“సారీ! ఊరికే వచ్చి నీ మూడ్ పాడు చేశాను కదూ! నాకంటే అసహ్యమైన జంతువుంటుందా?”
“వుంది! ఇదిగో, నా బొమ్మలో ఈ పిల్లి! ఇందాక మోహన్ కూడా అదే మాటన్నారు కదా? అది సరే, నాకొక విషయం అర్థం కావడం లేదు.”
“ఏమిటి?”
“నేనింకా మోహన్ గారు చేయి తిరిగిన కళాకారులనీ, జనమంతా ఆయన గీసిన చిత్రాలు కొనడానికి బారులు తీరి నిలబడ్డారనీ అనుకున్నాను. అందుకే ఆయన ఇక్కడికొచ్చి నా బొమ్మని చెడామడా తిడుతూంటే, అంతటి మేధావి నా బొమ్మ గురించి అభిప్రాయం చెప్పటమే నా అదృష్టమని మురిసిపోయాను కూడా! మరి నువ్వేమో…”
“అదేం లేదు, పాపం. అతనూ మన గూటి పక్షే. ఒక్కరూ తన చిత్రాలు కొనక, ఇలా ప్రకటనల కోసం బొమ్మలు గీసి డబ్బు సంపాదిస్తూంటాడు. నేనేమో అలాటి ఆయనని పట్టుకొని… నా పాపానికి నిష్కృతి లేదు,” మళ్ళీ గొల్లుమంది శ్రీదేవి.
“మళ్ళీ మొదలు పెట్టొద్దు, ప్లీజ్!”
శ్రీదేవి లేచింది. “వెళ్ళి క్షమాపణలైనా చెప్తాను. అతనంటే నాకేమాత్రం ఇష్టం వుండదనుకో. అయినా నేను చేసింది తప్పేగా? తప్పదు మరి! వస్తా.” బయటికెళ్ళింది.
సి.జీవి లేచి సిగరెట్టు ముట్టించాడు. కిటికీలోంచి బయటికి చూస్తూ దీర్ఘాలోచనలో పడ్డాడు.
జీవితంలో వీలైనంతవరకూ క్షమాపణలు చెప్పకుండా ఉండడానికే ప్రయత్నించాలి. ఎప్పుడైనా విధిలేక చెప్పాల్సి వస్తే, అందుకు అర్హులైన వారికే చెప్పాలి. ఏదో పొరపాటు చేశాం కదా అని ఎవరికి పడితే వారికి చెప్పకూడదు! అందులో మోహన్ లాటి వారికి అసలే చెప్పకూడదు. అలాటి వారికి క్షమాపణ చెప్తే, పెద్ద మనసుతో హుందాగా క్షమించేయకుండా, చిన్న పొరపాటుని పదే పదే ఎత్తి చూపి, పుండు మీద కారం జల్లినట్టు మాట్లాడి, ‘ఇతనికి క్షమాపణ చెప్పటం కాకుండా, చెంప పగలగొట్టాల్సిందేమో,’ అని అనుకునే పరిస్థితికి మనల్ని దిగజారుస్తారు.
ఇప్పుడూ అదే జరిగింది. ఈ పొరపాటు వల్ల ఇహ ముందు తనేం మాట్లాడినా, ఏం చేసినా శ్రీదేవి నోరెత్తకుండా పడుండాల్సిందే తప్ప, నోరెత్తకూడదని అన్యాపదేశంగా ఆమెకి సూచించి పంపేశాడు. మళ్ళీ ఎప్పట్లాగే జీవి గదికి పోవడాలూ, అడగకున్నా సలహాలు ఇచ్చేయడాలూ యథేఛ్ఛగా సాగుతున్నాయి. జీవి పధ్ధతి మాత్రం ఏమీ మారలేదు. ఎప్పట్లాగే, చిరునవ్వుతో అతను మోహన్ తన బొమ్మలమీద చేసే వ్యాఖ్యానాలని స్వీకరిస్తున్నాడు. అతనితో ఏకీభవిస్తున్నాడు కూడా. అతని స్థితప్రఙ్ఞత చూస్తున్నకొద్దీ శ్రీదేవికి అతను ఇంకా నచ్చుతున్నాడు.
ఈ మధ్య మోహన్ ఉపన్యాసాల్లో దర్పం పెరిగింది. ఎందుకంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత అతని చిత్రాలు అమ్ముడవుతున్నాయి. రెండు వారాల్లో మూడు బొమ్మలు అమ్ముడు పోయేసరికి అతని ఏజెంటు కూడ ఆశ్చర్యం పట్టలేకపోయాడు. సూర్యరశ్మికి కమలాలు విచ్చుకున్నట్టు, ఈ శుభ పరిణామాలతో అతనిలోని విమర్శకుడు విచ్చుకున్నాడు. ఈ మధ్యనే ఒక డబ్బున్న మారాజు తన బొమ్మని రెండువేలకి కొన్నాడని తెలియగానే, మోహన్‌కి డబ్బున్న వాళ్ళ మీద ఇదివరకున్న అభిప్రాయాలు సమూలంగా తుడిచిపెట్టుకు పోయాయి.
“నాకైతే ఇది డబ్బున్న వాళ్ళల్లో కళల గురించి సరైన అవగాహన పెరుగుతున్న శుభోదయానికి నాందిలా అనిపిస్తుంది,” అని ప్రకటించాడు, శ్రీదేవి, జీవిల ముందర, గంభీరంగా!
