దార్లో చిన్నప్పటి కబుర్లూ, ఉద్యోగాలూ, అన్నీ అయ్యేక నారాయణ అడిగేడు,
“ఇంతకీ అమ్మాయి నచ్చిందా?”
“ఆ! ఏదోలే, ఇప్పుడు అడక్కు.”
“ఇంకెప్పుడు అడుగుతాం? ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ మీ నాన్నగార్ని సంబంధాలు చూడమంటావా? ఇంకోసారి మళ్ళీ అమెరికా నుండి వస్తావా?”
“ఏమోరా అంతవరకూ ఆలోచించలేదు. ఈ అమ్మాయి ఏమీ మాట్లాడదు. ఎడ్డెం అంటే తెడ్డెం అనడం తప్ప.”
“అవన్నీ సర్దుకుంటాయ్ బాసూ పెళ్ళాయ్యాక. నీకు అమ్మాయి నచ్చిందా లేదా? అది చెప్పు ముందు.”
“నిజం చెప్పనా అబద్ధం చెప్పనా?”
నారాయణ చురుగ్గా చూసేడు రామం మొహంలోకి, “ఏమిటిది?” అన్నాడు చివరగా.
“చూసిన అమ్మాయ్ నచ్చలేదు. చూడని అమ్మాయ్ నచ్చింది.”
“ఏమిటీ?” అడిగేడు నారాయణ వెర్రిమొహం వేసి.
“నువ్వు అడిగేవు కనక చెప్తున్నాను. నీత నాకు అంతగా నచ్చలేదు. వాళ్ళ నాన్నగారు సరేసరి. పుల్ల విరిగినట్టూ చెప్పేసేడు ఆచారాల గురించీ, అవన్నీను. నాకూ అంత ఇష్టం లేకపోయింది. నాన్న ఏమనుకుంటాడో అని నోరు మూసుక్కూర్చున్నాను ఇప్పటిదాకా.”
“మరి చూడని అమ్మాయి నచ్చడం ఏవిటి? అమెరికాలో నీకో తెల్లమ్మాయి ఉందా?”
“చూడని నచ్చిన అమ్మాయి, ఈరోజు సాయంకాలం మీ ఇంట్లో చూసిన మీ పిన్నిగారమ్మాయి నిర్మల”
పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు నారాయణ. “ఒరే ఇప్పుడు మీ నాన్నగారికి తెలిస్తే నా చర్మం వలుస్తారు ఇదంతా నేను ఆడిన నాటకం ఏమో అని. బాబ్బాబు ఇక్కడ్నుంచి మీరు వెళ్ళిపోయేదాకా ఈ విషయం ఎత్తకు ప్లీజ్,” రామం చేతులు పట్టుకుంటూ అన్నాడు నారాయణ.
ఫక్కున నవ్వేడు రామం. “ఒరే నారాయణా, మీ ఇంట్లో నేను వాళ్ళతో మాట్లాడినట్టు మా ఇంట్లో మాట్లాడలేను, ఇక్కడే చెప్పేసి మీ పిన్ని కూతురు ఒప్పుకుంటే పెళ్ళి చేసుకుని మూడు నెలల్లో అమెరికా తీసుకెళ్తాను. ఎలా ఉంది ఐడియా?
“నాయనా నువ్వు రాక రాక వచ్చావు అని మా ఇంట్లోనే మకాం ఏర్పాటు చేశాను. ఇప్పుడు నువ్వు నా కొంప కూల్చేలా ఉన్నావు. ఏమి దారి భగవంతుడా?”
“సర్వ ధర్మాన్ పరిత్యజ్య, మామేకం శరణం వ్రజ….” చెయ్యెత్తి దీవిస్తూ రామం చెప్పేడు నవ్వుతూ.
“మనం ఇంటికెళ్ళగానే నువ్వెళ్ళి నిర్మలని అడిగి చూడు. ఈ రాత్రి అందరూ పడుకున్నాక నిర్మలకి ఇష్టం అయితే నాతో మాట్లాడడానికి ఏర్పాటు చెయ్యి. రేప్పొద్దున్నే నేను అమ్మా నాన్నలతో మాట్లాడతాను. నిర్మలకి ఇష్టం లేకపోతే సరే అప్పుడు ఆలోచిద్దాం.”
“మా పిన్నీ బాబాయ్ ఒప్పుకోవద్దూ?”
“ఓరి గాడిదా ఆ మాత్రం సహాయం చెయ్యలేవూ?”
