిప చెంగావి పావడ కటిస్థలి తాల్చి
జిలుగైన సరిగంచుచీర కట్టి
కులుకుగుబ్బల మీద మలయజాతము పూసి
కట్టువాపని కంచుకంబు తొడిగి
లీలగా సిగవేసి పూలదండలు చుట్టి
ముత్యాలతాటంకములు ధరించి
కడియాలు కుంటేళ్ళు గంట లొడ్డాణంబు
బవిరలు బావిలీల్‌ బన్నసరులు

ఉంగరంబులు కెంపులు ముంగరయును
మొదలుగల సొమ్ములను దాల్చి మురిపెమమర
తిరుగుచును విటకోటుల ధృతి కలంచి
హొన్నులు గడింతు మరునాన చిన్నదాన

నా వగ నా యొసపరినడ
నా వాలుంజూపుకోపు నా మాటలతీ
రావంతయు నీ వెరుగ వ
హా వన్నెలకానికూతురా యిది మేరా

చండ్లు పడె పండ్లు కదలెను
కండ్లకు చత్వార మొదవె కాయము ముదిసెన్‌
గోండ్లును భగమును బిగిచెడి
దిండ్ల తిరుగు నేర్పు తప్పె ధృతి మరపూనెన్‌

వృద్ధత్వ మివ్విధంబున
సిద్ధించెను కాని యిపుడు చిల్లరవిటులన్‌
బద్ధానురాగులుగ అని
రుద్ధజనకు కేళి తేల్చి రో వెల కొననే

కాన నీవును నావలె కాముకులను
వంచనము చేసి విత్తమార్జించవలయు
కాక యాతనిపై మోహకాంక్ష పూన
జనునె వాడెంత సౌందర్యశాలి యైన

అసదృక్కాముకుడౌటచే తను తదీయాంగంబు నందెంతయున్‌
రసపొక్కు ల్బలుబిళ్ళలు న్బహుళ ఘోర స్ఫార జాగ్రత్ప్ర మే
హసుఖవ్యాధులు మానకుండును సదా హా వాని పొందూనినన్‌
వెస నంటుంగద నీ భగస్థితి భయావిర్భూత భావంబునన్‌

అది చెడుట నీవు చెడుటయె
కద యెవ్వరు నిన్ను తేరి కనుగొనకయె న
వ్వుదు రొక కాసు నొసంగరు
తుది నీ బ్రతుకేమి యగునొ తోచదు నాకున్‌

అనుచు బోధసేయునట్టి మాయలమల్లి
బేసబెల్లి వగలవేసవెల్లి
ఉలికితెగులు బొల్లి నుల్లసిల్లెడు తల్లి
చూచి యా బొజుంగుజోటి పల్కె

అమ్మా నా మానస మిపు
డమ్మానిసిరేని మీద అంటి వదల దిం
కిమ్మాడ్కి చెప్ప నేటికి
బొమ్మా మరుచేతికీలుబొమ్మా సరగన్‌

ధనమేమి ప్రాతి నా కది
ఘనమే ఘనమేచక ప్రకట కచ వాడే
పెనుమేటి పెనిమిటి కదా
వినుమే నిక్కంబు విన్నవించెద తల్లీ

పెల్లు కల్లలల్లి బొల్లిమాటల చల్లి
మెల్లమెల్ల ఇల్లు గుల్లసేయు
తల్లికలుగు లంజె నుల్లోలమతి చేరు
పల్లవులకు సౌఖ్య మిల్ల జగతి

రమ్మంచును నమ్మించును
పొమ్మంచుం కోక లాకు పోకల్‌ రూకల్‌
క్రొమ్మించు సొమ్ము లెమ్మిం
తెమ్మంచును లాగు లంజె తెగి విటవరులన్‌

లఘువర్ణ గురువర్ణ లక్షణం బరయక
సరసపదార్థముల్‌ సంగ్రహించి
వృత్తభంగమునకు వెరపింతయును లేక
గణనిర్ణయనిరూఢి ఘనత కనక
అపశబ్దములకు రోయక సంధివిగ్రహ
ప్రాణహాని విచారపరత దక్కి
భావం బెరుంగక పండితోత్తములతో
కలయ నొల్లక మహాకపటమూని

యతుల పోనాడి మూర్ఖసంగతి వహించి
తిరుగు వెలబోటి జీవనస్థితి గణింప
కుకవి కృత కావ్య రూపానుగుణత పూని
అరసి చూచిన నిస్సారమగును పిదప

లంజెయును బీరకాయయు
ముంజెయు బాల్యమున చాల మోహము గొలుపున్‌
రంజనచెడి ముదిసిన వెను
కం చూడరు ముట్టబోరుగద నరులెందున్‌

పలువలు చెంతజేరి యొక పాతిక నేబులు చేతికిచ్చి ఛీ
మొలగల బట్టవిప్పి తగ ముందుగ పాన్పున నుండి వార లే
పలుగుదనంపు గూటముల బాధలు వెట్టిన నోర్చి పూనికన్‌
కులుకుచునుండు అప్పడుపుకూటి వెలంది కొలంబుపెద్దయే