మళ్ళీ అసలు విషయం
ఈ అలంకార శాస్త్ర విషయం అంతా నిజానికి మనకి అక్కర లేదు. లోకంలో భక్తికవులకి, కావ్యకవులకి వాళ్ళ జీవిత చరిత్రలని గురించి వినిపిస్తున్న కథలు ఈ విషయాన్ని బలంగా స్పష్టపరిచాయి. ఉదాహరణకి పాఠకులు పోతన్న భాగవతాన్ని భక్తిగ్రంథం గానే చదివారు కాబట్టి ఆయన గురించి అల్లిన కథలు అందుకు అనుకూలంగా వుంటాయి. పోతన్న రాసిన పుస్తకాన్ని సర్వజ్ఞసింగభూపాలుడు తనకి అంకితం ఇవ్వమన్నాడని, పోతన్న అందుకు అంగీకరించక తన పుస్తకాన్ని నరాంకితం చెయ్యనని కచ్చితంగా చెప్పాడని, అంచేత సింగభూపాలుడు కోపగించి ఆ పుస్తకాన్ని పాతిపెట్టించాడని, పాతిపెట్టిన పుస్తకంలో కొన్ని భాగాలు చెదలు కొట్టేయగా తరవాత ఆయన శిష్యులు వెలిగందల నారయ, మడికి సింగన ఆ భాగాలు పూర్తి చేశారని ప్రసిద్ధంగా చెప్పుకునే కథ ఉంది. రాజాశ్రయాన్ని నిరాకరించాడు కాబట్టి పోతన్న పొలం దున్నుకుంటూ పేదరికం లోనే బతికాడని ఈ కథ చెప్తుంది. శ్రీనాథుడు ఆయన బావమరిది అని, ఆయన వచ్చి పోతన్నతో, ‘రాజాశ్రయం వొప్పుకుని సకలసంపదలతో బతకరాదా,’ అని చెబితే పోతన్న,
బాలరసాలసాల నవపల్లవకోమల కావ్యకన్యకన్
కూళల కిచ్చి అప్పడుపు కూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైన నేమి, గహనంతరసీమల కందమూలగౌ
ద్దాలికులైన నేమి, నిజదారసుతోదరపోషణార్థమై
అన్నాడని, సరస్వతీ దేవే స్వయంగా వచ్చి కన్నీరు పెట్టుకుని కనిపిస్తే ఆవిణ్ణి ఓదారుస్తూ పోతన్న, “కాటుక కంటినీరు చనుకట్టుపయింబడ నేల నేడ్చెదో,” అని ఓదార్చి, “నిన్నాకటికిన్ గొనిపోయి అల్ల కర్ణాటకిరాటకీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ,” అని చెప్పాడని, ప్రసిద్ధంగా చెప్తారు. ఈ కథలకి పరమార్థం భక్తికవులకి, కావ్యకవులకి ఉన్న తేడా నిష్కర్షగా చూపించడం. భక్తికవికి డబ్బక్కర్లేదు. భక్తికవి తన పుస్తకం భగవంతుడికే యిస్తాడు. పుస్తకం కవికి కన్నకూతురు అని ఇప్పటికే కావ్యసంప్రదాయం నిర్ధారణ చేసింది. ఆ ఉపమానం మరికొంత పొడిగిస్తే తన కావ్యానికి రాజుని కృతిభర్తగా చేసిన కావ్యకవి భక్తికవుల దృష్టిలో తార్పుడుకాడు అవుతాడు. అందుకే పోతన్న చెప్పాడని అనే పద్యంలో అలాంటి రాజులు ఇచ్చే డబ్బు పడుపుకూడు అవుతుంది.
