నీలాద్రివిభున కా కృతి
వాలాయము నిచ్చి సిరులు వడయగ వలెనం
చాలోల చిత్తమున తా
నాలోచన సేయుచుండె నాత్మజ తోడన్
అంత
కటకపు వేంకటసానికి
విటుడగుటను నూజవీడు విడిచి యచటికిన్
తటుకున కూతుం దోడ్కొని
మటుమాయలు పన్నుకొనుచు మచ్చిక చేరెన్
చేరిన దాని నతడు గని
కూరిమితో కౌగిలించుకొని మక్కువ నా
హారాదికంబు లిడుచును
మారక్రీడల చెలంగి మన్నన నునిచెన్
అది యెట్టిదనిన
పుట్టకాల్ సొట్టకేల్ వట్టివ్రేలుం జెవుల్
పట్టు లేకట్టిట్టు బిట్టు కదలు
మిట్టపండ్లును పెనులొట్ట కన్గవయును
బిట్టులై చుట్టలై నిట్టనిగిడి
దట్టమై బలు కొంగపిట్ట చట్టువలను
కొట్టంగ సమకట్టినట్టి తెలుపు
రెట్టింప నౌదలబుట్టి చెంపలమీద
నట్టాడు ఈకలకట్ట చుట్ట
తొట్టిపెదవులు తుంపరలుట్టిపడెడు
చట్టికెనయగు నోరును గట్టిలేక
కొట్టుమిట్టాడు బలు జనులుట్టిపడెడు
యోనిగలయది వేంకటసాని మరియు
కల్లు పెల్లుగద్రావి కారుకూతలు కూయు
మాలని నైనను మరులుగొల్పు
కాసువీసంబులు వాసిగా లంకించి
జుడిగి నెల్లాళ్ళలో జోగి చేసి
యిలు వెళ్ళగా కొట్టు నెక్కువతక్కువ
మాటలాడును వట్టిబూటకములు
వేంకటశాస్త్రుల వేశ్య నెవ్వరితోడ
నవ్వదంచును జనుల్ నమ్మ తిరుగు
కూతునకు ఎవ్వనిం దెచ్చి కొమరుకన్నె
ప్రాయ మిప్పించి ఏరీతి ప్రబలునట్లు
చేసెదవొ యంచు చెవిలోన చెప్పుచుండు
శాస్త్రిగారికి వేంకటసాని యెపుడు
ఈసరణి తెలుప నాతం
డా సానిం జూచి పలికె నలివేణి! మదిన్
వేసరక తాళియుండుము
నీ సుతకున్ కూర్మి కూర్తు నీలాద్రినృపున్
నా కృతికన్యకకును కన
దాకృతి యీ కన్యకకును నతనిం బతిగా
నీకొన జేసిన మనకున్
చేకురు భాగ్యంబటంచు చెప్పి రయమునన్
యాగము పేరుచెప్పికొని అర్థము భూప్రజ వేడి తెచ్చినన్
భోగము సేయవచ్చు నిజపుత్త్ర సహోదర దార బంధు సం
యోగము గాగ నంచు మది నూహ యొనర్చి యతం డఖండ మా
యాగుణ దూషితాత్ముడయి యచ్చొటు వెల్వడి యెల్ల భూములన్
నీచత్వమునకు రోయక
చూచిన నరులెల్ల వేడి సుడివడక కడున్
యాచన చేసి పదార్థ మ
గోచరముగ సంగ్రహించుకొని వచ్చి వెసన్
మాలవాని చెరువు మరువున పందిళ్ళు
సాలలును ఘటించి సంభ్రమమున
యాజకులును పెద్దలైన విప్రుల కూర్చి
దీక్ష బూని నిజసతియును తాను
కడక దక్షిణాగ్ని గార్హపత్యాహవ
నీయ వహ్నులందు నిలిపి మంచి
మేకపోతుగముల మెదలకుండ వధించి
వెరవు మీర నందు వేల్చుచుండి
మఖము చూడ వచ్చు మనుజుల కిష్టిష్టి
కాగ అన్నమిడడు, గదుముడనుచు
కొడుకుతోడ తనదు కూతుమగనితోడ
చెప్ప వారు లోభచిత్తులగుచు
కొందర కొకింత కూడిడి
కొందరకుం కూరలొసగి కొందరకిడకే
దండన సేయుచు గెంటుచు
కొందర తిట్టుచును వెళ్ళగొట్టుచు కడకన్
పుడమిరేండ్లంపిన గుడ దధి హైయంగ
వీనముల్ లోనిండ్లలోన దాచి
కరణంబు లంపిన కంద పెండలములు
పదిలంబుగా నేల పాతివైచి
బ్రాహ్మణుల్దెచ్చిన బహువిధఫలములు
లోలోన తనదు చుట్టాలకిచ్చి
కోమట్లు తెచ్చిన గురుతర వస్తువుల్
మెల్లమెల్లన తారె మ్రింగివైచి
పప్పులో నుప్పు మిక్కిలి పారజల్లి
నేతిలో ఆముదమ్మును నిండ నింపి
పులుసులో గంజి మిక్కిలి కలయబోసి
భక్ష్యములలోన మిరియంపు పదడు కలిపి
మంచి బూరెలు పొణకల మాటువెట్టి
పిండిబూరె లొక్కొక్కముక్క పెద్దవారి
విస్తరులలోన పారంగ విసరివైచి
కసరికొట్టిన విప్రు లాకటను లేచి