ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్.

భగవద్గీత విభూతియోగములో శ్రీకృష్ణుడు అర్జునుడితో, విశ్వంలో ప్రతి చరాచరవస్తువులో అతి శ్రేష్ఠమైన వస్తువును పేర్కొని తాను కూడ అదేనంటాడు. మాసానాం మార్గశీర్షోఽహం ఋతూనాం కుసుమాకరః అని అంటాడు. కణ్ణదాసన్ బహుశా వీటిని పల్లవిగా తీసుకున్నాడేమో. ఒక పాట చక్కగా అమరాలంటే దానికి చిత్రంలోని సన్నివేశం, పాట సాహిత్యం, సంగీతం, నటీనటులు — ఇవన్నీ చక్కగా కుదరాలి. నిజ జీవితంలో భార్యాభర్తలైన సావిత్రీ గణేశన్లు నటులు. వేణువు, వయలిన్, అకార్డియన్, మృదంగ వాద్యాలతో నేపథ్య సంగీతం. పిబిఎస్ తరువాత పాడిన ఎన్నో ప్రేమ పాటలకు ఇది ఒక మార్గదర్శిగా నిలిచిపోయిందంటే అతిశయోక్తి కాదు.

మయక్కమా కలక్కమా మనిదన్ ఎన్బవన్ దైవమాగలాం

కాలంగళిల్ అవళ్ వసందం మదికి ఆనందాన్నిచ్చే శృంగారగీతమయితే, 1960లో విడుదలైన శుమైతాంగి చిత్రంలో, ‘మనిదన్ ఎన్బవన్’ మనసు పడే నిరాశానిస్పృహలను ఎత్తి చూపిస్తుంది. ఈ సినిమాలో అన్ని పాటలు కర్ణానందంగా వుంటాయి. అందులో తాత్విక చింతనలతో నిండిన రెండు పాటలు ఉన్నాయి. అవి – మయక్కమా కలక్కమా, మనిదన్ ఎన్బవన్. మయక్కమా కలక్కమా పాటలో వాయువాద్యాల నేపథ్యం మనకు ఒక విచిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది. మనిదన్ ఎన్బవన్ దైవమాగలాం వినడానికీ,చూడడానికీ కూడా బాగుండే పాట.

సన్నివేశం మదరాసు లోని మెరీనా బీచి. నిర్జనంగా ఉన్న ఆ రాత్రిపూట ఏకాంతంగా జెమినీ గణేశన్ గాంధీ బొమ్మ దగ్గర నడుస్తూ పాడతాడు. తాను ప్రేమించి పెండ్లి చేసుకోవాలన్న పిల్లతో పెళ్ళి ఆగిపోతుంది. ఆ నిరాశ ఈ పాటలో ప్రతిధ్వనిస్తుంది. నేపథ్య సంగీతంలో వేణువు, వయలిన్ ఈ పాట అందాన్ని మరింతగా చేస్తాయి. పిబిఎస్ తన గొంతుతో శ్రోతలను, ప్రేక్షకులను ఒక కొత్తలోకానికి తీసుకుని వెళతాడు ఈ పాటతో. ఇది నిజంగా ఒక మఱపురాని మఱువలేని చిత్రగీతమే!

మనిదన్ ఎన్బవన్ దైవమాగలాం
వాఱి వాఱి వళంగుంబోదు వళ్ళలాగలాం
వాళైప్పోల తన్నై తన్నై తందు త్యాగి యాగలాం
ఉరుగి ఓడుం మెళుగుపోల ఒళియై వీశలాం

(మనిషి తానె ఆ దేవుడవగనౌ / కరముతోడ దాన మొసగి కర్ణు డవగనౌ / అరటివోలె తన్నె నఱికి త్యాగి యవగనౌ / కరుగు క్రొవ్వు వత్తి వోలె కాంతి నియగనౌ )