పైగా పోతన్నకి సహజకవి అనే ఇంకో బిరుదు వుంది. పండితుల్లాగా శాస్త్రమర్యాదలన్నీ పాటించి నిర్దోషంగా చెప్పిన కావ్యం కూడా చివరికి సత్యాన్ని వర్ణించగలుగుతుందా? ఈ లౌకిక పాండిత్యాలు భగవంతుడికి అవసరమా? ఈ ప్రశ్నలు ఇంకా పొడిగిస్తే భక్తికవి తను తన పుస్తకానికి కర్తనని చెప్పుకునే ప్రయత్నం కూడా చేయడు. “పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట…” అని వినయంగా చెప్పి తన కర్తృత్వాన్ని నిరాకరించుకుంటాడు పోతన్న. అన్నమయ్యా ఆ పనే చేస్తాడు.
అన్నమయ్య గురించి కూడా ఇలాంటి కథే వుంది. సాళువ నరసింహరాయలు అన్నమయ్యని తన మీద ఒక పదం రచించమన్నాడని, మానవమాత్రుల మీద పదాలు రాయనని అన్నమయ్య తిరస్కరించాడని నరసింహరాయలకి కోపం వచ్చి అన్నమయ్యకి సంకెళ్ళు వేస్తే, అన్నమయ్య వెంకటేశ్వరుణ్ణి ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయాయని అన్నమయ్య జీవిత చరిత్ర రాసిన ఆయన మనవడు చినతిరుమలాచార్యులు మనకి చెప్పాడు.
ఈ కథలు ఇందాక చెప్పినట్లుగా భక్తికవులకి ఒక విధానం ప్రకారం జీవిత చరిత్రని నిర్మించడానికి వాళ్ళ భక్తులు చేసిన ప్రయత్నం. అంతేకాని సర్వజ్ఞసింగభూపాలుడు పుస్తకాన్ని పాతిపెట్టించేటంత దుర్మార్గుడని, అప్పటికి భాగవతానికి ఒక్కటే ప్రతి వుందని, పోతన్న నిజంగా తెలుగు, సంస్కృతము, శాస్త్ర గ్రంథాలు, సాహిత్య గ్రంథాలు, గురుముఖతా చదువుకోలేదని, శ్రీనాథుడు అతనికి నిజంగా బావమరిది అనీ — ఈ కథలకి అర్థాలు చెప్పడానికి వీల్లేదు. ఈ కథలు ఆ కవులు రాసిన గ్రంథాల పాఠకులు, శ్రోతలు, కల్పించుకున్నారు. అంటే, ఈ పుస్తకాలలో అర్థం వల్ల వాటి కర్తృత్వం ఏర్పడిందన్న మాట. మళ్ళా ఇంకోసారి చెప్పాలంటే కవి పుస్తకాన్ని నిర్మించలేదు. పుస్తకమే కవిని నిర్మించింది.
భక్తికవుల పుస్తకాలలో భగవంతుడికి కూడా కర్తృత్వం వుండాలి. పోతన్న “అల వైకుంఠపురంబులో నగరిలో…” అన్న పద్యాన్ని మొదలుపెట్టి అది ఎలా ముగించాలో తెలియక బయటికి వ్యాహ్యాళికి వెళ్ళాడని, ఆ సమయంలో భగవంతుడే పోతన్న రూపంలో వచ్చి ఆ పద్యాన్ని పూర్తి చేశాడని ఒక కథ చెప్తారు. ఇలాంటి కథే సర్వేశ్వరశతకం రాసిన యథావాక్కుల అన్నమయ్యని గురించి కూడా చెప్తారు. తుకారాంని గురించి కూడా ఇలాంటి కథే వుంది. భగవంతుడే తన చేత ఈ పదాలని రాయించాడని తుకారాం అంటే, అప్పటి కావ్యకవులు అతని మాటల్ని నమ్మరు. చివరి నిర్ణయం భగవంతుడికే వదిలిపెట్టాలని తుకారాం అంటాడు. అప్పటి కావ్యకవులు తుకారాం పదాలున్న పుస్తకాన్ని నది నీళ్ళలో పడేసి, అది భగవంతుడు నిజంగా అంగీకరించిన పుస్తకమే అయితే ఆ పుస్తకం పదమూడు రోజుల తరువాత నీళ్ళలో తేలాలి, అని వేళాకోళంగా అంటారు. తుకారాం భగవంతుడిని, ‘ఈ పదాలని నువ్వు రాయమంటే నేను రాశాను, నాకు నిజంగా ఏ పాండిత్యమూ లేదు, ఇవి తేలాలో మునగాలో నువ్వే నిర్ణయించు,’ అని ప్రార్థిస్తాడు. ఆశ్చర్యకరంగా పదమూడో రోజున నీటి తడి కూడా అంటకుండా ఆ పుస్తకం పైకి తేలుతుంది. ఏకనాథ్ గురించి కూడా ఇలాంటి కథే వుంది. మరాఠీ భాషలో భాగవతం రాసిన కవి ఆయన. ఆయన పుస్తకాన్ని గంగానదిలో పారేస్తే నదీదేవత స్వయంగా ఆ పుస్తకాన్ని రెండు చేతులతో పైకెత్తి తీసుకువస్తుంది.