జీవి కూడా మొత్తానికి పిల్లి-పిల్ల చిత్రాన్ని పూర్తి చేసి ఒక పెద్ద గాలరీలో ఇచ్చాడు, దీంతో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండని. మోహన్ రికమెండేష లెటర్ రాసిచ్చాడు కదా! అందుకని వాళ్ళూ తీసుకున్నారు. తన బొమ్మలు బాగనే అమ్ముడవుతూండడంతో మోహన్ ప్రకటనలకి వేసే బొమ్మలు తగ్గించుకున్నాడు. దాంతో తీరిక చిక్కి జీవి గదిలో ఎక్కువగా ఉపన్యాసాలు ఇవ్వసాగాడు.
“నీ బొమ్మని కూడ ఎవరైనా కొంటే కానీ ఆయన నోటికి తాళం పడదు.” వాపోయింది జీవి దగ్గర శ్రీదేవి.
“నా పనైతే నేను చేశానుగా! ఆ సంగతొదిలేయ్. అది సరే కానీ, నువ్వు ఆ మధ్య రాసిన పాటేమైంది?”
“అదా! అమీన్-సయానీ అనే మ్యూజిక్ కంపెనీ తీసుకుందిలే!” నిర్లిప్తంగా అంది శ్రీదేవి.
“మరి అలా మొహం వేలాడేసుకున్నావెందుకు? ఇహ చూడు నీ పాట ఢంకా బజాయించేస్తుంది.”
“కానీ కిందటిసారి సయానీని కలిసినప్పుడు ఏమంత ఉత్సాహంగా లేడు.”
“ఆ సయానీదంతా ఆంజనేయుడి తంతు. తన గొప్ప తనకే తెలిసి చావదు! కొంచెం టైమివ్వు ఆయనకి!”
“కొంచెమేం ఖర్మ, ఎక్కువే తీసుకోమను. పాట నలుగురి నోళ్ళలో నానితే చాలు.”
ఆశ్చర్యకరంగా ఆ పాట హిట్టయింది! ఆ రికార్డు ఎక్కువగా అమ్ముడవడమే కాక, సయానీకి ఆ పాట కోసమే ఎక్కళ్ళేనన్ని ఫోన్ కాల్సూ, అభినందనలూ అందసాగేయి. శ్రీదెవి డబ్బు ఇబ్బందులూ మాయమైపోయాయి. ఈ సంతోషంలో జీవి చిత్రం కూడా ఎవరైనా కొంటే బాగుండని ఎంతో ఆశ పడింది శ్రీదేవి. ఆ చిత్రం అమ్ముడు పోకపోగా, మోహన్ ఉపన్యాసాలూ, విమర్శలూ, సలహాలూ భరించలేని స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు జీవి గదిలో మోహన్ అలికిడి వినిపిస్తే కిందికి జారుకుంటుంది శ్రీదేవి.
ఒకరోజు మధ్యాహ్నం శ్రీదేవి గదిలో పని చూసుకొంటోంది. ఉన్నట్టుండి వరండాలో పబ్లిక్ ఫోన్ మోగిన చప్పుడు. అన్ని అపార్ట్‌మెంట్లకీ అదొక్కటే దిక్కు. అది ఇంకా మోగుతూనే వుంది. పాపం, ఏదైనా ముఖ్యమైన పనేమో.
“హల్లో! జీవి గారున్నారా?” అడిగిందొక బొంగురు గొంతు.
“లేరండీ! బయటికెళ్ళినట్టున్నారు. ఏదైనా మెసేజీ ఇస్తే ఆయనకిస్తాను.”
“అవునాండీ! పాండు ఫోన్ చేశాడని చెప్పండి. రోజూ పోస్ట్‌లో వస్తున్న ఆ కేసెట్లని ఏం చెయ్యమంటారని అడుగుతున్నానని కొంచెం చెప్పండి, ప్లీజ్!”
“కేసెట్లా?”
పాపం పాండు గారికి తన బాధ పంచుకోవటానికి ఎవరైనా పర్వాలేదు లాగుంది. ఆయన గోడు వింటే చాలు! అందుకే ఆగకుండా చెప్పుకుపోయాడు. “అవునండీ కేసెట్లు! పాటలు వింటాం చూడండి, రికార్డెడ్ కేసెట్లు అవి! ఒక్కటే పాటల కేసెట్టు వందల్లో కొన్నాడు. పోయిన నెలలో పోస్టులో పెద్ద పెద్ద పెయింటింగులు వచ్చాయి. నాలుగో ఐదో! ఎంత ఛండాలంగా వున్నాయనుకున్నారు? పగలు చూస్తే రాత్రి పీడకలలొస్తాయి! ఇంటి నిండా దిష్టి బొమ్మల్లా, ఇదేంటయ్యా మగడా అంటే, అవో గదిలో పడెయ్యవోయ్, నువ్వేం వాటి వంక చూడకూ అన్నాడు. సరేలే అని ఊర్కుంటే ఇప్పుడీ కేసెట్లు! అడుగెయ్యడానికి చోటు లేదు ఇంట్లో. నన్ను ప్రశాంతంగా రాసుకోనీకుండా ఏమిటండీ ఇది!”
పాండు కనక శ్రీదేవి మొహంలో మారుతున్న రంగులు చూసి వుంటే వెంటనే మాటలు ఆపేవాడే. కానీ చూడలేడు. కడుపులో వున్నదంతా కక్కేశాడు పాండు ఫోన్లో!