గబ్బిలము
అంటరాని తనంబు నంటి భారతజాతి
భువనసభ్యత గోలుపోయె ననుచు
క్షమకు మించిన కత్తి జర్మనీ యుద్ధాన
గనుగొన్న మొనగాడు గలుగడనుచు
కదురు రాట్నము చేత గాక స్వేచ్ఛాస్వర్గ
ముదము జిక్కుట నభఃపుష్ప మనుచు
నూరేండ్లు గాదు మున్నూరేండ్లు మనవచ్చు
న్యాయమార్గంబున నడువు డనుచు
నిమ్నజాతుల కన్నీటి నీరదములు
పిడుగులై దేశమును గాల్చివేయు ననుచు
రాట్నమును దుడ్డుకర్ర కరాన బూని
దెసల దోతెంచె గుజరాతు ముసలిసెట్టి
సీమగుడ్డకు కన్నులు చెమ్మగిల్లె
ముతకబట్టకు మర్యాద పొటమరించె
నగరి వెలుపలి మాలమాదిగలు కూడ
నరులుసుమ్మని దేశంబు గురుతుబట్టె
వెరపు వలదు నీకు హరిజన సోదరా
స్వీయరాజ్యరధము వెడలివచ్చె
లాగిపొమ్ము నీకు భాగంబు గలదంచు
పాడుచుండె రత్న భరతమాత
ఒకనాడా మునిపక్షి తొంటి చెలికాడున్నట్టి గేహంబు లో
నికి నేతెంచి యధావిధిం దిరుగుచుండెన్ మిత్రు డీక్షించి యు
త్సుకతం బొంగి దరస్మితంబున నిదే జోహారహో పక్షిణీ
యకలంకంబగు నీ సహాయమున నా యర్థంబు పండాయెనే
నా వర్ణించిన పుణ్యభూములను సందర్శించినావే మహా
దేవుం డాయన దేవియుం దగిన యాతిథ్యంబు నీకిచ్చిరే
నా వాక్కుల్ జెవి నాటితే మహిత రత్న స్వర్ణకాంతి చ్ఛటా
ద్వావ ద్దివ్య హిమాద్రికందర పవిత్ర క్షేత్రముల్ సూచితే?
పుడమి కలుషరాశి మ్రుగ్గిపోవుచు నుండ
నాట్యమాడుకొనుట న్యాయమగునె
భర్గదేవ! సృష్టి పరికించి పొమ్మంచు
పిలిచివచ్చినావె పులుగుచెలియ
కాళిదాసుని మేఘంబు గౌరవంబు
తెచ్చుకొన్నదె నీదు సందేశగాధ
ఘనులు చేకొను భూభృదగ్రముల పూజ
అసమ చతురత్వమున్న బానిసకు రాదు
వ్యాస వాల్మీకి ముని మదేభములు రెండు
తిరుగుచుండెనె కైలాస గిరుల మీద
వారి వార్ధక్యమున నీకు స్పష్టమగును
భరత రామాయణంబుల పడుచుదనము
ఆ వాల్మీకి నిసర్గ జంతుకరుణా వ్యాసక్తియే సత్కవిన్
కావించెన్ వెడలించె రామునికథా గాంగేయమున్ కానిచో
త్రోవల్ కొట్టెడు బోయ కేగురువు నేర్పున్ దివ్యగీర్వాణమున్
ఆవేశించి కళాధిదేవి వరమీయన్ విద్య లేమాత్రముల్
ఎదురై వచ్చెనె కాళిదాసుని లసచ్ఛృంగార సందేశ మం
బుద మార్గంబున తద్రసంబులు ధ్వనుల్ ముత్యాలు వర్షించెడిన్
పదినూరేండ్ల పురాణమేఘమనుచున్ భావింతువో నిత్యముం
పదియారేండ్ల వయస్సు కూర్పదె సుకావ్యస్పర్శ జేజెమ్మకున్
జనముల్ మెచ్చు రసప్రసిద్ధమగు నా సందేశభారంబుతో
జనముల్ వచ్చు విమానమాలికల గర్జాభీషణంబౌ ప్రభం
జన మార్గంబున నీ ప్రయాణమెటులన్ సాగించి నెగ్గించితో
చెనుకన్నేరవు గండముల్ తబిసిపక్షీ జన్మసన్మార్గులన్
కన్నులు ధన్యంబులుగా
కన్నావే మంచుకొండ గగనము శిరముం
తన్నెడు దాని నమరగవి
వెన్న వలెం ధవళరుచులు పిండెడు దానిన్
ఆ కొండయే యిండియా విరోధుల దండు
గుండె గాలంబైన వెండికోట
ఆ కొండయే ముత్తియపుదండ భారతో
ర్వీమాతృమణికి కిరీటభూష
ఆ కొండయే పర్వతాగ్రగణ్యములైన
కులపర్వతముల నిక్కులకు నిక్కు
ఆ కొండయే రజతాచలస్వామికి
మణిమయ కళ్యాణ మంటపంబు
సింధు గంగా మహానదుల్ చిన్ననాడు
ప్రాకనేర్చిన అపరంజి ప్రస్తరములు
పాదచిహ్నాలు పరికించి వచ్చినావె
కలుషములు వాయ కన్నుల కరువు తీర
ఇంద్రధనువు బట్టి సాంద్రాబ్దవనవాటి
మెలగుచున్నవాడు మృగయుడొకడు
వాడు గొంతుబిసిగి వసుధపై విసరిన
జంతుతతులు నిమ్నజాతి జనులు