రాజాస్థానంలో కావ్యకవి అయితే తన పుస్తకంలో పండితులు తప్పులు చూపిస్తే వాళ్ళతో వాదించి గెలవాలి. శ్రీనాథుడి లాగా తన ప్రత్యర్థి కంచుఢక్కని పగలగొట్టించాలి, కనకాభిషేకాలు చేయించుకోవాలి, గండపెండేరాలు వేయించుకోవాలి. రాజాస్థానపు కవి సాహిత్యప్రపంచంలో తన ప్రభుత్వాన్ని ప్రకటించుకుంటాడు. అతనికి కవిరాజు, కవిచక్రవర్తి, కవిసార్వభౌముడు ఇలాంటి పేర్లుంటాయి. రాజులు ఇతర రాజుల్ని కత్తి దూసి జయించినట్లే రాజకవి ఇతర కవుల్ని మాట దూసి జయిస్తాడు. రాజుది లౌకికసామ్రాజ్యం, కవిది కావ్యసామ్రాజ్యం. అందుకే రాజకవుల్ని గురించిన కథల నిండా కావ్యవివాదాలు, పండితసంఘర్షణలు వుంటాయి. ఇదే రాజకవులు తమకావ్యాలలో భక్తికవుల్లాగే భగవంతుణ్ణి వర్ణించవచ్చు. భగవత్కథలు చెప్పొచ్చు. అయినా వాళ్ళు రాజకవులు కావలసి రావడమే వాళ్ళ పాఠకులు చెప్పుకునే ఈ కథలకి ప్రయోజనం.
కృష్ణదేవరాయలని గురించి ఆయనకి అష్టదిగ్గజాలున్నారని, ఆయన వాళ్ళ మధ్య కూర్చుని సాహిత్యవ్యాసంగంలో మునిగి తేలుతుండేవాడని, మనకి నిజం కన్నా నిజం లాగా వినిపించే బోలెడు కథలున్నాయి. ఈ కథలు చరిత్రే అన్న నమ్మకంతో సాహిత్య చరిత్రకారులు ఆ అష్టదిగ్గజాలు ఎవరో రకరకాల సాక్ష్యాలతో రకరకాల జాబితాలు కూడా వేశారు. అష్టదిగ్గజాలు లేరు. తరువాతి కాలంలో పాఠకులు కల్పించుకున్న కథల్లో పుట్టారు వాళ్ళు. అయితే ఈ కథలకి వేరే ప్రయోజనం వుంది. అవి కవుల చరిత్రని చెప్పవు, సాహిత్యాభిరుచి చరిత్రని చెప్తాయి.
