అని యనివారితమోహము
మనమున పెనగొనగ నతడు మరిమరి చూడన్
వనితయు నాతని తప్పక
కనుగొని యనురాగమొదవ కడక నుతించెన్
పరువంపు ప్రాయంపు తురకబిడ్డని రీతి
మట్టుమీరగ పాగ చుట్టినాడు
కులుకుజవ్వనపు బల్ గుజరాతి పాపని
వీలుగా ప్రోగులు వెట్టినాడు
ఆడుభాగవతుని జాడ గడ్దము మూతి
నున్నగా గొరిగించుకొన్న వాడు
డుబుడక్క కొమరుడు డుంక నిజారును
పుడమిజీరెడి నగల్ తొడిగినాడు
మడుగులోబడ్డ మహిషంబు మాడ్కి మేన
నందముగ మంచిగంద మలందినాడు
భళిర యీ నీలనృపతితో కలయ కలుగు
బాలికామణిదే కదా భాగ్యమరయ
ఖర ఘృష్ణి సదృశ తేజుడు
పరమాత్మజ తుల్య రూపశాలి సుభగ భా
సురవదనుడు హరిసన్నిభ
గురుతరగుణు డిట్టి రాచకొమరుడు కలడే
గుహ్యకేశ తుల్య గురువైభవుండు పీ
నోరుశాలి సమరభీరు డుర్వి
జనుల నమలుబుద్ధి చనువాడితని తేరి
వాసుదేవు డెట్లు చేసెనొక్కె
ఆ వాలుకన్ను లందము
పీవర భుజదండములును పృథుగండములున్
కేవల శోభాతనుడీ
భూవరు డర్మిలిని నాకు బొజుగగు నొక్కో
బూరుగు పెనుమ్రాను పొడవు, గానుగరోటి
వలయదేహము, దాకవంటి నోరు
పెనురసపుం బొల్లిపెదవులు, అలమైన
బుర్రముక్కును, క్రొత్త బోడిగడ్డ
మల జ్యేష్టకిరవగు వెళుపుమొగంబును,
పొడకంత తలకాయ, కుడితి గూన
బోలెడు బొజ్జయు, పొలసుకన్నులు, లావు
నడుము, రాపాడెడు అడుగు లౌర
పెద్ద యేనుగుకాలంత కద్దు శిశ్న
మిట్టి సౌందర్యనిధి భువి పుట్ట జేసి
నట్టి తామరపట్టి నేర్పరయ తరమె
చాల చదివిన వేంకటశాస్త్రికైన
నా పూర్వపుణ్యఫలమున
ఈ పురుషునితోడ నేస్తమెనసిన కూర్మిన్
రేపిచ్చెద మాపిచ్చెద
కాపట్యములేని నిండు కౌగిలితనికిన్
జడ కటిసీమ తూల, నిడుజన్నులు రొమ్మున వ్రేల, కొప్పు వె
న్నడరుచు చిందులాడ, పురుషాయితబంధ కళాప్రవీణతన్
చెడుగుడులాడి వీని ఘనశిశ్నపటుత్వ మహత్వ మెన్నుచున్
విడువక వీని కూడి మది వెర్రితగుల్కొన చేయుటెన్నడో
కూతుబుడమ, మర్లమాతంగి ఆకును
మూత్రంబుతో నూరి ముద్దచేసి
పచ్చిపనస తోడ బాగుగా మర్దించి
నూనెతోడను కూర్చి మేన నలుగు
పెట్టిన నుమ్మెత్తవిత్తులు గుండెత
ల్లడపాకు పసరు నుల్లాసమునను
కాల్మడి కలిపి పోకలు దానిలోపల
నానించి యెండించి లోనికిముడ
వీడియముతోడ పెట్టిన విడువకితడు
బంటు తెరగున నా వెనువెంట తిరుగు
నట్లు సేయగ అత డెన్న డబ్బునొక్కొ
మెల్లమెల్లన కలధనంబెల్ల దొబ్బ
కొందరు మలయుక్తముగా
మందిడుదురు మరులుకొనగ మా వారసతుల్
మందత చెందును విటుడటు
నింద గదా యటుల సేయ నృపవర్యునకున్
ఏలాగు మాటలాడుదు
ఏలాగున మరులు కొలిపి యెలయింతును నే
నేలాగు లోలుజేయుదు
నేలాగున కలుగువిత్త మెల్ల హరింతున్
అని చాల జాలినొందుచు
చనుగుబ్బల పైటజార్చి చక్కగనొత్తున్
మొనవాడిచూపు చూచును
పెనుకొప్పటు జారజేసి బిరబిర ముడుచున్
ఆవ ద్రావిన పసరమ ట్లది మెలంగ
చూచి నీలాద్రిభూపతి సొమ్మసిల్లి
మెల్లమెల్లన తెలివొంది కల్లుద్రావి
పరవశత నొందు చండాలు పగిది తోచి
వలబడ్డ మీను కైవడి, నిప్పుద్రొక్కిన
కోతి భాతిని, వెర్రిగొన్న కుక్క
పద్ధతి, కుడితిలో పడిన మూషికమట్లు,
శ్లేష్మంబులో ఈగ లీల, సన్ని
పాతి చందమున, వాతంపుగొడ్డు వి
ధంబున, లాహిరీదళము మిగుల
తినిన పాశ్చాత్యుని తీరున, ఉరివడ్డ
పక్షి కైవడి, పెనుపాము పగిది,
భూతమూనిన మనుజుని పోల్కి, బెట్టు
మందు మెసవిన మాన్యు మాడ్కి, దేహ
మెరుగ కెంతయు కళవళంబెసగ దాని
పై తలంపిడి కన్ను మోడ్పక యతండు