ఊరుక్కెండ్రు వాళ్న్దద నెంజం శిలైగళ్ ఆగలాం
ఉఱవుక్కెండ్రు విఱింద ఉళ్ళం మలర్గళ్ ఆగాలాం
యారుక్కెండ్రు అళుదపోదుం తలైవన్ ఆగలాం
మనం మనం అదు కోవిల్ ఆగలాం

(జనుల కొఱకు మనిన హృదియు శిలగ మారునే / ప్రేమ కొఱకు మనిన హృదియు విరిగ మారునే / ఒరులకొఱకు యేడ్వ నేతగాను మారునే / హృది? యది? ఒక కోవెలవగనౌ)

మనమిరుందాల్ పఱవై కూట్టిల్ మాన్‌గళ్ వాళలాం
వళియిరుందాల్ కడుగుక్కుళ్ళే మలైయై కాణలాం
తుణిందువిట్టాల్ తలైయిల్ ఎంద శుమైయుం తాంగలాం
గుణం గుణం అదు కోవిల్ ఆగలాం

(ధైర్యముతో గూటిలోన మృగములుండునే / దారి యుండ కొండ జూడ నౌను ఆవలో / నిశ్చలముగ నెట్టి భారమైన మోయనౌ / మది? యది? ఒక కోవెలవగనౌ)

ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై కాలుపెట్టిన సందర్భంలో పిబిఎస్ ఇంగ్లీషులో మూన్ సాంగ్ ఆల్బమ్ వ్రాసిన విషయము అందరికీ తెలిసినదే. ఆ రికార్డును అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌కూ, అపోలో వ్యోమగాములకూ పంపారు కూడా. అది మాత్రమే కాదు, తమిళంలో నిలవు పాడల్గళ్ (చంద్రుని పాటలు) పాడడంలో గొప్పవాడని పిబిఎస్‌కి ఎంతో పేరుంది.

ఒకే పాట ఇద్దరు పాడితే ఎవరు బాగా పాడేరు అన్న ప్రశ్న సాధారణంగానే వస్తుంది. సుమారు 1966లో రాము అన్న సినిమా తెలుగులోనూ, తమిళంలోనూ వచ్చింది. తమిళ సినిమాలో కె.ఆర్. విజయ, జెమినీ గణేషన్ నాయికా నాయకులుగా నటిస్తే, తెలుగులో జమున, ఎన్.టి. ఆర్ లు నటించారు. ఈ రెండు సినిమాలకి సంగీత దర్శకత్వం ఇచ్చినవారు ఎం. ఎస్. విశ్వనాథన్ (తమిళ), ఆర్. గోవర్ధనం (తెలుగు). ఈ సినిమాలో చాలా మంచిపాటలు ఉన్నా, వాటన్నిటిలోను మంటలు రేపే నెల రాజా అన్న పాట పాట మంచి ప్రజాదరణ పొందింది. అందుకు ఒక ముఖ్య కారణం ఈ పాట బాణీ హిందూస్తానీ సంగీతానికి చెందిన భాగేశ్రీ అన్న రాగం ఆధారంగా కట్టబడి ఉండటమే! పాటలోని సాహిత్యానికి తగ్గట్టు విషాదభరితంగా నడిచే భాగేశ్రీ రాగం ఈ పాటకి ఎన్నుకోబడ్డది.

