అక్కడనుండి యుత్తర దిశాభిముఖంబుగ నిర్గమించు నీ
దృక్కుల నడ్డుచున్ హిమగిరీంద్రము దర్శనమిచ్చు దానిపై
నెక్కగనెంచి తెల్లదొర లీలిగిరెందరొ వారి దేహముల్
స్రుక్కవు నేటికిం బులుగుసుందరి మంచు మహత్వ్త మెట్టిదో
కరగిన మంచుబండలు ప్రగాఢభరంబున పట్టుదప్పి త
ద్గిరి శిఖరాల నుండి తలక్రిందులుగా దిగజారి లోయలన్
దిరిగెడు జీవరాసుల వధించుచు నుండును పేదవారికిన్
చెరపె కదా బలాధికుల నేయము సంయమిపక్షి భామినీ
అందు నెవరెష్టు శిఖరాన నధివసించి
వ్రాసికొనవచ్చు భరతవర్షంబు పటము
దాని యున్నతి తారకాధ్వజము మిగులు
సులలితములైన కవుల యూహలకు తరుగు
కలహంసల్ సను వాయుమార్గముల రేఖల్ పర్వతాగ్రంబునన్
కల వాత్రోవల దక్షిణోత్తర దిశాగ్రవ్యాప్తముల్ ప్రోన్నతం
బులు నీకున్ చనకాదు నిచ్చలు నిలింపుల్ గుంపులై రాకపో
కలు గావించెడు వెండికొండ వెరవుల్ కన్పట్టు నైమూలగన్
విహిత కైలాసయాత్ర గావించు నిన్ను
మంచుకొండలవిభు డాదరించగలడు
అల్లునకు కూతునకు వార్త లంపునేమొ
సమ్మతింపుము నుడులు భారమ్ము కావు
అస్త్రవిద్యాభ్యసన వేళ నద్భుతముగ
కొంచకొండకు రంధ్రంబు కొట్టినాడు
చినతనంబున పార్వతి చిన్నకొడుకు
తారకాగిరి కదియ యుత్తరపు గవిని
గిరుల మగవాని చెలిమి వ్యక్తీకరింప
మస్తమున దాల్పు మొక చిన్ని మంచుతునక
విసపుమేతరి కది సిఫారసుగ నుండు
వ్యర్థములు కావు పెద్దల పరిచయములు
మంచుఫలించు నగ్గిరుల మూడుల కారుమొయిళ్ళపై నుడా
యించు గమింపు మవ్వల మహేంద్రునివీడు త్రివిష్టపంబు క
న్పించు డలాయిలామలను వింతనృపుల్ పరిపాలనంబు సా
గించెద రిప్పు డచ్చరలు క్రీడ యొనర్పరు నందనంబునన్
ఆ లామాలకు పెండ్లిపేరటము లే దాజన్మ సన్యాస దీ
క్షా లగ్నాశయులై ధరింతు రతిదీర్ఘంబైన కుళ్ళాయముల్
మౌళిన్ వారి యనుజ్ఞ లేక విహరింపం బోల దెవ్వారి కా
నేలన్ పక్షివి నీకు పోదగని క్షోణీమండలం బుండునే
ఆ రాజ్యంబును గూబపట్టుకొని బిట్టాడించుచుండున్ దురా
చారంబుల్ వెడనమ్మకాల కది వాసస్థాన మస్పృశ్యతా
క్రూరవ్యాఘ్రము సంచరించుటకు సంకోచంబు లే దైన బౌ
ద్ధారామంబులు సాగనీయవు కదమ్మా దాని యౌద్ధత్యమున్
అసమ రుచిరాంబువైన మానస సరస్సు
కన్న కూతురు బుడుత గంగాభవాని
యెక్కి దిగుచుండు కొండల చక్కదనము
ప్రేక్షణీయంబు సుమ్ము గబ్బిలపుదేవి
బలిసిన మేనులన్ జడలబర్రెలు కొమ్ముల వింత సింహముల్
బలె విహరించు కొండల యుపత్యకలన్ సెలయేటి నీళ్ళ క్రో
ల్పులుల కళేబరా లచటి లోయలలో పొరలాడు వాని య
మ్ముల కెనయైన శృంగముల పోటుల తూటులుబడ్డ పొట్టలన్
జడనిధి వంటి మానసము సాటికి రావు సరస్సులెల్ల నం
దుడుగక రేగు పేరలల యూపున గట్టులదాకి ప్రాణముల్
విడిచిన గండుచేపలు కుళీరము లెల్లెడ తీరభూములం
దడుగిడరాక చీకి వికలాంగములై పడియుండు గుట్టలై
దమయంతీ నలులకు దౌ
త్యము చేసిన తొంటి పసిడి హంస విభుని చు
ట్టములందు పంకజోద్యా
నములందున నాలపింత్రు నైషధకథలన్
నిండిన దోరవెన్నెలల నిక్కిన పచ్చిక మేసి చాందినీ
కొండబయళ్ళలో తిరుగు గోపతి నీ కగుపించు నందు వే
దండవిరోధి దాల్చిన జటాటవి పూచిన పూవు చంద్రమః
ఖండము గోచరించు నెరుకల్గల నీ కెరిగింప నేటికిన్
విలు నమ్ముల్ ధరియించి చెంచులు తదాభీలాటవీ మధ్య భూ
ముల కన్పట్టిన నంజలింపుము మహాత్ముండైన భర్గుండు భ
క్తుల కిష్టార్థము లీయగోరిన గణస్తోమంబుతో మాయ పం
దుల వేటాడుచు భిల్లుడై నరుల కన్నుల్ గప్పి క్రీడించెడిన్
అచ్చోట తబిసి రాజులు
నిచ్చలు తపమాచరించు నీ కాతిథ్యం
బిచ్చెదరు పరుల విద్యలు
మెచ్చెద రీ గుణము నేడు మృగ్యంబ కదా