నిరంతరాయితమైన వ్యాసంగంతో రచన సాగించటమే ఆయన చేసిన పని. దాని లాభాలాభాల దృష్టి ఉండేది కాదు. ఐకాంతికమైన అభ్యాసం కావటం వల్ల ఆయన రచనలో సమకాలిక కావ్యవిమర్శ రీతులకు అనురూపంగా సృజనశీలితను తీర్చిదిద్దుకోవాలనే ప్రయత్నం కనుపించదు. తన కృతులను అధికరించి పఠితల అభిప్రాయం ఏ విధంగా ఉంటున్నదీ ఆయన పట్టించుకోలేదు. ఈ లక్షణాలన్నీ ఆయన మలి రచనలైన ‘గాయకుడి గేయాలు’ అన్న నూటపదహారు గేయాల సంపుటిలోనూ, Lovely Love Songs, White Shadows అన్న ఆంగ్లగీతికా సంపుటాలలోనూ మనకు కనుపిస్తాయి. ఇవన్నీ ఆయన వైయక్తిక భావసంపుటులు. ఆత్మీయాభివ్యక్తులు. చిత్రకవిత్వ కోవిదత్వం వల్ల ఆయనకు సిద్ధించిన పంక్తిపావనతకు ఇవి ఛాయారేఖలు మాత్రమే అని నా అభిప్రాయం. సుకవిత్వానుభవికులకు వీటిలో చర్వితచర్వణగా చిత్తవిచ్ఛిత్తిని కల్పింపగల ఉదాహరణీయ స్మరణీయపంక్తులు; భావికతకు, భావుకతకు నిదర్శనలు కనిపించవచ్చును.
‘గాయకుడి గేయాలు’లో తన గురుతుల్యులు శ్రీ సాలూరు రాజేశ్వరరావుని సన్నుతిస్తున్న ఒక గేయం కోహినూరు. చాలా మందికి పుస్తకం అందుబాటులో ఉండకపోవచ్చునని ఉదాహరిస్తున్నాను:
నిగనిగల కోహినూరు
నీ ముందు బలాదూరు!
నీ మేను పైడి తేరు
నీ వయసే పరువాలూరు!
బుగ్గ చిదిమితే పాలూరు!
పూపెదవులలో తేనూరు!
కన్నుల వెన్నెల వెలుగూరు! కను
సన్నల వన్నెల సొగసూరు!
నవ్వు రసాల రసాలూరు!
నడకల హంసల లయలూరు!
కంఠం మధుర రవాలూరు!
కదిలే కేశా లిరులూరు!
ఒడలి విఱుపులో మరులూరు!
ఊహలు మదిలో మెఱుపూరు!
తనువు నిలువునా వలపూరు! – నా
మనసు సదా నీ తలపూరు!
వ్యాసరచనలోనూ శ్రీనివాస్ అందెవేసిన చేయి. ఆ వ్యాసాలు వందలకొద్దీ ఉంటాయి. విలేఖరిగా విజయచిత్ర వంటి పత్రికలకు వ్రాసినవీ అనేకం. శ్రీ పోతుకూచి సాంబశివరావు తోడి బాల్యస్నేహం వల్ల వారి విశ్వరచన పత్రికలో సినిమా గొడవలు అనే హాస్యోక్తిమయమైన చక్కటి కాలమ్ నడిపారు. పెక్కుమంది కవులు, కళాకారుల సన్మాన సంచికలలో వారి వ్యాసాలున్నాయి. ‘భారతి’లో వ్రాసిన వ్యాసాల విలువ నిజంగా అనర్ఘమని చెప్పవచ్చును. వాటిలో మాండలిన్ శ్రీనివాస్ గుఱించిన వ్యాసాన్ని నా చిన్నప్పుడు ఎన్నిసార్లు చదువుకొన్నానో లెక్కలేదు. ‘రచన’లో సాలూరు రాజేశ్వరరావుని గుఱించి వచ్చిన వ్యాసం వెలకట్టలేనిది.
వేషభాషలకు, భూషలకు ప్రధానమైన చలనచిత్ర రంగంలో నిలద్రొక్కుకొని రావలసి ఉండటం వల్ల ఆయన రూపరేఖలో ఆధునికత ఉట్టిపడుతుండేది. కొన్నాళ్ళు పూర్తి సూటు, ఆ తర్వాత సఫారీ సూటు, కరణ్ సింగ్‌లా అదే తానుతో కుట్టిన మంచి టోపీతో చూడ ముచ్చటగా ఉండేవారు. చేతిలో పుస్తకం, జేబులో లెక్కలేనన్ని పెన్నులు రంగురంగుల్లో కనబడుతుండేవి. చెఱగని చిఱునవ్వు ఆ రూపానికి నిండుతనాన్ని తేవటం అందరికీ తెలిసిన సంగతే. వయసు మీఱసాగినప్పుడు జరీ తలపాగాను పెట్టుకోవటం మొదలుపెట్టారు. కళ్ళలో వెనుకటి కళ మాఱి అంతర్ముఖులు అవుతున్నారనిపించేది. చివఱి రోజులలో కొంత అంటీ అంటనట్టు కనిపించేవారు. ఆ విశాలమైన నేత్రాలు ఎక్కడికో కాలానికి గుర్తులు తెలియని అతీతసీమలకు వెళ్ళిపోవటానికి సిద్ధమౌతున్నట్లుగా ఉండేవి. ఆంధ్రత్వానికి దూరం కావటం లేదు కదా, మనస్సులో – అని అనుకొనేవాణ్ణి కాని, వారెన్నడూ ఆంధ్రత్వానికి దూరం కాలేదు. ఆప్యాయనానికీ దూరం కాలేదు. ఎటువంటివారినైనా ఆప్యాయనంగా పలకరించి పులకరింపజేసేవారు. మా నాన్నగారు ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారికి, ఆయన మిత్రమండలికి సన్నిహితులు కావటం వల్ల నన్ను పుత్త్రనిర్విశేషంగా చూచేవారు. తనకన్నా పాతికేళ్ళ చిన్న వయసువాడికి వినిపిస్తున్నానన్న సంకోచం లేకుండా, ప్రేమతో తాను సరిక్రొత్తగా వ్రాసిన రచనను వినిపించేవారు. మద్రాసును విడిచిపెట్టిన తర్వాత ఆ పరిచయపు నిత్యానుషంగం లేకపోయింది.
