ఒక చిన్నమలుపు
సంస్కృతకావ్యాలకి అన్నిటికీ కలిపి ఒక మహాసిద్ధాంతాన్ని తయారు చేయాలనే పెద్ద ఆశతో మొదలైన అలంకార శాస్త్రం ఆర్షకవుల్ని కూడా మామూలు కవులతో పాటు తన పరిధి లోనికి తీసుకు రావడానికి ప్రయత్నించింది. తొమ్మిదో శతాబ్దపు ఆనందవర్ధనుడు, తన ధ్వన్యాలోకంలో మహాభారత రామాయణాలని కావ్యాలు గానే పరిగణిస్తాడు. రామాయణానికి కరుణం అంగిరసం అని, మహాభారతానికి శాంతం అంగిరసమని పట్టుపట్టి ప్రతిపాదిస్తాడు. ఋషి రాసిన కావ్యాన్ని అలా గౌరవంతోనైనా మనుష్యమాత్రులు రాసిన కావ్యాలతో కలిపి పరిగణించడం అలంకార శాస్త్రం చేసిన ప్రధానమైన సైద్ధాంతిక ప్రయత్నం. కానీ ఈ ప్రయత్నం మొదలు పెట్టిన ఆనందవర్ధనుడికి ఇది తన ఒక్కడి వల్ల సాధ్యం కాదని తెలుసు. దీనికి కొన్ని తరాల బుద్ధిమంతులైన పాఠకులు, భావుకులు తోడు కావాలి. మానవాతీతమైన స్థాయికి చెందిన వ్యాసుణ్ణి కాని, వాల్మీకిని కాని అలంకార శాస్త్రనిష్కర్షకి లోబడేట్టు చేయడం తనకు సాధ్యం కాదు. అందుకనే ఆయన వ్యాసుణ్ణి, వాల్మీకిని కవులకు ఆదర్శాలుగా, గురువులుగా చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఉదాహరణకి, మహాభారత రామాయణాల లాంటివి ఒక రసంతో పరిపూర్ణంగా తయారయి వున్నాయని, ఆ కథల్ని తిరిగి చెప్పే వాళ్ళెవరయినా అందులో రసాన్ని మార్చే ప్రయత్నం చేయకూడదని నిక్కచ్చిగా చెప్పాడు ఆనందవర్ధనుడు. (సంతి సిద్ధరసప్రఖ్యా యేచ రామాయణాదయః కథాశ్రయా న తైర్యోజ్యా స్వేచ్చారసవిరోధినీ )7 అంటే వ్యాసుడు, వాల్మీకి కూడా కవులే అయినా వాళ్ళ స్థాయి వేరని చెప్పాలని చేసిన ప్రయత్నం ఇది.
అలంకార శాస్త్రం దృష్టిలో కావ్యకవి మామూలు మనిషి. మమ్మటుడు తన కావ్యప్రకాశంలో చెప్పినట్లు కవులు కావ్యాలని పేరు కోసం రాస్తారు, డబ్బు కోసం రాస్తారు. కావ్యంతో కలిగే ఇతర — శివేతరక్షతి, కాంతాసమ్మితయా ఉపదేశం — అనే ఫలితాలతో పాటు వీటిని కూడా అనుమానం లేకుండా కలిపాడు మమ్మటుడు. కావ్యకవి మామూలు మనిషి కాబట్టి అతను మంచి కవి కావడానికి శిక్షణ అవసరం. మంచి పద్యం మంచి శిక్షణ వల్ల తయారవుతుంది. కావ్యం దోషాలు లేకుండా, అలంకారాలతో కూడి, రసవత్తరమై ఉండాలి. ఆ కావ్యాన్ని పుచ్చుకున్న కృతిభర్తకి, చదివే పాఠకులకి ఏ రకమైన అవాంతరాలు రానివ్వకుండా మంగళకరమైన భాషలో నిర్మించబడాలి. భారతీయ సంప్రదాయంలో శబ్దం చాలా శక్తిమంతమయినది. సరిగ్గా వాడితే అది కామధేనువు లాగా కోరినవన్నీ ఇస్తుంది. సరిగ్గా వాడకపోతే వాడినవాళ్ళని పశువుల్ని చేస్తుంది.
