తనువుప్పొంగ సరస్వతీమహలు సందర్శించి తంజాపురీ
మనుజాధీశుల యోలగంబును పరామర్శించి పొమ్ముత్తరం
బునకున్ ద్రావిడభూములం గడచి పోబో దోచెడిన్ వాడువా
రని శౌర్యంబును మించు తెల్గు పొలిమేరల్ నేత్రపర్వంబుగన్
యతియుం బ్రాసయు లేని సంస్కృత కవిత్వారణ్యమందున్న భా
రత వేదాన పదేనుపర్వముల కాంధ్రత్వంబు నేర్పించి శా
శ్వతుడై పోయిన తిక్కయజ్వకు నివాసంబైన నెల్లూరికిన్
నతులర్పింపుము స్నానమాడు మతిగణ్యంబైన పెన్నానదిన్
ఒకపల్కు జాణతనమున
సకియలు నెల్లూరుసీమ సత్కవివరులం
దికమకలు పెట్టగలరని
పుకారు కల దది యబద్ధమో నిక్కువమో
హంపీక్షేత్రము జూచి పోవలయు నమ్మా తెల్గురాజ్యంపు నై
లింపశ్రీల కొకానొకప్పుడది కేళీరంగ మేత ద్రమా
శంపావల్లరు లారిపోయిన ప్రదేశంబందు నీ బందుగుల్
కొంపల్గట్టి నివాస ముండెదరు నీకుం గూర్తు రానందమున్
పరదాపద్ధతి మాన్పిరో సిరికి కుప్పల్ వోసి యంగళ్ళ యం
దురుమాణిక్యము లమ్మినారచట మున్నో పక్షిణీ మూరురా
యరగండండు మహేంద్రవైభవముతో నాంధ్రక్షమామండలిన్
పరిపాలించిన నాటి పెంపును తలంపన్ మేను కంపించెడిన్
పగతు రసూయ చేత కరవాలమునన్ తనువెల్ల చెండినన్
జిగిరిచియున్న యుగ్రనరసింహుని భీమదృగంచలంబులన్
పొగలుడివోవ లేదతని మ్రోల నిమేషము నిల్వజాలనిన్
ఖగసతి నిన్ను ధైర్యవతిగా గణియింతురు వీరయోధులున్
ఏనికవంటి సానువు గణేశుని నున్నని బొజ్జ మీద కా
లూనగలేదు తుమ్మెద తదుజ్వ్జల శిల్ప మఖండ తుంగభ
ద్రానది కప్పగించుకొని దద్దమలైన తెలుంగువారి వి
ద్యానగరాన చిందుమొక యశ్రుకణంబు నుపాయనంబుగన్
సరసుడు కృష్ణభూవిభుడు స్వారి యొనర్చిన పారసీహుమా
దొరల ఖురాగ్రహల్యలను దున్నిన భూములలోన నాంధ్ర సుం
దరు లొకనాడు నాటుకొనినారు దిగంత జయప్రరోహముల్
గరిసెల నించినా రురువుగా ఫలియించిన సుప్రతిష్ఠలన్
మూరురాయరగండ డూరేగడీనాడు
విద్యానగర రాజవీధులందు
మేలైన పట్టుడేరా లెత్తరీనాడు
పారసీకగురాల బేరగాండ్రు
ఇనుపరోకళ్ళ సాధన సేయవీనాడు
కొమ్మునిక్కిన భద్రకుంజరములు
తెలుగు స్కంధావారముల నిండదీనాడు
మరఫిరంగుల తెల్లదొరల దండు
మణిమయంబైన యాంధ్రసామ్రాజ్యరథము
భువికి గ్రుంగిన పదియునారవ శతాబ్ది
కృష్ణవిభు వీట ప్రొద్దు క్రుంకినది మొదలు
ఋషిఖగాంగన తెల్లవారినది లేదు
కంచర్ల శ్రీకృష్ణ గంధర్వు డేలిన
నగరంబు దున్నించి నారువోసి
వినుకొండ విభుని రాయని భాస్కరుని కోట
బురుజు లూపున నేలకొరగ దన్ని
పల్నాటిదొరల శుంభత్ప్రతాపజ్వాల
సాటికెక్కని నాగులేట కలిపి
వినుతి గాంచిన కొండవీటి సామ్రాజ్యంబు
నుక్కుకత్తుల బావి కొప్పగించి
యుడుకునెత్తుట చేతులు కడిగికొన్న
కాలపురుషుని పెనుదుండగములు తలచి
మనసు నలిగిన గుంటూరు మండలంబు
నరసి పోవమ్మ జన్మ ధన్యత వహింప
ప్రొద్దునకు వన్నె బెట్టిన
యిద్దరు భాస్కరులు పుడమి నేలగ సొగసుల్
దిద్దినది మేన వయసున
పెద్దది గుంటూరు సీమ పెరసీమలలో
ఖరుచైపోయె తెలుంగు రక్త మతిలోక స్వచ్ఛశౌర్యంబు సో
దరి! వ్యర్థంబగు కోడిపందెపు తగాదా లందు పల్నాటిలో
నరుదారన్ మివిలెన్ వినోదముగ కార్యంపూడి తిర్నాళ్ళ త
త్కరవాలంబులు త్రుప్పుపట్టి యిపుడున్ కల్పించు నారాటమున్
కృతులంది కృతులొసంగిన
వితరణరతులైన కొండవీటి నృపుల యు
న్నతియుం బతనం బిప్పుడు
కృతులై కొండల నలంకరించి జితించెన్
విసిగి విరక్తిచే తెలుగు వీధులలో నొక పిచ్చివానిగా
మసలిన రెడ్డిరాజు మునిమాన్యుడు వేమన యాశుధారగా
విసరిన కావ్యముల్ శ్రవణపేయముగా ప్రతిశబ్ద మీనెడిన్
దెసల నలంతి పోలికల తీయదనంబున భావసంపదన్