నేను బి.ఎ. పూర్తయాక 1974 సెలవు రోజులలో ‘సంతాప సభ’ అని నాటకం ఒకటి వ్రాశాను. ఒక కవిగారు బ్రతికి ఉండగానే ఆయన కావ్యం చచ్చిపోతుంది. అన్ని చోట్లా వెతికి ప్రతులు మఱెక్కడా లేవని నిర్ధారించుకొన్నాక ఊళ్ళోని సాంస్కృతిక సంఘం వారు కవిగారిని ముఖ్య అతిథిగా పెట్టి ఆ కావ్యానికి సంతాప సభను నిర్వహిస్తారు. కావ్యాన్ని గుఱించి వక్తలందరూ మంచి మాటలు చెబుతారు. అంతా వ్యంగ్యధోరణిలోనే సాగుతుంది. నేనందులో పి.బి. శ్రీనివాస్ గారిని ఒక వక్తగా ప్రవేశపెట్టాను. అధ్యక్షులవారు “ఇప్పుడు బహుభాషా నేపథ్య గాయకులు, సుప్రసిద్ధకవి శ్రీ పి.బి. శ్రీనివాస్ గారు ప్రసంగిస్తా”రని ప్రకటిస్తారు. మీరేమీ అనుకోరని నాటకం లోని ఆ భాగాన్ని ఉదాహరిస్తాను:
పి.బి. :- (వేదిక ఎక్కుతూ, చేతిలోని కాగితాలను సరిచూసుకొంటూ, మైకు దగ్గరికి వస్తారు) సభకు నమస్కారం! విషయం చెప్పి సభకు రమ్మంటే, ముందు కవిగారు పోయారనుకొని మాల్ఖోస్ లో రాశా. తీరా ఇక్కడికి వచ్చాక కవిగారు చల్లగా ఉన్నారు, కావ్యమే లేదు – అని తెలిసి సంతోషంగా రాగమాలికలోకి మార్చా. చదువుతాను వినండి:
(రాగమాలిక)
ఇది సీసపద్యం.
[చ]నినావె కావ్యమా! స్వర్గవాసానికి
వ[చ్చి] నాల్గు సెకండ్లు బ్రదుకలేదు
ఇది[యే]మి ఘోరమో! ఈ రీతి అచ్చైన
వెంటనే [లో]కాన్ని వీడినావు
నినుఁగోరి [కా]దొకో! నీ తండ్రి కవి యిట్లు
పుట్టెడు దుఃఖా[న] మునిఁగిపోయె
ఉవిద! నీవెట [నుం]టివో! యెట్లు నీవు
లభ్యపడఁగలవు నేఁ[టి] పాఠకులకు!కనఁగ వచ్చునె నిను[వో]లు కావ్యరాజ
మాంధ్ర సాహిత్య చరిత నే [కా]లమందు!
పఠితృలోకమ్ము వీడుట భా[వ్య] మగునె?
లోకఋణమిట్లు తీఱెనా నీకు [మా]కు!ఇందులోని మొదటి పాదంలో మొదటి అక్షరం, రెండో పాదంలో రెండో అక్షరం, మూడో పాదంలో మూడో అక్షరం – ఇలా అన్ని పాదాలలోని అక్షరాలను కలిపి చదివితే “చచ్చి యే లోకాన నుంటివో కావ్యమా!” అని వాక్యం వస్తుంది. ఇల్లాంటి చిత్రాన్ని ఇంతవఱకు ఏ భాషలోనూ ఎవరూ చెయ్యలేదు. ఆ తరవాతి పద్యం వినండి:
ఇంతింతై, మఱి యింతయై, మఱియు నీ వింతై, మఱీ వింతగా
నంతై, పాఠకనేత్రగోళముల గల్లంతై, సెకండ్ హ్యాండులో
సొంతంబై, సిగరెట్ బజార్లఁ బడి యస్వుల్వీడి చింతింపఁగా
సుంతైనం గనరాక యుంటివి గదా చోద్యంబుగా కావ్యమా!(సభలో చప్పట్లు)
అయినా, నాలుగు కాలాలపాటు చల్లగా బ్రతికి ఉండాల్సిన కావ్యం అర్ధాయుష్కం ఎందుకయిందో? అని ఆలోచన వచ్చాక ఈ పద్యం రాశా.
తొలుత నచ్చైన దీనినే దుమ్ము దులిపి
మఱల ముద్రింప వలెనేమొ మన మటంచు
దివిజప్రెస్సుల గుండియల్ దిగ్గురనగ
అరుగుచున్నావె కావ్యమా! అమరపురికి.
అని వ్రాసి వినిపించాను. తన రచనను పేరడీ చేశానని నొచ్చుకొనకపోగా శ్రీనివాస్ పకపకపక నవ్వి, “నువ్వు నాటకం వేస్తే చెప్పు, నేను వచ్చి నా వేషం నేనే వేస్తా!” అని మాట యిచ్చారు. నాటక ప్రదర్శన జరగకపోయినా, వారిచ్చిన మాట మాత్రం ఒక మధురస్మృతిగా మిగిలిపోయింది నాకు!