అలంకార శాస్త్ర గ్రంథాలన్నీ కావ్యానుభవాన్ని సిద్ధాంతీకరించడంతో పాటు కవుల్నీ, సహృదయుల్నీ సుశిక్షితులుగా తయారు చేయడం కోసం రాసినవి. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ ఇతర సాహిత్య శాస్త్ర గ్రంథాలు కవులకన్నా పై స్థాయిలో వుండి కవుల్ని శాసించలేదు. స్థూలంగా చూస్తే కావ్యం రమణీయంగా తయారవాలంటే కవి ఈ నియమాలని పాటించాలి అనే ఉద్దేశంతో చెప్పినట్టు ఉన్నా, అలంకార శాస్త్ర గ్రంధాలు, నిజానికి కవిని శాసించే పని లోనే, కవికన్నా పైస్థాయిలో వుండే గొంతుక తోటే రాయబడ్డాయి. ఇంకొంచం వివరంగా చెప్పాలంటే అప్పటి సాంప్రదాయక ధర్మంలో కావ్యజగత్తు లౌకికజగత్తుకి ప్రతి రూపం. అంటే ఒకదానికొకటి సమానంగా వుంటాయి. ఉదాహరణకి ఈ బొమ్మ చూడండి.
లౌకికజగత్తులో రాజు వేదశాస్త్రాలు చెప్పిన నియమాలని బట్టి పరిపాలిస్తాడు.అంటే వేదశాస్త్రాలు రాజులు అనుసరించవలసిన శాసనాలు. ఆ వేదశాస్త్రాలని అన్వయించే పని చేసేవాడు పురోహితుడు. రాజు చేసే పని — ఆ శాసనాలకి పురోహితుడు చెప్పిన అన్వయానికి లోబడి తదనుగుణంగా పరిపాలన చేయడం. ప్రజల పని — ఆ పరిపాలన యొక్క మంచి ఫలితాలని అనుభవించడం. సరిగ్గా ఇలాగే కావ్యజగత్తులో కూడా అలంకార శాస్త్రం కవిని శాసిస్తుంది. ఆ శాసనాన్ని ఆలంకారికులు అన్వయిస్తారు. దాన్ని అనుసరించిన వాడే కవి, కావ్యకర్త, అవుతాడు. పాఠకులు సహృదయులై వాటి వల్ల కలిగే రసాన్ని ఆనందిస్తారు. మంచికవి తప్పులు చెయ్యడు. లిఖితప్రతిలో తప్పులు కనిపిస్తే అవి లేఖకదోషాలు.
అయితే, అలంకార శాస్త్రంలో చెప్పిన స్థాయిభావాలన్నీ మానవచైతన్యంలో భాగాలే. కవులు ఈ మానవచైతన్యంలో భాగాలయిన వాటిని మానవులే అనుభవించగల రసానుభవంగా మారుస్తారు. ఈ మాట ఇంకొంచం స్పష్టంగా చెప్పాలంటే రసానుభవం మనుష్యులకొక్కరికే సాధ్యం. అంటే రసానుభవానికి మనకి వేరే అర్హతలేమీ అక్కరలేదు. మనం మనుషులమైతే చాలు. సాహిత్యానందం కేవలం మానవకర్మ. ఈ అనుభవానికి మానవులందరు సమానంగా అర్హులు. వాళ్ళకి మనిషిగా వుండటం తప్ప వేరే విశేషార్హతలు ఏవీ అక్కరలేదు. పోతే, కావలసినదల్లా కవిత్వాన్ని ఆనందించగల హృదయం. ఇలాంటి వాళ్ళని సహృదయులు అని ఒక ప్రత్యేకమైన పేరు పెట్టింది అలంకార శాస్త్రం.
అయితే భక్తికవిత్వం ఆనందించడానికి ఈ అర్హతలు సరిపోవు. అందుకోసం పాఠకుడు భక్తుడు కూడా కావాలి. ఉదాహరణకి వేంకటేశ్వర సుప్రభాతంలో ఈ చరణం చూడండి.
శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ
వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే
శ్రీవత్స చిహ్న శరణాగతపారిజాత
శ్రీ వేంకటేశ్వరవిభో తవ సుప్రభాతం
ఇందులో వున్నవన్నీ విష్ణుమూర్తి పేర్లు. విష్ణుమూర్తి పేరు వింటే చాలు ఒళ్ళు పులకరించిపోయే భక్తుడికి ఇది మహాకవిత్వం. భక్తుడు కాని మామూలు వ్యక్తి వింటే, ‘అయితే ఏవంటావ్?’ అన్నట్లుగా చూస్తాడు.