మంటలు రేపే – రాము నిలవే ఎన్నిడం నెరుంగాదే

ఘంటసాల పాట గురించి వేరే ఏమీ చెప్పక్కరలేదు. పైగా ఘంటసాల స్వయంగా భాగేశ్రీ రాగంలో బాణీలు కట్టి (ఉదా. ఈమాటలో ప్రచురించబడ్డ గుర్రం జాషువా పాపాయి పద్యాలు అన్న వ్యాసంలోని ఆఖరి పద్యం) పాడారు. ఇంతకన్న ఎవ్వరూ ‘మంటలు రేపే నెల రాజా’ అన్న పాట బాగా పాడలేరు అన్న నిర్ధారణకు భిన్నమైన అభిప్రాయం ఇదే పాట తమిళ భాషలో విన్నప్పుడు కలుగుతుంది. తమిళ పాట లోని సాహిత్యాన్ని ఆస్వాదించే భాషా ప్రావీణ్యం కొంతమంది శ్రోతలకి లేకపోయినా, తమిళ పాటలో వచ్చిన గమకాలు, ఆలాపనలు వింటూంటే ఉక్కిరి బిక్కిరి అవ్వక తప్పదు. తమిళ పాట (నిలవే ఎన్నిడం నెరుంగాదే) పాడింది పిబిఎస్. ఘంటసాల పాటలంటే ఎంతో అభిమానమున్నా, ఈ పాట విషయంలో పిబిఎస్‌కి ఎక్కువ మార్కులు వెయ్యక తప్పదు. చిత్రరంగంలో గాయకులందరూ కూడా రాము సినిమాలో పిబిఎస్ పాడిన నిలవే ఎన్నిడం పాట అత్యుత్తమమైనదని చెబుతారు. రెండూ విని మీరే నిర్ణయించుకోండి.

ఈ పాట తమిళ సాహిత్యానికి తెలుగు అర్థం ఇదీ:

నిలవే ఎన్నిడం నెరుంగాదే

నిలవే ఎన్నిడం నెరుంగాదే
నీ నిన్నైక్కుం ఇడత్తిల్ నానిల్లై
మలరే ఎన్నిడం మయంగాదే
నీ మయంగుం వగైయిల్ నానిల్లై

కోడైయిల్ ఒరు నాళ్ మళై వరలాం ఎన్
కోలత్తిల్ ఇని మేల్ ఎళిల్ వరుమో
పాలైయిల్ ఒరు నాళ్ కొడి వరలాం ఎన్
పార్వైయిల్ ఇని మేల్ సుగం వరుమో

ఊమైయిన్ కనవై యార్ అఱివార్ ఎన్
ఉళ్ళత్తిన్ కదవై యార్ తిరప్పార్
మూడియ మేగం కలైయు మున్నే నీ
పాడవందాయో వెణ్ణిలవే

అమైది ఇల్లాద నేరత్తిలే అంద
ఆండవన్ ఎన్నై పడైత్తువిట్టాన్
నిమ్మది ఇళందు నాన్ అలైందేన్ ఇంద
నిలైయిల్ ఉన్నై ఏన్ తూదు విట్టాన్

నెలరాజా నా దగ్గర చేరకు, నీవనుకొన్న చోటులో నేను లేను; విరిబాలా నన్ను చూసి మురిసిపోకు, నీవు మురిసే విధముగా నేను లేను.

వేసవిలో ఒక రోజు వాన కురుస్తుంది, కాని నా ఆకారంలో ఇకపై అందము కొత్తగా వస్తుందా? ఎడారిలో ఒక రోజు పూలతీగ పెరగవచ్చు, కాని నాకది ఆనందాన్ని ఇస్తుందా?

మూగవాడి కలలను గురించి ఎవరికి తెలుసు, నా గుండె తలుపులు ఎవరు తెరుస్తారు? కమ్ముకొన్న మేఘాలు చెదరిపోకముందే పాడడానికి వచ్చావేమో?

శాంతిలేని ఒక సమయంలో ఆ దేవుడు నన్ను సృష్టించాడు, వేదనతో నేను తిరుగాడుతున్న స్థితిలో నిన్ను దూతగా ఎందుకు పంపాడో?

కన్నడ పాటలు

ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా, తమిళంలో లాగానే ఆర్ నాగేంద్ర రావు జాతకఫల సినిమా ద్వారానే పిబిఎస్ మొట్ట మొదట కన్నడ చిత్రసీమకు (గోవర్ధన్ సంగీత దర్శకత్వంలో) కూడా పరిచయమయ్యాడు. సంగీత దర్శకుడు జి కె వెంకటేశ్‌కు (ఒకప్పుడు ఇళయరాజా ఇతనికి సహాయకుడు, తరువాతి కాలములో వెంకటేశ్ ఇళయరాజాకు సహాయ దర్శకుడు!) పిబిఎస్ అంటే ఇష్టం. తాను ఓహిలేశ్వర అనే కన్నడ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నప్పుడు రాజకుమార్‌ను తనకు పాడడానికి ఒక కొత్త గాయకుడికి అవకాశం ఇస్తే బాగుంటుందని సూచించాడు. వెంకటేశ్, రాజ్ మంచి స్నేహితులు. అలాగే ‘ఝమాయించ’మన్నాడు రాజకుమార్.