నారాయణ నీరసంగా నవ్వి చెప్పేడు, “నీ అసాధ్యం కూలా, మాంఛి ఇరకాటంలో పెట్టేవు నన్ను.”
రామం మర్నాడు పొద్దున్నే కాఫీలయ్యేక చెప్పేడు అందరితోటీ.
“ఆఖరికి నేను నీతని చేసుకోకూడదని నిశ్చయించుకున్నాను. మీరేమన్నా సరే”
దీక్షితులు హతాశుడైపోయేడు. “చూశావుటే ఈ అప్రాచ్యుడి తెలివితేటలు? అన్నీ చూసుకుని మనం కూడా నచ్చిందని చెప్పేశాక ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని వాళ్ళతో మాట్లాడమంటావ్?” అన్నాడు రామం అమ్మతో. ఆవిడ ఏమీ మాట్లాడలేదు.
రామం తను నీతా వాళ్ళ ఇంట్లోకి అడుగుపెడుతూంటే విన్న మాటలు అవీ చెప్పీ తర్వాత అన్నాడు మెల్లిగా, “నాన్నా, నాకు అంత నచ్చలేదు అమ్మాయి. నేను ఇంట్లోకి వెళ్తూంటే వినపడిన మాటలూ అంత బావోలేవు. నాకిష్టంలేని అమ్మాయిని చేసుకుంటే మీకు మంచిదే, మీ మాట అవీ నిలుస్తాయ్ సరే. మరి నా సంగతో? నేను ప్రాచ్యుణ్ణో, అప్రాచ్యుణ్ణో అలా వుంచి ఈ మాట చెప్పండి.”
ఆయన మాట్లాడలేదు కానీ కాసేపు మౌనం తర్వాత అన్నాడు, “మరి ఇంకో అమ్మాయిని మనం చూడట్లేదు. ఇప్పుడు పెళ్ళి కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావ్? మళ్ళీ అమెరికా నుంచి రావాలంటే ఎన్నేళ్ళు పడుతుందో? అప్పటికి నా కరచరణాలు ఆడొద్దూ?”
“నాకు నచ్చిన అమ్మాయిని చూపిస్తే ఒప్పుకుంటారా?” సూటిగా అడిగేడు రామం తల్లి తండ్రులకేసి చూస్తూ.
“ఓరి వెధవా, అమెరికాలో అప్పుడే ఒకమ్మాయిని చూసుకున్నావేమిటీ? ఆ ఏడుపు మాతో ముందే చెప్తే ఇంతవరకూ వచ్చే బాధ తప్పేది కదా?” దీక్షితులు అన్నాడు కొడుకుకేసి చూస్తూ.
నిర్మల కిసుక్కున నవ్వడం రామం చూసేడు. రామం కూడా నవ్వేడు,
“లేదులే నాన్నా. అమ్మాయిది ఇండియాయే”
“సరే చూద్దాం. ఎవరా అమ్మాయి?”
ఇదంతా తప్పించుకోవడానికి నారాయణ ఏదో పని ఉన్నట్టూ చటుక్కున లేచి బాత్రూం లో దూరేడు.
“జాతకాలు, శాఖా అని పట్టింపులు ఉండకూడదు మరి.”
“చూద్దాం అన్నానుగా? చెప్పు ఎవరు అమ్మాయి?”
“మీరు ఈ షరతులన్నీ ఒప్పుకుంటే గాని చెప్పేది లేదు”
“అంటే నువ్వు చూసుకున్న అమ్మాయ్ ఎలా ఉన్నా, బ్రాహ్మలు కాకపోయినా ఒప్పుకోవాలా?” విసుగ్గా అడిగేడు దీక్షితులు.
“అంతవరకు రాదులే నాన్నా, అమ్మాయి వాళ్ళూ బ్రాహ్మలే”
“బతికించావ్”
“సరే వినండి. నిన్న సాయంకాలం వాకింగ్ వెళ్ళి వచ్చాక నేను నిర్మలతోటి మాట్లాడాను. నాకు ఆవిడ నచ్చారు. ఆవిడకి ఇష్టం అయితే మీరు వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడండి.”