ఆలంకారికులు భక్తిని రసంగా అంగీకరించడానికి ఇబ్బంది పడటం ఈ కారణం వల్లనే అనిపిస్తుంది. జగన్నాథుడు తన రసగంగాధరంలో8 భక్తిని రసంగా ఎందుకు అంగీకరించ కూడదు అన్న విషయం సహేతుకంగా చర్చించి అది రసమేనని ఒప్పుకుంటున్నట్లు కనపడి, చివరికి నాట్యశాస్త్రం అడ్డుపెట్టుకుని తప్పుకుంటాడు. ఫలితంగా ఆయన నిర్ణయం ఏమిటంటే భరతాది మునివచనమేవ అత్ర రస భావత్వాది వ్యవస్థాపకత్వేన స్వాతంత్ర్య అయోగాత్, అని. రసమూ, భావమూ అనేవి ఏవి అవునో ఏవి కావో అన్న వ్యవస్థ విషయంలో భరతుడి వచనమే అనుసరించాలి కాని, మనం ఇష్టం వచ్చినట్లు ఆ వ్యవస్థని మార్చడానికి వీలులేదు. భరతుడు రసాలు ఎనిమిదే అన్నాడు. దానికి భక్తిని కలపడానికి వీల్లేదు. ఇది శాస్త్రకార శాసనం.
అంతకు ముందు అభినవగుప్తుడు కూడా తన అభినవభారతిలో, స్థాయిభావాల్ని గురించి చెప్తూ, స్థాయిత్వంచ ఏతావతామేవ జాతయేవహి జంతు రిత్యాదిభిః సంవిద్భిః పరీతోభవతి, అని నియమం చేశాడు. అంటే స్థాయిభావాలు ఇవే. మానవుడు వీటితోటే జన్మిస్తాడు. వీళ్ళ సిద్ధాంతం ప్రకారం భక్తి మానవసహజాతాలలో ఒకటి కాదు. అంచేత దానికి రసత్వం లేదు.
కానీ భక్తికవులు రాధాకృష్ణుల ప్రేమని వర్ణించేటప్పుడు, ఉదాహరణకి జయదేవుడి లాగా (తరవాత అన్నమయ్య లాగా), యథేఛ్ఛగా రాయడంతో ఆలంకారికులకి గట్టి ఇబ్బందులే వచ్చాయి. జగన్నాథుడైతే నిష్కర్షగా, రతేః సంభోగరూపాయాః మనుష్యేష్వివ ఉత్తమదేవతా స్ఫుటీకృత సకలానుభవ వర్ణనం అనుచితం, అని చెప్పాడు. ఉత్తమదేవతల సంభోగరూపమైన రతి మనుష్యుల విషయంలో లాగా స్ఫుటంగా దాపరికం లేకుండా వర్ణించడం ఉచితం కాదు, అని. గీతగోవిందంలో జయదేవుడు చేసిన వర్ణనలు దృష్టిలో పెట్టుకుని ఇంకా కఠినంగా — జయదేవాదిభిస్తు గీతగోవిందాది ప్రబంధేషు సకల సహృదయ సమ్మితోయం సమయః మదోన్మత్త మతంగ జైరివ భిన్న ఇతి న తన్నిదర్శనేన ఇదానీంతనేన తథావర్ణయితుం సాంప్రతం, అన్నాడు. (జయదేవాది కవులు గీతగోవిందం లాంటి ప్రబంధాల్లో సహృదయులెందరో అంగీకరించిన ఈ నియమాన్ని మదించిన ఏనుగుల్లాగా నాశనం చేశారని, అందుచేత అది నిదర్శనంగా చూపించి ఈనాటి వాళ్ళు అలా వర్ణించడానికి వీల్లేదు). అయినా కృష్ణభక్తులకి ఇది అభ్యంతరంగా తోచలేదు. రాధాకృష్ణుల ప్రేమని విశృంఖలంగా వర్ణించడం వాళ్ళకి అనుచితంగా కనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు దాన్ని భక్తిరసంగా చూశారు కాబట్టి. ‘భక్తిరసామృతసింధువు’లో రూపగోస్వామి ఈ విషయాన్ని అలంకార శాస్త్ర పరిధి లోనే చర్చించి భక్తికి రసత్వాన్ని సాధించాడు.