ఇంకొక ఉదాహరణ చూపిస్తాను. కాళిదాసు, భవభూతి ఈ కథలో ఒక కాలం వాళ్ళు. భవభూతి తన ఉత్తరరామచరిత్రని పూర్తి చేసి తన కవిత్వం కాళిదాసుకి నచ్చుతుందో లేదో చూద్దామని తన సేవకుడి ద్వారా ఒక శ్లోకాన్ని ఆయన దగ్గరకు పంపిస్తాడు. కాళిదాసు ఆ శ్లోకాన్ని చదివి ఏమీ అనకుండా వూరుకుంటాడు. చాలా నిరాశపడిన భవభూతి, ‘కాళిదాసు ఏమీ అనలేదా, అసలు నువ్వున్నంతసేపూ ఆయన ఏమీ మాట్లాడలేదా?’ అని తన సేవకుణ్ణి గుచ్చిగుచ్చి అడుగుతాడు. ‘అయ్యా, ఆ శ్లోకం కాళిదాసుగారు చదివిన సమయంలో ఆయన ప్రియురాలు తన దూతిక ద్వారా కాళిదాసుగారికి తాంబూలం పంపించింది. ఆ తాంబూలం వేసుకుని, ఈ పద్యం చదువుతూ కాళిదాసుగారు ఇందులో కొద్దిగా సున్నం ఎక్కువయ్యింది, అని మాత్రం అన్నారండి,’ అని చెప్తాడు. భవభూతి వెంటనే తన శ్లోకంలో ఒక సున్నా యెక్కువగా వుంది అని గ్రహించి ఆ సున్నా తీసేస్తాడు. ఆ శ్లోకం ఇది.
కిమపి కిమపి మందం మందమాసక్తి యోగాత్
అవిరలిత కపోలం జల్పతో రక్రమేణ
అశిథిలపరిరంభవ్యాపృతైకైకదోష్ణో
రవిదిత గతయామా రాత్రిరేవం వ్యరంసీత్
ఈ శ్లోకంలో చివరి పాదంలో ఏవం అన్న దగ్గర సున్నా తీసి చదవండి.
రాత్రిరేవ వ్యరంసీత్.
అంటే, గడిచిపోయింది రాత్రి మాత్రమే అని.
ఈ చిన్న కథ చారిత్రకం కాదని, కాళిదాసు, భవభూతి ఒక కాలం వాళ్ళు కాదని కొట్టిపారేసే ఆధునిక చరిత్రకారులు గమనించని విషయం ఒకటుంది. ఇది చరిత్ర కాదు. ఇది సాహిత్యాభిరుచి చరిత్ర అని ఇందాక అన్నాను. ఆ దృష్టితో ఈ కథని మరికొంచం జాగ్రత్తగా చూద్దాం. ఈ కథలో కాళిదాసు గొప్ప కవే కాదు, గొప్ప సహృదయుడు కూడా. తను తనతోటి కవి పద్యం లోని లోపాన్ని బండగా, ‘ఆ సున్నా తీసేయ్’ అని చెప్పకూడదు. పరోక్షంగా సూచించాలి. అలా సూచిస్తే గ్రహించగల సూక్ష్మజ్ఞానం భవభూతికి ఉంది. పైగా ఈ మాటలు చెప్తున్నప్పుడు కాళిదాసు చుట్టూ వున్న వాతావరణం పరమరమణీయమైన వాతావరణం. ఆయన తన ప్రియురాలు పంపిన తాంబూలం వేసుకుంటున్నాడు. సాహిత్యానుభవం తాంబూలచర్వణానుభవం లాంటి ఇంద్రియానుభవం. తాంబూలంలో లాగే పద్యంలో చేరిన దినుసులన్నీ సమపాళ్ళల్లో వుండాలి. ఏది యెక్కువైనా అనుభవంలో అందం దెబ్బ తింటుంది. ఇంత పరిణతమైన సాహిత్య విమర్శతో పాటు ఈ కథ ఇంకో విశేషాన్ని కూడా చెప్తుంది — కవిత్వంలో అందాల్ని ఇంకో కవే చెప్పగలడు. భవభూతి పద్యాన్ని కాళిదాసే గ్రహించగలడు.