దీక్షితులు నోరు విప్పబోతూండగా చటుక్కున అన్నాడు రామం, “నిర్మలని ఇప్పుడేమీ అనవద్దు. ఆవిడని చూశాక నేను అడిగేను. ఆవిడ కూడా అడిగినప్పుడు ఈ సడన్ టర్న్ ఆప్ ఈవెంట్స్‌కి దిమ్మెరపోయారు. వాళ్ళ పేరెంట్స్‌నిని కల్సి మాట్లాడాలి కూడాను. ఈ విషయంలో తప్పు ఏదైనా ఉంటే అదంతా నాదే. నారాయణ కూడా చాలా మధనపడుతున్నాడు.”
ఎప్పుడూ వెంటనే ఏదో అనే దీక్షితులు చాలాసేపటివరకూ మాట్లాడలేకపోయేడు. నిర్మల గురించి తెలియకపోవడం ఒక ఎత్తు ఐతే, అన్నిసార్లు నీతతో ఫోన్లో మాట్లాడి ఇప్పుడు వద్దూ అంటే ఏమనుకుంటారో అనేది ఇంకోటి. అదీ గాక దీక్షితులి మనస్సు ఇంత తొందరగా జరిగిపోయిన వాటిని జీర్ణించుకోవడానికి సిద్ధంగా లేదు. “ఏమంటావ్?” అన్నట్టూ రామం తల్లి కేసి చూసేడు. ఆవిడ షాక్ లోంచి తేరుకోనట్టూ కాలి బొటనవేలు నేలమీద రాస్తూ దానికేసే చూస్తోంది. ఈ లోపున నారాయణ బయటకొచ్చేడు బాత్రూం లోంచి.
రామం చెప్పేడు మళ్ళీ, “ఇప్పుడే మీరు ఫోన్ చేసి మాట్లాడండి నిర్మల వాళ్ళ నాన్నగారితో. మనం అందరం కాకినాడ బయల్దేరి వెళ్దాం ఇక్కడ నిర్మలగారి మెడికల్ కాలేజీ పని ఐపోయేక. అక్కడ్నుంచి అలా మన ఊరికెళ్ళిపోవచ్చు.”
ఆఖరికి దీక్షితులు నోరు తెరిచి అడిగేడు “నిర్మలా నువ్వేమంటావమ్మా?”
కాసేపు నిశ్శబ్దం తర్వాత నిర్మల చెప్పింది, “మా ఇంట్లో ఒప్పుకుంటే నాకు ఇష్టమేనండీ. కానీ వెంటనే అమెరికా వెళ్ళిపోవాలంటే కుదరదు మరి. నాకు మెడికల్ కాలేజీలో ఇంకా పని ఉంది.”
“దానిదేవుంది. మీకు వీసా రావడానికి టైం పడుతుంది. నేను వెళ్ళి మీకు పేపర్స్ పంపించాక ఎలాగా రెండు మూడు నెలలు పట్టొచ్చు.” రామం చెప్పేడు.
“మరి నీతా వాళ్ళకేం చెప్పమంటావురా?” దీక్షితులు అడిగేడు రామాన్ని.
“చెప్పడానికేవుంది? ఆయన పట్టింపు ప్రకారం మా జాతకాలు కలవాలి. నేను ఆయనకి నచ్చలేదని తెలుస్తూనే ఉంది మొదట్నుంచీ. నీత నాకు అంతగా నచ్చలేదు కూడాను. కతికితే అతకదు అని ఆయనే చెప్పేరుగా? నారాయణ ఇంట్లో కతికేం. ఇక్కడే మాకు నిర్మల గారితో అతికిందీ, మీ థియరీ తప్పూ అని చెప్పేయడమే. మీకు చెప్పడానికి మాటలు రాకపోతే, నేనే చెప్తాను.” రామం నవ్వుతూ చెప్పేడు.
“ఏడిశావులే, మొత్తమ్మీద నీకు నీకు నచ్చిన అమ్మాయి కనిపించి పెళ్ళి అవుతోంది సంతోషించు” నవ్వేడు దీక్షితులు. ఆయన నవ్వు చూసి అందరూ నవ్వారు. అందరి మనసులూ కాసింత తేలిక పడినట్లయింది.
ఈ లోపున నారాయణ వాళ్ళావిడ ఇంట్లోంచి పంచదార తీసుకొచ్చి అందరి చేతుల్లోనూ పోసింది. నారాయణ వెంటనే రామం, నిర్మల ఇద్దరిచేతా చేత తల్లికీ తండ్రికీ కాళ్ళకి నమస్కారం చేయించి చెప్పేడు,
“సరే సాయంకాలం అందరం టేక్సీలో కాకినాడ పోతున్నాం.”