కన్నడ, తమిళ, తెలుగు చిత్రములలో మాత్రమే కాకుండా ఎన్నో భాషలలో తీయబడిన చిత్రాలలో పిబిఎస్ పాడాడు. ఇక్కడ ఒకటి రెండు పాటలను ఉదహరిస్తాము. ఏళు రాత్రికళ్ అనే మలయాళ చిత్రములో సలిల్ చౌధరీ దర్శకత్వములోని రాత్రి అనే కోరస్‌తో మాత్రమే తాళము లేని పాట కర్ణపేయంగా వుంటుంది. లతా మంగేష్కర్‌తో మైఁ భీ లడ్కీ హూఁ అనే చిత్రములో చందా సే హోగా వో ప్యారా అనే పాట నిజముగా మధురమైనదే.
చందా సే హోగా వో ప్యారా నైనా జో నైన్ సే మిలే
పిబిఎస్ నటులకు సరిపోయే గాయకుల గాత్రం అనేదాన్ని గురించి అది ప్రేక్షకుల, శ్రోతల భ్రమ మాత్రమే అంటాడు. నిజంగా జెమినీ గణేశన్‌కు ఎ. ఎం. రాజా గొంతుక, తనది రెండు సరిపోతాయన్నది అలాటిదే. అదే విధంగా రాజకుమార్‌కు తన గొంతు సరిపోవడం అనేది కూడా. ఎందుకంటే వాళ్ళిద్దరు స్వతహాగా మంచి గాయకులు. (రాజ్ తరువాతి కాలంలో పాడాడు, జెమినీ పాటను మనం వినలేదు.) అలాగే తాను సామాన్యంగా ఘంటసాల మాత్రమే పాడే ఎన్.టి. రామారావు, నాగేశ్వర రావులకు పాడితే నప్పదు అనే భ్రమ కూడా అలాంటిదే.
పిబిఎస్ ఉచ్ఛదశ దాటిన తరువాత అతనికి పాడే అవకాశాలు తగ్గిపోయాయి. ఆ పరిస్థితుల్లో ఆయనని కొందరు నిర్మాతలు సరిగా ఆదరించక తిరస్కరించారు. ఒకప్పుడు ఒక పాటకు 300 మాత్రమే పారితోషికం (సుమారు 1500 రూపాయలు అప్పటి పారితోషికమయితే) ఇవ్వగా, సంస్కారవంతుడైన పిబిఎస్ అది బహుశా ఎవరికో చెందవలసినది తనకు పొరపాటుపడి ఇచ్చి ఉంటారని తనతో వచ్చిన వారితో చెప్పి వారికే తిరిగి ఇచ్చాడట ఆ డబ్బును. మరొక సారి ఎల్. వైద్యనాథన్ సంగీత దర్శకత్వంలో పిబిఎస్ పాటను కూడ బాలసుబ్రహ్మణ్యాన్ని పాడమంటే బాలూ నిరాకరించి పిబిఎస్ పాడేవరకు అక్కడే ఉండి తరువాత అతనికి పాదాభివందనం చేసి వెళ్ళాడట.
పిబిఎస్ బహుభాషా పరిచయాన్ని, కె. బాలచందర్ ఆకలిరాజ్యం సినిమాలో చక్కగా ఉపయోగించుకొన్నాడు. అందులో విశ్వనాథన్ దర్శకత్వంలో జానకి పాడే తూ హైఁ రాజా అనే హిందీ పాటకు సాహిత్యం అందించినది ఎవ్వరో కాదు, పి. బి. శ్రీనివాసే. నిజానికి పిబిఎస్ సినిమాల్లో ప్రవేశించింది జెమినీ వారి మిస్టర్ సంపత్ అనే హిందీ సినిమాలో దోహాలు పాడటం ద్వారా. ఆ తరువాత కూడా హిందీ సినిమాల్లోను, ప్రైవేటుగా చాలా గజళ్ళు కూడా పాడారు. ఆయన లతతో కలిసి, మైఁ భి లడ్కీ హూ సినిమాలో పాడిన ‘చందా సె హోగా హొ ప్యార్’ అన్న పాట ఎంత ప్రసిద్ధి చెందిందో చెప్పనవసరం లేదు. ఆయన డాకు భూపత్ అన్న హిందీ డబ్బింగ్ సినిమాలో (తెలుగు మాతృక: రాజనందిని, 1958) సుశీలతో కలిసి పాడిన నైనా జో నైన్ సే మిలే పాట, తెలుగులో ఎ. ఎం. రాజా, సుశీల ఎంతో మనోహరంగా పాడిన అందాలు చిందు సీమలో, అన్న పాటకి ఏ మాత్రం తీసిపోదు.
అరుదైన వ్యక్తి
అనేక భాషల్లో పాటలు పాడి ప్రఖ్యాతి పొందిన పిబియస్‌ను మన పొరుగున ఉన్నవారు ‘మా వాడు’ అని గర్వంగా చెప్పుకోవటం తెలుగువారిగా మనం అందరం గర్వించ తగ్గ విషయం. అది తెలుగువారి అదృష్టం. తెలుగునాట పిబియస్‌కి తగినంత గుర్తింపు రాకపోటం మనం బాధపడవలసిన విషయం! పిబిఎస్‌కు తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము రాజ్యోత్సవ పురస్కారం, 2500 చదురపుటడుగుల భూమి, శివ ఫౌండేషన్ వారి మాధవపెద్ది పురస్కారం, రాజకుమార్ కుటుంబం వారి రాజ్‌కుమార్ సౌహార్ద పురస్కారం, శిరోమణి బహుమతి, గాయకి సుశీల ట్రస్ట్ వారి లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డ్ పి. బి. శ్రీనివాస్ పొందిన కొన్ని సన్మానాలు. సాత్వికుడిగా, అజాతశత్రువుగా, మెత్తని మనసుతో అందరితో ఎంతో కలివిడిగా కలిసిపోయే మనిషిగా ఆయన చాలా అరుదైన వ్యక్తి! రావలసింత గుర్తింపు కానీ, అవకాశాలు కానీ రాలేదని ఎన్నడూ చింతించని మనిషి. అందరూ నావాళ్ళే అని ఉడ్‌లాండ్స్-డ్రైవ్ఇన్ ఫలహారశాలలో కూర్చుని పలకరించిన వారందరితో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ వుండేవారు. ఎవరికి సన్మానం అని విన్నా జేబులనిండా వుండే రంగురంగుల కలాలతో ఒక పద్యం రాసి దాన్ని ఒక ప్లాస్టిక్ కవరులో పెట్టి, స్వయంగా పాడి తరువాత సమర్పించేవారు ఆయన. తెలుగువారిగా ఈ మహామనీషిని ఈ సందర్భంలో స్మరించుకోటం మన కనీస ధర్మం!