ఈ మూఢత నవిదేకె – జాతకఫల ఈ దేహదింద – ఓహిలేశ్వర

అలా ఓహిలేశ్వర సినిమాలో రాజకుమార్‌కు మొట్టమొదట పిబిఎస్ పాడాడు. ఆ చిత్రంలో ఎక్కువ పాటలను ఘంటసాల పాడాడు. ఒక పాటను రాజకుమార్ కూడా పాడినట్లున్నాడు. కాని పిబిఎస్ గాత్రం రాజకుమార్‌కు చక్కగా కుదిరినట్లు రాజ్‌తో సహా అందరూ అభిప్రాయపడ్డారు. అప్పటినుండీ 1974 వరకు రాజకుమార్ పాటలను కన్నడలో పిబిఎస్ మాత్రమే పాడాడు. 1974లో ఒక పాట రికార్డింగుకు పిబిఎస్ రాలేక పోయినప్పుడు రాజకుమార్ తానే పాడుకున్నాడు. అప్పటినుండి ప్రేక్షకులు రాజకుమార్ పాటలనే అభిమానించారు కాబట్టి పిబిఎస్ తరువాత అతనికి పాడలేక పోయాడు.


పిబిఎస్, రాజ్ కుమార్

1950, 60 దశకాలలో కన్నడ చిత్రసీమలో ముగ్గురు ‘కుమార’ నాయకులు ఉండేవారు — రాజకుమార్, ఉదయకుమార్, కళ్యాణకుమార్. వాళ్ళ ముగ్గురికీ పిబిఎస్ గాత్రదానం చేశాడు. తరువాతగా వచ్చిన గంగాధర్, శ్రీనాథ్, విష్ణువర్ధన్, అంబరీష్ లాంటి హీరోలకి కూడా పిబిఎస్ పాడాడు. రాజకుమార్ తాను శరీరమయితే పిబిఎస్ తన శారీరము (కంఠస్వరము) అనే వాడు. అదేవిధంగా రాజకుమార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే బహుమతి లభించినప్పుడు శ్రీనివాస్ అది తనకే వచ్చినట్లు పొంగిపోయాడు. పిబిఎస్ పాడిన చిత్రగీతాలలో ఎక్కువ పాలు కన్నడ సినిమాలలోవే. అతని కన్నడ ఉచ్చారణ, పాటలు అభ్యాసం చేసేటప్పటి క్రమశిక్షణ, వేళ తప్పకుండా రికార్డింగులకు వెళ్ళడం — చిత్రదర్శకులు, సంగీత దర్శకులు ఎంతో అభిమానించేవారు. కన్నడ చిత్రసీమలో 1960, 70 దశకాలలో గొప్ప సంగీత దర్శకులు ఉండేవారు — టి జి లింగప్ప, జి కె వెంకటేశ్, విజయభాస్కర్, రాజన్-నాగేంద్ర, ఎం రంగారావు తదితరులు. వారు బాణీలలో మాధుర్యానికి పెద్ద పీట వేసేవాళ్ళు. స్వతహా గానకోకిలయైన పిబిఎస్ ఆ సంగీత దర్శకుల ఆధ్వర్యంలో తన పాటలలో తేనెలొలికించాడు. అప్పుడప్పుడు రాజేశ్వర రావు (అమరశిల్పి జక్కన్న), చలపతి రావు (మావన మగళు) వంటివారి దర్శకత్వంలో పిబిఎస్ అన్ని రకాలైన పాటలు (శృంగార, శోక, విరహ, తాత్విక, హాస్య, యుగళ గీతాలు) పాడాడు.