తలనొప్పియు తాపజ్వర
మలసటయును మిగుల పొడమ నసురసు రనుచున్
నిలువంగ బలము చాలక
తలిమముపై వ్రాలి దాని తలచుచు నుండెన్
అని నంబి నారసింహుం
డనువొప్పగ నిట్లు చెప్ప నా తంబళి వీ
రన యావలికథ లెస్సగ
వినయంబున చెప్పుమనుచు వెస వేడుటయున్
నీచచరిత్ర వారరమణీభగ రుక్తతగాత్ర నిత్య దు
ర్యాచకమిత్ర సజ్జనపదార్థ పరిగ్రహణైకసూత్ర దు
ష్కాచ పిశంగనేత్ర నృపకర్మ మహాలతికా లవిత్ర శ్రీ
రాచి నృపాల గోత్ర వనరాశి కనద్ బడబాగ్నిహోత్రమా
దురాలాప దుర్దోష దుర్మార్గ వర్తీ
ధరామండలఖ్యాత ధౌర్య్తాపకీర్తీ
పరస్త్రీ రతాసక్త భావప్రపూర్తీ
స్థిరాయుస్స్థిరాజాత దీర్ఘోగ్రమూర్తీ
ఇది శ్రీమజ్జగన్నాథదేవ కరుణాకటాక్ష వీక్షణానుక్షణ సంలబ్ధ సరసకవితావిచిత్ర సలలితాపస్తంబసూత్ర కౌండిన్యసగోత్ర కూచిమంచికుల పవిత్ర గంగనామాత్యపుత్ర మానితానూన సమాన నానావిధరంగ త్రిలింగదేశ భాషావిశేష భూషితాశేష కవితావిలాస భాసురాఖర్వ సర్వలక్షణసార సంగ్రహోద్దామ శుద్ధాంధ్రరామాయణ ప్రముఖ బహుళ ప్రబంధ నిబంధన బంధురవిధాన నవీనశబ్దశాశన బిరుదాభిరామ తిమ్మకవిసార్వభౌమసహోదర గురుయశోమేదుర వివిధవిద్వజ్జనవిధేయ జగన్నాథనామధేయ ప్రణీతంబైన చంద్రరేఖావిలాపం బను హాస్యరస ప్రబంధరాజంబునం బ్రథమాశ్వాసంబు సంపూర్ణము.
ద్వితీయాశ్వాసము
శ్రీరహితగేహ! చంద్రీ
వారవధూ మదనసదన వర్ధిత సుఖరో
గారూఢిత మృదుదేహ! వ
నీరంగ విహారసాంద్ర! నీలనరేంద్రా!
ఆకర్ణింపుము తావకీన కథావిధానంబు యథార్థంబుగా దొల్లి శ్రీశివబ్రాహ్మణ వర్ణాగ్రగణ్యుండైన వీరభద్రభట్టారునకు శ్రీమద్వైఖానస వంశోత్తముండగు నంబి నరసింహాచార్యుం డవ్వలికథ యిట్లని చెప్పందొడంగె
అక్కమలేక్షణ యది గని
చిక్కెంబో వీడు నాదు చేతికటంచున్
నిక్కుచు తల్లికడకు చని
మక్కువ నక్కథ యెరుంగ మరువున తెలుపన్
ఇట్లు దెలుప వేంకటసాని యిట్లనియె
నీ తండ్రి క్రతువు కనుగొన
నాతతగతి నీలనృపతి యరుదెంచి నినున్
రాతిరి గని మోహించుట
లాతులలో తేనెపుట్టినట్లయ్యె కదే
ఏమేమి, నీలభూపతి
నీమీదం కన్నువైచి నిష్టురజవవ
త్కామ శరజాల నిర్దళి
తామేయ స్వాంతుడయ్యెనా మేలుభళీ
కూతుర, యాతుర పడి నీ
వాతని చేరంగబోకు, మటుతాళుము, వా
డేతెంచు సంచులను ధన
మాతతగతి నించుకొంచు వ్యామోహమునన్
వలపెంత నీకు కలిగిన
కులధర్మము తప్పరాదు కుమ్మరపురువుం
బలె తిరిగి పొట్టపెంపగ
వలె జుమ్మా ముద్దుగుమ్మ వగ నాయమ్మా
అని యనేకప్రకారంబుల లాలించి మేలెంచి తనకాలంబునాటి నాటకంబులు బూటకంబులు బోటిదనంబులు నీటులు కూటంబులమాటలు చాటుమాటులేక తేటతెల్లంబుగా నబ్బోటితో చాటందొడంగె
వేంకటశాస్త్రులవంటి ని
రంకుశులను మరులు కొల్పి యర్థము చాలన్
లంకించి నాకు నమ్మిన
కింకరులుగ చేసికొంటి కిమ్మనకుండన్
మున్నెంతవాడు వేడిన
కన్నెరికంబీక మీదుగట్టితి నీకై
మన్నన గైకొమ్మని విటు
లన్నిత్యము మాయచేసి లంకింతు వరాల్
ఒకడు కానకుండ నొక్కని రావించి
ఒకనిచెంత కేగుచుండి నడిమి
దారి నొకని కూడి తబ్బిబ్బు గావించి
ధనము కొల్లగొందు తవిలి ముందు
మందుల మంత్రంబులచే
విందులచే పూతచేత వీడెంబులచే
తందనపదముల ఆటల
మందులకావించి విటుల మానక దోతున్
అందలముల్ శతాంగములు అశ్వచయంబులు పాలకీలునున్
మందరశైలరాజనిభ మత్తగజంబులు వెంటనంటి రా
ముందర పొందుగా ధనముమూటలు మేటులు కాన్కలంపి నా
మందిరసీమ గాతు రసమాన నృపాలకుమారు లెప్పుడున్
నీకేమి చెప్పవలయును
లోకులెరుంగుదురు నాటిలో మదనుడహా
నాకనుసన్నల మెలగును
కాకుండిన నింతసొమ్ము గడియింతునటే
అప్పారాయని సభలో
మెప్పొందితి సాటి సానిమేళంబులలో
చెప్పిన పగ్గెగ నీమది
కిప్పుడు తోచును, మరెవ్వరిచ్చట సాక్షుల్
చెలమకు పిట్టలు చేరెడు
పొలుపున నా యింటిచుట్టు భోగాభిరతిన్
పలుగు గులాములు తురకలు
వలగొని కానుకలు కొనుచు వత్తురు సుమ్మీ